మొన్నటివరకూ ఫ్లూ అంటే.. ఒక మందుబిళ్లతో తగ్గిపోయే సమస్య! నిన్నటికి వచ్చేసరికి.. కొన్ని పరీక్షలు, ఒకట్రెండు ఇంజెక్షన్లు కూడా తోడైతేగానీ.. ఉపశమనం ఉండేది కాదు..
మరి నేడు... స్వైన్ ఫ్లూ లేదా హెచ్‌ఐఎన్1 కావచ్చు... ఫ్లూ పేరు చెబితే చాలు.. మనిషి హడలెత్తిపోయే పరిస్థితి! ఈ నేపథ్యంలో వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త మోసుకొచ్చారు.
ఒకట్రెండు కాదు.. ఏకంగా పన్నెండు రకాల ఫ్లూ వైరస్‌లను దీటుగా ఎదుర్కోగల మందును తయారు చేశారు! ప్రాణాంతక వ్యాధులెన్నింటికో మందులు కనుక్కున్న మానవమేధ... జలుబు విషయానికి వచ్చేసరికి మాత్రం ఇప్పటికీ ఏ పరిష్కారమూ కనుక్కోలేకపోయింది. లక్షణాలను అదుపులో ఉంచడం, నొప్పి తగ్గేందుకు మాత్రలు వేసుకోవడం మాత్రమే మనం చేయగలం. శరీరంలో జలుబుకు కారణమైన వైరస్ కొంతకాలం తరువాత తనంతట తానే ప్రభావం చూపడం మానేస్తే నయమైనట్టు లెక్క. అయితే కాలంతో పాటు జలుబు కారక వైరస్‌ల తీరూ మారిపోవడంతో సమస్య కాస్తా జటిలమవుతోంది. పక్షులకు మాత్రమే సోకే వైరస్ మనిషికి సోకి బర్డ్‌ఫ్లూ, పందుల వైరస్‌తో స్వైన్‌ఫ్లూ... కొద్దిపాటి మార్పులున్న ఇతర వైరస్‌లతో రకరకాల ఫ్లూ జ్వరాలు మనిషిని చుట్టుముడుతున్నాయి. అందుకే వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
రోగనిరోధక ప్రొటీన్‌తో చెక్!
మన శరీర రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ ప్రొటీన్ ‘1జీ01’వైరస్‌కు యాంటీబాడీగా పనిచేస్తుందని వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రొటీన్‌ను అందించినప్పుడు ఫ్లూ కారక వైరస్‌లు శరీరం మొత్తం వ్యాపించడం ఆగిపోవడమే కాకుండా.. తమ నకళ్లను తయారు చేసుకోలేకపోయాయి కూడా. ఎలుకలపై జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వేర్వేరు ఫ్లూ వైరస్‌లను నిరోధించగలిగే సార్వత్రిక వ్యాక్సిన్ తయారీకి మార్గం సుగమమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా సంక్లిష్టమైన ఫ్లూ కేసులకు సమర్థమైన చికిత్స అందించేందుకూ వీలవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ అలీ ఎల్‌బెడీ తెలిపారు. ఇంజెక్షన్ లేదా.. ముక్కుల్లోకి పిచికారీ చేసుకోగల మందు రూపంలో ఈ ప్రొటీన్‌ను ఉపయోగించవచ్చునని చెప్పారు. హెచ్1ఎన్1, హెచ్3ఎన్2లతో పాటు ఇన్‌ఫ్లూయెంజా బి రకం వైరస్‌లను నిరోధించగల టీకా లేదంటే.. ఆయా సీజన్లలో ఎక్కువ ప్రభావం చూపే నాలుగు రకాల వైరస్‌లను అడ్డుకునే క్వాడ్రివేలంట్ వ్యాక్సిన్‌ను తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచవచ్చునని వివరించారు. క్వాడ్రివేలంట్ వ్యాక్సిన్‌లో ఏటా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘1జీ01’ప్రొటీన్‌తో కూడిన వ్యాక్సిన్ మాత్రం 12 రకాల వైరస్‌ను ఎదుర్కోగలదని వివరించారు. 2017లో ఫ్లూతో బాధపడుతున్న ఓ రోగి రక్తం నుంచి తాము ఈ ప్రొటీన్‌ను వేరు చేశామని, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల ఉపరితలంపై ఉండే ప్రొటీన్‌ను ఇది సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించడంతో దీనిపై తమ ఆసక్తి పెరిగిందని చెప్పారు.
శాస్త్రవేత్తలకూ అంతుచిక్కలేదు..
మామూలుగా ఏ యాంటీబాడీ అయినా.. ఏదో ఒకరకం వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలదు. కానీ 1జీ01 పన్నెండు రకాల వైరస్‌లను ఎలా ఎదుర్కొంటోందో శాస్త్రవేత్తలకూ అంతు చిక్కడం లేదు. వైరస్ సోకిన మూడు రోజులకు ప్రొటీన్‌ను అందించినప్పటికీ అది సమర్థంగా పనిచేసింది. ప్రస్తుతం ఫ్లూ కోసం వాడే టామీ ఫ్లూ మాత్రను లక్షణాలు కనిపించిన 24 గంటల్లోపు అందించాల్సి ఉంటుంది. వైరస్ ఉపరితలంపై కనిపించే మరో ప్రొటీన్ న్యూరామినిడేస్‌పై దాడి చేయడం ద్వారా 1జీ01 వైరస్ నకళ్లను రూపొందించకుండా నిరోధిస్తుందని భావిస్తున్నట్లు డాక్టర్ అలీ తెలిపారు. సార్వత్రిక వ్యాక్సిన్ తయారీ కీలకమైన సమయంలో 1జీ01ను గుర్తించామని, వైరస్ ఎక్కడ దాడి చేస్తుందో తెలుసు కాబట్టి సమర్థంగా వాడుకునేందుకు అవకాశాలు ఎక్కువని వివరించారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment