Latest research
-
కరోనాతో మంచాన పడ్డవారికి... లాంగ్ కోవిడ్ ముప్పు!
న్యూఢిల్లీ: కరోనా రోగుల్లో వారం పాటు, ఆపై మంచానికి పరిమితమైన వారిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు ప్రస్ఫుటంగా కని్పస్తున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. వారిలో చాలామంది కనీసం రెండేళ్లపాటు విపరీతమైన ఒంటి నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్నారట. లాన్సెట్ రీజనల్ హెల్త్ యూరప్ జర్నల్ అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. లింగ, వయో తదితర భేదాలకు అతీతంగా అందరిలోనూ ఇది సమానంగా కనిపించినట్టు వివరించింది. కరోనాతో రెండు నెలలకు, అంతకుమించి ఆస్పత్రిపాలైన వారిలో ఈ సమస్యలు, లక్షణాలు మరింత ఎక్కువగా తలెత్తినట్టు పేర్కొంది... ఇలా చేశారు... ► అధ్యయనం కోసం స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్‌ల్లో 64,880 మంది వయోజనులను ఎంచుకున్నారు. ► వీరంతా 2020 ఏప్రిల్ నుంచి 2022 ఆగస్టు మధ్య నానారకాల కొవిడ్ తరహా శారీరక సమస్యలను ఎదుర్కొన్నవారే. ► అందరూ పూర్తిగా, లేదా పాక్షికంగా కరోనా టీకాలు వేయించుకున్నవారే. ► వీరిలో 22 వేల మందికి పైగా కరోనా కాలంలో ఆ వ్యాధితో బాధపడ్డారు. ► వీరిలోనూ 10 శాతం మంది కనీసం ఏడు రోజులు, అంతకంటే ఎక్కువ సమయం పాటు మంచాన పడ్డారు. ఇలా మంచాన పడ్డవారిలో చాలామంది ఇతరులతో పోలిస్తే 37 శాతం ఎక్కువ లాంగ్ కోవిడ్ లక్షణాలతో సతమతమయ్యారు. అవేమిటంటే... ► శ్వాస ఆడకపోవడం ► ఛాతీ నొప్పి ► తల తిప్పడం ► తలనొప్పి ► మంచాన పడ్డ వారితో పోలిస్తే ఇతరుల్లోనూ ఇలాంటి లక్షణాలు తలెత్తినా వాటి తీవ్రత మాత్రం అంత ఎక్కువగా లేదు. లాంగ్ కోవిడ్ అంటే... ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం కోవిడ్ సోకిన మూడు నెలల తర్వాత దాని తాలూకు లక్షణాలు తిరగబెట్టి కనీసం రెండు నెలలు, ఆ పైనకొనసాగితే దాన్ని లాంగ్ కోవిడ్‌గా పేర్కొంటారు. ► కోవిడ్ బారిన పడ్డ వారిలో కనీసం 10 నుంచి 20 శాతం మందిలో లాంగ్ కోవిడ్ తలెత్తినట్టు పలు అధ్యయనాల్లో తేలింది. ‘‘లాంగ్ కోవిడ్ ప్రజారోగ్యానికి పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయంగా ఎంతోమంది దీని బారిన పడ్డారు’’అని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ డాక్టోరల్ స్టూడెంట్ ఎమిలీ జోయ్స్ వివరించారు. ‘అందుకే కోవిడ్ తాలూకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావంపై ఓ కన్నేసి ఉంచాలి. కనీసం రెండేళ్ల దాకా శారీరక మార్పులు, సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి’అని సూచించారు. -
Health Benefits of Onions: ఉల్లితో మధుమేహం దూరం!
కాలిఫోర్నియా: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఈ మాటల్లో నిజముందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహ రోగులకు ఉల్లిపాయ సూపర్ ఫుడ్ అని, రోజూ ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియాలో శాన్ డియోగాలోని ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవల్స్ 50శాతం వరకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉందని ఆ అధ్యయనంలో తేలినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. మధుమేహ రోగుల చికిత్సలో భాగంగా ఉల్లిపాయను కూడా సూచించవచ్చునని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నైజీరియాలో డెల్టా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంటోని ఒజిహె అన్నారు. అయితే తమ పరిశోధనలు ప్రస్తుతం ఇంకా ఎలుకలపైనే చేశామని, త్వరలో మానవ ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పారు. ‘‘ఉల్లిపాయ తక్కువ ధరకి లభిస్తుంది. డయాబెటీస్‌కి వాడే మందుతో పాటు ఉల్లిపాయ కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ మందు ఇంకా బాగా పని చేస్తుంది. అయితే ఇంకా ఎలుకల్లోనే ఈ ప్రయోగం జరిగింది’’ అని ఆంటోని వెల్లడించారు. మధుమేహం ఉన్న ఎలుకల్లో రోజుకి 400 ఎంజీ, 600 ఎంజీ ఉల్లిని ఇవ్వడంతో చక్కెర స్థాయి బాగా తగ్గిందని, అంతేకాకుండా కొలస్ట్రాల్ కూడా తగ్గినట్టు తేలినట్టుగా వివరించారు. మరోవైపు సెంటర్ ఫర్ డయోబెటిస్ చైర్మన్ డాక్టర్ అనూప్ శర్మ ఈ అధ్యయనంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతీయులు ఉల్లిపాయ చాలా ఎక్కువగా తింటారని అలాంటప్పుడు భారత్ మధుమేహగ్రస్తులకు ఎందుకు హాట్‌స్పాట్‌గా మారిందని ప్రశ్నించారు. మానవ ప్రయోగాలు జరిగేంతవరకు ఒక నిర్ధారణకు రాలేమన్నారు. -
ఫ్లూకి విరుగుడు!
మొన్నటివరకూ ఫ్లూ అంటే.. ఒక మందుబిళ్లతో తగ్గిపోయే సమస్య! నిన్నటికి వచ్చేసరికి.. కొన్ని పరీక్షలు, ఒకట్రెండు ఇంజెక్షన్లు కూడా తోడైతేగానీ.. ఉపశమనం ఉండేది కాదు.. మరి నేడు... స్వైన్ ఫ్లూ లేదా హెచ్ఐఎన్1 కావచ్చు... ఫ్లూ పేరు చెబితే చాలు.. మనిషి హడలెత్తిపోయే పరిస్థితి! ఈ నేపథ్యంలో వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త మోసుకొచ్చారు. ఒకట్రెండు కాదు.. ఏకంగా పన్నెండు రకాల ఫ్లూ వైరస్‌లను దీటుగా ఎదుర్కోగల మందును తయారు చేశారు! ప్రాణాంతక వ్యాధులెన్నింటికో మందులు కనుక్కున్న మానవమేధ... జలుబు విషయానికి వచ్చేసరికి మాత్రం ఇప్పటికీ ఏ పరిష్కారమూ కనుక్కోలేకపోయింది. లక్షణాలను అదుపులో ఉంచడం, నొప్పి తగ్గేందుకు మాత్రలు వేసుకోవడం మాత్రమే మనం చేయగలం. శరీరంలో జలుబుకు కారణమైన వైరస్ కొంతకాలం తరువాత తనంతట తానే ప్రభావం చూపడం మానేస్తే నయమైనట్టు లెక్క. అయితే కాలంతో పాటు జలుబు కారక వైరస్ల తీరూ మారిపోవడంతో సమస్య కాస్తా జటిలమవుతోంది. పక్షులకు మాత్రమే సోకే వైరస్ మనిషికి సోకి బర్డ్‌ఫ్లూ, పందుల వైరస్‌తో స్వైన్‌ఫ్లూ... కొద్దిపాటి మార్పులున్న ఇతర వైరస్‌లతో రకరకాల ఫ్లూ జ్వరాలు మనిషిని చుట్టుముడుతున్నాయి. అందుకే వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రోగనిరోధక ప్రొటీన్‌తో చెక్! మన శరీర రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ ప్రొటీన్ ‘1జీ01’వైరస్‌కు యాంటీబాడీగా పనిచేస్తుందని వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రొటీన్‌ను అందించినప్పుడు ఫ్లూ కారక వైరస్లు శరీరం మొత్తం వ్యాపించడం ఆగిపోవడమే కాకుండా.. తమ నకళ్లను తయారు చేసుకోలేకపోయాయి కూడా. ఎలుకలపై జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో వేర్వేరు ఫ్లూ వైరస్‌లను నిరోధించగలిగే సార్వత్రిక వ్యాక్సిన్ తయారీకి మార్గం సుగమమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా సంక్లిష్టమైన ఫ్లూ కేసులకు సమర్థమైన చికిత్స అందించేందుకూ వీలవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ అలీ ఎల్బెడీ తెలిపారు. ఇంజెక్షన్ లేదా.. ముక్కుల్లోకి పిచికారీ చేసుకోగల మందు రూపంలో ఈ ప్రొటీన్‌ను ఉపయోగించవచ్చునని చెప్పారు. హెచ్1ఎన్1, హెచ్3ఎన్2లతో పాటు ఇన్‌ఫ్లూయెంజా బి రకం వైరస్‌లను నిరోధించగల టీకా లేదంటే.. ఆయా సీజన్లలో ఎక్కువ ప్రభావం చూపే నాలుగు రకాల వైరస్‌లను అడ్డుకునే క్వాడ్రివేలంట్ వ్యాక్సిన్‌ను తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచవచ్చునని వివరించారు. క్వాడ్రివేలంట్ వ్యాక్సిన్‌లో ఏటా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘1జీ01’ప్రొటీన్‌తో కూడిన వ్యాక్సిన్ మాత్రం 12 రకాల వైరస్‌ను ఎదుర్కోగలదని వివరించారు. 2017లో ఫ్లూతో బాధపడుతున్న ఓ రోగి రక్తం నుంచి తాము ఈ ప్రొటీన్‌ను వేరు చేశామని, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ల ఉపరితలంపై ఉండే ప్రొటీన్‌ను ఇది సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించడంతో దీనిపై తమ ఆసక్తి పెరిగిందని చెప్పారు. శాస్త్రవేత్తలకూ అంతుచిక్కలేదు.. మామూలుగా ఏ యాంటీబాడీ అయినా.. ఏదో ఒకరకం వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలదు. కానీ 1జీ01 పన్నెండు రకాల వైరస్‌లను ఎలా ఎదుర్కొంటోందో శాస్త్రవేత్తలకూ అంతు చిక్కడం లేదు. వైరస్ సోకిన మూడు రోజులకు ప్రొటీన్‌ను అందించినప్పటికీ అది సమర్థంగా పనిచేసింది. ప్రస్తుతం ఫ్లూ కోసం వాడే టామీ ఫ్లూ మాత్రను లక్షణాలు కనిపించిన 24 గంటల్లోపు అందించాల్సి ఉంటుంది. వైరస్ ఉపరితలంపై కనిపించే మరో ప్రొటీన్ న్యూరామినిడేస్పై దాడి చేయడం ద్వారా 1జీ01 వైరస్ నకళ్లను రూపొందించకుండా నిరోధిస్తుందని భావిస్తున్నట్లు డాక్టర్ అలీ తెలిపారు. సార్వత్రిక వ్యాక్సిన్ తయారీ కీలకమైన సమయంలో 1జీ01ను గుర్తించామని, వైరస్ ఎక్కడ దాడి చేస్తుందో తెలుసు కాబట్టి సమర్థంగా వాడుకునేందుకు అవకాశాలు ఎక్కువని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వాయుకాలుష్యంతో వాళ్లకూ చేటు...
పరిపరి శోధన పట్టణ వాతావరణంలోని వాయుకాలుష్యం వల్ల మనుషులందరికీ చేటేననే సంగతి తెలిసిందే. కాలుష్యానికి నేరుగా బహిర్గతమయ్యే వారికి మాత్రమే వాయుకాలుష్యం వల్ల అనర్థాలు తలెత్తుతాయని ఇంతవరకు భావిస్తూ వచ్చారు. అయితే, గర్భస్థ శిశువులకు సైతం వాయుకాలుష్యం తీరని హాని చేస్తోందని తాజా పరిశోధనల్లో తేలింది. ఆరునెలలు నిండిన గర్భిణులు పట్టణ కాలుష్యంలో గడిపినట్లయితే, వాహనాల నుంచి వెలువడే పొగ ద్వారా గర్భస్థ శిశువు ఊపిరితిత్తుల్లోకి ప్రమాదకర రసాయనాలు చేరుతాయని యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలోని సిన్సినాటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ కు చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెలలు నిండకుండానే ప్రసవాలు జరిగే పరిస్థితి ఉంటుందని, ఒక్కోసారి మృతశిశువులు జన్మించే ప్రమాదం కూడా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.