హల్‌చల్ చేస్తున్న హారిబుల్ వీడియో!!
దాదాపు అది 10 అడుగుల ఎత్తు ఉన్న డాబా ఇల్లు. పైన ఏడాది కూడా వయస్సులేని పిల్లాడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ డాబాపై చివరి అంచుకు వచ్చాడు. డాబాపై చుట్టూ రక్షణగా చిన్న పిట్టగోడ కూడా లేదు. సహజంగా అలా డాబాపై చివరి అంచుకు పిల్లాడు వస్తే కింద పడిపోతాడని ఎవరైనా భయపడతారు. కానీ కింద ఉన్న ఆ పిల్లాడి తండ్రి మాత్రం.. అందుకు విరుద్ధంగా డాబాపై నుంచి పిల్లాడిని దూకేయమంటూ ప్రోత్సాహించాడు. తండ్రి అలా చేయడంతో అభంశుభం తెలియని ఆ పిల్లాడు దూకేశాడు. పది అడుగుల పైనుంచి ఆ బుజ్జాయి కిందపడేలోపు తండ్రి రెండు చేతులు చాపి కౌగిలిలోకి తీసుకున్నాడు. ఈ దారుణాతి దారుణమైన ఈ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తుంది. చూసిన నెటిజన్ల దిమ్మతిరిగేలా చేస్తోంది.
తండ్రి అంత నిర్లక్ష్యంగా పిల్లాడి ప్రాణాల్ని పణంగా పెట్టి.. ఈ దారుణమైన సాహసాన్ని చేయాల్సిన అవసరమేముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది మధ్యప్రాచ్యంలో తీసిన వీడియో అని భావిస్తున్నారు. ఈ వీడియోలో వెనుక ఉన్న ఓ మహిళ నవ్వుతున్నట్టు వినిపిస్తోంది. ఆన్‌లైన్‌లో పెట్టే ఉద్దేశంతో తీసినా.. లేక మరే ఉద్దేశంతో ఈ వీడియో తీసినా కానీ చిన్నారి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడంపై మాత్రం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ లేని సమయంలో ఆ బుజ్జాయి డాబాపైకి ఎక్కి.. కిందకు దూకేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. పిల్లల పట్ల ఇలాంటి ప్రమాదకర ఫీట్లు వద్దని హితవు పలుకుతున్నారు. ఆ వీడియోలోని పిల్లాడి తండ్రిని 'ఫాదర్ ఆఫ్ ది ఇయర్'గా పేర్కొంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.