
బీజింగ్ : ఓ తెలుగు సినిమా పాటలో చెప్పినట్టు.. ‘జలకాలటాలలో.. గలగల పాటలలో.. ఎంత హాయిలే హలా.. ఏమేమీ హాయిలే హలా’అన్నట్టుగా ఉంటుంది నీటి కొలనులో ఈదులాడటం. దక్షిణ చైనాలోని సముద్రం ఒడ్డున ఉన్న ఓ వాటర్ పార్కులో చాలా మంది జనం గత ఆదివారం అలాంటి పాటే పాడుకుంటూ.. జలకాల్లో మునిగిపోయారు. కానీ.. ఉన్నట్టుండీ ఓ ఉపద్రవం ముంచుకొచ్చింది. అంతెత్తున ‘సునామీ‘ కెరటాలు వారిని ముంచెత్తాయి. నీటిలో చాలా మంది కిందామీద పడ్డారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒడ్డున ఉన్నవారు బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు. ఓ 10 సెకన్ల పాటు అక్కడ బీతావహ వాతావరణం నెలకొంది.
అయితే, అది సునామీ కాదని తేలిపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వాటర్ పార్కులో అలలు సృష్టించే మెషీన్ తప్పిదం వల్ల భారీ ఎత్తున నీటి కెరటాలు వారిపై విరుచుకుపడ్డాయని తెలిసింది. ఘటనకు చింతిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తీవ్రమైన అలల తాకిడికి కొలనులో ఉన్న 44 మంది గాయపడ్డారు. ఒడ్డున ఉన్న ఓ మహిళ పరుగెత్తబోయి కిందపడటంతో గాయాలపాలయ్యారు. పార్కు నిర్వాహకులపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ కొనసాగుతోంది. పార్కుని మూసివేశారు. ఈ ‘సునామీ’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment