మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్: మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కలిసి ఎనిమిది ప్రధాన ఒప్పందాల మీద సంతకాలు చేశారు. భారత జర్మనీ ఒప్పందాల్లో ఫలితాలు రాబట్టే విషయాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టామని, ప్రధానంగా ఆర్థిక బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ రెండు దేశాలు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని ఆయన అభివర్ణించారు. భారతదేశం చాలా నమ్మదగ్గ భాగస్వామి అని ఏంజెలా మెర్కెల్ ప్రశంసించారు. జర్మనీ ఇక ఎంతో కాలం పాటు అమెరికా, బ్రిటన్ లాంటి సంప్రదాయ భాగస్వాముల మీద ఆధారపడటం కుదరదని ఆమె చెప్పారు. ఈయూ-ఇండియా స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందాలపై ప్రధాని మోదీ, మెర్కెల్ చర్చించారు. చైనా ప్రతిపాదిస్తున్న సిల్క్ రోడ్ వాణిజ్యంపై తమకున్న అసంతృప్తిని మోదీ స్పష్టంగా చెప్పారు.
వచ్చే నెలలో హాంబర్గ్‌లో జరిగే జి20 సదస్సులో వీరిద్దరూ మరోసారి భేటీ కానున్నారు. అప్పుడు దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రంలో చైనా సైనిక విస్తరణ గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. భారత్, జర్మనీలు చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశాలని, పెద్ద ఆర్థిక వ్యవస్థలని, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో కీలక భాగస్వాములని మోదీ అభివర్ణించారు. జర్మనీ పర్యటన ముగిసిన తర్వాత ఆయన స్పెయిన్, ఫ్రాన్స్, రష్యాలలో కూడా పర్యటించనున్నారు.