వాట్సాప్ ఇక మరింత కొత్తగా..
శాన్ ప్రాన్సిస్కో: ప్రముఖ ఆడియో, వీడియో, టెక్స్ట్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను ప్రారంభించింది. మొబైల్ ఫోన్ లోని కెమెరాకు అనుసంధానం చేసి ఈ ఫీచర్ను ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్స్ తో ఇతరులకు పంపించే ఫోటోలు, వీడియోలపై నచ్చిన కామెంట్ పెట్టేందుకు, వాటిపై ఎలాంటి బొమ్మలైన గీసేందుకు, ఎమోజీలను యాడ్ చేసేందుకు వీలు కల్పించనుంది.
'ఇక నుంచి మీరు తీసిన ఒక ఫొటోనిగానీ, వీడియోనిగానీ ఇతరులతో పంచుకోవాలని అనుకున్నప్పుడు ఈ ఫొటోలకు, వీడియోల ఎడిటింగ్కు సంబంధించిన టూల్స్ మీకు వాటంతటవే కనిపిస్తాయి' అని వాట్సాప్ ఒక పోస్ట్ ద్వారా తెలిపింది. దీంతోపాటు ఇక నుంచి ఏవైనా వీడియోలో వాట్సాప్ ద్వారా రికార్డు చేసే సమయంలో జూమ్ చేసే సౌకర్యం కూడా కల్పించనుంది. మంగళవారం నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుండగా ఆపిల్ ఐఫోన్లకు త్వరలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.