మైక్ పెన్స్ :
ట్రంప్‌తో పాటే ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధికార మార్పిడిని పర్యవేక్షించే బాధ్యతలను ఈయనకు అప్పజెప్పారు (ట్రాన్సిషన్ టీమ్‌కు సారథి). ట్రంప్ చేసే నియామకాల్లో ఈయన అభిప్రాయం కూడా కీలకమే. 57 ఏళ్ల పెన్స్ ప్రస్తుతం ఇండియానా గవర్నర్‌గా పనిచేస్తున్నారు. రోమన్ క్యాథలిక్. అబార్షన్లకు గట్టి వ్యతిరేకి. లింగ వివక్ష, జాతి వివక్షతో అబార్షన్లు, అలాగే పుట్టబోయే బిడ్డకు అంగవైకల్యం ఉందని అబార్షన్ చేయించుకోవడాన్ని ఈ ఏడాది మార్చిలో ఇండియానాలో నిషేధించారు.
మైకేల్ ఫ్లిన్
జాతీయ భద్రతా సలహాదారు : అమెరికా సైన్యంలో త్రీస్టార్ లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరయ్యారు. మిలటరీ గూఢచారి విభాగం ‘డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ’ డెరైక్టర్‌గా 2012 నుంచి 2014 దాకా పనిచేశారు. ఇస్లామిక్ తీవ్రవాదంపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఈ కారణంగానే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని స్వయంగా ఆయనే అన్నారు. ‘ముస్లింలను చూసి భయపడటం సహేతుకమే’ అని ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్వీట్ చేశారు. తీవ్రవాదంపై పోరులో ఎలా గెలవాలనే దానిపై పుస్తకం కూడా రాశారు. ఐసిస్‌కు వ్యతిరేకంగా సిరియాలో రష్యాతో సన్నిహితంగా పనిచేయాలని వాదిస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈయన మొదటి నుంచీ డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారు. పార్టీ సభ్యతం ఉన్నవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో హిల్లరీని వ్యతిరేకిస్తూ ట్రంప్ సభల్లో చురుకుగా పాల్గొన్నారు. ట్రంప్‌కు మాజీ సైనికుల మద్దతును కూడగట్టడంలో ఈయన పాత్ర కీలకమని భావిస్తారు. ఫ్లిన్ ఎంపిక ముస్లిం దేశాలలో (గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలతో సహా) అనుమానాలకు తావిస్తోంది.
రీన్స్ ప్రీబస్
చీఫ్ ఆఫ్ స్టాఫ్: రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ట్రంప్ అభ్యర్థిత్వం పట్ల అభ్యంతరాలున్న రిపబ్లికన్ పార్టీ కీలకనేతలకు, పార్టీ అధికారిక అభ్యర్థికి మధ్య సంధానకర్తగా కీలకభూమిక పోషించారు. శ్వేతసౌధంలో ఈయనే కీలకం కానున్నారు. ఏ విషయమైనా, ఎవరైనా అధ్యక్షుడిని చేరాలంటే ఈయనను దాటివెళ్లాల్సిందే. ప్రధాన ద్వారపాలకుడి లాంటి వాడు. 44 ఏళ్ల ప్రీబస్‌కు ఇదివరకు వైట్‌హౌస్‌లో పనిచేసిన అనుభవం లేదు. అయితే ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ రేయాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ విస్కాన్సన్ రాష్ట్రానికి చెందిన వారు.
జెఫ్ సెషన్స్
అటార్నీ జనరల్: శాంతి భద్రతల కోణంలో అటార్నీ జనరల్ కీలకం. పౌర హక్కుల అమలులోనూ ముఖ్య భూమిక. 69 ఏళ్ల జెఫ్ సెషన్స్ అలాబామా రాష్ట్రం నుంచి సెనెటర్‌గా ఉన్నారు. వలస విధానం అత్యంత కఠినంగా ఉండాలనేది ఈయన అభిప్రాయం. ప్రభుత్వఖర్చులు తగ్గించాలని, నేర నియంత్రణ చర్యలు కఠినంగా ఉండాలని అంటారు. జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారనే అభియోగంతో 1986లో సమాఖ్య జడ్జిగా ఈయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అటార్నీ జనరల్‌గా ఈయన నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో పాత అభియోగాలు మళ్లీ తెరపైకి వచ్చి సమస్యగా మారొచ్చనే అభిప్రాయం ఉంది.
మైక్ పాంపియో
సీఐఏ డెరైక్టర్: అమెరికా నిఘా సంస్థ ’సీఐఏ (సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ)’ పాత్ర... పరిధి విస్తృతంగా ఉంటుంది. ప్రచ్ఛన్నయుద్ధం కాలంలోనైతే ఇతర దేశాల్లో అంతర్యుద్ధాన్ని ఎగదోయడం, ప్రభుత్వాలను కూల్చడం, అస్మదీయులను గద్దెనెక్కించడంతో సహా అమెరికా మిత్రులు కాని వారిని భౌతికంగా నిర్మూలించడం లాంటి పనులెన్నో చేసేది. రిపబ్లికన్ పార్టీలో కీలకనేత, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు మైక్ పాంపియో(52)ను సీఐఏ డెరైక్టర్‌గా ట్రంప్ ఎంపిక చేశారు. రిపబ్లికన్‌పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరిగిన పోటీలో పాంపియో తొలుత ట్రంప్ ప్రత్యర్థి మార్కో రూబియోకు మద్దతునిచ్చారు. ఇరాన్‌తో ఒబామా ప్రభుత్వం అణు ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు. జాతీయ భద్రతా సంస్థ చేపట్టిన బల్క్ డాటా సేకరణ కార్యక్రమాన్ని సమర్థించారు.
నిక్కీ హేలీ
ఐరాసలో అమెరికా రాయబారి: దక్షిణ కరోలినా గవర్నర్‌గా రెండోసారి ఎన్నికైన భారతీయ- అమెరికన్ నిక్కీ హేలీ (అసలు పేరు నిమ్రత రణ్‌ధవా. ముద్దుపేరు నిక్కీ. దీనికి భర్త పేరు కలిపి నిక్కీ హేలీ అయింది.). ట్రంప్ క్యాబినెట్‌లోకి ఎంపికైన తొలి మైనారిటీ. జాతి వివక్షతో తలెత్తే ఉద్రిక్తత పరిస్థితులను మళ్లీ సాధారణ స్థితికి తేవడం, విపత్కర పరిస్థితుల్లో జాతుల మధ్య సంధానకర్తగా వ్యవహరించడం, అదే సమయంలో అవసరమైనపుడు మైనారిటీలకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా మాట్లాడటం... తదితర లక్షణాలతో 44 ఏళ్ల నిక్కీ హేలీని అమెరికా రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. ప్రస్తుతం అమెరికాలోని గవర్నర్లలో పిన్న వయస్కురాలు ఈమే. రిపబ్లికన్ పార్టీలో రైజింగ్ స్టార్‌గా ముద్రపడ్డ నిక్కీ తొలుత ట్రంప్‌ను వ్యతిరేకించినా తర్వాతి దశలో మద్దతు పలికారు. సిక్కు మతంలో పుట్టిన నిక్కీ 1996లో మైకేల్ హేలీని పెళ్లాడే ముందు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. వీరికి ఇద్దరు పిల్లలు. అంతర్జాతీయ వేదికలపై పెద్దగా అనుభవం లేని నిక్కీ హేలీ ఇకపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడానికి పనిచేయాల్సి ఉంటుంది.
జేమ్స్ మాటిస్- డిఫెన్స్ సెక్రటరీ?
అమెరికా నావికాదళంలో 44 ఏళ్ల సుదీర్ఘకాలం పనిచేసిన జేమ్స్ మాటిస్‌ను రక్షణ మంత్రి పదవికి ట్రంప్ దాదాపు ఖాయం చేసినట్లే. గత వారాంతంలో ట్రంప్, మాటిస్ భేటీ జరిగింది. యుద్ధవ్యూహాల్లో బాగా ఆరితేరినవాడు. 2003 ఇరాక్ యుద్ధంలో అమెరికా నావికాదళాలకు నాయకత్వం వహించారు. రణతంత్రంలో అత్యంత నిష్ణాతుల్లో ఒకరిగా ఈయనకు పేరు. నిష్కర్షగా, కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే మాటిస్‌కు ‘మ్యాడ్ డాగ్’ అనే పేరుంది. అహంభావి. 66 ఏళ్ల ఈ బహ్మచారిని పెంటగాన్ చీఫ్ జనరల్‌గా (డిఫెన్స్ సెక్రటరీ) నియమించడానికి ఒక అడ్డంకి ఉంది. సైన్యం నుంచి రిటైరయిన ఏడేళ్ల దాకా ఏ మాజీ సైనికాధికారిని డిఫెన్స్ సెక్రటరీగా నియమించకూడదనే నిబంధన ఉంది. సైన్యంపై పౌర ప్రభుత్వం అజమాయిషీ ఉండాలనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారు. 2013లో రిటైరైన మాటిస్‌ను నియమించాలంటే ఈ నిబంధనను సవరించాల్సి ఉంటుంది.
స్టీఫెన్ బానన్
ప్రధాన వ్యూహకర్త : మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన స్టీఫెన్ బానన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందానికి సీఈవోగా పనిచేశారు. జాత్యహంకార భావాలున్న వ్యక్తిగా పేరుపడ్డారు. జాతి వివక్ష, యూదు వ్యతిరేక భావజాలాన్ని ట్రంప్ నేరుగా వైట్‌హౌస్‌లోకి తీసుకెళుతున్నారనే దానికి బానన్, ప్రీబస్ నియామకాలు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తాయి. ‘డొంకతిరుగుడు మాటలు అక్కర్లేదు. శ్వేతజాతి గొప్పదనే భావాలున్న వ్యక్తిని ట్రంప్ తన ప్రధాన వ్యూహకర్తగా పెట్టుకున్నారు’ అని అమెరికా ప్రతినిధుల సభలో మైనారిటీ నేత నాన్సీ పెలోప్సీ అన్నారు. పాలనావ్యవహారాల్లో ప్రీబస్, బానన్ ఇద్దరూ సమాన హోదాతో పనిచేస్తారని ట్రంప్ బయటికి చెప్పినా... వీరి మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు తప్పదనేది విశ్లేషకుల అభిప్రాయం.
(చదవండి..ట్రంప్ టీమ్లో విదేశాంగ శాఖ ఎవరికి?)
ట్రంప్ టీమ్లో ఎవరెవరు?
Published Thu, Nov 24 2016 8:16 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
Advertisement
Advertisement