ఈ వజ్రాలకు రక్తం మరకలు లేవు!
కాలిఫోర్నియా: తళతళ మెరసే వజ్రాల వెనక రక్తం మరకలు ఉన్నాయన్న విషయం మనకు తెల్సిందే. వజ్రాల కోసం అంగోల, కాంగో, లిబేరియా దేశాల్లో రక్తం ఏరులై పారింది. సియెర్రా లియోన్ లాంటి దేశాల్లో బానిసలతో వజ్రపు గనులను తవ్వించారు. ప్రపంచంలో వజ్రాల కోసం యుద్ధాలు జరిగిన సంఘటనలే కాకుండా వజ్రాలతో ఆయుధాలు కొనుగోలు చేసి యుద్ధాలు చేసిన చరిత్ర కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రక్తం ధారల నుంచి పుట్టుకొచ్చిందే వజ్రం. అందుకనే 2007లో హాలివుడ్‌లో ‘బ్లడ్‌డైమండ్’ పేరితో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ప్రముఖ హాలివుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో హీరోగా నటించారు.
స్వచ్ఛమైన కార్బన్ నుంచి వజ్రాలు ప్రకృతి సిద్ధంగా తయారవుతాయని తెల్సిందే. వందల కోట్ల సంవత్సరాల అత్యున్నత ఉష్ణోగ్రత, భూపొరల్లో కలిగే అత్యధిక ఒత్తిడి కారణంగా భూగర్భంలో వందకిలోమీటర్ల లోపల బొగ్గుగనులు వ జ్రాల గనులుగా మారుతాయి. ప్రపంచం మొత్తంలో ఇప్పటివరకు ఉత్పత్తయిన వజ్రాల్లో కేవలం 0.1 శాతం మాత్రమే రక్తపుటేరులతో తడిసిపోయాయని, నాటు వజ్రాల వ్యాపారాన్ని నిర్వహించే ‘కింబర్లే ప్రాసెస్’ వెల్లడించింది. అయినా రక్తపు చరిత్రలేని ఈకో ఫ్రెండ్లీ కృత్రిమ వజ్రాల ఫ్యాక్టరీ ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో అందుబాటులోకి వచ్చింది.
‘డైమండ్ ఫౌండ్రీ’ని ఆస్ట్రియా, అమెరికనైన మార్టిన్ రుషుసు గతేడాది నవంబర్‌లో స్థాపించి, దానికి ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ వ్యవస్థాపకుడు ఎవాన్ విలియమ్స్‌తోపాటు, బ్లడ్ డైమండ్‌లో నటించిన డికాప్రియో తదితర 12 మంది బిలియనీర్లు ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఇంతకుముందు తనతోపాటు కలసి నానో సోలార్ కంపెనీలో పనిచేసిన ఇంజనీర్ల బృందాన్నే మార్టిన్ ఇందులోకి తీసుకున్నారు. సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడికి సమానమైన, దాదాపు పదివేల ఫారన్‌హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ప్లాస్మాను రియాక్టర్‌లో ఉత్పత్తి చేయడం ద్వారా ఈ కంపెనీ కృత్రిమ వజ్రాలను తయారు చేస్తోంది.
ప్రపంచంలో కృత్రిమ వజ్రాలను ఉత్పత్తిచేసే కంపెనీలు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నాయని, అయితే తాము అనుసరించే విధానం ఇతర కంపెనీలకన్నా భిన్నమైనదని, తాము పర్యావరణానికి అనుకూలమైన ఇంధనాన్ని మాత్రమే వజ్రాల తయారీకి వినియోగిస్తామని మార్టిన్ వివరించారు. మార్కెట్‌లో దొరికే వజ్రాలకన్నా తాము పది నుంచి 15 శాతం తక్కువకు వజ్రాలను సరఫరా చేస్తామని, నెలకు వెయ్యి కారెట్ల బరువుగల వజ్రాలను తయారు చేస్తామని ఆయన చెప్పారు.
ఇప్పటి వరకు తమ కంపెనీ తయారు చేసిన వజ్రాల్లో 12 క్యారెట్ల వజ్రమే అతి పెద్దదని ఆయన తెలిపారు. 0.13 క్యారెట్ల బరువుగల వజ్రం 305 డాలర్లకు, 2.30 క్యారెట్లు కలిగిన వజ్రం 23 వేల డాలర్లకు విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రకృతి సిద్ధంగా దొరికే వజ్రాలకు, కృత్రిమ వజ్రాలకు ధరలో పెద్ద తేడా ఏమీ ఉండదని, ఏదైనా వజ్రం, వజ్రమేకదా! అని మార్టిన్ వ్యాఖ్యానించారు. రక్తం మరకలు గుర్తురాకుండా ఉండాలంటే ఈ కృత్రిమ వజ్రాలే మేలేమో!