వాషింగ్టన్: ఉత్తర కొరియాపై సైనిక చర్యకు అమెరికా సర్వ సన్నద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కొరియా అణు కార్యకలాపాలకు దూరంగా ఉండేలా బాధ్యతాయుత దేశాలన్నీ ఏకమవ్వాలని పిలుపు ఇచ్చారు. అమెరికా బాంబర్లను కూల్చివేయడం ద్వారా తమను తాము రక్షించుకుంటామని ఉత్తర కొరియా పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ కొరియాను గట్టిగా హెచ్చరించారు. దౌత్య, ఆర్థిక చర్యలకు బదులు తాము మరో ప్రత్యామ్నాయం ఎంచుకుంటే అది ఉత్తర కొరియా విధ్వంసానికి దారితీస్తుందని అన్నారు.
ఉత్తర కొరియా నేత కిమ్ తీరు బాగా లేదని ట్రంప్ ఆరోపించారు. ఉత్తర కొరియాలో పరిస్థితిని దశాబ్ధాల కిందటే పరిష్కరించాల్సి ఉందని, అమెరికా గత పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పుడు తాను ఈ పనికి ఉపక్రమించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాపై అమెరికా పలు ఆంక్షలు విధించినా అణు పరీక్షల నుంచి కొరియా వెనక్కి తగ్గకపోవడంతో కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.