వైర్‌లెస్ కరెంట్
తీగలు లేకుండా విద్యుత్ ప్రసారం.. అది కూడా అంతరిక్షం నుంచి! ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఈ దిశగా జపాన్ శాస్త్రవేత్తలు ముందడుగేశారు మరి. తీగలు లేకుండా 55 మీటర్ల దూరం పాటు వారు కరెంటును విద్యుదయస్కాంత సూక్ష్మ తరంగాల రూపంలో విజయవంతంగా పంపగలిగారు. దీంతో భవిష్యత్తులో అంతరిక్షంలో సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. భూమి మీదకు తీసుకువచ్చేందుకు వీలు కానుంది!
- నేషనల్ డెస్క్
తీగల్లేని కరెంటు ఇలా
జపాన్ అంతరిక్ష సంస్థ ‘జాక్సా’ శాస్త్రవేత్తలు తొలుత 1.8 కిలోవాట్ల విద్యుత్‌ను సూక్ష్మ తరంగాలు(మైక్రోవేవ్స్)గా మార్చారు. వాటిని 55 మీటర్ల దూరంలోని రిసీవర్‌కు పంపారు. వాటిని రిసీవర్ స్వీకరించి, విద్యుత్ తరంగాలుగా మార్చి తిరిగి ప్రసారం చేసింది. శక్తిమంతమైన విద్యుదయస్కాంత సూక్ష్మ తరంగాలను వైర్‌లెస్‌గా పంపడం ప్రపంచంలో ఇదే తొలిసారని, దీన్ని గతవారం విజయవంతంగా నిర్వహించామని జపాన్ తెలిపింది. తాజాగా మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ 10 కిలోవాట్ల విద్యుత్‌ను మెక్రోవేవ్స్‌గా మార్చి 1640 అడుగుల దూరంలోని ఓ రిసీవర్‌కు పంపించి తద్వారా వంటగదిలో వాడే కొన్ని పరికరాలను విజయవంతంగా పనిచేయించారు.
అంతరిక్ష విద్యుత్తు
భూమి మీద 24 గంటలూ సౌరవిద్యుత్ ఉత్పత్తి కుదరదు. అంతరిక్షంలో అయితే అడ్డంకులే ఉండవు. అందుకే ఉపగ్రహాలకు భారీ సౌరఫలకాలను బిగించి.. సౌరవిద్యుత్‌ను తయారుచేసి.. భూమికి తీసుకురావాలన్న యత్నం. కానీ రోదసి నుంచి విద్యుత్ తీగలు కుదరవు కనుక వైర్‌లెస్‌గా కరెంట్ ప్రసారమే మార్గం. మైక్రోవేవ్స్ టెక్నాలజీని అభివృద్ధిపరిస్తే 2040 నాటికి ఇది సాధ్యమవుతుందని జాక్సా చెబుతోంది. వీరి ప్రతిపాదన ప్రకారం.. భూమికి 36 వేల కి.మీ. ఎత్తులో భారీ సోలార్ శాటిలైట్లను మోహరిస్తారు. భూమిపై భారీ రిసీవర్లను ఏర్పాటుచేస్తారు. 3 కి.మీ. సైజు ఉండే ఒక రిసీవర్ ఒక అణు రియాక్టర్ ఉత్పత్తి చేసేంత విద్యుత్‌ను గ్రహిస్తుందని అంచనా. ఇదే టెక్నాలజీతో మన ఇళ్లు, కార్యాలయాల్లోనూ తీగలు లేకుండానే కరెంటును వాడుకునేందుకు కూడా వీలు కానుంది!
ముప్పు మాటేమిటి..?
సూక్ష్మ తరంగాలు అంటే.. విద్యుదయస్కాంత రేడియేషన్‌కి ఒక రూపమే. మరిఈ రేడియేషన్‌తో మనుషులకు ప్రమాదం కలగదా? సూక్ష్మతరంగాల కిందుగా పక్షులు, విమానాలు ప్రయాణిస్తే ముప్పేమీ జరగదా? అంటే అది మైక్రోవేవ్స్ శక్తిస్థాయి మీద ఆధారపడి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్‌కు ఈ వేవ్స్ ప్రసారం అయినా, చుట్టూ జనావాసాలకు ప్రమాదం ఉండదు. అయితే, రిసీవర్ ప్రాంతం మీదుగా విమానాలను నిషేధించాలి. లేదా విమాన ప్రయాణికులపై మైక్రోవేవ్స్ ప్రభావం పడకుండా ప్రత్యేక లోహ కవచాలు ఉపయోగించాలి. పక్షులకు హాని కలగని స్థాయిలోనే మైక్రోవేవ్స్‌ను ప్రసారం చేయాల్సి ఉంటుంది.