Wireless power
-
వైఫైలా ‘వైర్లెస్ పవర్’.. కేబుల్స్ లేకుండానే మొబైల్ ఛార్జింగ్!
సియోల్: ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఛార్జింగ్ అయిపోతే చికాకు పడతారు. ఛార్జింగ్ పెట్టేందుకు కేబుల్ కోసం వెతుకుతారు. ఇంట్లో ఉంటే పర్వాలేదు.. కానీ వేర ప్రదేశానికి వెళ్లినప్పుడు కేబుల్స్‌ను తీసుకెళ్లటం కొంత భారంగానే ఉంటుంది. అయితే.. ఇకపై ఆ ఇబ్బందులు తప్పబోతున్నాయి. ఎలాంటి కేబుల్స్ లేకుండానే విద్యుత్తు సరఫరా చేసే ప్రయోగంలో తొలి విజయం సాధించారు శాస్త్రవేత్తలు. దక్షిణ కొరియాలోని సెజోంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త ‘వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్’ను అభివృద్ధి చేశారు. ఇన్‌ఫ్రారెండ్ లైట్స్ ద్వారా సురక్షితంగా పవర్‌ను ట్రాన్స్ఫర్ చేసి చూపించారు. 30 మీటర్ల దూరంలోని సెన్సార్లకు ఛార్జింజ్ చేసేందుకు 400 మిల్లీవాట్ల పవర్‌ను ఈ వ్యవస్థ విజయవంతంగా సరఫరా చేసింది. దీనిని మొబైల్ పరికరాలను ఛార్జ్ చేసే విధంగా విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచే పనిలోపడ్డారు శాస్త్రవేత్తలు. ‘పవర్ డివైజ్‌లను వైర్‌లెస్‌గా మార్చటం ద్వారా ఫోన్స్, టాబ్లెట్స్ వంటి వాటికి కేబుల్స్‌ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం రాదు. అలాగే.. ఐఓటీ పరికరాలు, తయారీ ప్లాంట్లలోని సెన్సెర్లను ఛార్జ్ చేయవచ్చు.’ అని పరిశోధన బృంద నాయకుడు జిన్యోంగ్ హా తెలిపారు. మరోవైపు.. వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ కోసం పలు టెక్నిక్‌లపై పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. అయితే.. మీటర్ల వ్యవధిలో తగినంత విద్యుత్తును పంపడం సవాలుగా మారిందన్నారు. ఈ క్రమంలో.. పరిశోధకులు 'డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ ఛార్జింగ్' అనే పద్ధతి అన్ని టెక్నిక్‌ల కంటే మేలైనదిగా తేల్చారు. ఏదైనా వస్తువు, వ్యక్తి ఈ సిస్టమ్‌లోని లైట్‌ను అడ్డుకోనంత వరకు తక్కువ స్థాయి పవర్‌ను సురక్షితంగా పంపించవచ్చని చెప్పారు. ఎలా పనిచేస్తుంది? డిస్ట్రిబ్యూటెడ్ లేజర్ ఛార్జింగ్ అనేది కొంత వరకు సంప్రదాయ లేజర్ లాగానే పని చేస్తుంది. ఒకే వస్తువులో లేజర్ పరికరాలను అమర్చకుండా.. ట్రాన్స్మిటర్, రిసీవర్ రెండు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు ఒకే లైన్లో ఉండి లేజర్ లైట్ అనుసంధానమవుతే.. ఈ వ్యవస్థ లైట్ ఆధారిత పవర్‌ను లోడ్‌కు సరఫరా చేస్తుంది. ఒకవేళ ట్రాన్స్మిటర్, రిసీవర్ల మధ్య ఏదైనా అడ్డుపడితే ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా పవర్ సేఫ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. పరిశోధకులు రిసీవర్, ట్రాన్స్మిటర్లను 30 మీటర్ల దూరం వేరు చేశారు. ట్రాన్స్మిటర్ ఎర్బియం-డోప్డ్ ఫైబర్ యాంప్లిఫైయర్ ఆప్టికల్ సోర్స్‌తో తయారు చేశారు. రిసీవర్ యూనిట్లో రెట్రో రిఫ్లెక్టర్, ఆప్టికల్ సిగ్నల్‌ను ఎలక్ట్రికల్ పవర్‌గా మార్చే ఫోటోవోల్టాయిక్ సెల్, పవర్ డెలివరీ అవుతున్నప్పుడు ప్రకాశించే ఎల్ఈడీ ఉన్నాయి. ఈ వ్యవస్థ విజయవంతంగా విద్యుత్తును ట్రాన్స్ఫర్ చేసి చూపించింది. ఇదీ చదవండి: వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం -
ఇక టెలివిజనూ.. వైర్లెస్
ఇప్పటికే స్మార్ట్ఫోన్ల చార్జింగ్ కోసం అందుబాటులోకి వచ్చిన వైర్లెస్ టెక్నాలజీ... ఇప్పుడు టెలివిజన్లకు విస్తరించనుంది. రష్యాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కేబుల్‌కు బదులుగా వైఫై పద్ధతిలో టీవీకి విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఇది పనిచేయనుంది. రెజొనెన్స్ అనే స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన ఈ సరికొత్త టెక్నాలజీని సీఈఎస్ 2021లో ప్రదర్శించారు. కేబుల్స్‌కు బదులు వైఫై పద్ధతిలో విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ, దాన్ని అందుకునే రిసెప్షన్ సిస్టమ్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. (చదవండి: 5జీ బడ్జెట్ మొబైల్ వచ్చేసింది!) విద్యుత్తు సాకెట్‌కు దూరంగా టీవీని ఏర్పాటు చేసుకోవడం అసాధ్యమైన ఈ నేపథ్యంలో రెజొనెన్స్ ఈ వైర్లెస్ టీవీని తీసుకొచ్చింది. వైర్లెస్ పద్ధతిలో విద్యుత్తును అందుకునే రిసీవర్. కాయిల్‌ను టీవీ లోపలే ఏర్పాటు చేశామని, ప్రసారం చేసే ట్రాన్స్‌మీటర్‌ను టీవీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుందని కంపెనీ వివరించింది. కనీసం మీటర్ దూరం వరకూ విద్యుత్తును ప్రసారం చేయవచ్చని, కాయిల్ సైజును మార్చడం ద్వారా ఈ దూరాన్ని మరింత పెంచవచ్చని తెలిపింది. రిసీవర్ కాయిల్‌ను టెలివిజన్ఫ్రేమ్లోకే చేరవచ్చని, ట్రాన్స్‌మీటర్‌ను అవసరాన్ని బట్టి టెలివిజన్ అడుగు భాగంలో కానీ.. గోడ లోపలగాని ఏర్పాటు చేసుకోవచ్చని కంపెనీ వివరించింది. ఏడాది క్రితం సామ్సంగ్ కూడా ఇలాంటి వైర్లెస్ టీవీని తెచ్చే ప్రయత్నం చేసినా... తగిన టెక్నాలజీ లేదని తన ప్రయత్నాలను విరమించుకుంది. రెజొనెన్స్ తన టెక్నాలజీపై అమెరికాతో పాటు ఇండియా, యూరోపియన్ యూనియన్, కెనడా, దక్షిణ కొరియాల్లోనూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ టెక్నాలజీని టెలివిజన్లకు మాత్రమే కాకుండా... ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ ఉపకరణాలతోపాటు విద్యుత్తు వాహనాలకూ వాడొచ్చని కంపెనీ చెబుతోంది. -
వైర్లెస్ కరెంట్
తీగలు లేకుండా విద్యుత్ ప్రసారం.. అది కూడా అంతరిక్షం నుంచి! ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఈ దిశగా జపాన్ శాస్త్రవేత్తలు ముందడుగేశారు మరి. తీగలు లేకుండా 55 మీటర్ల దూరం పాటు వారు కరెంటును విద్యుదయస్కాంత సూక్ష్మ తరంగాల రూపంలో విజయవంతంగా పంపగలిగారు. దీంతో భవిష్యత్తులో అంతరిక్షంలో సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. భూమి మీదకు తీసుకువచ్చేందుకు వీలు కానుంది! - నేషనల్ డెస్క్ తీగల్లేని కరెంటు ఇలా జపాన్ అంతరిక్ష సంస్థ ‘జాక్సా’ శాస్త్రవేత్తలు తొలుత 1.8 కిలోవాట్ల విద్యుత్‌ను సూక్ష్మ తరంగాలు(మైక్రోవేవ్స్)గా మార్చారు. వాటిని 55 మీటర్ల దూరంలోని రిసీవర్‌కు పంపారు. వాటిని రిసీవర్ స్వీకరించి, విద్యుత్ తరంగాలుగా మార్చి తిరిగి ప్రసారం చేసింది. శక్తిమంతమైన విద్యుదయస్కాంత సూక్ష్మ తరంగాలను వైర్‌లెస్‌గా పంపడం ప్రపంచంలో ఇదే తొలిసారని, దీన్ని గతవారం విజయవంతంగా నిర్వహించామని జపాన్ తెలిపింది. తాజాగా మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ 10 కిలోవాట్ల విద్యుత్‌ను మెక్రోవేవ్స్గా మార్చి 1640 అడుగుల దూరంలోని ఓ రిసీవర్‌కు పంపించి తద్వారా వంటగదిలో వాడే కొన్ని పరికరాలను విజయవంతంగా పనిచేయించారు. అంతరిక్ష విద్యుత్తు భూమి మీద 24 గంటలూ సౌరవిద్యుత్ ఉత్పత్తి కుదరదు. అంతరిక్షంలో అయితే అడ్డంకులే ఉండవు. అందుకే ఉపగ్రహాలకు భారీ సౌరఫలకాలను బిగించి.. సౌరవిద్యుత్‌ను తయారుచేసి.. భూమికి తీసుకురావాలన్న యత్నం. కానీ రోదసి నుంచి విద్యుత్ తీగలు కుదరవు కనుక వైర్‌లెస్‌గా కరెంట్ ప్రసారమే మార్గం. మైక్రోవేవ్స్ టెక్నాలజీని అభివృద్ధిపరిస్తే 2040 నాటికి ఇది సాధ్యమవుతుందని జాక్సా చెబుతోంది. వీరి ప్రతిపాదన ప్రకారం.. భూమికి 36 వేల కి.మీ. ఎత్తులో భారీ సోలార్ శాటిలైట్లను మోహరిస్తారు. భూమిపై భారీ రిసీవర్లను ఏర్పాటుచేస్తారు. 3 కి.మీ. సైజు ఉండే ఒక రిసీవర్ ఒక అణు రియాక్టర్ ఉత్పత్తి చేసేంత విద్యుత్‌ను గ్రహిస్తుందని అంచనా. ఇదే టెక్నాలజీతో మన ఇళ్లు, కార్యాలయాల్లోనూ తీగలు లేకుండానే కరెంటును వాడుకునేందుకు కూడా వీలు కానుంది! ముప్పు మాటేమిటి..? సూక్ష్మ తరంగాలు అంటే.. విద్యుదయస్కాంత రేడియేషన్‌కి ఒక రూపమే. మరిఈ రేడియేషన్‌తో మనుషులకు ప్రమాదం కలగదా? సూక్ష్మతరంగాల కిందుగా పక్షులు, విమానాలు ప్రయాణిస్తే ముప్పేమీ జరగదా? అంటే అది మైక్రోవేవ్స్ శక్తిస్థాయి మీద ఆధారపడి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్‌కు ఈ వేవ్స్ ప్రసారం అయినా, చుట్టూ జనావాసాలకు ప్రమాదం ఉండదు. అయితే, రిసీవర్ ప్రాంతం మీదుగా విమానాలను నిషేధించాలి. లేదా విమాన ప్రయాణికులపై మైక్రోవేవ్స్ ప్రభావం పడకుండా ప్రత్యేక లోహ కవచాలు ఉపయోగించాలి. పక్షులకు హాని కలగని స్థాయిలోనే మైక్రోవేవ్స్‌ను ప్రసారం చేయాల్సి ఉంటుంది.