2030 నాటికి మహిళా క్యాన్సర్ రోగులు రెట్టింపు
2030 నాటికి మహిళా క్యాన్సర్ రోగులు రెట్టింపు
Published Mon, Nov 7 2016 2:05 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
క్యాన్సర్ బాధితులు, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, మహిళా రోగులు
ప్రపంచంలోని వర్ధమాన దేశాల్లో బ్రెస్ట్‌క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ల వల్ల ఏటా 8 లక్షల మంది మరణిస్తున్నారని, 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని టొరాంటో, కేప్‌టైన్ యూనివర్సిటీలు, లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మమోగ్రఫీ, కీమోథెరపీ సౌకర్యాలు లేకపోవడం వల్ల పేద దేశాల్లో బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ల వల్ల ఎక్కువమంది మహిళలు మరణిస్తున్నారని వారు తెలిపారు.
బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల్లో మూడింట రెండు వంతుల మంది మృత్యువాత పడుతుంటే, ప్రతి పదిమంది సర్వైకల్ రోగుల్లో తొమ్మిది మంది మృత్యువాత పడుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. గర్భిణి, ప్రసవం సమస్యల కారణంగా మరణిస్తున్న మహిళలకన్నా మూడురెట్లు ఎక్కువ మంది మహిళలు ఈ రెండు క్యాన్సర్ల వల్ల మరణిస్తున్నారని వారు తెలిపారు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి కేవలం 1.72 డాలర్లను వెచ్చించడం వల్ల పెద్ద సంఖ్యలో మహిళల మృతులను అరికట్టవచ్చని వారు చెబుతున్నారు.
ప్రపంచంలో 2030 నాటికి బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల సంఖ్య 32 లక్షల రూపాయలకు, సర్వైకల్ క్యాన్సర్ రోగుల సంఖ్య ఏడు లక్షలకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మరో నాలుగేళ్లలో బాలికలకు 'పాపిలోమా' (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ చేయడం ద్వారా వారికి సర్వైకల్ క్యాన్సర్‌ను వారికి రాకుండా అరికట్టవచ్చని వారు తెలిపారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది బాలికలకు పాపిలోమా వ్యాక్సినేషన్ చేయించాలని వారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సిఫార్సు చేశారు.
Advertisement
Advertisement