ఆమె ఓ సూపర్ మోడల్!
న్యూయార్క్ : ఆమె ఓ క్యాన్సర్ పేషెంట్.. వ్యాధి ముదిరి ఫోర్త్ స్టేజ్ లో ఉంది. కానీ అందమైన ఫోటోలతో, అద్భుతమైన మోడల్ గా అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. క్యాన్సర్ వ్యాధి బారినపడగానే తీవ్రమైన భయాందోళనలకు లోను కావడం చాలామంది బాధితుల్లో కనిపిస్తుంది. తమకు తాము మరణశాసనం రాసుకున్నట్టుగా కుంగిపోతారు. ముఖ్యంగా వ్యాధి నివారణలో భాగమైన కీమో థెరపీ, దాని దుష్ప్రభావాలకు మరింత బెంబేలెత్తిపోతారు. కానీ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉన్న ఓ మోడల్ ఇపుడు ప్రపంచంలోని క్యాన్సర్ వ్యాధి పీడితులకు స్ఫూర్తిగా నిలిస్తోంది. ఒకవైపు రోగం పీడిస్తున్నా ఆత్మవిశ్వాసంతో తన వృత్తిలో ముందడుగు వేయడం ఆకర్షిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని,ఆత్మసౌందర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
డయానా క్రిష్టియన్ (25) మూడు సంవత్సరాల క్రితం లింఫోమియా బారిన పడింది. న్యూయార్క్ నుండి ఫ్యాషన్ బిజినెస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే చిన్నవయసులోనే ఈ మహమ్మారి ఆమెను కూడా వణికించింది. వ్యాధిని గుర్తించే సమయానికి దాదాపు నాలుగు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కీమో థెరపీ, రెండుసార్లు స్టెమ్ సెల్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ మూలంగా పూర్తిగా నీరసించిపోయింది. జుట్టుమొత్తం ఊడిపోయింది.
అయినా తన రూపం చూసుకొని కంగిపోలేదు. తన కరియర్ లో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. చికిత్స అనంతరం తన స్నేహితుడు సహాయంతో కొన్ని ఫోటోలు తీసి ఒక పోర్ట్ ఫోలియె క్రియేట్ చేసుకుంది. అలా ఆమె పోర్ట్ ఫోలియోలోని ఫోటోలు పెద్దపెద్ద కంపెనీల, ఫోటో గ్రాఫర్ల దృష్టిని ఆకర్షించాయి. ఎలాంటి విగ్ గానీ, స్కార్ఫ్ ధరించకుండానే ఫోటోలకు ఫోజులిస్తూ, ర్యాంపై పై నడుస్తే ధీశాలిగా నిలిస్తోంది. దీంతోపాటు చాలా మేజర్ కంపెనీలకు తమ మోడలింగ్ చేస్తూ సూపర్ మోడల్ గా నిలిచింది.
క్యాన్సర్ సోకినంత మాత్రాన ఎక్కడా అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఈ సూపర్ మోడల్ డయానా పిలుపునిస్తోంది. తన అనారోగ్యానికి దాచడం తనకు ఇష్టం లేదని, తను ఎలా ఉన్నానో, వాస్తవంగా ఎలా కనిపిస్తున్నానో అలాగే ప్రపంచానికి తెలియాలని డయానా పేర్కొంది.