
గెలిచిన తర్వాత ట్రంప్ ఏమన్నారంటే...
న్యూయార్క్: అమెరికా ప్రజల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడతానని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీయిచ్చారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. గెలుపోటములు సహజనమని, దేశం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది ఒక్కటే చారిత్రక విజయం కాదని, ఇంకా చాలా ఉందని పేర్కొన్నారు.
ప్రజలంతా సమైక్యంగా ఉండడానికి అందరూ కలిసిరావాలన్నారు. ఈ విజయం వెనుక చాలా మంది కృషి ఉందన్నారు. తన విజయానికి పాటుపడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు హిల్లరీ క్లింటన్ అభినందనలు తెలిపారని చెప్పారు. తాను కూడా హిల్లరీని అభినందించానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారం ఇద్దరం హోరాహోరీ తలపడ్డామని గుర్తు చేశారు. అమెరికా ఎప్పుడూ నంబర్ వన్ అని, అంతకన్నా తక్కువ అంగీకరించబోమన్నారు. తమ దగ్గర గొప్ప ప్రణాళిక ఉందని, అమెరికా ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేస్తానని ప్రకటించారు.
ట్రంప్ ఇంకా ఏమన్నారంటే...
- మౌలిక సదుపాయాలను రీడిజైన్ చేస్తా
- మన సంస్కృతి వారసత్వాలను పునరుద్ధరించుకోవాలి
- మాజీ సైనికులకు అండగా నిలుస్తాం
- కష్టపడి పనిచేస్తే ఏ స్వప్నమైనా సాకారమవుతుంది
- ఇన్నాళ్లు మహిళలు, నల్లజాతీయులను విస్మరించారు
- ఇక ముందు ఇటువంటి పరిస్థితి ఉండదు
- మనం చేయాల్సిన పని ఇప్పుడే మొదలైంది
- దేశాన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాను
- ప్రతి అమెరికన్ గర్వించేలా పనిచేస్తాం
-
అమెరికన్లు అందరికీ నేను అధ్యక్షుడిని