ఇక ఇతర దేశాల్లోనూ 'ఆధార్'
వాషింగ్టన్: ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలకు అడ్డుకట్టవేయడమేకాక భారత పౌరులకు విశిష్ట గుర్తింపును కల్పించిన ఆధార్ కార్డు విధానాన్ని ఇతర దేశాల్లోనూ అమలుచేయాలని ఐఎంఎఫ్ (ప్రపంచ బ్యాంక్) భావిస్తోంది. ఈ మేరకు భారత్ లో ఆధార్ కార్జుల జారీలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను ప్రత్యేకంగా పిలిపించుకుని ప్రెజెంటేషన్లు వింటోంది. ఈ క్రమంలోనే యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐఏఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ భూషణ్ పాండే గురువారం ప్రపంచం బ్యాంక్ అధికారులకు ఆధార్ పై ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఒక్కో పౌరుడికి జారీ చేసేందుకు కనీసం ఒక అమెరికన్ డాలర్ ఖర్చు కూడా కాని ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు ఏవిధమైన ప్రయోజనాలు ఉంటాయో అజయ్ భూషణ్ ప్రపంచం బ్యాంక్ అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా భారత్ లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రపంచ బ్యాంక్ అధికారులు ప్రశంసించారు. 100 కోట్ల మంది వేలి ముద్రలు, ఐరిస్, చిరునామాలు సేకరించడం, అంతమందికీ విశిష్ట సంఖ్యను అందివ్వడానికి భారత ప్రభుత్వం అనేక శ్రమలకోర్చిందని, అయితే ఆధార్ జారీ అయిన తర్వాత పనుల్లో పారదర్శకత, నగదు రహిత లావాదేవీలు వంటి ప్రయోజనాలు అనుభవంలోకి వచ్చాయని యైఐఏఐ డీజే తెలియజెప్పారు. సమావేశం అనంతరం అయయ్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ మొదట ఆఫ్రికన్ దేశాల్లో ఆధార్ కార్డు తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఆ తర్వాత మిగతా దేశాలకు విస్తరింపజేయాలని ప్రపంచ బ్యాంక్ ఆలోచిస్తున్నట్లు తెలిపారు. మరి కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు.