వేగంగా కరుగుతున్న హిమనీ నదాలు
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా హిమనీనదాలు ప్రమాదకర స్థాయిలో కరుగుతున్నట్లు ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. 20 శతాబ్దంతో పోలిస్తే ఈ శతాబ్దపు మొదటి దశాబ్దంలో హిమనీ నదాలు మూడు రెట్లు ఎక్కువగా కరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యురిచ్ కేంద్రంగా పనిచేసే 'వరల్డ్ గ్లేసియర్ మానిటోరింగ్ సర్వీస్'(డబ్ల్యూజీఎమ్‌ఎస్) ఈ అధ్యయనం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమనీ నదాల్లో సంభవించిన మార్పులకు సంబంధించి సుమారు 120 ఏళ్లకు పైగా సమాచారాన్ని ఈ సంస్థ సంకలనం చేసింది. శాటిలైట్ ఆధారిత డేటాతో పాటు వివిధ రకాలుగా ఈ సమాచారాన్ని సేకరించింది. దీని ప్రకారం 20 శతాబ్దపు సగటుతో పోలిస్తే ప్రస్తుతం రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా హిమానీనదాలు కరుగుతున్నట్లు తేలిందని డబ్ల్యూజీఎమ్‌ఎస్ డెరైక్టర్ మైకెల్ జెంప్ తెలిపారు.
వివరాలు
1. ప్రస్తుతం హిమనీ నదాలు ఏడాదికి అర మీటరు నుంచి మీటరు వరకు కరుగుతున్నాయి. గత శతాబ్దంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం.
2. ఈ గణాంకాలు కొన్ని వందల హిమనీ నదాలకు సంబంధినవి మాత్రమే. వాటిని సందర్శించడంతో పాటు శాటిలైట్ ఆధారంగా సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ కచ్చితమైన గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల హిమనీ నదాలకు కూడా వర్తిస్తాయని జెంప్ తెలిపారు.
3. ప్రపంచవ్యాప్తంగా ఇంతకు మునుపెన్నడూ ఈ స్థాయిలో హిమనీ నదాలు కరిగన దాఖలాలు లేవు.
4. హిమనీ నదాలు అధిక స్థాయిలో కుచించుకుపోతున్నాయి.
5. రెండు దశాబ్దాలుగా భారీగా కరుగుతుండడం వల్ల చాలా ప్రాంతాల్లో హిమనీ నదాల్లో అసమతౌల్యత ఏర్పడింది.
6. ఒకవేళ వాతావరణం స్థిరంగా ఉన్నా హిమనీ నదాలు కరిగే అవకాశం లేకపోలేదు.