కిలో చేపల ఖరీదు ఎంత ఉంటుంది.. మహా అయితే రూ.200–300 ఉంటుంది. మరీ పులస చేపల వంటివి అయితే కేజీకి రూ.10 వేలు దాటుతుంది. కానీ ఈ ఫొటోలోని చేప ఖరీదెంతో తెలుసా.. రూ.12.6 కోట్లు! అది కూడా ఏ కిలో చేపలకు కాదు.. ఒకే ఒక బతికున్న చేపకు. వామ్మో ఒక్క చేపకు అంత ధరనా.. అని ఆశ్చర్యపోతున్నారా.. ఇంతకీ ఆ చేపలో ఏముందని అంత ధరకు కొన్నారనే కదా మీ అనుమానం. ఆ చేప పేరు ‘లెజెండ్’. కోయి–కొహకు జాతికి చెందిన మంచినీటి ఆడ చేప. తెలుపు వర్ణంలో ఉండి దానిపై నారింజ రంగు మచ్చలతో చూడముచ్చటగా ఉంటుంది. జపాన్‌లోని హిరోషిమాలో ఉన్న సఖి చేపల మార్కెట్‌లో ఈ ఏడాది ఓ వేలం పాట జరిగింది.
101 సెంటీమీటర్ల (3 అడుగుల 3 అంగుళాలు) పొడవున్న ఈ లెజెండ్‌ను అన్ని కోట్లకు దక్కించుకున్నారు. గతేడాది కన్నా ఈ సారి రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం విశేషం. తైవాన్‌కు చెందిన యింగ్‌యింగ్ అనే మహిళ ఈ చేపను కొన్నారు. ఈ అరుదైన, అందమైన చేపల పోటీలు ఏటా జపాన్‌లో జరుగుతుంటాయి. ఆ పోటీల్లో లెజెండ్‌ను పోటీకి నిలిపి విజేతగా నిలవాలని ఆమె ఆలోచన. గతేడాది పోటీల్లో కూడా ఈ చేప విజేతగా నిలవడంతో దీనికి డిమాండ్ భారీగా పెరిగి ఇంత ధరకు అమ్ముడు పోయింది. ఈ ఒక్క చేప దాదాపు 5 లక్షల గుడ్లను పెడుతుందట. వాటిలో దాదాపు 5 వేల చేప పిల్లలు అమ్మకానికి అనువుగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కోయి చేపల్లో 90 శాతం జపాన్‌లోనే ఉత్పత్తి అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment