
ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్ : అగ్రరాజ్యంలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపుతోంది. కరోనా మరణాల విషయంలో ఇతర దేశాలు అందుకోలేనంత ఎత్తులోకి చేరుకుంది అమెరికా. గురువారం-శుక్రవారం వరకు 24 గంటల సమయంలో ప్రపంచ రికార్డు స్థాయి మరణాలు సంభవించాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. దాదాపు 1,500 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారని వెల్లడించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, అమెరికాలో ఈ సంఖ్య 2లక్షల 77 వేలుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 60వేల మంది.. అమెరికాలో 7,400 మంది మరణించారు. ( కరోనాపై కలసికట్టుగా పోరాడుదాం )
అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్లందరూ మరో నాలుగు వారాలు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరానికి మించిన పరిష్కార మార్గం లేదని అన్నారు. ‘‘దేశ పౌరుల ప్రాణాలు కాపాడాలి. స్వీయ నియంత్రణ మీదే మన భవిష్యత్ ఆధారపడి ఉంది. భౌతిక దూరాన్ని పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఇల్లు కదలకుండా ఉండండి. మరో నెల రోజులు ఇలా చేస్తే మనం కరోనాపై యుద్ధంలో గెలుస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాలన్నీ పాటించండి’’అని ప్రజలకు ఆయన హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment