ప్రపంచ కుబేరులు తీవ్రంగా నష్టపోయారు!
ప్రపంచ కుబేరుల్లో సుమారు నాలుగు వందలమంది కేవలం మూడు వారాల్లోనే వందల బిలియన్ డాలర్లను కోల్పోవడం మార్కెట్ ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది. వీరంతా మూడు సంవత్సరాల కాలంతో పోలిస్తే ఈ ఒక్క నెలలోనే భారీ నష్టాలను చవిచూశారు. ఉమ్మడిగా వీరు నష్టపోయిన సంపద విలువ 350 బిలియన్ డాలర్లని బ్లూమ్ బర్గ్ బిజినెస్ రిప్టోర్లులు చెప్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఈక్విటీల వృద్ధి రేటు తీవ్రంగా పడిపోవడంతో వందలమంది బిలియనీర్లు భారీ నష్టాల పాలయ్యారు. బ్లూం బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఈ ఒక్కవారంలోనే వారంతా సుమారు 115 బిలియన్ డాలర్ల నష్టాలను చవి చూశారు. అందులో ఏడుగురు శుక్రవారం ఒక్కరోజులోనే ఒక బిలియన్ డాలర్లను కోల్పోయినట్లు నివేదికలు చెప్తున్నాయి. బ్లూమ్బర్గ్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్ డాట్ కామ్ ఇంక్ (Amazon.com Inc. ) వ్యవస్థాపకుడు జెఫ్ బెజాస్ నష్టాల్లో అందరికన్నా ముందున్నారు. 8.9 బిలియన్ డాలర్లను ఈ ఒక్క నెల్లోనే నష్టపోయారు. అంతేకాక ఒక్క శుక్రవారం రోజునే 1.9 బిలియన్ డాలర్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. అలాగే బిల్ గేట్స్ 6.8 బిలియన్ డాలర్ల నికర విలువను, చైనా అత్యధిక సంపన్నుడు వాంగ్ జియాన్ లిన్ 6.4 బిలియన్ డాలర్లను నష్టపోయారు. డౌజోన్స్ 391 పాయింట్లతో పాటు, మార్కెట్లో యూరోపియన్ స్టాక్స్ భారీగా పడిపోయిన కారణంగా ఇటువంటి తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చిందని తాజా రిపోర్టులు చెప్తున్నాయి. అలాగే స్టేట్ రెస్క్యూ ప్రచారంతో షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ కూడ ఏడు నెలల్లో రెండోసారి ఊహించని రీతిలో మలుపు తిరిగింది.
ఇదిలా ఉంటే పన్నెండు సంవత్సరాల కాలంలో చమురు ధరలు తీవ్రంగా పడిపోవడం వల్లనే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలపాలయ్యాయని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికలు చెప్తున్నాయి. కాగా తీవ్రంగా నష్టపోయిన నాలుగు వందలమంది అత్యధిక సంపన్నుల్లో ఈ సంవత్సరం తొమ్మిది మంది నికర విలువలో కొంత పెరుగుదల కనిపించింది. వీరిలో ముఖ్యంగా ముంబైకి చెందిన రిలయన్స్ ఇండస్ల్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, భారత ఆయిల్ బిలియనీర్ ముఖేష్ అంబానీ నికర విలువలో 620 మిలియన్ డాలర్ల వృద్ధి కనిపించింది.