మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలోయ్.. ఎప్పుడూ ఉరుకులూ, పరుగులూ, టెన్షన్లేనా..? కాంక్రీట్ జంగిల్‌లో, ఇరుకు గదుల్లో రోబోల్లా ఉండాల్సిందేనా..? ఇక చాలు.. అటువంటి బిజీ లైఫ్‌కి కాస్త విరామం ఇవ్వండి.. మా ‘మురాకా’ లో సేద తీరండి అంటూ ట్రావెల్ ప్రియులను ఆహ్వానిస్తోంది మాల్దీవుల ప్రభుత్వం.
మొట్టమొదటిసారిగా..
మురాకా అంటే పగడం అని అర్థం. మాల్దీవుల్లోని రంగాలీ ఐలాండ్‌లో ఉన్న ఓ విల్లా కూడా పగడంలా మెరిసిపోతుందట. అందుకే దానికి మురాకా అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ విల్లాగా పేరు పొందిన ఈ విల్లా నిర్మాణానికి సుమారు 15 బిలియన్లు ఖర్చు అయిందట. సింగపూర్‌లో తయారు చేసిన ఈ విల్లాను మాల్దీవులకు తీసుకు వచ్చి కాంక్రీట్ పోల్స్ సహాయంతో సముద్రంలో దించారు. వేగమైన గాలులు, అలలను తట్టుకుని ఇది నిలబడగలదు.
హిందూ మహాసముద్రంలో 16 అడుగుల లోతులో నిర్మితమైన ఈ రెండు అంతస్తుల విల్లా గుండా అరుదైన సముద్రపు జీవులను వీక్షిస్తూ హాయిగా సేద తీరవచ్చు. జిమ్, బార్ వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు సూర్యుడిని చూసేందుకు విల్లా పైకి ఎక్కితే సరి. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మురాకాలో ఒక్కరాత్రి స్టే చేయాలంటే భారీగానే ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది మరి. అంతేకాదు ఒక వ్యక్తి ఈ విల్లాను కేవలం నాలుగు సార్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఇంతకీ ఒక్కరోజు అద్దె ఎంతో చెప్పలేదు కదూ.. జస్ట్ 36 లక్షలేనటండీ.
Comments
Please login to add a commentAdd a comment