ఉద్యోగుల వేళ్ల మధ్య మైక్రోచిప్
ఉద్యోగులారా..! మీ చేతులను ఓ సారి చూసుకోండి. మీ చేతులే ఇకపై బ్యాంకు లావాదేవీలు, ఆన్‌లైన్‌లో షాపింగ్‌లు జరిపే మెషీన్లుగా మారితే ఎలా ఉంటుంది. అవునండి. తమ చేతిలో కంపెనీలు ఇచ్చే మైక్రోచిప్స్‌ను అమర్చుకునేందుకు యూరప్‌లో ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులు ఈ చిప్‌ను బొటన వేలు, చూపుడు వేలు మధ్య ఉన్న చర్మభాగంలో అమర్చుకున్నారు కూడా. అంతేకాదు ఆ చిప్‌ను ఉపయోగించి ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్‌తో పాటు కంపెనీల అవసరాలకు అనుగుణంగా వీరంతా విధులు నిర్వహిస్తున్నారు.
ఏంటీ చిప్..
బియ్యపు గింజంత సైజులో ఉండే ఈ చిప్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్‌ఐడీ)తో ట్యాగ్ చేస్తారు. దీనికి కాంటాక్ట్‌లెస్ బ్యాంకు కార్డుల వలె పని చేసే సామర్ధ్యం ఉంటుంది. అంటే ఇవి విద్యుదయాస్కాంత తరంగాలను ఉపయోగించి స్టోర్ చేసిన సమాచారాన్ని చదవగలుగుతాయన్నమాట. మరో విధంగా చెప్పాలంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్(ఎన్‌ఎఫ్‌సీ) గురించి మీరు వినే ఉంటారు కదా. అచ్చు అలానే కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులు, మొబైల్ పేమెంట్లకు ఈ చిప్‌ను వినియోగించి పని కానించేయొచ్చు.
ప్రస్తుతం ఈ చిప్ టెక్నాలజీ యూరప్ నుంచి అమెరికాకు కూడా పాకింది. 32ఎమ్ అనే ఓ అమెరికన్ కంపెనీ ఈ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది. అమెరికాకు చిప్ టెక్నాలజీ కొత్తేమీ కాదు. 2005లోనే ఆ దేశంలో చిప్ టెక్నాలజీ వినియోగంపై ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఉద్యోగి ఇష్టానికి వ్యతిరేకంగా చిప్‌ను అతని/ఆమె శరీరంలోకి ప్రవేశపెట్టకూడదని దాని సారాంశం.
నష్టాలకూ కొదవలేదు!
ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌తో చిప్‌లను ఆన్‌లైన్ లావాదేవీలకు ఉపయోగించడం ప్రమాదకరమని స్టోక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లోని మైక్రోబయాలజిస్ట్ బెన్ లిబ్బర్‌టన్ అభిప్రాయపడుతున్నారు. ఎన్‌క్రిప్టెడ్ చిప్‌లను హ్యాక్ చేయడం సులభతరమని చెబుతున్నారు. చిప్‌లను అమర్చుకున్న ఉద్యోగులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు చేసింది కూడా.