ఆ హెలికాప్టర్ కూలిపోయింది
కఠ్మాండు: నేపాల్ భూకంప బాధితులకు సహాయం చేయడానికి వెళ్లి అదృశ్యమైన అమెరికా హెలికాప్టర్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ అదృశ్యమైన ఆ కాప్టర్ను దాదాపు 60 గంటల తర్వాత జాడ కనుక్కొన్నారు. నేపాల్ పర్వత శ్రేణుల్లో కూలిపోయినట్టుగా నేపాల్ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
చైనాకు సరిహద్దుల్లో దోల్కా జిల్లాలోని కలిన్ చౌక్ పర్వతంపై కనిపించిందని నేపాల్ సైన్యం తెలిపింది. కఠ్మాండుకు సమీపంలో విమానం ద్వారా హెలికాప్టర్ జాడ కనుక్కున్నట్టుగా మేజర్ జనరల్ బినోజ్ బాసంత్ తెలిపారు. హెలికాప్టర్ శిథిలాల నుంచి ముగ్గురు అమెరికన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
నేపాల్లోని భూకంప బాధితుల కోసం అమెరికాకు చెందిన హెలికాప్టర్ మంగళవారం ఆహార పదార్థాలను తరలిస్తున్న క్రమంలో అదృశ్యమైంది. అమెరికాకు చెందిన యూహెచ్ -1 వై హ్యూయే అనే హెలికాప్టర్, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మెరైన్ సిబ్బంది, ఇద్దరు నేపాలీ సైనికులుతోపాటు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.