డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద లైంగిక ఆరోపణలు కొనసాగుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన నాటి నుంచి ట్రంప్ మీద చాలా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. న్యూయార్క్‌కు చెందిన ఈ జీన్ కారోల్(75) అనే అడ్వైజ్ కాలమిస్ట్ ఒకరు 1990ల కాలంలో ట్రంప్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. తన ‘హైడియస్ మెన్’ పుస్తకంలో దీని గురించి చెప్పుకొచ్చారు.
‘1995 - 96కాలంలో ట్రంప్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడు ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఒకరోజు నేను మాన్‌హట్టన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌కి వెళ్లినప్పుడు ట్రంప్ అక్కడ కనబడ్డారు. ఆయనతో అంతకు ముందే పరిచయం ఉండటంతో పలకరింపుగా నవ్వాను. తనేదో జోక్ చేశాడు. అలా సరదాగా నవ్వుతు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతలో ట్రంప్ ఓ బాడీ సూట్ తెచ్చి ట్రై చేయమంటూ నన్ను డ్రెస్సింగ్‌రూమ్‌లోకి తోశారు. తర్వాత నా వెనకే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించార’ని కారోల్ తెలిపారు.
‘ఈ సంఘటనతో ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాను. వెంటనే ఆయన్ని తోసేసి అక్కడ నుంచి బయటకు పరిగెత్తుకొచ్చాను. ఆ సమయంలో అక్కడ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఎవరూ లేర’ని తెలిపారు. ఈ విషయం గురించి తాను ఇద్దరు మిత్రులతో చర్చించానని.. ఒకరేమో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయమని చెప్పగా.. ఆయనకు చాలా పలుకుబడి ఉంది కాబట్టి మౌనంగా ఉండమని హెచ్చరించారన్నారు కారోల్.
అయితే ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టి పారేశారు. తన జీవితంలో ఇంతవరకూ కారోల్‌ని కలవలేదని చెప్పుకొచ్చారు. ‘ఇది ఫేక్ న్యూస్. దీనికి సంబంధించి ఎలాంటి ఫోటోలు లేవు.. వీడియో లేదు.. రిపోర్టు లేవు.. చుట్టుపక్కల ఎవరూ లేరు... బెర్గ్‌డార్ప్ గాడ్‌మ్యాన్ కంపెనీ కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి వీడియో ఫుటేజ్ లేదని చెప్పింది. ఎందుకంటే అసలు అలాంటి సంఘటన జరగలేదు కాబట్టి’ అంటూ ట్రంప్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment