రోడ్డున పడనున్న 'యాహు' ఉద్యోగులు!
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాహు కంపెనీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించనుంది. నేడు త్రైమాసిక లాభాల రిపోర్టు విడుదల చేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. సంస్థలో పనిచేసే 15 శాతం ఉద్యోగులు.. దాదాపు 1600 మందికి పైగా ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తోందని యాహు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మరిస్సా మేయర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా డైరెకర్టపై ఒత్తిడి ఏర్పడినట్లు తెలుస్తోంది. యాహూ లాభాలు క్రమక్రమంగా తగ్గుతున్నందున సంస్థ నిర్వహణ ఖర్చును అదుపులో పెట్టేందుకు ఉద్యోగులను తీసేయడం మార్గంగా ఎంచుకుంది.
చాలా మార్పులు రావాలని స్టార్ బోర్డ్ భావిస్తోంది. గతేడాది డిసెంబర్ లో యాహు కంపెనీలో ఓ ఇన్వెస్టర్ స్ప్రింగ్ ఓల్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ను నియమించడంతో పాటు 80శాతం ఉద్యోగాలకు కోతపెట్టింది. చైనాకు చెందిన అలిబాబా కంపెనీలో తన వాటాలు విక్రయించవద్దని నిర్ణయించుకుంది. గత మూడేళ్లుగా అనుకున్న రీతిలో యాహు ఫలితాలు సాధించలేదన్న విషయం తెలిసిందే. ఉద్యోగులపై వివక్ష చూపిస్తోదంటూ, చట్టాలను ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలతో యాహుకే చెందిన ఓ ఉద్యోగి సిలికాన్ వ్యాలీలోని ఫెడరల్ కోర్టులో సొంత సంస్థపై దావా వేశాడు. సరిగ్గా అదేరోజు కంపెనీ ఉద్యోగుల కోత విషయం బయటకు రావడంతో సంస్థకు చెందిన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. యాహు ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది.