కరీంనగర్‌ఎడ్యుకేషన్: నగరంలోని ఎస్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8 మంది శనివారం ఉదయం నుంచి జాడలేకుండా పోయారు. వివరాల్లోకెళితే.. బస్టాండ్ సమీపంలోని కిమ్స్ డిగ్రీ కళాశాల వద్దనున్న ఎస్టీ గురుకులంలోని విద్యార్థులు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గోడదూకి పోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు సంక్షేమశాఖ అధికారులు పారిపోయిన విద్యార్థులు ఇళ్లకు వెళ్లారా.. వేరే చోటికి వెళ్లారా అనే విషయంపై స్పందించకుండా ఉండడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి.
గురుకుల విద్యాలయంలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాల్సిన అధికారులు 8 మంది విద్యార్థులు పారిపోయి 18 గంటలపాటు జాడతెలియకపోయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండడం పట్ల గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన గిరిజన జేఏసీ జిల్లా చైర్మన్ బీమాసాహెబ్ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థుల వివరాలను ఆరా తీశారు. అద్దె భవనంలో పిల్లలకు సరైన రక్షణ లేదని, రూంలు సరిపడా లేవని, వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులపై గిరిజన సంక్షేమ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే 8 మంది విద్యార్థులు గోడదూకి వెళ్లిపోయారని ఆరోపించారు. హాస్టల్ సందర్శించిన వారిలో డీవైఎస్‌ఐ నాయకులు తిరుపతినాయక్, బోడ మోహన్ సదయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment