మంథని: సక్రమంగా విధులకు హాజరవుతున్నా.. వేతనంలో వాటా ఇవ్వడంలేదని వేధిస్తున్న అధికారిపై అంగన్‌వాడీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే అదికాస్త బెడిసికొట్టింది. ఫిర్యాదు తర్వాత వేధింపులు మరింత ఎక్కువ కావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. మంథని సీడీపీవో పద్మశ్రీ తమను వేధిస్తున్నారని ప్రాజెక్టు పరిధిలోని సుమారు 80 అంగన్‌వాడీ టీచర్లు జనవరి 16న మంథని ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబుతోపాటు కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత నెల 13న జిల్లా సహకార, సంక్షేమ అధికారి చంద్రప్రకాశ్‌రెడ్డి 57 మంది ఆంగన్‌వాడీ టీచర్లను వ్యక్తిగతంగా విచారణ చేశారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సీడీపీవో ప్రతినెలా తమ వేతనం నుంచి బలవంతంగా రూ.3 వేలు వసూలు చేస్తున్నారని విచారణ అధికారికి తెలిపారు. ఇవ్వకుంటే అసభ్య పదజాలంతో ధూషిసూ భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ సీడీపీవోకు వ్యతిరేకంగా విచారణాధికారి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు.
రాజకీయ ఒత్తిళ్లతో..
విచారణ నివేదికను కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారికి పంపిస్తామని చెప్పిన అధికారికి రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఉన్నట్లు అంగన్‌వాడీ టీచర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు తమకు కాకుండా సీడీపీవోకు అనుకూలంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా విచారణ నీరుగారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. విచారణ జరిపి 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ అధికారిపై ఎలాంటి చర్య లేకపోగా, తమపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేసిన కేంద్రాలకు తనిఖీల పేరిట వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని బాధిత టీచర్లు పేర్కొంటున్నారు. తాము విధులు నిర్వహించే పరిస్థితి లేదని అంటున్నారు. పది రోజుల క్రితం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి గుండెపోటుకు గురైందని తెలిపారు. గతంలో సైతం కన్నాల–1 కేంద్రం టీచర్ పక్షవాతానికి గురైందని, నాగెపల్లికి చెందిన సజన అస్వస్థకుగురై అనారోగ్యపాలైందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణలో పారదర్శత పాటించి తమను ఇబ్బందులకు గురుచేస్తున్న అధికారిపై చర్య తీసుకోవాలని పలువరు టీచర్లు కోరుతున్నారు.
వేధింపులు నివారించండి
అంగన్‌వాడీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా సీడీపీవో సూపర్‌వైజర్లు వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో అనేక మంది టీచర్లు అనారోగ్యబారిన పడుతున్నారు. న్యాయం కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ జరుగుతుండగా...అధికారి పార్టీకి చెందిన వారు టీచర్లకు సపోర్టు చేయకుండా అధికారి అనుకూలంగా మాట్లాడటం సరికాదు. –జ్యోతి, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment