
సైదాపూర్(హుస్నాబాద్): ఓ యువకుడు ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పదస్థితిలో చనిపోయిన ఘటన మండలంలోని ఎలబోతారం గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. యువకుడి మృతికి సదరు మహిళే కారణమని, వివాహేతర సంబంధం నెరిపి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన మ్యాకల ముత్యాలమ్మ, రాజయ్య కుటుంబం మండలంలోని ఎలబోతారం గ్రామానికి ఏళ్ల క్రితమే వలసవచ్చింది. వీరి కుమారుడు హరీష్(23) చింతలపల్లి గోదాములో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులిద్దరూ హరీశ్ చిన్నతనంలోనే చనిపోయారు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో హరీష్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సదరు వివాహిత భర్త రాజన్నసిరిసిల్ల జిల్లాలో పనిచేస్తుండగా.. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎలబోతారంలోనే ఉంటోంది.
హరీష్‌తో వివాహేతర సంబంధముందన్న విషయం తెలిసి ఆమె భర్త తరచూ గొడవపడుతున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఈ విషయం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేవరకూ వెళ్లింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా.. కొద్దిరోజులకు మళ్లీ ఎప్పటిలాగే వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈక్రమంలో శనివారం రాత్రి హరీష్ మద్యంతాగి తన ఇంటికి వచ్చాడని సదరు వివాహిత పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించింది. బ్లూకోట్ సిబ్బంది వచ్చేసరికే.. ఇంట్లో దూళానికి ఉరేసుకుని కనిపించాడు. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హరీష్‌ను సదరు మహిళే హత్య చేసి ఉంటుందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేదిలేదని ఆందోళనకు దిగారు. అనుమానితులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో సదరు వివాహితపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment