జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ భవనం, చదువుకుంటున్న విద్యార్థులు
సాక్షి, పెద్దపల్లికమాన్ : పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగుల చూపంతా జిల్లా కేంద్రంలో గల గ్రంథాలయం పై పడింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటివద్దే కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధం కావడం సాధ్యం కాని పరిస్థితి. ఇలా అయితే తమ లక్ష్యం నీరుగారి పోతోందని భావించిన యువత గ్రంథాలయాలకు వచ్చి రోజంతా ఇక్కడే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు మెయిన్స్ పరీక్షలు, దక్షిణ మధ్య రైల్వేలో పోలీసు, బీఎస్‌ఎన్‌లో టీటీఎ, ఎల్‌ఐసీలో పలు ఉద్యోగాలకు పరీక్షలుండడంతో పటు గ్రామాల నుంచి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నిరుద్యోగులు తరలివస్తున్నారు.
ఉదయం 8 గంటల నుంచే..
పెద్దపల్లితో పాటు అప్పన్నపేట బంధంపల్లి, రాఘవపూర్, రంగంపల్లి, హన్మంతునిపేట లాంటి గ్రామాల నుంచి విద్యార్థులు ఉదయం 8గంటల నుండి పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వస్తున్నారు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా నిర్ధేశించుకున్న వీరు రాత్రి 8గంటల వరకు గ్రంథాలయంలోనే పఠనం చేస్తున్నారు. సొంతగా తెచ్చుకున్న పుస్తకాలతో గంటల తరబడి చదువుతున్నారు.
అరకొర సౌకర్యాలే....
పట్టణం జిల్లాగా మారిన గ్రంథాలయ అభివృద్ధి జరుగడం లేదు. గత సంవత్సరం కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దాతలు ఇచ్చిన కొన్ని పుస్తకాలు తప్ప కాంపిటిషన్‌కు ఉపయోగపడే పుస్తకాలు లేవని పాఠకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ సాహిత్య, ఉద్యమ చరిత్రలతో పాటు అన్ని పోటీ పరీక్షలకు సరిపడ పుస్తకాలను తెప్పించాలని గ్రంథాలయ అధికారికి పలుమార్లు పుస్తకాల లిస్టు ఇచ్చామని నిరుద్యోగ యువత తెలిపారు. ఉన్న అడపాతడపా పుస్తకాలను గ్రంథాలయంలోని వెనుక రూంలో ఉంచి తాళం వేసి ముందుగా ఉండే హాల్‌ను మాత్రమే తెరిచి ఉంచి సిబ్బంది మాత్రం అందుబాటులో ఉంచారని పాఠకులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రూప్ డిస్కర్షన్ సాధ్యం..
కానిస్టేబుల్, ఎస్‌ఐ, రైల్వే ఉద్యోగాలకు సాధన కోసం గత సంవత్సరం నుంచి పెద్దపల్లి గ్రంథాలయానికి వస్తున్నాను. ఇంట్లో చదివేటప్పుడు అనేక సందేహాలు వస్తాయి. కానీ ఇక్కడ ఫ్రెండ్స్‌తో గ్రూప్ డిస్కర్షన్ చేయడం వల్ల అనుమానాలు సులభంగా నివృత్తి చేసుకోవచ్చు.
– ఇ.సతీష్, సాగర్‌రోడ్
ఏకాగ్రతకు అనువైన ప్రదేశం
డిగ్రీ పూర్తి చేశాను. కానిస్టేబుల్, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని అర్హత సాధిస్తా. గ్రంథాలయంలో ఎక్కువ మంది చదువటం వల్ల వారిని చూసి చదువాలనే కసితో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. అందుకనే ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్న.
– రాజుకర్, శాంతినగర్
ప్రశాంతంగా ఉంటుందని..
రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డ్, టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాను. ఇంట్లో చదవాలంటే టీవీ శబ్దాలు, మోటార్ వాహనాల శబ్దాలతో చదువుపై ఏకాగ్రత చేయలేకపోతున్న. ఏకాగ్రతతో చదవాలంటే గ్రంథాలయం ఒక్కటే అనువైన స్థలమని ఇక్కడమిత్రులతో కలిసి చదువుతున్నాను.
– ఎ.రమేష్, పెద్దపల్లి
పుస్తకాలు అన్నీ తెస్తాం
గ్రంథాలయంలో ఇద్దరే ఉద్యోగులు ఉండడం వలన సిబ్బంది కొరత ఉంది. వీరు సమయాన్ని విభజించి షిప్టుల వారిగా పనిచేస్తారు. గ్రంథాలయంలో సిబ్బంది లేనట్లు పాఠకులు నా దృష్టికి తీసుకరాలేదు. అలా జరిగితే మెమోలు జారీ చేసి కఠిన చర్య తీసుకుంటాం. రెండు రోజుల్లో కాంపిటీషన్ పుస్తకాలను తెప్పించి పాఠకులకు అందుబాటులో ఉంచుతాం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.
– గ్రంథాలయ అధికారి, గఫూర్
Comments
Please login to add a commentAdd a comment