
అపారమైన ప్రకృతి సౌందర్యంతో అలరారే పర్వత ప్రాంతాలు, విశాలమైన సముద్ర తీరం, అందమైన కాఫీ తోటలు, వీటన్నింటినీ మించి ఘనమైన వారసత్వ సంపదైన మైసూరు, హంపీ, హళేబీడు, బాదామి వంటి గతించిన సామాజ్ర కట్టడాలతో కన్నడనాడు పర్యాటకులకు స్వర్గమే. ప్రపంచమే కుగ్రామమైన నేటి రోజుల్లో రాష్ట్రానికి విదేశీ పర్యాటకులు వెల్లువెత్తాలి. అయితే ఇందుకు భిన్నంగా జరుగుతోంది.
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర పర్యాటక స్థలాలపై విదేశీయులు ఆసక్తి తగ్గుతోందా అంటే మూడేళ్ల గణాంకాలను అనుసరించి అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో పర్యాటక శాఖ గుర్తించిన 352 ప్రాంతాలు పర్యాటకానికి అనుకూలంగా ఉంటాయి. అయితే విదేశీయులు ఎక్కువగా టెంపుల్, జంగిల్ టూరిజానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. రాష్ట్రంలో ముఖ్యంగా 13 వైల్డ్‌లైఫ్ టూరిజం ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో బన్నేరుఘట్ట నేషనల్ పార్కుకు దగ్గరగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మిగిలిన ఏ వైల్డ్‌లైఫ్ పార్క్‌కు సమీపంగా విమానయాన సర్వీసులు లేవు. విదేశీయులు రోడ్డు మార్గం కంటే విమానయాన సేవల ద్వారా తాము చూడదలుచుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి మాత్రమే విమానయాన సేవలు అందుబాటులో ఉన్నాయి. తప్ప మిగిలిన ఏ ప్రాంతాలనికి విమానయాన సేవలు అందుబాటులో లేవు. దీంతో విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోందని పర్యాటక శాఖ అధికారులే చెబుతున్నారు.
వసతుల కొరత.. భాషా సమస్య
విదేశీయులు ఉండటానికి అనుగుణంగా హోటల్స్ సౌకర్యాలు ఉండటం లేదని తెలుస్తోంది. త్రీ స్టార్ హోటల్స్ అని చెప్పుకునే చాలావాటిలో కనీస వసతులు కూడా సక్రమంగా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పర్యాటక ప్రాంతానికి, సదరు హోటల్స్ ఉన్న ప్రాంతానికి మధ్య సరైన వాహన వ్యవస్థ లేకపోవడం వల్ల విదేశీ పర్యాటకులకు ఇబ్బందిగా మరింది. హంపీని ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ విదేశీ పర్యాటకుల ఎక్కువగా వస్తుంటారు. అయితే వారికి సరైన సదుపాయాలు మాత్రం ఉండటం లేదని విమర్శలు ఉన్నాయి. కొడగు ప్రాంతంలో హోంస్టేలు ఉన్నా కూడా అందులో దేశీయ ఆహారం మాత్రమే లభిస్తోందని.. ఆ వంటకాలను విదేశీయులు తినలేకపోతున్నారని పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రముఖంగా భాషా సమస్య కూడా విదేశీయుల సంఖ్య తగ్గడానికి కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న గైడ్‌లకు ఇంగ్లీషు, జర్మనీ వంటి ఒకటి రెండు భాషలు తప్ప మరే ఇతర భాషలు కూడా రావడం లేదు. దీంతో చైనా, ఆఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి విశేషాలు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పర్యాటక మంత్రి ఖర్గె ఏమంటున్నారు..?
ఈ విషయమై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడుతూ...‘విదేశీ పర్యాటకులను ఆకర్షించే చర్యల్లో భాగంగా పర్యాటక మిత్ర పేరుతో స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. వీరికి కనీసం ఇంగ్లీషు కాక మరో మూడు భాషల్లో స్థానిక పర్యాటక ప్రాంతం గురించి ఇతరులకు చెప్పేలా ఆ శిక్షణ ఉంది. ఇక ఉడాన్ పథకంలో భాగంగా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విమానసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ చర్య పర్యాటక రంగానికి కూడా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.