
బనశంకరి(కర్ణాటక): ఇంటి వద్ద దింపుతామంటూ ఓ మహిళను కారులో ఎక్కించుకుని ఇద్దరు దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ సంఘటన బనశంకరిలోని జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జ్ఞానభారతికి చెందిన తులసమ్మ అనే మహిళ సోమవారం రాత్రి ఆలయం నుంచి ఇంటికి నడిచి వెళుతోంది. అదే సమయంలో అమ్మ ఆశ్రమం వద్ద వెనుక నుంచి వచ్చి కారులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను పేరుతో పిలిచారు.
తులసమ్మ కారు వద్దకు వచ్చి మీరెవరని ప్రశ్నిస్తుండగానే.. మీరు మాకు తెలుసు.. ఇంటి వద్దకు తీసుకెళ్తామంటూ కారులో ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో పరిచయస్తులుగా మాట్లాడుతున్న ఇద్దరు దుండగులు విద్యానికేతన్ స్కూల్ వద్ద తులసమ్మ కారు దిగుతుండగా ఆమె మెడలో ఉన్న 60 గ్రాముల బరువుగల బంగారు చైన్‌ని లాక్కొని ఉడాయించారు. సహాయం కోసం ఆమె గట్టిగా కేకలు వేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. ఈ ఘటనపై బాధితురాలు జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.