
సాక్షి, బెంగళూరు: శివరామ్ కారత్ లేఔట్ భూముల డీనోటిఫికేషన్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ రాష్ట్ర శాఖ అద్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్పకు భారీ ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఎఫ్‌ఐఆర్ పై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శివరామ్ కారత్ లేఔట్ కోసం స్వాధీనం చేసుకున్న భూములను అక్రమంగా డీ–నోటిఫై చేశారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు యడ్యూరప్పపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాల్సిందిగా కోరుతూ యడ్యూరప్ప హైకోర్టులో మధ్యంతర అర్జీని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్పపై నమోదైన కేసు కేవలం రాజకీయ ప్రేరితమని యడ్యూరప్ప తరఫు న్యాయవాది సి.వి.నాగేశ్ న్యాయస్థానం ఎదుట తన వాదనలను వినిపించారు. అంతేకాక ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్
పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయస్థానానికి తెలియజేశారు. ఏసీబీ, యడ్యూరప్ప తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి అరవింద కుమార్, అర్జీదారులైన యడ్యూరప్ప కోరిన విధంగానే ఎఫ్‌ఐఆర్ పై మధ్యంతర స్టే జారీ చేశారు. గురువారం నుండే తీర్పు రాసే ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ ప్రక్రియను శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తి చేసిన న్యాయమూర్తి అరవింద్ కుమార్, తన తీర్పును ప్రకటించారు. ‘ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవడంలో ఏసీబీ ఆలస్యం చేసింది. అంతేకాదు ఎఫ్‌ఐఆర్ ప్రకారం విచారణ చేపట్టడంలో కూడా తారతమ్యాలు కనిపిస్తున్నాయి. ఫిర్యాదుల ప్రకారం కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. అందువల్ల సహజంగానే ఏసీబీ అధికారులపై సంశయం కలుగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో ఆరోపణలను రుజువు చేసే సాక్ష్యాలేవీ కూడా న్యాయస్థానానికి కనిపించడం లేదు. అందువల్ల ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌పై మధ్యంతర స్టేను జారీ చేస్తోంది’ అని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది.
సత్యానికి లభించిన విజయం.....
కాగా, శివరామ్ కారత్ లేఔట్ భూముల డీ–నోటిఫికేషన్‌కు సంబంధించి హైకోర్టు యడ్యూరప్పపై ఇచ్చిన స్టే సత్యానికి లభించిన విజయమని బీజేపీ సీనియర్ నేత ఆర్.అశోక్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం శుక్రవారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అందరు సీఎంలు భూముల డీనోటిఫికేషన్ చేస్తుంటారు. కానీ, యడ్యూరప్పపై మాత్రం రాజకీయ కక్షతో కేసులు నమోదు చేస్తున్నారు. ఆయనపై వేధింపులకు పాల్పడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అని విమర్శించారు.
యడ్డీకి నోటీసులు
కాగా యడ్యూరప్పకు పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప పీఏ వినయ్‌ను యడ్యూరప్ప పీఏ సంతోష్ కిడ్నాప్ చేసి భౌతిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయమై ఈనెల 28న విచారణకు హాజరు కావాలని కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీపీ బడిగేర్ ఈ నోటీసులను జారీ చేశారు.