ఖమ్మం వైద్యవిభాగం: ఆధునిక సాంకేతికతను వైద్యసేవలకు విస్తృతపరచడంలో కూడా వినియోగిస్తూ సత్ఫలితాలు సాధించే దిశగా వైద్యశాఖ అడుగులేస్తోంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ఏఎన్‌ఎంలకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఊళ్లలో వ్యాధుల గుర్తింపు, అందిస్తున్న వైద్యసేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసే వెసులుబాటు లభించింది. తద్వారా ఉన్నతాధికారులు అప్రమత్తమై.. తగిన సూచనలు, జాగ్రత్తలు వివరించే అవకాశాలు లభిస్తున్నాయి. ట్యాబ్‌ల ద్వారా పాటలు, వీడియోలు, పుస్తకాలు చూపిస్తూ ముఖ్యంగా తల్లులకు, పిల్లలకు ఆరోగ్య కార్యక్రమాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాన్పులప్పుడు ఏం చేయాలి..? పిల్లల టీకాలు ఎప్పుడు, ఎక్కడ వేస్తారు..? వీటి ద్వారా కలిగే ప్రయోజనాలను ట్యాబ్‌ల ద్వారా వివరిస్తున్నారు.
224 మందికి ట్యాబ్‌లపై శిక్షణ..
జిల్లాలో 224 సబ్ సెంటర్లలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు ఇటీవల ట్యాబ్‌లు అందజేసి, వీటి వినియోగంపై శిక్షణ కూడా కల్పించారు. సిమ్ కార్డులు అందించి, వివరాల నమోదును ఎలా పొందుపరచాలనే విషయాలు బోధించారు. భవిష్యత్‌లో ఆరోగ్య శాఖలో గల అన్ని సేవల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పారదర్శకంగా ఉండాలనే భావనతో ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, కేసులు, కమ్యూనికేబుల్, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులను కూడా ఈ ట్యాబ్‌లలో పొందుపరచనున్నారు. కాన్పు అనంతరం కేసీఆర్ కిట్‌ను సత్వరం అందజేసి.. ఆ ఫొటోను వెంటనే ఆన్‌లైన్‌లో పంపుతున్నారు. ఆస్పత్రులకు కావాల్సిన మందులెన్ని..? ఉన్న వాటిని ఎలా వినియోగిస్తున్నారు..? అనే వివరాలు కూడా ట్యాబ్‌ల ద్వారా తెలుసుకుంటున్నారు. ఏఎన్‌ఎంలకు ట్యాబ్‌ల పంపిణీతో గ్రామాల్లో అందుతున్న వైద్యసేవల వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తుండడంతో ఇకపై జిల్లావ్యాప్తంగా 185 మంది సెకండ్ ఏఎన్‌ఎంలకు కూడా ట్యాబ్‌లు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదయ్యే వివరాలు ఇలా.. గ్రామాల్లో మాతా,శిశు వైద్యసేవల గురించి గర్భిణులు, బాలింతల ఆరోగ్య జాగ్రత్తలు చిన్నపిల్లల టీకాలు, ఆరోగ్య సేవలు రికార్డులు, రిజిష్టర్లలో రాసే విషయాలన్నీ ఇక ట్యాబ్‌లోనే ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌లోనే వివరణ జిల్లా అధికారులు నేరుగా సమీక్షించే అవకాశం పారదర్శకంగా వైద్యసేవలు.. ట్యాబ్‌లు అందజేశాక.. గ్రామాల్లో ఎలాంటి వైద్యం అందిస్తున్నారనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. అవసరమైన మందులను సకాలంలో సరఫరా చేసేందుకు ఆస్కారం ఏర్పడింది. ప్రస్తుతం మంచి ఫలితాలు వస్తున్నాయి. త్వరలో రెండో ఏఎన్‌ఎంలకు కూడా ట్యాబ్‌లు ఇస్తాం. – నీలోహన, ఎన్‌హెచ్‌ఎం డీపీఓ
Comments
Please login to add a commentAdd a comment