సుభాని మృతదేహం లభ్యం | help with dogs quad Subhani Dead body | Sakshi
Sakshi News home page

సుభాని మృతదేహం లభ్యం

Published Sun, Apr 15 2018 10:31 AM | Last Updated on Sun, Apr 15 2018 10:31 AM

help with dogs quad  Subhani Dead body

సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణానికి చెందిన నాటు కోళ్ల వ్యాపారి ఎస్‌కె. మహబూబ్‌ సుభాని(35) మృతదేహం శనివారం మండలంలోని రుద్రాక్షపల్లి శివారులో లభ్యమైంది. డాగ్‌స్క్వాడ్‌ సాయంతో అతడి శవాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్‌కె. మహబూబ్‌ సుభాని బుధవారం సాయంత్రం నాటుకోళ్ల కోసం ఎప్పటిలాగే వెళ్లాడు. రెండురోజులు గడిచినా సుభాని ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి శివారులో చినడొంక దారిలో రక్తపు మరకలు, చొక్కా గుండీలు, చెప్పులు, హెల్మెట్, సెల్‌ కవర్, పర్సు, కాంటా రాళ్లు కన్పించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిస్సింగ్‌ అయిన సుభానికి సంబంధించిన వస్తువులుగా మామయ్య బాజీ గుర్తించారు. ఆ పరిసర ప్రాంతాలలో బంధువులు, పోలీసులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు.  

డాగ్‌స్క్వాడ్‌ ప్రవేశంతో.. 
మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన డాగ్‌స్క్వాడ్‌ బృందాన్ని సత్తుపల్లి ఎస్సై నరేష్‌బాబు శనివారం ఉదయం రుద్రాక్షపల్లిలోని చిన్నడొంక ప్రదేశంలోని రక్తపు మరకలు ఉన్న వద్దకు తీసుకెళ్లారు. మహబూబ్‌ సుభాని చెప్పులు, వస్తువులను వాసన చూపించటంతో డాగ్‌స్క్వాడ్‌ సుమారు 200 మీటర్ల దూరంలోని కల్వర్టు వద్దకు వెళ్లి ఆగిపోయింది. చుట్టు పక్కల అంతా వరిపొలాల్లో నీళ్లు ఉండటంతో కొద్దిసేపు డాగ్‌స్క్వాడ్‌ అక్కడక్కడే తిరుగుతుండటంతో పోలీసులు సమీపంలోని వరి పొలాలను క్షుణ్ణంగా పరిశీలించే క్రమంలో దుర్వాసన వెదజల్లింది. అనుమానం వచ్చి వరిదుబ్బలను తొలగిస్తుండగా మహబూబ్‌ సుభాని మృతదేహం కన్పించింది. మూడురోజులు కావటంతో మృతదేహం బాగా ఉబ్బిపోయి చర్మం ఊడిపోయింది. అక్కడే ప్రభుత్వ వైద్యులు నర్సింహారావును పిలిపించి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.  
 
నాటుకోళ్ల లావాదేవీలే.. 
రుద్రాక్షపల్లి గ్రామానికి చెందిన ఓ నాటుకోళ్లు దొంగతో మహబూబ్‌ సుభానికి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. జనవరి నెలలో బుగ్గపాడు, రుద్రాక్షపల్లి పరిసర ప్రాంతాల్లో పందెం కోళ్లు పెద్ద ఎత్తున దొంగలించబడ్డాయి. ఇటీవలే ఆ యువకుడు తన సొంత ద్విచక్ర వాహనం రూ.8 వేలకు తాకట్టు పెట్టి జూదం ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలిసింది. డబ్బుల కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో మహబూబ్‌ సుభాని మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్తుపల్లి పట్టణ సీఐ ఎం.వెంకటనర్సయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement