సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటి వచ్చి రాష్ట్రంలో గత మూడు నెలలుగా కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్న మావోయిస్టులకు తాజా ఎన్‌కౌంటర్‌తో భారీ దెబ్బ తగిలింది. వారి కార్యకలాపాలను ఆదిలోనే అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం దండకారణ్యాన్ని జల్లెడ పడుతోంది. అయినా మావోయిస్టులు గోదావరి పరీవాహక ప్రాంతం ద్వారా మరిన్ని జిల్లాల్లోకి విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కూంబింగ్ వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మావోయిస్టులను నిలువరించేందుకు పోలీసులు మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.
అయితే ప్రస్తుత ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన ప్రకటనతో మరింత టెన్షన్ నెలకొంది. దీంతో సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ రాజ్యమేలుతోంది. గిరిజన గూడేలతోపాటు ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న భద్రాచలం, పినపాక, ములుగు నియోజకవర్గాల పరిధిలోని టీఆర్‌ఎస్ నాయకులు హడలిపోతున్నారు. అధికార పార్టీ నేతలే టార్గెట్ అని జగన్ ప్రకటించడంతో వారిలో అలజడి రేకెత్తుతోంది.
మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా పోలీసులు..
మూడేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు నామమాత్రమే. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చేందుకు మావోయిస్టు అగ్రనేతలే నేరుగా భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లోని దండకారణ్యాన్ని షెల్టర్‌జోన్‌గా చేసుకుని తెలంగాణ ప్రాంతంలో కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు తెలిసింది. భద్రాచలం, పినపాక, ఏటూరు నాగారం ఏజెన్సీల్లో రిక్రూట్‌మెంట్‌లు సైతం భారీగా చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి భారీగా కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నారు.
మావోయిస్టు పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్న అగ్రనేతలే లక్ష్యంగా పోలీస్ బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు రెండు రాష్ట్రాల్లో పలు విధ్వంసక చర్యలకు పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంప్‌లపై దాడులకు పాల్పడడంతో అనేకసార్లు మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీస్ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఛత్తీస్‌గఢ్‌తో పాటు చర్ల, వెంకటాపురం, పినపాక మండలాల్లో పలువురు పౌరులను హత్యచేశారు.
రెండు రాష్ట్రాల్లో పలు విధ్వంసాలకు పాల్పడ్డారు. వారిని అడ్డుకునే యత్నాల్లో భాగంగా తాజా ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఆపరేషన్ మొత్తం భద్రాచలం నుంచి జరగడంతోపాటు తెలంగాణ పోలీసులు కీలకపాత్ర పోషించడంతో మావోయిస్టు పార్టీ నేరుగా ప్రకటన చేసింది. ఇకపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారపార్టీ నాయకులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సరిహద్దులో మరింత ఉద్రిక్తం...
బీజాపూర్ జిల్లాలో తడపలగుట్ట అడవుల్లో మావోయిస్టులు పెద్దఎత్తున సమావేశమైనట్లు పక్కా సమాచారం అందడంతో పోలీస్ బలగాలు వేగంగా ముందుకు కదిలాయి. ఆ ప్రాంతంలో 150 నుంచి 200 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని, అందులో అగ్రనేతలు ఉంటారనే లక్ష్యంతో గ్రేహౌండ్స్ బలగాలు చుట్టుముట్టడంతో ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టు సభ్యులు, అగ్రనేతలు ఆ ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు ఇప్పటికీ భావిస్తూ అదనపు బలగాలను దింపి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. దీంతో సరిహద్దు జిల్లాల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.
ఏజెన్సీ ప్రాంత నేతల్లో మరింత దడ...
మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన నేపథ్యంలో వారు ప్రతీకార చర్యలకు దిగడం ఖాయమని భావిస్తున్న టీఆర్‌ఎస్ నేతల్లో మరింత దడ నెలకొంది. ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు, పినపాక నియోజకవర్గంలోని పినపాక, కరకగూడెం, అశ్వాపురం మండలాల నాయకులు భయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment