తిరుమలాయపాలెం: మిషన్ భగీరథ ద్వారా ఈ నెలాఖరుకు ఇంటింటికీ తాగునీరు అందించనున్నట్లు ఆ పథకం వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మాదిరిపురం వద్ద శనివారం మిషన్ భగీరథ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ సురేందర్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలనే సీఎం కేసీఆర్ ఆశయం త్వరలోనే నెరవేరబోతుందని, ఈనెల చివరి నాటికి పనులన్నీ పూర్తి చేసి గ్రామాల్లోని ఓహెచ్‌ఆర్‌లకు నీటిని చేరవేసే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని 21 మండలాలు, ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలానికి తాగునీరు అందించేందుకు రూ.1,700కోట్లతో భగీరథ పనులు చేపట్టామన్నారు. ఆయా ప్రాంతాల్లో పనులు జాప్యం కావడంతో సీఎం ఆదేశాల మేరకు తాము పర్యటిస్తున్నామని చెప్పారు. కాగా.. ఇన్‌టేక్‌వెల్ నుంచి నీటిని సరఫరా చేసేందుకు మోటార్ల బిగింపు, పైపులైన్ నిర్మాణాలు ఆలస్యం కావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు సంస్థలు జాప్యం చేస్తే పనుల నుంచి తప్పుకోవాలని, అవసరమైతే తామే పనులు చేపడతామన్నారు. పనులు చేపట్టిన వివిధ శాఖల అధికారులు పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆయన తీవ్రంగా ఆగ్రహించారు.
ఈ క్రమంలోనే సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ జోక్యం చేసుకుని పనులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు.. ఏ ప్రాంతంలో ఎంత మందితో పనులు చేయిస్తున్నారో సాయంత్రం నాటికి పూర్తి నివేదిక అందించాలని ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డిని ఆదేశించారు. ఎన్ని సమీక్షలు చేసినా మీ తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి తాగునీరు ఇవ్వకపోతే పోటీ చేయనని సీఎం కేసీఆర్ చెప్పిన రెండేళ్లలోనే పనులు వేగవంతం చేశారని అన్నారు. రూ.24వేల కోట్ల తో రాష్ట్రంలోని 24 వేల పైచిలుకు ఆవాసాలకు పరిశుద్ధమైన జలాలు అందించేందుకు శరవేగంగా పనులు పూర్తి చేసుకుని.. గ్రామాల్లోని ఓహెచ్‌ఆర్‌లకు నీటిని తీసుకెళ్లే పనులు చివరి దశకు చేరాయన్నారు.
కార్యక్రమంలో డోర్నకల్, వైరా ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, భానోతు మదన్‌లాల్, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి, సీఈ నాగేశ్వర్, వరంగల్ సెగ్మెంట్ ఎస్‌ఈ కృష్ణయ్య, జెడ్పీ సీఈఓ మారుపాక నగేష్, ఆర్డీఓ పూర్ణచందర్‌రావు, ఎంపీడీఓ వెంకటపతిరాజు, తహసీల్దార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment