
కర్నూలు శివారులోని ఓ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న కల్తీ మద్యం(ఫైల్)
కర్నూలు(హాస్పిటల్): ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్నే కల్తీ చేస్తున్న వ్యాపారులు అనారోగ్యానికి కొనితెచ్చే మద్యాన్ని వదిలిపెడతారా...? కల్లు నుంచి ఖరీదైన మద్యం వరకు ప్రతి దాన్నీ కల్తీ చేసేసి మద్యం బాబుల నోట్లో పోస్తున్నారు. ఇలా తాగిన మద్యం వారి ఆరోగ్యాన్ని గుల్ల చేస్తోంది. మరికొందరి ప్రాణం తీస్తోంది. సమాచారం వస్తే తెలుసుకుని దాడులు చేయడం మినహా తనిఖీల ద్వారా కల్తీ మద్యాన్ని అధికారులు అరికట్టలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి.
కల్లు నుంచి ఖరీదైన మద్యం దాకా కల్తీ
కాదేది కవితకు అనర్హమనేది పాత సామెత. కాదేది కల్తీకి అనర్హమనేది నేటి సామెతగా మారింది. కల్లు, సారా, చీఫ్ లిక్కర్ నుంచి ఖరీదైన మద్యం వరకు కల్తీ చేస్తున్నారు. నెలరోజుల క్రితం కర్నూలు నగర శివారులోని వీకర్‌సెక్షన్ కాలనీ సమీపంలో ఓ ఇంట్లో బ్రాండెడ్ మద్యం ఖాళీ సీసాల్లో కల్తీ మద్యాన్ని తయారు చేసే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బాటిల్ రూ.వెయ్యికి పైగా ఉండే బ్రాండ్లన్నింటినీ అతను రెక్టిఫైడ్ స్పిరిట్‌తో తయారు చేస్తూ పట్టుబడటంతో ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది క్రితం గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో రంగన్న అనే వ్యక్తి కల్తీ మద్యం తయారు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇతడు బయటి ప్రాంతం నుంచి సీసాలు, మూతలు తీసుకొచ్చి కల్తీమద్యం తయారు చేసి, బెల్ట్‌షాపులకు విక్రయిస్తున్నాడు. కోసిగి ప్రాంతంలోనూ ఆరు నెలల క్రితం పోలీసులు కల్తీ మద్యాన్ని విక్రయిస్తుండగా ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఆళ్లగడ్డలో ఓ వ్యక్తి మద్యంలో నీళ్లు కల్తీ చేసి విక్రయిస్తుండగా ఐదు నెలల క్రితం పోలీసులు అరెస్టు చేశారు.
ఇవే కాదు వెలుగులోకి రాని ఉదంతాలు చాలానే ఉన్నాయి. కల్తీ మద్యానికి అవసరమైన రెక్టిఫైడ్ స్పిరిట్‌ను వ్యాపారులు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. 2015 లోనూ రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం అమ్మకాలు వెలుగుచూసిన విషయం సంచలనం సృష్టించింది. అప్పట్లో ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల వ్యాపారులు ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి.
మద్యానికి బానిసవుతున్న యువత
మద్యానికి పెద్దలే కాదు యువత కూడా బానిస అవుతోంది. టీనేజీ వయస్సు నుంచే దీనికి అలవాటుపడుతున్నారు. స్నేహితులతో సరదాగా మొదలయ్యే ఈ అలవాటు వారిని బానిసను చేస్తోంది. రోజూ రాత్రి ఇంటికి వస్తున్నారంటే వణికిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మద్యం తాగిన వ్యక్తి ఏ మూడ్‌లో వస్తాడో.. ఏం చేస్తాడోనన్న భయం పలు కుటుంబాల్లో ఉంది. యువత నుంచి వృద్ధుల వరకు మద్యానికి బానిసలుగా మారడంతో అటు ఆర్థికంగా మరోవైపు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు.
మద్యం వల్ల అనారోగ్య సమస్యలు
కాలేయం, పాంక్రియాస్ దెబ్బతింటుంది. కాలేయం దెబ్బతిని లివర్ సిర్రోసిస్ వచ్చి మరణం సంభవిస్తుంది.
గుండె పరిమాణం పెరిగి, గుండెపోటు వస్తుంది.
జీర్ణకోశవ్యాధులు, అల్సర్ వంటి ఇబ్బందులు వస్తాయి.
మెదడులో చురుకుదనం తగ్గుతుంది.
మద్యం మత్తులో కుటుంబసభ్యులు, భార్యపై అనుమానం పెరుగుతుంది. ఈ కారణంగా ఆత్మహత్యలు, హత్యలు పెరిగే అవకాశం ఉంది.
రోగనిరోధకశక్తి తగ్గిపోయి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుంది.
దాంపత్య జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపి, భార్యాభర్తల మధ్య ఎడబాటుకు కారణం అవుతుంది.
మద్యం మత్తులో ఉండటం వల్ల సరిగా కనిపించకపోవడం, వినిపించకపోవడం, ఎదురుగా వచ్చే వాహనాలను, మనుషులను గుర్తించలేకపోవడం వంటి సమస్యలు వచ్చి ప్రమాదాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment