ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణంగా వారికే తెలియకుండా జరిగేవి రెండే రెండు విషయాలు. ఒకటి జననం ; రెండు మరణం. ఈ రెండు విషయాలు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక భావనని మాత్రం కలిగిస్తాయి. జననం పది మందికి సంతోషాన్ని కలిగిస్తే , మరణం వంద మందికి బాధని కలిగిస్తుంది. అయితే ఈ జనన మరణాల మధ్య కొట్టు మిట్టాడే ప్రతి మనిషి జీవితంలో కలిగే మధురానుభూతి ప్రేమ. ఈ ప్రేమ కూడా జనన మరణాల్లో ఒక భాగమే. "రెండు ప్రేమల కలయిక జననం అయితే ... అదే రెండు ప్రేమలు విడిపోవడం మరణం". జననం ఎంత సంతోషాన్ని ఇస్తుందో మరణం అంతకు రెట్టింపు బాధని ఇస్తుంది. ఆ బాధకి కారణం కూడా ప్రేమే. మనం ప్రేమించిన వాళ్ళు మరణిస్తే ఆ బాధ ఇంకా చెప్పలేనిది. ఆ వార్త వినడానికి కూడా మనం సిద్దంగా ఉండం. ఒకవేళ అదే వార్త ఒక అబద్ధం అయితే , అబ్బా ..!! ఆ ఊహ కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా !? ఇప్పుడు చెప్పబోయే నా ఈ కథ కూడా అలాంటిదే.
నా పేరు దీక్ష. నేను పీజీ చదువుతున్న రోజులవి. ప్రతి రోజు కళాశాలకు వెళ్ళడం ఇంటికి రావడం నా తల్లిదండ్రులతో సంతోషంగా గడపడం ఇదే నా దిన చర్య గా ఉండేది. నేను నా తల్లిదండ్రులకి ఒక్కగానన్కొక్క కూతురిని కావడం వల్ల నన్ను కొంచెం గారంబంగానే పెంచారు. అంతే కాకుండా వాళ్ళకి నేను అంటే ఎంతో ఇష్టం. నాకు నా తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ. నా తల్లిదండ్రులు, వాళ్ళ ప్రేమ తప్ప ఇంకొక మనిషికి, వారి ప్రేమకి నా మనసులో చోటు ఉండేది కాదు. అలాంటి నన్ను మార్చి నా మనసులో ఇంకొకరికి స్థానం ఇచ్చేలా చేసి ఇంకో ప్రేమని పరిచయం చేసిన వ్యక్తి ఆనంద్. తను నేను చదివే కళాశాల లోనే పీజీ చదువుతున్నాడు. మొదట్లో తనకి నాకు అస్సలు పడేది కాదు, కానీ నిజానికి తను చాలా మంచివాడు, మంచి మనస్తత్వం కలవాడు, సున్నిత స్వభావి. తనని నేను మొదటిగా మా కళాశాలలో ఒకరితో గొడవ పడుతుండగా చూశాను. అలా గొడవ పడటం నాకు నచ్చలేదు, తర్వాత తను నా సహా విద్యార్థే అని తెలిసింది. మొదట్లో నేను తనతో సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు. ఒకే తరగతి కావడం వల్ల తర్వాత తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి కానీ, ఆ మాటలు కూడా తూటాల్లా ఉండేవి. అలా మేము కలిసిన ప్రతి సారి ఏదో ఒక గొడవ పడుతూ ఉండేవాళ్ళం. మా ఇద్దరికీ రోజు ఏదో ఒక గొడవ కాకపోతే ఆ రోజు గడిచినట్టే అనిపించేది కాదు. అలా ఉన్న సమయంలో ఒకరోజు ఆనంద్ కళాశాలకు రాలేదు, ఎవరికి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఎందుకో తెలియదు కానీ ఆ రోజు నేను నేనుగా లేను. ఏదో తెలియని కల్లోలం, ఎందుకో తెలియని బాధ, ఏదో కోల్పోతున్న అనే భావన నాలో కలిగింది. అలా ఒక వారం తరువాత తను కళాశాలకు వచ్చాడు. తనని చూడగానే నాకు ప్రాణం తిరిగివచ్చినట్టుగా అనిపించింది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి రాకపోవడానికి గల కారణాన్ని తెలుసుకుని, నాకు కలిగిన భావన నేను తనతో చెప్పాను.
అప్పుడు ఆనంద్ నీకు అలా జరగడానికి గల కారణం ప్రేమ అని చెప్పాడు. ఎందుకంటే ఈ వారం రోజులు తన పరిస్థితి కూడా అలానే ఉండడం వల్ల దానికి గల కారణం గురించి ఆలోచిస్తే తనకి బాగా అర్థం అయిన విషయం అది అని నాకు చెప్పాడు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, కానీ తీరిగ్గా ఆలోచిస్తే తను చెప్పిందే వాస్తవం అని తెలిసింది. ఇక ఇద్దరికీ అర్ధం అయ్యింది ఏంటంటే ఒకరికి తెలియకుండానే ఒకరం తిట్టుకుంటూ, గొడవ పడుతూ ప్రేమలో పడ్డాం అని. ఒకరు లేకుంటే ఒకరం ఉండలేము అని. ఇక అలా మా ప్రేమ యాత్ర మొదలయింది. మేము మా ప్రేమ యాత్ర లో మునిగి తేలుతూ ఉండగా, ఒకరోజు ఆనంద్ కళాశాలకు వస్తుండగా అనుకోకుండా ఒక కారు తప్పు దారిలో వచ్చి ఆనంద్ నీ ఢీకొంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆనంద్ నీ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ , చిగురిస్తున్న మా ప్రేమ పూవుగా మారకముందే వాడిపోయింది. ఆ ప్రమాదంలో ఆనంద్ తలకి గాయం అయి బాగా రక్తం పోవడంతో తను మరణించాడు అనే వార్త నాకు తెలిసింది. ఆ వార్త విన్న క్షణం ఒక్కసారిగా నా గుండెలు పగిలిపోయాయి. ప్రాణాలు పోయినట్టుగా అనిపించింది, పిచ్చిదానిలా గుండెలు బాదుకుంటూ ఏడ్చాను. ఆ సమయంలో నా బాధ చెప్పుకుని ఏడ్వటానికి కూడా ఎవరు లేరు, నా తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదు వాళ్ళతో అయినా నా బాధ నీ పంచుకుందాం అంటే. ఇక ఏమి చెయ్యాలో తోచక పిచ్చిదానిలా అయి చనిపోదాం అని అనుకున్నాను, కానీ, ఇంత ఇష్ట పడ్డ ఆనంద్ దూరం అవుతేనే నా పరిస్థితి ఇలా ఉంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా తల్లిదండ్రులకి నేను దూరం అయితే ఇక వాళ్ళు ఎలా తట్టుకుంటారని నా ప్రేమని, నా బాధని నా గుండెల్లోనే దాచుకుని వాళ్ళకోసం బ్రతుకుతూ ఉన్నాను.
అంతలోనే నా పీజీ పూర్తి కావచ్చింది. ఇక నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చెయ్యాలి అని సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఒక మంచి సంబంధం వచ్చిందిజ అబ్బాయి పేరు కృష్ణ, అమెరికా లో ఉద్యోగం, మంచి కుటంబం ఇలాంటి సంబంధం మళ్లీ రాదు అని నన్ను ఒప్పించారు, నేను వాళ్ళ మాట కాదు అనలేక ఆనంద్ ఎలాగో తిరిగి రాడు, తననే తలచుకుంటూ నా తల్లిదండ్రులని బాధ పెట్టలేక, ఆ పెళ్లి చేసుకుని ఇక్కడి నుండి దూరంగా వెళ్తే అయినా ఆనంద్‌ని మరిచిపోతా అని ఆ సంబంధం ఒప్పుకున్నాను. ఒప్పుకోవడమే ఆలస్యం పెళ్లి ముహూర్తాలు పెట్టించారు. నిశ్చితార్థం రానే వచ్చింది. నా తల్లిదండ్రులు అనుకున్నట్టుగానే కృష్ణ తో నా నిశ్చితార్థం అయ్యింది. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య రెండు నెలల వ్యవధి రావడంతో జీవితాంతం కలిసి ఉండాల్సింది తనతోనే కాబట్టి ఒకరి అభిప్రాయాలు ఒకరం తెలుసుకోవాలి అని మెల్ల మెల్లగా కృష్ణతో మాట్లాడడం మొదలుపెట్టాను. తను నాపై చూపించే ప్రేమాభిమానాలకి తన దగ్గర నా గతం దాచడం సరైంది కాదు అని ఆనంద్ విషయం చెప్పేశాను. తను నా ప్రేమని అర్థం చేసుకుని నా బాధని పంచుకుంటూ నా బాధలో నాకు తోడుగా ఉంటూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. తను చూపించే ప్రేమాభిమానాలు, జాగ్రత్తలు నాకు తన మీద ప్రేమ కలిగేలా చేశాయి. .
అలా మెల్ల మెల్లగా నేను కృష్ణ నీ ప్రేమించడం మొదలు పెట్టాను. కానీ ఇంతలోనే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మళ్లీ నన్ను మొదటికి తీసుకొచ్చింది. ఒకరోజు మా స్నేహితులని పెళ్లికి ముందు కలవాలని, పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళడం, మళ్లీ కలవడం కుదురుతుందో లేదో అని అందరం అనుకుని కలుసుకున్నాం. కానీ అక్కడ నేను ఊహించనిది ఒకటి జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే అక్కడికి ఆనంద్ కూడా వచ్చాడు. ఆ రోజు ప్రమాదం లో ఆనంద్ కి తలకి గాయం అయి రక్తం బాగా పోవడం వలన తను కోమా లోకి వెళ్ళాడు, మళ్లీ ఎన్ని రోజులకు కోమా నుండి వస్తాడో తెలియక, తనకోసమే చూస్తూ నేను నా జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని తన తల్లిదండ్రులే నాకు తను చనిపోయాడు అని అలా అబద్ధం చెప్పారు. ( ఆనంద్ మా ప్రేమ విషయం ఆ ప్రమాదం జరిగే ముందు రోజే తన తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళని ఒప్పించాడు ). తనని చూడగానే నాకు ప్రాణాలు లేచి వచ్చినట్టుగా, ఇన్ని రోజుల తరువాత ఊపిరి పీల్చుకున్న ట్టుగా అనిపించింది, వెంటనే తనని పట్టుకుని గట్టిగా ఏడ్చాను, తను లేని నా జీవితం ఎలా ఉందో, ఎలా గడిపానో జరిగింది అంతా చెప్పాను. నాకు నిశ్చితార్థం అయింది అని తెలిసి ఆనంద్ నిర్ఘాంతపోయాడు. చాలా బాధ పడ్డాడు, పెళ్లి అంటూ చేసుకుంటే అది నన్నే అంటూ ఏడ్చాడు. ఇక ఏమి చెయ్యాలో తోచక ఇప్పటికే నిశ్చితార్థం అయిన అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది అని తెలిస్తే నా తల్లిదండ్రుల గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మా విషయం తెలిసింది కృష్ణకే కాబట్టి తన దగ్గరికి వెళ్లి జరిగింది అంతా చెప్పాను. కృష్ణ కూడా మా ప్రేమని అర్థం చేసుకుని ఇంకొకరిని ప్రేమించి తననే మనసులో పెట్టుకుని నువ్వు నాతో జీవితాంతం సంతోషంగా ఉండలేవు. నాపై నీకు ఇష్టం ప్రేమ లేనప్పుడు నేను నిన్ను చేసుకుని సంతోషంగా ఉండలేను కాబట్టి నువ్వు ఆనంద్ నీ పెళ్లి చేసుకోవడమే సరైనది అన్నాడు. కృష్ణ నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా ప్రేమ గురించి, మా గతం గురించి అంతా చెప్పాడు.
మొదట్లో నా తల్లిదండ్రులు మా పెళ్ళికి ఒప్పుకోలేదు, ఒక అబ్బాయితో నిశ్చితార్థం జరిగి ఇంకొకరితో పెళ్లి చేస్తే మా పరువు పోతుంది అని అన్నారు. కానీ బాగా ఆలోచించిన తర్వాత కొన్ని రోజులకు నా సంతోషం ముందు వాళ్ళకి అవి అన్ని కూడా చిన్నగానే అనిపించాయి. చివరికి ఆనంద్ తో నా పెళ్లికి ఒప్పుకున్నారు. నా తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి కారణం అయిన కృష్ణనే దగ్గర ఉండి మా పెళ్లి జరిపించాడు. అలా నా జీవితంలో ఊహించని మలుపులతో ఆనంద్ తో నా పెళ్లి జరిగింది. "ఒకసారి మనం ప్రాణంలా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే వాళ్లు దూరంగా ఉన్నా బ్రతికే ఉన్నారు అన్న ఒక్క చిన్న ఆశ మనల్ని బ్రతికిస్తుంది. అదే వాళ్ళు చనిపోయారు అని తెలిస్తే ఆ ఊహ కూడా మనల్ని చంపేస్తుంది, అలా మరణించి ఇక వాళ్ళు మనకి లేరు అని అనుకునే సమయానికి వాళ్ళు మళ్లీ మన జీవితంలోకి తిరిగి వస్తే....!!!" "అదే నా జీవితం".
ఇట్లు
దీక్ష ఆనంద్.
Comments
Please login to add a commentAdd a comment