నా వల్లే తను చనిపోయింది. | Hyderabad Boy Arun : Failure Telugu Love Story | Sakshi
Sakshi News home page

డబ్బు పిచ్చే ఇదంతా చేసింది.

Published Mon, Mar 30 2020 2:54 PM | Last Updated on Mon, Mar 30 2020 3:17 PM

Hyderabad Boy Arun : Failure Telugu Love Story - Sakshi

ఈ ప్రపంచాన్ని అందులో ఉన్న మనుషులను నడిపిస్తుంది రెండే రెండు అక్షరాల రెండు పదాలు.  అందులో మొదటి రెండు అక్షరాల పదం డబ్బు అయితే... రెండోది ప్రేమ.  డబ్బు లేకుండా ఏ మనిషి బ్రతక లేడు. కానీ ప్రేమ లేకుండా ఏ మనిషికి జీవం లేదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి మనిషి డబ్బుకోసం మాత్రమే బ్రతుకుతున్నాడు.  ప్రేమ ఉన్నా లేకున్నా డబ్బు ఉంటే చాలు జీవితాంతం సంతోషంగా బ్రతికేయ్యొచ్చు  అనే ఆలోచనలతోనే ఉంటున్నాడు. డబ్బు మాయలో పడి, డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలతో నిజమైన ప్రేమని కూడా అబద్దంగా మార్చేస్తున్నాడు.  నిజానికి ప్రేమ గొప్పదా ...? డబ్బు గొప్పదా...? అనే ప్రశ్నకి జవాబు మాత్రం దొరకడం లేదు. ఇలాంటి చిక్కు ప్రశ్న కి సమాధానం వెతుక్కోవాల్సి న రోజూ వస్తుంది అని ఎవరం అనుకోం కదా ! కాని నా జీవితం లో  అలాంటి రోజు ఒకటి వచ్చింది. ఆ క్షణం నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు నేను ఆ ప్రశ్న కి సమాధానాన్ని , నేను ఎదుర్కొన్న సంఘటనని మీకు చెప్పబోతున్నాను.


నా పేరు అరుణ్. మాది ఒక బీద కుటుంబం. నేను , అమ్మ , నాన్న ఉండేవాళ్ళం. నా తల్లిదండ్రులు రోజూ వారి కూలి చేసి దానితో వచ్చిన డబ్బుతో ఇల్లు గడిపేవాళ్ళం. ఒక్క రోజు కూలీ కి వెళ్లకుంటే ఆ రోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి మాది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా తల్లదండ్రులు పస్తులు ఉంటూ మరీ కూలీతో వచ్చిన డబ్బులతో నన్ను బడికి పంపించి చదువించేవారు. వాళ్ళు ప్రతి రోజు నాకు ఒకటే మాట చెప్పేవారు... నువ్వు మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మంచి స్థాయిలో ఉండాలి అని.  వాళ్ళలా నేను కూలీ పని చేసుకోకూడదు అని , బాగా కష్ట పడి చదివి బాగా డబ్బులు సంపాదించాలని వాళ్ళ కోరిక. నేను నా తల్లిదండ్రుల కష్టం చూడలేక బాగా చదువుకుని ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని ప్రతి రోజూ పాఠశాలకి వెళ్తూ మంచిగా చదువుకుంటూ నా ఎం. బి. ఎ నీ మొదటి తరగతిలో పూర్తిచేశాను.

తర్వాత నా మార్కులను , నాలోని నైపుణ్యాలను చూసి ఒక పెద్ద కంపెనీ వాళ్ళు నాకు వాళ్ళ కంపెనీ లో పని చేసేందుకు అవకాశం ఇచ్చారు. నేను ఎంతో సంతోషంగా వెళ్లి నా తల్లిదండ్రలకు ఈ విషయం చెప్పాను, వాళ్ళు ఎంతో సంతోషించారు. ఇక నేను ఆ కంపెనీకి వెళ్లి పని చెయ్యడం ప్రారంభించాను. అలా నా జీవితంలో సంపాదన ప్రారంభం అయింది.  నేను అనుకున్నట్టుగానే బాగా సంపాదించడం ప్రారంభించాను. నేను పని చేస్తున్న కంపెనీ లోనే ప్రమోషన్లు పొందుతూ బాగా సంపాదిస్తూ నా తల్లిదండ్రులు అనుకున్నట్టుగానే ఉన్నత స్థాయికి  ఎదిగాను. ఇలా సంపాదనలో మునిగి తేలుతున్న నా జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ మలుపుకి కారణం ఒక అమ్మాయి. ఆ అమ్మాయి రాక నన్ను నా జీవితాన్ని మొత్తం మార్చేసింది.

 డబ్బు పిచ్చితో బ్రతుకుతున్న నా జీవితానికి ప్రేమని పరిచయం చేసి , ప్రేమ లోతుల్ని అర్థం అయ్యేలా చేసిన ఆ అమ్మాయి పేరు దీప్తి. తను నేను పనిచేసే కంపెనీలోన నా సహోద్యోగి. నేను కంపెనీలో చేరిన మొదట్లో పని విషయంలో నాకు ఎలాంటి సందేహం ఉన్న తీర్చేది. ఒక్కోసారి నా పని కూడా తనే చేసేది. అలా అలా మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. తను మొదటి నుండి  నాపై ఎక్కువగా జాగ్రత్త , ప్రేమ , అభిమానాలు చూపించేది. ఇక అలా తను చూపించే ప్రేమాభిమానాలకి నేను ముగ్ధుడిని అయ్యాను. నాకు తెలియకుండానే నేను తనతో ప్రేమలో పడిపోయాను. అలా అలా మా పరిచయం కాస్తా ప్రేమగా, సన్నిహితులం కాస్తా ప్రేమికులుగా మారిపోయాం. ఒకే కంపెనీ కావడంతో మా ప్రేమకి ఎలాంటి అడ్దంకులు , ఇబ్బందులు ఉండేవి కావు. 


దీప్తి మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది. నన్ను మా ఇంట్లో చెప్పి ఒప్పించమంది. సరే అని నేను చెప్పబోయాను . కానీ అంతలోనే సిటీలోనే అతి పెద్ద కంపెనీకి ఓనరు వచ్చి నా నైపుణ్యాలను , సామర్థ్యాల ను చూసి నన్ను వాళ్ళ కంపెనీలో చేరమని చెప్పడానికి వచ్చారు . అంతే కాకుండా నన్ను తన కూతురికి ఇచ్చి పెళ్లి చేసి ఆ కంపెనీని కూడా నా సొంతం చేస్తాను అని అన్నాడు. ఇక నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు , బాగా ఆలోచించాను ఇంత డబ్బు దానితో పాటు అమ్మాయి వస్తుంది అంటే ఏ అబ్బాయి అయినా ఎందుకు కాదు అంటాడు. పైగా నాకు ఉన్న డబ్బు పిచ్చితో    ప్రేమ కావాలా...? డబ్బు కావాలా...?అంటే డబ్బే కావాలి అని నేను దానికి ఒప్పుకున్నాను.

 ఈ విషయం తెలుసుకున్న దీప్తి ఏకంగా మా ఇంటికే వచ్చి నా తల్లిదండ్రులకు జరిగింది అంతా చెప్పి ,,," ఛీ!!! నువ్వు ఇలాంటి వాడివి అని అనుకోలేదు. నీకు డబ్బు అంటే ఇంత పిచ్చి ఉంది. నువ్వు డబ్బుకోసం ఏం అయినా చేస్తావ్ , ఎంతకైనా దిగజారుతావు అని నాకు ఇన్ని రోజులలో తెలియలేదు , తెలిసుంటే నీలాంటి వాడిని అస్సలు ప్రేమించేదానినే కాదు. ఏ డబ్బు కోసం అయితే నువ్వు   నన్ను నా ప్రేమని కాదని వెళ్ళావో ఏదో ఒక రోజు నువ్వు నీ డబ్బు తప్ప నీకంటూ నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను చూసుకునేవారు ఎవరు ఉండరు. ఏ డబ్బు కోసం అయితే నువ్వు నన్ను మోసం చేశావో అదే డబ్బు మాయలో పడి నువ్వు తప్పకుండా మోసపోతావు" అని నన్ను తిట్టి....బోరుమని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇదంతా చూసిన నా తల్లిదండ్రులు ఎంతో బాధ పడుతూ " నువ్వు ఇంత బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఇంత సంపాదిస్తుంటే నా కొడుకు అని ఎంతో సంతోషంగా గర్వంగా చెప్పుకుని తిరిగాం... కానీ నువ్వు ఇంత నీచుడివని, డబ్బు కోసం ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నీ వదులుకున్నావు, నీలాంటి కొడుకు మాకు పుట్టకున్న బాగుండు అనిపిస్తుందన్నారు. 

దీప్తి మాటలు , నా తల్లిదండ్రుల మాటలు విన్నాక నాపై నాకే అసహ్యం వేసింది.  నేను చేసిన తప్పు ఏంటో బాగా తెలిసొచ్చింది. ఇక వెంటనే ఆలస్యం చెయ్యకుండా దీప్తి దగ్గరకి వెళ్ళాను. కానీ.... నేను వెళ్ళే సరికి దీప్తి లేదు తన శవం మాత్రం ఉంది. నన్ను తిట్టి అక్కడి నుండి ఎంతో బాధతో ఇంటికి వెళ్తున్న దీప్తినీ ఒక లారీ వచ్చి గుద్దడంతో  అక్కడికక్కడే చనిపోయింది. ఆ వార్త విని ఒక్కసారిగా నేను షాక్‌ అయ్యాను . ఏమి చెయ్యలేక పిచ్చి వాడిలా దీప్తి  పై పడి నువ్వు , నీ ప్రేమ నాకు కావాలి అని గుండెలు పగిలేలా ఏడ్చాను . కానీ ఏమి లాభం బ్రతికుండగా వద్దు అని చనిపోయాక కావాలి అంటే ఏదీ రాదు కదా..!! నాకున్న నా డబ్బు పిచ్చే దీప్తి చావు కి కారణం అయింది. డబ్బే లోకం అనుకునే నన్ను తన లోకంగా భావించి, ప్రేమించిన దీప్తి నీ దూరం చేసుకునీ ,,, చివరకి తప్పు తెలుసుకుని తను తన ప్రేమ కావాలని వెళ్తే అందనంత దూరంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళింది నా దీప్తి.  తను లేని లోటు తీరనిది. తను చనిపోయాక దీప్తినే తల్చుకుంటూ , నేను చేసిన తప్పుకి బాధ పడుతూ నా తల్లిదండ్రులు చెప్పింది వింటు  ఈ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. 

నా ఈ జీవితానికి నేనే విలన్ . డబ్బు ఒకటి ఉంటే సరిపోతుంది అనుకున్నాను కానీ దానికంటే విలువైంది మరొకటి ఉంది అదే ప్రేమ అని తెలుసుకోలేక పోయాను.  నేను డబ్బు కావాలా? ప్రేమ కావాలా ? అన్నప్పుడు నాకు ప్రేమే కావాలి అని అనుంటే ఈ రోజు నా జీవితం దీప్తి తో చాలా అద్భుతంగా ఉండేది. నా జీవితం నాకు నేర్పింది ఏంటంటే డబ్బు కన్న ప్రేమే గొప్పది . ఎందుకంటే డబ్బుతో ప్రపంచం నడుస్తుండొచ్చు కానీ మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రేమ కావాలి ""మనం పుట్టినప్పుడు మనల్ని జాగ్రత్త గా చూసుకునే "అమ్మ ప్రేమ"   పెరుగుతూ ఉన్నప్పుడు మనల్ని నడిపించే "నాన్న ప్రేమ"   సరదాగా ఆనందించే సమయంలో "మిత్రుల ప్రేమ"   పెళ్లి అయ్యాక "భార్య/ భర్త ప్రేమ"   ముసలి వాళ్ళం అయ్యాక "పిల్లల ప్రేమ" . ఇక్కడ ప్రేమించే విధానం , ప్రేమించే వ్యక్తులు వేరు కావచ్చు కానీ , ప్రేమ మాత్రం ఒక్కటే ,,,,అదే శాశ్వతం.  డబ్బు ప్రతి ఒక్కరీ దగ్గరా ఉంటుంది కానీ ప్రేమ మాత్రం కొందరికే దక్కుతుంది. మన జీవితం లో ఒక్క నిమిషంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని ఊహించలేని మలుపు తిప్పుతాయి.  కాబట్టి ఆ ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, ప్రేమ బాటకై అడుగేద్దాం
ఇట్లు
ఈ విషాద గాథకి విలన్ 
అరుణ్ (హైదరాబాద్‌).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement