తప్పు నాదీ...శిక్ష ఆమెకి | Vivek From Bangalore: Telugu love story | Sakshi
Sakshi News home page

తప్పు నాదీ...శిక్ష ఆమెకి

Published Thu, Apr 23 2020 7:50 PM | Last Updated on Thu, Apr 23 2020 7:53 PM

Vivek From Bangalore: Telugu love story - Sakshi

అబద్ధం అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన జీవితంలో ఎదో ఒక విషయంలో చెప్తాడు. కానీ అబద్ధం చెప్పడం వలన కలిగే అనర్థాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే అబద్ధం చెప్పి అన్ని అనర్థాలకు కారణం అయ్యే బదులు నిజం చెప్పి సంతోషంగా ఉండడం ఉత్తమం. అబద్ధం  మనం చెప్పిన ఆ ఒక్క క్షణం ప్రశాంతతని ఇస్తుంది కావచ్చు, కానీ నిజం చెప్పడానికి కష్టం అయినా అది మనకి జీవితాంతం ప్రశాంతతని ఇస్తుంది.  మనం ఆడే అబద్దం ఇతరుల జీవితంలో ఊహించని మలుపు కి దారి తీస్తే.. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే నా ఈ కథ కూడా అలాంటిదే. ఒక్క క్షణం సంతోషం కోసం నేను ఆడిన అబద్ధం నా జీవితంలో ఎలాంటి బాధని తీసుకొచ్చిందో నేను మీతో పంచుకోబోతున్నాను.

నేను బి.టెక్ చదువుతున్న రోజుల్లో నాకు  ముగ్గురు స్నేహితులు ఉండేవారు. నేను ఎక్కువగా ఆ ముగ్గురితోనే ఉండేవాడిని, వారితోనే కళాశాలకు వెళ్ళడం రావడం చేసేవాడిని. ప్రతి ఒక్కటి వారితోనే పంచుకునేవాడిని. నా స్నేహితులందరిలో కూడా నేను ఆ ముగ్గురిని ఎక్కువగా నమ్మేవాడిని. అంతేకాకుండా మా కళాశాలలో నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి పేరు రక్ష. నేను ఆ కళాశాలలో చేరిన మొదటి రోజే రక్షని చూశాను. నేను తనని చూసిన క్షణం నుండే తనని ప్రేమించడం మొదలు పెట్టాను. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను కానీ నా ప్రేమ విషయం మాత్రం రక్ష కి ఇంతవరకు చెప్పలేదు. కారణం రక్ష నన్ను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తోంది. ఇప్పుడు నేను తనని ప్రేమిస్తున్న విషయం చెప్తే రక్ష తన స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని ఎక్కడ బాధ పడుతుందో అని, నాతో మాట్లాడడం ఎక్కడ మానెస్తుందో అని, తనని బాధ పెట్టడం ఇష్టం లేక  ప్రేమికుడిలా కాకపోయినా ఒక మంచి స్నేహితుడిలా అయినా ఉందాం అని చెప్పలేదు. నా స్నేహితులు ముగ్గురికి కూడా నా ప్రేమ విషయం తెలుసు.

అది అలా ఉండగా బీ.టెక్ నాలుగవ సంవత్సరం రానే వచ్చింది. రక్ష కి నాకు మధ్య స్నేహం ఇంకా పెరిగి మేమిద్దరం చాలా దగ్గరయ్యారు. అది గమనించిన నా స్నేహితులు నాతో రక్ష కూడా నన్ను ప్రేమిస్తుందనీ అందుకే నాతో అంత సన్నిహితంగా ఉంటుందనీ చెప్పారు. ఇక మిగిలింది  ఒక్క సంవత్సరం మాత్రమే ఇప్పుడు కూడా నేను నా ప్రేమ విషయం చెప్పకపోతే తనని కోల్పోయి చాలా బాధ పడాల్సి వస్తుంది అని హెచ్చరించారు. వెంటనే వెళ్లి రక్ష కి నా ప్రేమ విషయం చెప్పమన్నారు. నేను కూడా ఏమి ఆలోచించకుండా నా స్నేహితులు చెప్పింది విని రక్ష దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పాను. కానీ ఇక్కడ నేను మొదట్లో అనుకున్నదే నిజం అయింది. రక్ష నన్ను ప్రేమించడం లేదు. నన్ను ఓ మంచి స్నేహితుడిగానే భావిస్తోంది. ఇక చేసేది ఏమి లేక తిరిగి నా స్నేహితుల దగ్గరికి వచ్చాను. అప్పటికే నా స్నేహితులు రక్ష కూడా నన్ను ప్రేమిస్తుంది అనే నమ్మకంతోనే ఉన్నారు, వారికి రక్ష నన్ను ప్రేమించడం లేదని చెప్పలేక, చెప్తే స్నేహితుల ముందు నా పరువు పోతుందేమో అని ఆలోచించి వారికి రక్ష కూడా నన్ను ప్రేమిస్తుంది అని, ఆ ఒక్క క్షణం సంతోషం, ప్రశాంతత కోసం అబద్ధం చెప్పాను. ఇక మా ప్రేమ విషయం నా స్నేహితుల ద్వారా కళాశాల మొత్తం తెలిసింది. అంతేకాకుండా మా కళాశాలలోనే రక్ష వాళ్ళ బంధువుల అమ్మాయి కూడా చదువుతుండడం తో తనకి కూడా ఈ విషయం తెలిసింది. ఆ అమ్మాయి రక్ష ఎవరినో ప్రేమిస్తుంది అని తన ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది. వారు రక్ష కి బంధువులే కావడం వలన ఆ విషయం రక్ష వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసింది. (కోవిడ్‌–19 లవ్‌స్టోరీ)

రక్ష ప్రేమ విషయం తెలిసి తన పరువు అందరి ముందు పోయింది అని రక్ష తండ్రి తనని చదువు మాన్పించి, తను ఎవరిని ప్రేమించడం లేదని ఎంత చెప్పినా వినకుండా వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు. కానీ ఈ విషయాలేవీ కూడా అప్పటికి నాకు తెలియవు. నేను నా బీ.టెక్ పూర్తి చేసుకుని, రక్ష ఎలాగో నన్ను ప్రేమించడం లేదు కదా అని తనని మెల్ల మెల్లగా మర్చిపోతూ, జీవితంలో పైకి ఎదగాలని ఒక మంచి ఉద్యోగం చేస్తూ బెంగుళూర్ లో స్థిర పడ్డాను. కొన్నాళ్ళకు నా తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం తెచ్చి నా పెళ్లి చేశారు, ఆ అమ్మాయి చాలా మంచిది, నేను తనతో సంతోషంగా నా జీవితాన్ని గడుపుతున్నాను. ఇది ఇలా ఉండగా ఒకరోజు రక్ష భర్త తాగి వాహనం నడపడం వలన ప్రమాదం జరిగి చనిపోయాడు. దాంతో రక్ష తన కలలు తన చదువు అంతేకాకుండా తన జీవితం కూడా ఇలా మధ్యలో ఆగిపోయినందుకు  డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఈ విషయాలన్ని  నేను ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా స్నేహితులని కలిస్తే వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఆ విషయాలన్ని తెలిసి నేను చాలా బాధ పడ్డాను. నేను ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశానా అని కృంగిపోయాను. వెంటనే వెళ్ళి రక్షని కలవడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు. చేసేది ఏమీ లేక బెంగుళూర్ తిరిగి వెళ్ళిపోయాను. కానీ నా వల్లేరక్ష జీవితం ఇలా అయిందన్న బాధ నన్ను వెంటాడుతూ ఉంటుంది. అంతేకాకుండా నేను చేసిన తప్పుకి జీవితాంతం పశ్చాత్తాప పడుతూనే ఉంటాను.

చదవండి: (ఎవరైనా ఇలా ప్రేమిస్తారా?)
ఇలా నా జీవితంలో నేను క్షణ కాల సంతోషం, ప్రశాంతత కోసం చెప్పిన అబద్దం మరొకరి జీవితంతో ఆడుకోవడమే కాకుండా జీవితాంతం భరించలేని బాధని కూడా నాకు ఇచ్చింది. "మనం మన జీవితంలో అబద్దంఆడాల్సి వస్తే అది పది మందికి ఉపయోగపడేలా ఉండాలి కానీ మరొకరి జీవితాంతంతో ఆడుకునేలా మాత్రం కాదు.

ఇట్లు 
వివేక్.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement