
ప్రతీకాత్మక చిత్రం
అసూయ ఓ స్లోపాయిజన్ లాంటిది. అది ఆవరించిన వ్యక్తిని వారికి తెలియకుండానే కొద్దికొద్దిగా నాశనం చేస్తుంది. నిత్యం అసూయతో రగిలిపోయే వ్యక్తి తనని తాను బాధించుకోవటమే కాకుండా ఇతరులను, ముఖ్యంగా తమను ఇష్టపడే వ్యక్తులను ఎక్కువగా కష్టపెడుతుంటారు. అది రిలేషన్‌లో ఉన్న వ్యక్తులకు సంబంధించిందైతే వారి జీవితం నిత్యం నరకం ప్రాయం అవుతుంది. అసూయ కలిగిన వ్యక్తులు ఎదుటి వ్యక్తి ప్రేమ మొత్తం తమకే చెందాలనే మొండిపట్టుదలతో చిన్న చిన్న విషయాలకు కూడా వారిని సాధిస్తుంటారు. పార్ట్‌నర్ ప్రతి కదిలికపై ఓ కన్ను వేసి వారి పొరపాట్లను కూడా భూతద్దంతో వెతికి చూపి హింసిస్తుంటారు. ఎప్పుడైతే బంధంలోకి అసూయ అడుగుపెడుతుందో అప్పుడు ఆ బంధం నాశనం అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే అసూయను ప్రారంభంలోనే గుర్తించి అరికట్టాల్సిన అవసరం ఉంది.
- అసూయ మొదలవ్వగానే ఆ వ్యక్తి ఎదుటి వారితో తమకు సంబంధించిన విషయాలను పంచుకోవటం మానేస్తారు. మన బంధంలోకి అసూయ అడుగుపెట్టిందని చెప్పే మొదటి, ముఖ్యమైన లక్షణం ఇదే. ఎప్పుడైతే ఓ వ్యక్తి మనతో ఉన్నపుడు భద్రతగా, కంఫర్ట్‌గా ఫీలవుతారో అప్పుడే ఆ వ్యక్తి మనతో తమకు సంబంధించిన విషయాలను పంచుకోవటానికి ఇష్టపడతారు. అలా జరగకుంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే.
- మనం ఎక్కువగా ఎదుటి వ్యక్తికి సంబంధించిన విషయాలపై దృష్టిపెడుతూ వారి ప్రతి కదలికను తెలుసుకుంటునట్లయితే అసూయకు బీజం పడిందని భావించాలి. మనం ఎక్కువగా ఎదుటి వ్యక్తి గురించి, వారి స్నేహాల గురించి ఆలోచిస్తుంటే అది మన బంధానికే గొడ్డలిపెట్టు అవుతుంది.
- మీ పార్ట్‌నర్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్లయితే అది అసూయగా గుర్తించాలి. ఎందుకంటే మనతో వారు కంఫర్ట్‌గా ఫీలవ్వకపోవటం, మనతో సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల మనల్ని అవాయిడ్ చేయటం మొదలుపెడతారు.
- జరగని, అనవసరమైన విషయాలను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ జంట ఎల్లప్పుడూ గొడవ పడుతున్నట్లయితే ఆ బంధంలో అసూయ ప్రవేశించిందని గుర్తించాలి. అసూయ మొదలవ్వగానే బంధం బలహీనపడి జంట మధ్య తరచూ గొడవలకు దారితీస్తుంది.