సతీష్, అఖిల
తొండంగి కొమ్మనాపల్లి గ్రామానికి చెందిన నులక తాటి సతీష్, కృష్ణా జిల్లా వీర్లుపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన పడిగెల అఖిల మధ్య మూడేళ్ల క్రితం ప్రేమ చిగురించింది. చిట్టచివరకు కోర్టు కేసులు,జైలు తదితర పరిణామాలను అధిగమించి చట్టప్రకారం ఒక్కటైంది ఆ జంట.
సతీష్‌ది కొమ్మనాపల్లిలో కూలీ పని చేసుకుని జీవించే చిన్న కుటుంబం. ఆశించిన స్థాయిలో పని లేకపోవడంతో ఆర్థిక సమస్యలతో నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లారు. చిక్కడ్‌పల్లి ప్రాంతంలో అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌గా అతడి తండ్రి దాసు పనిచేయటంతో కుటుంబం అంతా అక్కడే నివాసం ఉంది. ఇంటర్ వరకూ చదువుకున్న సతీష్ మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా చేరాడు. అదే అపార్ట్‌మెంట్‌లో కృష్ణాజిల్లా వీర్లుపాడు మండటం జయంతి గ్రామానికి చెందిన పి.అయ్యప్ప వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అతడి కుటుంబం కూడా అక్కడే నివాసం ఉంటోంది. ఆఫీస్ బాయ్‌గా ఉన్న సతీష్ వస్తూపోతూ ఉండడంతో అయ్యప్ప కుమార్తె అఖిలకు, అతడికి మధ్య స్నేహం ఏర్పడింది. 2017నాటికి అది కాస్తా ప్రేమగా మారింది.
అదే ఏడాది జనవరి 20న వారిద్దరూ ప్రేమ బాసలు చేసుకున్నారు. కాలక్రమంలో వారి వ్యవహారం పెద్దలకు తెలిసింది. కులాలు వేరు కావటంతో అఖిల తండ్రి ఆమెను స్వగ్రామం జయంతికి పంపించారు. సుమారు ఆరునెలల అనంతరం ఫోన్ల ద్వారా మాట్లాడుకున్నారు. ఆగస్టులో వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్లారు. దీంతో అఖిల తల్లిదండ్రులు స్వగ్రామం పరిధి పోలీస్ స్టేషన్‌లో సతీష్‌పై మైనర్ అయిన తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సతీష్ తల్లిదండ్రులుకు సతీష్, అఖిల చెన్నైలో ఉన్నారని తెలియడంతో ఫోన్లో వారికి నచ్చచెప్పారు. దీంతో సతీష్, అఖిల ఇద్దరూ తొండంగి మండలంలోని స్వగ్రామం కొమ్మనాపల్లికి వచ్చారు.
సతీస్ తల్లిదండ్రులు వీరిద్దరినీ ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అఖిల తండ్రి సతీష్‌పై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అయ్యప్పను కూడా రప్పించారు. మైనర్ కావటంతో పోలీసులు అఖిలను అయ్యప్పతో పంపించారు. కేసుకు సంబంధించి వీర్లుపాడు పోలీస్‌స్టేసన్‌నుంచి ఒంటిమామిడి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అప్పటికే సతీష్‌పై కేసు నమోదు చేయడంతో ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నందిగామ సబ్‌జైలులో సతీష్ సుమారు 63రోజులు ఉన్నాడు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాడు. కాలం గడుస్తోంది.
సతీష్ మళ్లీ హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరాడు.అఖిల నందిగామలో టైలరింగ్ నేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ ద్వారా సతీష్ నెంబర్ సేకరించిన అఖిల ఫోన్ చేసి తన ప్రేమను కొనసాగించింది. ఈ ఏడాదితో మైనార్టీ తీరి జనవరి నాటికి మేజర్ కావడంతో సతీష్‌ను పెళ్లిచేసుకునేందుకు నందిగామ నుంచి అన్నవరం చేరుకుంది. అన్నవరంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. 2017లో తన ప్రియురాలు తనకు ప్రపోజ్ చేసిన రోజైన జనవరి 20నే వివాహం చేసుకున్నట్లు సతీష్ తెలిపాడు.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment