Telugu Love Story
-
నువ్వూ వద్దు నీ ప్రేమా వద్దు..
తన పేరు బుజ్జి నా జూనియర్. హ్యాపిడేస్ సినిమాలో లాగా తనని మొదటిసారి చూడగానే ప్రేమించా. వెంటనే తనకి చెప్పా. మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది. కానీ నేను మాత్రం తనని వదులుకోలేకపోయా. నా చదువు పూర్తవగానే జాబ్‌లో జాయిన్ అయ్యాను. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు తన నుంచి కాల్ వచ్చింది. ఓ ప్రాజెక్ట్‌లో హెల్ప్ కావాలి అని. అలా తను నాకు మళ్లీ దగ్గరైంది. అప్పుడే తన మనసులో మాటని నాతో పంచుకుంది. నువ్వంటే నాకిష్టమే. కానీ మంచి జాబ్‌లో స్థిరపడితే మా ఇంట్లో వాళ్లని ఒప్పిస్తా అంది. అప్పటికి నా జీతం 16 వేలు మాత్రమే. సో ఇంకా మంచి జాబ్ కోసం కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఉద్యోగం సంపాదించి వాళ్లింటికి వెళ్లి మా ప్రేమ గురించి చెప్పి ఒప్పించాలనుకున్నా. అందుకే బాగా కష్టపడేవాడ్ని. ఈ గ్యాప్‌లో తనతో పెద్దగా ఫోన్లో మాట్లాడుకునే టైం దొరికేది కాదు. దీంతో మా ఇద్దరి మధ్యా గొడవలు వచ్చేవి. ఎంత గొడవపడినా మళ్లీ తనే కాల్చేసి మాట్లాడేది. కానీ ఓరోజు మా మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. నా ఓప్కి నశించి తనమీద గట్టిగా అరిచేశా. అంతే ..నీమీద ఉన్న నమ్మకం అంతా పోయింది నువ్వు నాకొద్దు. నీ ప్రేమా వద్దు అని చెప్పి వెళ్లిపోయింది. అరిచింది నా బుజ్జిపైనే కదా ఎప్పటిలానే తనే మళ్లీ కాల్ చేస్తుంది అనుకున్నా. కానీ నా మాటలు తనని ఎంత గాయపరిచాయో అప్పుడు అర్థమైంది. కాల్ చేసేది కాదు. నేను ఫోన్ చేసినా మాట్లాడేది కాదు. కొన్నిరోజులకి నాకు పెళ్లి అని తన నుంచి కాల్ వచ్చింది. ముందుగా నేను నమ్మలేదు. ఏదో కోపంగా అంటుంది అనుకున్నా .తర్వాత వాళ్ల ఫ్రెండ్స్ చెప్పాకా ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పనైంది. తనకి పెళ్లి అని తెలిసినప్పటినుంచి కన్నీళ్లతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. చివరిగా తను నాతో అన్న ఒకే ఒక్కమాట..నన్ను ప్రశాంతంగా బతకనివ్వు అని. ఇప్పడు జాబ్ చేయడం మానేశా. కోచింగ్ కూడా వదిలేశా. వచ్చే నెలలో తన పెళ్లి. తను ఎక్కుడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలి. --హరీష్ రాజు, నెల్లూరు -
లాగిపెట్టి కొట్టి ‘పిచ్చిదానిలా కనిపిస్తున్నానా?’..
నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజుల్లో మా ఇంటి పక్క ఇంట్లో ఓ అమ్మాయి ఉండేది. తను ఏడవ తరగతి చదువుతుండేది. ఒకే ఊరు కనుక కలిసి ఆడుకుంటూ ఎప్పుడూ సరదాగా ఉండేవాళ్లం. నేను మా ఇంట్లో అమ్మకు సహాయం చేసే వాడిని, తను నాకు సహాయం చేసేది. అలా మా మధ్య ఇష్టం చాలా పెరిగింది. తనెప్పుడూ నా కోసమే ఆలోచించేది. తనంటే ఇష్టంగా ఉండేవాడిని కానీ, ప్రేమ అని అనుకోలేదు. తను నా మీద పెంచుకుంటున్న ఇష్టం అందరూ గమనించారు! నేను తప్ప. ఆమె మా పేర్లు ఫ్లేమ్స్ వేసుకుని, ఆ పేపరు బ్యాగులో ఉంచుకుంది. నాకు సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా దాచుకునేది. అవన్నీ గమనించిన వాళ్ల ఇంట్లో వాళ్లు తనని నా నుండి దూరం పెట్టారు. అప్పుడు అర్థమైంది నాకు, తనని నేను ఇష్టపడతున్నానని. ఇక అప్పటినుంచి తనకు దూరంగా ఉండటం నరకంలా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నా పక్కనే కూర్చునేది. ఊర్లో అందరూ మేము భార్యాభర్తలం అనుకునేలా ఉండేది. కొద్ది రోజులకి తనని నాతో పూర్తిగా మాట్లాడకుండా చేశారు. వాళ్ల పిన్ని ఆ అమ్మాయిని కొట్టి నాకు దూరం చేసింది. అలా రెండేళ్లు మేము దూరంగా ఉన్నాం. తర్వాత మళ్లీ మాట్లాడింది. కానీ, ఇక మీదట మేము అందరిలో కలిసి ఉండకూడదు అని నిశ్చయించుకున్నాం. ఎవరికీ తెలియకుండానే మాట్లాడుకునేవాళ్లం. అందుకు వాళ్ల చెల్లెలు కూడా మాకు హెల్ప్ చేసింది. మెసేజెస్, కాల్స్ చేసుకునేవాళ్లం. మాకు ఆస్తిలేని కారణంగా తనని దూరం చేశారు. వాళ్ల మామయ్యకు ఇచ్చి పెళ్లి చేయటానికి ఖాయం చేశారు. తను అప్పటినుంచి ఏడుస్తూ ఉండేది. ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నా వయసు 19 తనను తీసుకుని వెళ్లలేను. అలా అని ఆపలేను. చచ్చిపోవాలనుకున్నా. తను కూడా అలానే అనుకుంది. ఆస్తి, వయసు కారణంగా నా ప్రేమ నాకు దూరం అయింది. ఒకసారి అడిగా నేనంటే అంత ఇష్టమా అని తను లాగిపెట్టి కొట్టింది. ‘నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఎందుకు అలా అడిగావు. ఇంకెప్పుడూ అలా అడగకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం! ఇలా అడుగుతావని నేనెప్పుడూ అనుకోలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోను. నా ప్రాణం పోయేటప్పుడు నిన్ను తలుచుకుని చచ్చిపోతాను. ఎప్పటికీ నీ కోసమే ఆలోచిస్తూ బ్రతుకుతాను’ అంది. ఒక్కసారిగా నన్ను పట్టుకుని ఏడ్చింది. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒక అమ్మాయిని పట్టుకోవటం అదే మొదటిసారి. నా లైఫ్‌లో ఆరోజుని ఎప్పటికీ మర్చిపోలేను. నేను అడిగా ‘మరి నాతో వచ్చేయొచ్చు కదా’ అని. తను రాను అంది. ఏం అంటే ‘మా ఇంట్లో వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. నా మూలంగా వాళ్లు అవమానపడకూడదు.’ అంది. ‘మరి నన్ను ఎందుకు ఇష్టపడ్డావు’ అన్నాను. ‘ నా లైఫ్ అంతే! ఈ జన్మకు ఇలా అవ్వాలని రాశాడేమో దేవుడు’ అంది. చాలా బాధగా అనిపించింది. అప్పుడు తనో కోరిక కోరింది. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని. ‘అదేంటీ?’ అన్నా. ‘ఎవరికీ తెలియకపోయినా నువ్వు నా వాడివి అనే ఫీలింగ్ నాకు చాలు. నువ్వు నన్ను చేసుకో’ అంది. తన బర్త్‌డే రోజు బొట్టు పెట్టించుకుంది. ‘నా బర్త్ డే అని కాకుండా నువ్వు బొట్టు పెట్టిన రోజుగా గుర్తుంచుకుంటా’ అని ఏడ్చింది. ‘ఇలానే ఉండిపోవాలని ఉంది. ఇంకో జన్మంటూ ఉంటే నీతో ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా’ అని అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రేమంటే ఎదుటి వ్యక్తి కళ్లల్లోనే తెలుస్తుంది. తన కళ్లు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నాయని నాకు చెబుతాయి. తన కళ్లు చూస్తే ఆ కళ్లు నా కోసం బాధపడుతున్నాయని నాకు అర్థం అవుతుంది. ఇంకో లైఫ్ ఉంటే నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ప్రేమించే నీ ప్రేమని, ఐ మిస్ యూ బంగారం! - స్వామి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నువ్వు కుదరదంటే చచ్చిపోతా!!
అతడి పేరు సుభాష్! మా ఇంటి పక్కనే వాళ్ల ఇళ్లు. మా రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దూరపు బంధుత్వం కూడా. తను నాకు బావ వరుస అవుతాడు. చాలా స్నేహంగా ఉండేవాళ్లం చిన్నప్పటినుంచి. ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్నపుడు నాకు ప్రపోజ్ చేశాడు. నేనప్పుడు ఓకే చెప్పలేదు. డిగ్రీ ఇద్దరం ఒకే కాలేజ్‌లో చేరాము. నెలకోసారైనా నాకు ఐ లవ్ యూ చెప్పేవాడు. తెలిసిన వ్యక్తి, మంచి వాడు, పైగా రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది! కాబట్టి, పెళ్లికి ఒప్పుకుంటారని నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్‌లో ఓకే చెప్పాను. నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. ఓ వ్యక్తినాపై ఇంతలా ప్రేమ చూపించడం నాకు బాగా నచ్చేది. చూస్తుండగానే మా ప్రేమలో ఏడేళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఈ ఏడేళ్లలో ఎన్నో మార్పులు. నాకు, అతడికి మధ్య ఎన్నో కలవని పాయింట్లు ఉన్నాయి. రోజురోజుకు అతడిపై ప్రేమ తగ్గుతూ వచ్చింది. ఇక మీదట అతడితో కలిసి ఉండటం కుదరదనిపించింది. ఇదే విషయం అతడికి చాలాసార్లు చెప్పి చూశాను. ‘ నేను నీతో కలిసి ఉండలేను’ అని. దానికి అతడు చాలా సీరియస్ అయ్యేవాడు, బాగా తిట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత క్షమాపణలు చెప్పి, ‘ నువ్వు కుదరదంటే నేను చచ్చిపోతాను’ అనేవాడు. అయినా పట్టువదలకుండా అతడికి నచ్చజెప్పటానికి ప్రయత్నించేదాన్ని. ‘మనిద్దరి దార్లు వేరు.. ఎప్పటికీ కలవవు’ అని. పట్టించుకునేవాడు కాడు. మేమిద్దరమూ పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం మా ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. నేను మా ఇంట్లో ఈ విషయం చెప్పటానికి ప్రయత్నించినపుడు వాళ్లు కూడా నా మాట వినలేదు. అతడితో బ్రేకప్ చెప్పి, మా రిలేషన్‌కు ఓ ఎండ్‌కార్డ్ వేద్దామని చేస్తున్న ప్రయత్నం ఎప్పటికి ఫలిస్తుందో. - శీ విధ్య, సూర్యాపేట లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
తనతో గొడవ.. ఫైనల్ రౌండ్లో..
కాలేజీకి వెళ్లి చదువు కోవడం.. ఇంట్లో పని చేయడం తప్ప ఏమీ తెలియని నా జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి వచ్చింది. ఎప్పుడూ గొడవ పడే మేము ఫ్రెండ్స్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నేను ఏ అమ్మాయి గురించి మాట్లాడినా గొడవ పడేది. అప్పుడే అర్థం అయింది.. తను నన్ను ప్రేమిస్తోందని. తన పుట్టినరోజుకు ముందు రోజు నాకు ప్రపోజ్ చేసింది. అప్పుడు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ, హాలిడేస్‌కు తను ఇంటికి వెళుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ రోజు అర్థమైంది! తనని నేను ప్రేమిస్తున్నానని. ‘నేను ఎక్కడికీ వెళ్లను బుజ్జి! మళ్లీ వస్తాగా’ అని తను వెళ్లిపోతుంటే చాలా బాధ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను వచ్చి వెళ్లిన ప్రతీసారి బాధ పడుతూనే ఉన్నా. ఎందుకంటే ఎంత సేపు చూసినా తను నన్ను వదిలి వెళ్లే చివరి నిమిషం చాలా బాధిస్తోంది. అందరి లవ్ స్టోరీలో లాగే మా లవ్‌లో కూడా గొడవలు వచ్చాయి. కానీ, అపుడు మేము విడిపోలేదు. అడ్జస్ట్ అవుతూనే వచ్చాము. కానీ మా ప్రేమ పెళ్లి వరకు తీసుకు వెళ్లాలంటే మనీ, క్యాస్ట్ ప్రాబ్లమ్స్‌గా మారాయి. క్యాస్ట్ మార్చలేం కదా అందుకే మనీ అయినా ఉండాలనుకున్నాం. మాది ఒక పూర్ ఫ్యామిలీ! ఎంత పూర్ అంటే తనతో ఒక నైట్ ఫోన్ కాల్ మాట్లాడాలంటే వన్ డే హోటల్ సర్వర్‌గా పనిచేసే వాడిని. తనకి ఒక రింగ్ కొనాలని రెండు నెలలు బార్లో సర్వర్‌గా పని చేశా. తను రిచ్ గాళ్! ఎలా అయినా మా ఫ్యామిలీ, నేనూ డెవలప్ అవ్వాలనుకున్నాం. మా డాడీని ఒప్పించి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాం. ఎలాగో డెవలప్ అయ్యాం. ఇక నేను మంచి జాబ్ చేయాలనుకున్నపుడు! ‘సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చెయ్’ అని చెప్పింది. ఎందుకంటే కొద్ది టైంలో ఎక్కువ శాలరీ రావాలంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కరెక్ట్ అనుకున్నాం. తనని సీఏ చేయమని చెప్పా. నాకా ఒక ముక్క ఇంగ్లీష్ రాదు! సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా? అనుకున్నా అప్పుడే వాళ్ల అక్కకి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాయి. తరువాత తనకి, సో! త్వరగా కోర్స్ చేసి మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఆరు నెలల్లో చేయాల్సిన కోర్స్ ఒక నెలలో చేసి జాబ్ ట్రైల్స్‌కు ఫిబ్రవరి 14న వెళ్లా. నాకు తన దగ్గరకి వెళ్లాలని ఉండేది. తనకేమో నేను జాబ్ కోసం వెళ్లాలని ఉండేది. జాబ్‌కోసం సెర్చ్ చేస్తున్న టైంలో తనకి ఎగ్జామ్స్. నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యా! ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్‌కు వెళ్లా. మా ఇద్దరి మధ్యా చిన్న గొడవ వల్ల సరిగా ఏకాగ్రత ఉంచలేక ఫైనల్ రౌండ్లో జాబ్ మిస్ అయింది. చదవకుండా టైం వేస్ట్ చేస్తోందని తనని తిట్టా. కానీ, మామూలే మళ్లీ చదవకుండా ఉండే సరికి కోపంలో బాగా తిట్టి, ‘నెల రోజులు వెయిట్ చెయ్ అమ్ము! గొడవ పడటానికి కరెక్ట్ టైం కాద’ని చెప్పా. వన్ మంత్ మాట్లాడలేదు. నాకు జాబ్ వచ్చేసింది! ఫుల్ హ్యాపీతో తనకి చెప్పా. అంతే ఏమైందో తెలీదు. ఆ వన్ మంత్ తను చాలా బాధ పడి నాపై ద్వేషం పెంచుకుంది. ‘నేను నీ సెకండ్ ఆప్షన్! నేను ఉంటే జాబ్ తెచ్చుకోలేవా’ అని వెళ్లి పోయింది. తనే తిరిగి వస్తుందిలే అనుకున్నా. కానీ రాలేదు . తను వస్తుందని 4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నా. ‘తప్పకుండా వస్తావ్ కదా అమ్ము .. నీకోసం ఎదురు చూస్తూనే వుంటా . మిస్ యూ అమ్ము.. లవ్ యు బంగారం ...లవ్ యూ ఫరెవర్ బంగారం.. - బుజ్జి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
కోర్టు కేసులు, జైలు.. మూడేళ్ల ప్రేమ
తొండంగి కొమ్మనాపల్లి గ్రామానికి చెందిన నులక తాటి సతీష్, కృష్ణా జిల్లా వీర్లుపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన పడిగెల అఖిల మధ్య మూడేళ్ల క్రితం ప్రేమ చిగురించింది. చిట్టచివరకు కోర్టు కేసులు,జైలు తదితర పరిణామాలను అధిగమించి చట్టప్రకారం ఒక్కటైంది ఆ జంట. సతీష్‌ది కొమ్మనాపల్లిలో కూలీ పని చేసుకుని జీవించే చిన్న కుటుంబం. ఆశించిన స్థాయిలో పని లేకపోవడంతో ఆర్థిక సమస్యలతో నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లారు. చిక్కడ్పల్లి ప్రాంతంలో అపార్ట్మెంట్ వాచ్‌మన్‌గా అతడి తండ్రి దాసు పనిచేయటంతో కుటుంబం అంతా అక్కడే నివాసం ఉంది. ఇంటర్ వరకూ చదువుకున్న సతీష్ మాదాపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా చేరాడు. అదే అపార్ట్మెంట్లో కృష్ణాజిల్లా వీర్లుపాడు మండటం జయంతి గ్రామానికి చెందిన పి.అయ్యప్ప వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అతడి కుటుంబం కూడా అక్కడే నివాసం ఉంటోంది. ఆఫీస్ బాయ్‌గా ఉన్న సతీష్ వస్తూపోతూ ఉండడంతో అయ్యప్ప కుమార్తె అఖిలకు, అతడికి మధ్య స్నేహం ఏర్పడింది. 2017నాటికి అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది జనవరి 20న వారిద్దరూ ప్రేమ బాసలు చేసుకున్నారు. కాలక్రమంలో వారి వ్యవహారం పెద్దలకు తెలిసింది. కులాలు వేరు కావటంతో అఖిల తండ్రి ఆమెను స్వగ్రామం జయంతికి పంపించారు. సుమారు ఆరునెలల అనంతరం ఫోన్ల ద్వారా మాట్లాడుకున్నారు. ఆగస్టులో వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్లారు. దీంతో అఖిల తల్లిదండ్రులు స్వగ్రామం పరిధి పోలీస్ స్టేషన్లో సతీష్‌పై మైనర్ అయిన తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సతీష్ తల్లిదండ్రులుకు సతీష్, అఖిల చెన్నైలో ఉన్నారని తెలియడంతో ఫోన్లో వారికి నచ్చచెప్పారు. దీంతో సతీష్, అఖిల ఇద్దరూ తొండంగి మండలంలోని స్వగ్రామం కొమ్మనాపల్లికి వచ్చారు. సతీస్ తల్లిదండ్రులు వీరిద్దరినీ ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అఖిల తండ్రి సతీష్‌పై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అయ్యప్పను కూడా రప్పించారు. మైనర్ కావటంతో పోలీసులు అఖిలను అయ్యప్పతో పంపించారు. కేసుకు సంబంధించి వీర్లుపాడు పోలీస్స్టేసన్నుంచి ఒంటిమామిడి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అప్పటికే సతీష్‌పై కేసు నమోదు చేయడంతో ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నందిగామ సబ్‌జైలులో సతీష్ సుమారు 63రోజులు ఉన్నాడు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాడు. కాలం గడుస్తోంది. సతీష్ మళ్లీ హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరాడు.అఖిల నందిగామలో టైలరింగ్ నేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ద్వారా సతీష్ నెంబర్ సేకరించిన అఖిల ఫోన్ చేసి తన ప్రేమను కొనసాగించింది. ఈ ఏడాదితో మైనార్టీ తీరి జనవరి నాటికి మేజర్ కావడంతో సతీష్‌ను పెళ్లిచేసుకునేందుకు నందిగామ నుంచి అన్నవరం చేరుకుంది. అన్నవరంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. 2017లో తన ప్రియురాలు తనకు ప్రపోజ్ చేసిన రోజైన జనవరి 20నే వివాహం చేసుకున్నట్లు సతీష్ తెలిపాడు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు! బస్‌లో...
2008లో నేను బీటెక్‌లో జాయిన్ అయ్యాను! అప్పుడే మొదటిసారి ఈడీసీ ల్యాబ్‌లో ఆద్యను చూశాను. ఆమె అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అది చూసి నాకు కూడా తనతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించేది. నేను చాలా షైగా ఉండేవాడిని. సో తనతో మాట్లాడటానికి, ఫ్రెండ్షిప్ చెయ్యడానికి చాలా రోజులు పట్టింది. సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి కొంచెం క్లోజ్ అయ్యాం. కానీ, తన మీద లవ్ ఉందని నాకు తెలియలేదు. వేరే ఎవరైనా నా కన్నా తనతో క్లోజ్‌గా ఉంటే బాగా కుళ్లు వచ్చేది. సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్‌లో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ ఒకడు తనకి లవ్ ప్రపోజ్ చేశాడు. తను కూడా ఒప్పుకుంది. ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. వాళ్లిద్దరూ నా ఫ్రెండ్స్ కాబట్టి. కానీ ఉండేకొద్దీ వాళ్లిద్దరూ బాగా క్లోజ్‌గా ఉండటం, అన్నీ షేర్ చేసుకోవడం అన్నీ చూసి నేను తట్టుకోలేకపోయాను. అప్పుడే అర్ధం అయ్యింది! నేను తనని లవ్ చేస్తున్నా అని. ఎందుకో తెలీదు వాళ్ళ లవ్ ఒక నెలలోనే బ్రేకప్ అయింది. ఆ తర్వాత తన ఫ్యామిలీలో కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. వాటి వల్ల తను మెంటల్‌గా ఇబ్బందికి గురయ్యింది. తనకి నేను చాలా ధైర్యం ఇవ్వాలనుకున్నా. కానీ, కాలేజ్‌కి కూడా సరిగా వచ్చేది కాదు. నా ఫ్రెండ్ లాగా నేను మాటకారిని కూడా కాదు. థర్డ్ ఇయర్ చివర్లో తను కోలుకుంది. వాళ్ల ఫ్యామిలీ కూడా మా ఇంటి వెనక లైన్లోకి షిప్టు అయ్యారు. థర్డ్ ఇయర్ తర్వాత సమ్మర్ హాలిడేస్‌లో తను కొన్ని కోర్సెస్‌లో జాయిన్ అయ్యింది. అది తెలిసి నేను కూడా తను ఉన్నచోటే జాయిన్ అయ్యాను. ఆ రోజులు నా జీవితంలో గోల్డెన్ డేస్. తనతో చాలా సేపు కలసి ఉండేవాడిని. ఇంటికి కలిసి వెళ్లేవాళ్లం. చాలా ఫాస్ట్‌గా రెండు నెలలు గడిచిపోయాయి. అప్పుడే తనకి నా లవ్ గురించి చెప్పాను. మెసేజ్‌లో, డైరెక్ట్‌గా చెప్పే అంత ధైర్యం నాకు లేదు. అది చెప్పిన తర్వాత ఒక రెండు రోజులు నేను తనని డైరెక్ట్‌గా చూడలేకపోయా. తను నార్మల్‌గానే ఉంది. కానీ, నాకు మాత్రం ఏదో తెలియని ఫీలింగ్. నన్ను తను ఎప్పుడు ఒక పిల్లోడి లాగా, అమాయకుడిలాగా, ఫ్రెండ్ లాగానే చూసింది. కానీ నేనంటే చాలా కేరింగ్‌గా ఉండేది. చాలా వాల్యూ అండ్ ఇంఫార్టెన్స్ ఇచ్చేది. అందుకే తను అంటే నాకు చాలా అభిమానం. అవునని లేదా కాదని ఏమీ చెప్పలేదు. మేము అలానే కంటిన్యూ అయ్యాము. నేను తనని లవ్ చేస్తున్నా అని, నన్ను బాగా టీజ్ చేసేది. తను అలా చేస్తుంటే నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని. తను నాతో చాలా సీక్రెట్స్ షేర్ చేసుకునేది. అలా మా క్లాస్‌కి సంబంధించి ఎదో ఒకటి షేర్ చేసుకునేది. దాన్ని నేను నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడికి ఒకసారి మాటల్లో చెప్పాను. వాడు దాన్ని ఒక గొడవ నుండి బయట పడటానికి వాడుకున్నాడు. దాని వల్ల తను నాతో చాలా రోజులు మాట్లాడలేదు. లాస్ట్ డేస్‌లో మళ్లీ మాట్లాడింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసేది. దాన్ని అలానే కంటిన్యూ చేసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ, కాలేజ్ అయిపోయిన ఒక రెండు నెలల తర్వాత ఎదో విషయం మళ్లీ ఎవరికో చెప్పానని మాట్లాడటం ఆపేసింది. చాలా బాధ పడ్డాను. తర్వాత మాట్లాదిద్ది అనుకున్నా. కానీ, 8 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎన్నో సార్లు మెసేజ్ చేసినా నో రిప్లై. నేను ఫారెన్ వెళ్లి సెటిల్ అయ్యాను. అయినా తన పుట్టినరోజు అప్పుడు న్యూ ఇయర్‌కి మెసేజెస్ చేస్తూనే ఉన్నాను. కానీ నో రెస్పాన్స్. తన రిప్లై కోసం ఎంత తపించానో నాకు తెలుసు. తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసి నేను కూడా పెళ్లి చేసుకున్నా. కానీ, తనను నేను ఇంకా మిస్ అవుతున్నాను, ఒక మంచి ఫ్రెండ్‌లాగా తనతో మళ్లీ మాట్లాడాలని ఉంది కానీ ఏమీ చెయ్యలేకపోతున్నా. తనంటే నాకు చాలా ఇష్టం. తన క్యారెక్టర్ అంటే ఇష్టం! నా పట్ల తను చూపించే ప్రేమ, కేరింగ్ అంటే ఇష్టం. తనని ఎంత ఇష్టపడ్డా, ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు నేను, బస్‌లో కూడా అవకాశం వచ్చినా పక్కన కూర్చునే వాడిని కాదు. అందరూ తనని ఏం అనుకుంటారో అని. తనని చూడటం, తనతో మాట్లాడటం...ఇవే నాకు చాలా మ్యాజికల్ ఫీలింగ్స్ ఇచ్చేవి. తనని మిస్ అవ్వడమే నా జీవితంలో నేను ఎప్పటికి తిరిగి పొందలేనిది, ఎప్పటికి బాధ పడే విషయం. ఆమె ముందు అన్నీ చిన్నవే అనిపిస్తుంది, ఆద్య నన్ను ఒక్కసారి అయినా లవ్ చేసిందో లేదో తెలీదు. కానీ, నేను ఇంకా బెటర్‌గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఏం అనుకున్నా తను, ఆ రోజులు మళ్లీ తిరిగి రావు. - చంద్రకాంత్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
వాడో సైకో! టార్చర్ పెట్టేవాడు..
‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ ఆడవాళ్లను ఉద్ధేశించి ఓ సినీకవి రాసిన పాట ఇది. ఈ పాట విన్నప్పుడల్లా నా మనసులో మరో పాట మెదిలేది! ‘ ప్రేమ ఎంత మధురం చెలికాడు అంత కఠినం’ అని. ఓ మగాడి బాధకు ఆడది ఎంత కారణమవుతుందో.. ఓ ఆడదాని బాధకు మగాడు కూడా అంతే కారణం అవుతాడు. నా కష్టాలకు నిలువెత్తు రూపం భార్గవ్! ఎంబీఏ చదువుతున్నపుడు పరిచయమయ్యాడు. తనది ఎంఎస్సీ! ఇద్దరం ఒకే క్యాంపస్‌లో చదువుకునేవాళ్లం. మా కాలేజ్‌లో జరిగే ఈవెంట్స్‌లో చురుగ్గా పార్టిసిపేట్ చేసేవాడు. డ్యాన్స్ చేసేవాడు, డ్రామాలువేసేవాడు. అతడంటే ఇష్టం పెరగటానికి అవికూడా ఓ కారణం అని చెప్పొచ్చు. ఓ సాంఘీక నాటకం వేయటానికి నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు యాక్టింగ్ రాదన్నా వినలేదు! పట్టుబట్టి మరీ లాక్కెళ్లారు. క్లాసులు జరుగుతున్నా ఓ గంట పాటు రిహార్సల్స్ చేసేవాళ్లం. అప్పుడే మా ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. నాటకం వేయటం అయిపోయినా మా స్నేహం కొనసాగింది. తరచు ఫోన్లలో మాట్లాడుకునే వాళ్లం. ఓ రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నపుడు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. అతనంటే నాకూ ఇష్టం కాబట్టి సరే అన్నాను. ఓ 6నెలలు ఫోన్లలోనే గడిపాం. తర్వాత అప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్లే వాళ్లం. ఇద్దరి చదువులు పూర్తయి కాలేజీనుంచి బయటపడ్డాం.. ఆ తర్వాతి నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. తనకు బుద్ధిపుట్టినప్పుడల్లా నాకు ఫోన్‌చేసేవాడు. ఇంట్లో ఉండటం వల్ల అతడి ఫోన్‌ను తీయటం సరిగా కుదిరేది కాదు. బాగా తిట్టేవాడు! ఎంత చెప్పినా నా పరిస్థితి అర్థం చేసుకునేవాడు కాదు. ఓ రోజు ఫోన్ చేసి ‘బయటకు వెళదాం రా!’ అన్నాడు. ఇంట్లో పరిస్థితి చెప్పి రావటం కుదరదన్నా. తిట్టాడు, తర్వాత ‘ నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది’ అంటూ ఏడ్చినంత పనిచేశాడు. నాకు బాధేసింది.. తర్వాత భయమేసింది. ఫోన్ పెట్టేసి ఆలోచనల్లో పడ్డా. ఓ రోజు ఫోన్ చేశాడు.. నేను వెంటనే ఫోన్ తీశా ‘నీకూ నాకు సెట్ అవ్వదు. విడిపోదాం’ అని ఫోన్ పెట్టేశాడు. నేను ఫోన్ చేసినా తీయలేదు. ఇలా నెల రోజులు.. చాలా బాధపడ్డా. ఓ రోజు రాత్రి 11 గంటలకు బాగా తాగి నాకు ఫోన్ చేశాడు. ‘ సారీ! ఆ రోజు నేను జోక్ చేశా. నువ్వంటే నాకు ప్రాణం, నిన్నెలా వదులుకుంటా’ అన్నాడు. నా మతి పోయింది! ఏం మాట్లాడుతున్నాడో అతడికైనా అర్థం అయ్యుండదు.. దాదాపు ఒంటి గంట వరకు నాన్‌స్టాప్‌గా మాట్లాడాడు. ఫోన్ పెట్టేద్దామంటే ఏమనుకుంటాడో అన్న భయం. చెవులు చిల్లులు పడ్డాయి.. కళ్లు మంటలు పుట్టాయి. అతన్ని ప్రేమించినందుకు నా మీద నాకే జాలేసింది. నేను ఎంత బిజీగా ఉన్నా అతడి ఫోన్ వస్తే మాత్రం తీసేదాన్ని. కొద్దిసేపు నవ్వుతూ మాట్లాడేవాడు.. తర్వాత కోపం.. ఏడుపు.. ఫోన్లోనే నవరసాలు పండించేవాడు. అతనితో ఫోన్ మాట్లాడటం కమల్ హాసన్ సినిమా చూసినట్లు ఉండేది. ఓ సైకోలాగా నన్ను ప్రతీరోజు టార్చర్ చేసేవాడు. మొన్న డిసెంబర్ 31నుంచి నాతో కాంటాక్ట్‌లో లేడు. విచారిస్తే బాగా తప్పతాగి ఎవరితోనో గొడవపడితే బాగా కొట్టారంట, ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ విషయం తెలియగానే నా ముఖంలో ఓ క్వచ్ఛన్ మార్క్! పీడాపోయిందని సంతోషించాలా? బాధపడాలా? - నవ్య లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఉద్యోగం లేదు.. ఎలా జీవిస్తారు..
మాది కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్ల వాలేరు గ్రామం. మా గ్రామంలో నాది తూర్పు వీధి, నేను మా ఊళ్లోని పడమర వీధికి చెందిన అరుణశ్రీ అనే అమ్మాయిని ప్రేమించాను. ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే పెద్దలకు చెప్పాం. అయితే వాళ్లు ముందు అంగీకరించలేదు. ‘నీకు ఉద్యోగం లేదు. ఎలా జీవిస్తారు’ అంటూ ప్రశ్నించేవారు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, ఇష్టమైన అమ్మాయితో వివాహం చేస్తేనే నేను సంతోషంగా ఉంటానని నచ్చచెప్పేవాడిని. అయినా పెద్దలు సుముఖత వ్యక్తం చేయలేదు. వివాహం చేసుకుంటే అరుణశ్రీనే చేసుకుంటానని.. లేదంటే వివాహం అవసరం లేదని తేల్చిచెప్పేశాను. ఇంతలోనే నాకు ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. దీంతో పెద్దలు జోరుగా పెళ్లి సంబంధాలు చూసేపనిలో పడ్డారు. నేను ముందుగా చెప్పిన విషయాన్ని పెద్దలకు స్పష్టం చేశాను. ‘మా సంతోషం ముఖ్యమా.. లేదా మీకు ఆర్ధిక అసమానతలంటూ కాలయాపన చేస్తారా?’ అని.. పదే పదే అడిగాను. దీంతో ఇరువురి పెద్దలు ఆర్ధిక అసమానతలతో పాటు అన్ని విషయాలను పక్కన పెట్టారు. దీంతో 2019 మేలో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నాము. మేము పెద్దల గౌరవానికి, వాళ్ల మనోభావాలకు, సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నాం. - గుడి రాజేష్ కుమార్, డిపో మేనేజర్, ఆర్టీసీ, అలిపిరి డిపో కులాంతర వివాహమని ఆమె ఇంట్లో ఒప్పుకోలేదు డాక్టర్ పెంచలయ్య దంపతులు మాది నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం. నాన్న వెంకటయ్య, అమ్మ సుబ్బమ్మ వ్యవసాయ కూలీలు. మా ఆవిడ చిట్టి! అనంతపురం జిల్లా వజ్రకరూర్కు చెందిన అంజనయ్య, మాణిక్యమ్మల కుమార్తె. 1986లో తిరుపతిలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివే సమయంలో చిట్టి బీఎస్సీ నర్సింగ్ చదివేది. ఆ సమయంలో మా ఇద్దరి మధ్యా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి ఇష్టాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, కులాంతర వివాహమని ఆమె ఇంట్లో ఒప్పుకోలేదు. నాలుగు సంవత్సరాలు ఆగి, ఆ తర్వాత మళ్లీ అడిగి చూశాం. మాపై నమ్మకంతో పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో లవ్ అండ్ అరెంజెడ్ మ్యారేజ్ జరిగింది. పెళ్లి జరిగిన సంవత్సరం తర్వాత ఇద్దరం ప్రభుత్వ కొలువులు సాధించాం. మాకు ఇద్దరు పిల్లలు. బాబు డాక్టర్ తేజ్‌దీప్ ఎంఎస్ జనరల్, పాప దీప్తి నాలుగో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతోంది. ప్రేమికులకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఈ కాలంలో ప్రేమ, వ్యామోహం, ఆకర్షణకు తేడా కొందరు పిల్లలకు తెలియడం లేదు. - డాక్టర్ పెంచలయ్య, డీఎంఅండ్‌హెచ్‌ఓ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆ ఊహే బాగుంది! లేకుంటే..
అది 2005! నేను 8వ తరగతిలోకి అడుగు పెట్టాను. మా క్లాస్‌లో కొత్తగా ఓ అమ్మాయి చేరింది. తను ఆగష్టు 15న పాట పాడింది. మొదటి సారిగా తను పాడుతుంటే నేను వినడం. ఎంత స్వీట్ వాయిసో తనది! మళ్లీ మళ్లీ వినాలనిపించింది. రెండు జడలు వేసుకుని చాలా క్యూట్‌గా ఉండేది. స్కూల్ వెనకే వాళ్ల ఇల్లు. రోజు స్కూల్ అయిన వెంటనే తనని ఫాలో చేసేవాడిని. సెలవులు అయితే చాలు సైకిల్ వేసుకుని వాళ్ల వీధిలో తిరగటమే నా పని. నా ప్రేమ సంగతి ఆమెకు చెప్పాలంటే భయం. టెన్త్‌లో తను జాయిన్ అయిన ట్యూషన్లోనే నేనూ జాయిన్ అయ్యా. ఎప్పుడూ ఆమెను అలా చుస్తూ ఉండి పోయే వాడ్ని తప్ప ధైర్యం చేసి చెప్పలేకపోయా. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను తనకి ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ప్రేమించే వయసు కాదని చెప్పి పంపింది. తన కళ్లను చూసినప్పుడల్లా తను నన్నే చూస్తోందని అనుకునే వాడ్ని. అలా టెన్త్ కూడా అయిపోయింది. తరువాత మేము వేరే వేరే కాలేజీలలో చేరటంతో దూరం పెరిగి పోయింది. కానీ, తను గుర్తుకు రాని రోజు లేదు. ఎప్పుడు తన ధ్యాసే. డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నపుడు తనకు పెళ్లి అయి పోయింది.ఇప్పటికీ అనుకుంటూ ఉంటా‘ ఒకవేళ తనకి చెప్పి ఉంటే నా ప్రేమను అంగీకరించి ఉండేదేమో?’ అని!(ఆ ఊహే బాగుంది లేకుంటే, నేను చెప్పి తను కాదని ఉంటే తట్టుకోలేకపోయేవాడ్ని). - మణికంఠ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆ భయం నా కోపాన్ని చంపేసింది..
2012లో బీటెక్ ఫేయిలై నేను ఇంటి దగ్గర ఉన్నా. ఏమీ తోచేది కాదు.. ఇంట్లో వాళ్లు నన్ను తిట్టని తిట్టులేదు. బాగా ఇబ్బంది పడ్డరోజులవి. ఇంట్లో దిక్కుతోచక ఓ బట్టల షాపులో పనికి కుదిరా. ఉదయం వెళితే.. రాత్రి పదయ్యేది ఇంటికి వచ్చేసరికి. పైగా తక్కువ జీతం! కానీ, తప్పలేదు. నాకు ఏపనైనా ఎక్కువ రోజులు చేయటం ఇష్టముండేదికాదు. అందుకే రోజురోజుకు నాకు పని మీద శ్రద్ధ తగ్గుతూ వచ్చేది. నాతోపాటు పనిచేసే ఓ అమ్మాయి పని మానేయటంతో పనిభారం కూడా పెరిగింది. దీంతో నేను పని మానేయాలని ఫిక్స్ అయ్యా!. అలాంటి సమయంలో షాపులో సేల్స్‌గర్ల్‌గా చేరిందో అమ్మాయి! పేరు సుహాసిని. చూడ్డానికి చాలా అందంగా ఉండేది. కానీ, నేను అంతగా తనవైపు చూసేవాడిని కాదు. అప్పుడప్పుడు అవసరం ఉన్నపుడు మాట్లాడేవాడ్ని. ఓసారి అర్జంటు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కొంత డబ్బు కావాల్సి వచ్చింది. ఎవరిని అడగాలో తెలియలేదు. షాపులో ఇదివరకే బాకీ ఉంది. అడగటానికి ఇబ్బందిపడ్డా! ధైర్యం చేసి అడిగా. ఓనర్ ఊర్లో లేడు! ఇవ్వటం కుదరదన్నాడు మేనేజర్. కొద్దిగా మనసు చివుక్కుమంది. ఏదో ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. పక్కకు చూశా..‘ మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర కొంత డబ్బుంది తీసుకోండి! తర్వాత ఇద్దరు గానీ’ అంది. ఓ పక్క అవసరం.. మరోపక్క మొహమాటం.. అవసరమే గెలిచింది. ‘వీలైనంత తొందరగా తిరిగిచ్చేస్తాను’ కాస్త బొంగురుపోయిన గొంతుతో అన్నాను. ‘పర్లేదు! మీకు వీలైనప్పుడే ఇవ్వండి’ అంది నవ్వుతూ. నాకప్పటినుంచి తనంటే గౌరవం పెరిగింది. నా చేతికి డబ్బు రాగానే తన డబ్బు తిరిగిచ్చేశాను. నాకే కాదు తను నా కళ్లముందే చాలా మందికి సహాయం చేసింది. తనపై ఉన్న గౌరవం కాస్తా! ఆరాధనగా మారింది. కొన్ని నెలలు తనను మూగగా ఆరాధించా. ఓసారి సుహాసిని ఇంటికి వెళ్లే సమయంలో నేను కూడా తన వెంట వెళ్లాను. ప్రేమిస్తున్న సంగతి చెప్పేశా! తను ఆలోచించుకుని చెబుతా అంది. మరుసటి రోజు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నా. తనురాలేదు. వరుసగా మూడు రోజులు గడిచిపోయాయి. నాకు భయం వేసింది! నా ప్రేమ సంగతి చెప్పి తనను ఇబ్బంది పెట్టాననిపించింది. నా బాధకు అడ్డులేకుండా పోయింది. ఆలోచనలతో రాత్రిళ్లు నిద్రకూడా పట్టలేదు. మరసటి రోజు నీరసంగానే షాపుకు వెళ్లా. కొద్దిసేపటి తర్వాత తను వచ్చింది. నా పెదవులపైకి చిరునవ్వులు తెచ్చింది. కొద్దిగా కోపం కూడా వచ్చింది. ఏం అయ్యుంటుందోనన్న భయం నా కోపాన్ని చంపేసింది. ‘‘ఏం జరిగింది! మూడు రోజులు ఎందుకురాలేదు. నా ప్రేమ సంగతి నీకు చెప్పి ఇబ్బంది పెట్టినందుకు సారీ! ఇకమీదట నిన్ను ఇబ్బంది పెట్టను’ అన్నాను కొంచెం బాధగా. ‘అదేం లేదు! మా అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది.’ చెప్పింది. ఆ మాటలు నాలో కొండంత ధైర్యం నింపాయి. వెంటనే నా ప్రేమ సంగతి అడగాలనిపించింది. కానీ, బాగోదని ఆగిపోయా. అప్పుడు తనే‘ ప్రేమ! గీమా అంటే మా ఇంట్లో కుదరదు. మా వాళ్లతో మాట్లాడి ఒప్పించండి.’ అంది. ఇది చాలు అనుకున్నా! మా ఇంట్లో వాళ్లను ఒప్పించి, వాళ్లింటికి తీసుకెళ్లాను. ఇది వరకే మా నాన్నకు వాళ్లతో పరిచయం ఉండటంతో మంచి ఉద్యోగం వస్తే పెళ్లి చేయటానికి అభ్యంతరం లేదన్నారు. సబ్జెక్టులు కంప్లీట్ చేయటం, ఉద్యోగంలో చేరిపోవటం అంతా చకచకా జరిగిపోయింది. 2019 నవంబర్‌లో మాకు ఎంగేజ్మెంట్ జరిగింది. మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. - నవీన్ కుంట, నంద్యాల లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
చాలా సార్లు అనిపించింది! ధైర్యం చాల్లేదు..
నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లో అభిని చూశాను. తను మా సీనియర్! చాలా అందంగా ఉండేవాడు. చూడగానే నచ్చేశాడు. ప్రతిరోజూ కాలేజీలో అతడ్ని చూసేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్దీ అతడిమీద చాలా ఆశలు పెంచుకున్నాను. నా ప్రేమ సంగతి అతని చెబుదామని లెక్కలేనన్ని సార్లు అనిపించింది! ధైర్యం చాలక ఆగిపోయాను. తను కనిపించని రోజు చాలా బాధగా ఉండేది. వేసవి సెలవుల్లో అయితే ఇంకా కష్టంగా. అందరు సెలవుల కోసం ఎదురుచూస్తే.. నేను సెలవులు ఎప్పుడు అయిపోతాయా! అభిని ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూసేదాన్ని. నేను సెకండ్ ఇయర్, తను థర్డ్ ఇయర్. తనతో ఒక్కసారైనా మాట్లాడే అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఓ రోజు తనే నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. మాట్లాడింది రెండు మాటలే అయినా చాలా సంతోషంగా అనిపించింది. చూస్తుండగానే అతడి ఫైనల్ ఇయర్ ఎండింగ్‌కు వచ్చింది. ఫేరెవల్ పార్టీలో చివరిసారిగా అతడ్ని చూశాను. తర్వాత చూడలేదు. ఐదేళ్లు గడిచిపోయింది. అయినా అతడ్ని మర్చిపోలేకపోతున్నా. ప్రతిరోజూ అతడు గుర్తుకువస్తూనే ఉంటాడు. తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. వచ్చే జన్మకైనా నా ప్రేమ ఫలిస్తుందని ఆశిస్తూ.. - సణ్ముఖి, గోపల్లె చదవండి : అయ్యో! వాలెంటైన్స్ రోజు.. ఫీల్ పోయింది.. నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది
కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మానాన్నల బలవంతంమీద ఓ మాట్రిమొనియల్ సైట్లో నా వివరాలు నమోదుచేశా. ఆ మాట్రిమొనియల్ సైట్లోనే వరుణ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. పరిచయం పెరిగే కొద్ది అతడిపై ప్రేమ పుడుతుందని భావించా. అయితే ఆ సమయంలో మానసికంగా నా ఆరోగ్యం అంతగా బాగోలేదు. నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో కూడా ఈ విషయాలు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడిని సరిగా పట్టించుకునేదాన్ని కాదు. అతడు మాత్రం నాకు తరచు ఫోన్ చేస్తుండేవాడు. ప్రేమగా మాట్లాడుతుండేవాడు. నాకు ఇష్టం లేకపోయినా ఇబ్బంది పడుతూనే మాట్లాడేదాన్ని. అతడి వైపునుంచి నాపై ఆశలు పెరుగుతూపోయాయి. నాకు మాత్రం అతడిమీద ఇష్టం కలగలేదు. దీంతో నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి, వరుణ్‌తో మాట్లాడటం మానేశాను. అయితే పూర్తిగా సంబంధాలు తెంచుకున్న రెండు సంవత్సరాల తర్వాత అతడిపై ఇష్టం మొదలైంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది. తప్పు చేశానన్న భావనలోంచి బయటపడలేకుండా ఉన్నా. ఎలాగైనా అతడ్ని కలిసి క్షమాపణ చెప్పాలనిపిస్తోంది. దానికి తోడు మా వాళ్లు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నాకు మాత్రం వరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది. అర్థం కాని విషయం ఏంటంటే అతడింకా పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నాడా? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎలా స్పందిస్తాడు? ఇలాంటి ప్రశ్నలే నా మెదడును తినేస్తున్నాయి. ఎలాగైనా అతడితో మాట్లాడాలని ఉంది. - శైలజా, చిత్తూరు చదవండి : ఆ రోజునే పెళ్లి చేసుకుంటాం! లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నా లక్! ఆమె కూడా ఆ రోజునుంచి..
2006 నా లైఫ్‌ను మార్చేసిన సంవత్సరం. అవి నేను ఇంటర్ చదువుత్నురోజులు. చాలా అల్లరిగా.. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడిని. నేనప్పటివరకు ఏ అమ్మాయినీ లవ్ చేయలేదు. ఓ రోజు లంచ్ బ్రేక్‌లో.. క్లాస్ రూంలో ఓ ఇద్దరు ఫ్రెండ్స్ చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా మీ గోల అని నేను వెళ్లి అడిగాను. వాళ్లు ఒక అమ్మాయికోసం అని చెప్పారు. ‘ఏవర్రా అమ్మాయి’ అని అడిగా. వాళ్లు ఓ పేరు చెప్పారు. ‘ఆ అమ్మాయి నాకు తెలియదు రా!’ అన్నాను. ‘చూపిస్తాము ఆగు’ అన్నారు. అమ్మాయి కోసం వేయిట్ చేస్తున్నాం. అప్పుడు వచ్చింది.. నా లైఫ్‌లోకి ఒక అమ్మాయి. అలా గేట్ వైపు చూశాను. అప్పుడే సైకిల్ దిగి నడుచుకుంటూ వస్తోంది. ఆమె కళ్లు కారు లైట్లలా ఉన్నాయి. ఆ ఒక్క క్షణంలో నా మనసును దోచేసింది. ఇంకేం ఉంది! నా లైఫ్ పట్టాలు ఎక్కింది. ఇక ప్రతీరోజు తననే చూస్తూ, తను నవ్వితే నాలో తెలియని ఆనందం. ఫైనల్‌గా క్లాస్‌లోని కొందరు వెర్రి వాళ్లు నేనా అమ్మాయికి లైన్ వేస్తున్నానని చెప్పేశారు. అదేంటో నా లక్! తను ఆ రోజునుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూ నావైపు చూస్తూ ఉండేది. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. నా మనసులోని మాట తనకు చెప్పలేకపోయా. తనే ధైర్యం చేసి ‘నన్ను లవ్ చేస్తున్నావా’ అని అడిగింది. కానీ, నేను పూర్ ఫ్యామిలీ, తనకి ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేకపోయా. కానీ, తను చాలా సార్లు నా ప్రేమను తెలిపే చాన్స్‌లు ఇచ్చింది. నేనే ఉపయోగించుకోలేకపోయా. ఇంటర్ అయిపోయింది. తను డిగ్రీ, నేను బీటెక్ జాయిన్ అయ్యాను. అప్పటికీ నేను వాళ్ల కాలేజీకి వెళ్లే వాడిని తనను చూడటానికి. అయినా నా ప్రేమను తనకు చెప్పలేకపోయా. నా లైఫ్‌లో మర్చిపోలేని అమ్మాయి తను. 2012లో బీటెక్ అయిపోయింది. బెంగళూరులో జాబ్‌లో జాయిన్ అయ్యాను. తర్వాత తెలిసింది! తనకు పెళ్లి అయిపోయిందని. ఇప్పటికీ తను నా మనసులో ఉంది. - సందీప్, ఒంగోలు లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆమె మాటలు విని నేను షాక్!
తన పేరు కౌసల్య! మెడిసిన్ చదువుతున్నపుడు మా మధ్య ప్రేమ చిగురించింది. మెడిసిన్ అయిపోయిన తర్వాత వేరు వేరు హాస్పిటల్లలో డాక్టర్లుగా జాయిన్ అయ్యాం. తరచూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. ఎంత బిజీగా ఉన్నా.. వారంలో కనీసం మూడు సార్లైనా కలుసుకునేవాళ్లం. మా ప్రేమలో నాలుగు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. చిన్నచిన్న గొడవలు, అలకలు, సర్దుకుపోవడాలు మామూలైపోయాయి. అయినా మా మధ్య ప్రేమ తగ్గలేదు. ఇద్దరివీ వేరువేరు కులాలు! పెద్ద వాళ్లను ఒప్పించటానికి కష్టపడాల్సి వస్తుందనుకున్నాం. అనుకున్నట్లుగానే జరిగింది. తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నా. మా ఇంట్లో ససేమీరా! అన్నారు. నిత్యం మా వాళ్లతో గొడవలు పడేవాడ్ని. మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోవటం లేదని కౌసల్య వాళ్ల ఇంట్లో తెలిసినప్పటినుంచి వాళ్లలో మార్పు వచ్చింది. నేను వాళ్ల ఇంటికి వెళ్లినపుడు సరిగా పలకరించేవారు కాదు. నేను మాత్రం పట్టించుకునేవాడిని కాదు. నెల రోజుల తర్వాత మా ఇంట్లో కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే తనకు ఫోన్ చేసి విషయం చెప్పా. తను మొదట నమ్మలేదు! నిజమని తెలిసి సంతోషించి. ఇంట్లో వాళ్లకు చెప్పి ఫోన్ చేస్తానంది. నేను తన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. కానీ గంటలు గడుస్తున్నా తన నుంచి ఫోన్ రాలేదు. నేను ఫోన్ చేస్తుంటే తియ్యటం లేదు. రాత్రి పడుకోబోయేముందు ఓ సారి ట్రై చేద్దామని ఫోన్ చేశా. తను ఫోన్ ఎత్తింది. నా మాటలకు సరిగా స్పందించ లేదు. ఏమైందని అడిగా.. ఏం లేదంది. చెప్పమని పట్టుబట్టే సరికి చెప్పింది. తన మాటలు విని నేను షాక్ అయ్యాను. ఈ పెళ్లి తన ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదంట. ఎందుకంటే మా అమ్మానాన్నలకు ఇష్టం లేకుండా కౌసల్యను పెళ్లిచేసుకుంటే. అత్తారింట్లో వేధింపులు తప్పవని వాళ్లు భయపడుతున్నారు. నేను వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. పెళ్లైన తర్వాత వేరు కాపురం పెడతానని కూడా మాటిచ్చాను. ఏం చెప్పినా వినే పరిస్థితిలో వాళ్లు లేరు. కొన్ని రోజులకే కౌసల్యకు వేరే వ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నేను తనని ఇంటికి తీసుకొస్తానని మా అమ్మానాన్నకు చెప్పా. వాళ్లు ఒప్పుకోలేదు. కౌసల్య అమ్మానాన్నలు ఒప్పుకుంటేగానీ, పెళ్లి జరగదని తెగేసి చెప్పారు. తన మనసులో ఏం ఉందో అడిగా.. తను మాత్రం నేనేం చేసినా తనకు ఓకే అంది. ఆ మరుసటి రోజే రిజిస్ట్రర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నాం. రెండు ఇళ్లకు దూరంగా ఇళ్లు తీసుకుని కాపురం పెట్టాం. సంవత్సరం గడిచింది. కౌసల్య ఇంట్లో వాళ్లు మాతో కలిసిపోయారు. కానీ, మా ఇంట్లో వాళ్లు సీరియస్‌గానే ఉన్నారు. మేము విడిపోయి పెద్దవాళ్లను సంతోషపెట్టగలమనే నమ్మకం నాకు లేదు. పిల్లల సంతోషం పెద్దలకు ముఖ్యం కానప్పుడు వారి గురించి ఎందుకు ఆలోచించాలి అనిపించింది. అందుకే అలా చేశా. మా వాళ్లు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. - గోకుల్ రమణ, గుత్తి -
తను నవ్వింది! బాగుందని పొగిడింది..
2008 డిసెంబర్ నెలలో సైన్స్ ఫేయిర్ కోసమని నాగలాండ్ బయలుదేరాం. విజయవాడనుంచి మా ప్రయాణం మొదలైంది. మూడు రోజుల పాటు ట్రైన్లో ప్రయాణిస్తే కానీ, మేము వెళ్లాల్సిన చోటుకు చేరుకోలేము. మొదటిసారి అన్ని రోజులు ప్రయాణించటం చాలా కొత్తగా ఉంది. సాయంత్రమే ట్రైన్ బయలుదేరింది. ఎవరి సీట్లు వాళ్లకు కేటాయించారు. ఓ రోజు ఆలోచిస్తూనే స్తబ్ధుగా గడిచిపోయింది. మరుసటి రోజునుంచి కొత్త స్నేహాలు మొదలయ్యాయి. ఆడ,మగ తేడాలేకుండా అందరం కలిసిపోయి బాగా మాట్లాడుకునేవాళ్లం. నాకు మామూలుగానే సిగ్గు ఎక్కువ. అయినప్పటికి కొంచెం ధైర్యం చేసి అందరితో కలిసిపోయాను. సాయంత్రం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం, అంత్యాక్షరి ఆడుకున్నాం. అప్పుడే ఓ అమ్మాయి మాట, పలుకు, పాట నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అప్పటివరకు నేను తన ముఖంవైపు నేరుగా చూడలేదు. అప్పుడు చూడాలనిపించి చూశా! చూడగానే నా మనసు దోచేసింది. అప్పటినుంచి ఆమె మాటలు కూడా నాకు తియ్యటి పాటల్లా వినిపించటం మొదలయ్యాయి. ఎందుకో ఒకరకమైన ఆకర్షణకు గురయ్యాను. ఏ పనీ లేకపోయినా తనకోసమే ఆమె బోగిలోకి వచ్చేవాడిని, అటు ఇటు తిరిగేవాడిని. మొత్తానికి తను కూడా నన్ను చూడటం మొదలుపెట్టింది. మరసటి రోజు సాయంత్రం మళ్లీ అందరు గ్రూపుగా అయ్యారు. సరదాగా మాట్లాడుకోవటం, పాడుకోవటం చేశారు. నేను తన ఎదురుగా కూర్చుని ఉన్నా. నేను పాడాల్సిన టైం వచ్చింది. ‘ నాలోనె పొంగెను నర్మదా.. నీళ్లలో పూసిన తామర.. అంతట్లో మారెను రుతువులా! పిల్లా నీ వల్ల’ తనవైపు చూస్తూ పాడాను. తను నవ్వింది! బాగుందని పొగిడింది. థాంక్స్ కూడా చెప్పింది.. కళ్లతో.. అది నాకు మాత్రమే అర్థమైంది. నాగాలాండ్‌లో ఉన్నన్ని రోజులు ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. అయినా ఏదీ మాట్లాడుకునే వాళ్లం కాదు. అలా పది రోజులు! టెన్ బ్యూటిఫుల్ డేస్ తనతో ఉన్నాను. సైన్స్ ఫేయిర్ అయిపోయి తిరిగి వస్తున్నపుడు చాలా బాధేసింది. ఆ రోజు రాత్రి డిసెంబర్ 31.. ట్రైన్లోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. అప్పట్లో మా దగ్గర ఫోన్లు ఉండేవి కావు. ఉన్నా ఏం లాభం ఈ పదిరోజుల్లో ఏ రోజూ మేము మాట్లాడుకోలేదు! ఏం చేస్తాం. మళ్లీ అందరూ ఓ చోట గ్రూపుగా అయ్యారు. పాటలు, ఆటలు మొదలుపెట్టారు. తనిప్పుడు నా ఎదురుగా ఉంది. ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటున్నాం. ఎందుకో సందర్భం కాకపోయినా ఓ పాట‘ అదే నువ్వు! అదే నేను అదే గీతం పాడనా..’ తన కళ్లలో భావాల్ని నేను కనిపెట్టలేకపోయాను. అది బాధో! ప్రేమో!.. ఏదో తెలియదు కానీ, నా కళ్లు కొద్దిగా చెమర్చాయి. రాత్రి నిద్ర పట్టలేదు. తనను కలిసి కనీసం వెళ్లొస్తానని కూడా చెప్పలేకపోయాను. పొద్దున లేచే సరికే తను దిగిపోయింది. నా గుండెలో కలుక్కుమన్న భావన. మాట్లాడలేకపోయానని నన్ను నేను చాలా తిట్టుకున్నా. ఇది జరిగి దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది. తన జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. తన మనసులో నా స్థానం ఏంటన్న ప్రశ్న ఇప్పటికీ నన్ను తొలుస్తూనే ఉంది. - విఘ్నేశ్, రాయచోటి -
బెస్ట్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడని తెలిసి..
డిగ్రీ అయిపోగానే జర్నలిజం చేయటానికి హైదరాబాద్‌లోని ఓ కాలేజ్‌లో చేరాను. జర్నలిజం అంటే నాకు చిన్నప్పటినుంచి ఇష్టం. కాలేజ్‌కు దగ్గరలో ఓ హాస్టల్లో ఉండేదాన్ని. క్లాసులు స్టార్ట్ అయిన కొద్ది రోజుల వరకు నాకెవరూ ఫ్రెండ్స్ అవ్వలేదు. నెల తర్వాత అందరితో నాకు మంచి బాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రాజీవ్‌తో! అతడు నా బెస్ట్ ఫ్రెండ్. అన్ని విషయాల్లో తోడుగా ఉండేవాడు. పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకునేవాళ్లం. అయినప్పటికి ఎప్పుడూ హద్దులు దాటలేదు. కించపర్చుకునేలా మాట్లాడుకోలేదు. అతనంటే నాకు అభిమానం, గౌరవం ఏర్పడింది. అతడికి కూడా నేనంటే అంతే మర్యాద. చూస్తుండగానే రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఉద్యోగాలు ఇద్దరినీ దూరం చేశాయి. ఎంత దూరం ఉన్నా మేము రెగ్యులర్‌గా ఫోన్లోనో, సోషల్ మీడియాలోనో టచ్‌లో ఉండేవాళ్లం. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే నాకు పెళ్లి జరిగింది. అతడ్ని కూడా పెళ్లికి పిలిచా! రాలేదు. తర్వాత చాలా రోజులు అతడితో నేను టచ్‌లో లేను. ఓ సంవత్సరం తర్వాత అతడే నాకు కాల్ చేశాడు. ఇక అప్పటినుంచి మేము టచ్‌లో ఉంటున్నాం. ఓ సారి మాటల సందర్భంలో ‘‘ఇంకెన్నాళ్లని ఇలా ఉంటావ్. పెళ్లి చేసుకోవా’’ అని అడిగా. అందుకు తను నన్ను ఎదురు ప్రశ్నించాడు‘‘ నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావ్?’’ అని. నేను షాక్ అయ్యాను. వెంటనే తేరుకుని‘‘ నాకు పెళ్లి చేసుకోవాలని ఉండింది. అందుకే చేసుకున్నాను’’ అని చెప్పా. దానికి అతడు ‘‘ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నేను చేసుకోను’’ అన్నాడు. అతడి మాటల్లో ఏదో బాధ తొంగిచూసింది. నాకప్పుడర్థమైంది! రాజీవ్ నన్ను ప్రేమిస్తున్నాడని. అతడు ఇన్ని రోజులు చూపించిన అభిమానం, గౌరవం నాపై ప్రేమ అని తెలిసి నా మనసులో ఏదో మూల బాధకలిగింది. ఫోన్ పెట్టేసి బాగా ఏడ్చాను. అతను చాలా మంచి వాడు. తను ప్రేమకు దూరమవ్వటానికి నేనే కారణమని తట్టుకోలేకపోతున్నా. అప్పుడు అతడి ప్రేమను అర్థం చేసుకోలేకపోయా. ధైర్యం చేసి తను కూడా చెప్పలేకపోయాడు. బెస్ట్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడని తెలిసి ఏం చేయాలో అర్థం కావటం లేదు. - మౌనిక, బళ్లారి -
ఈ సెలవుల్లో తనకు ప్రపోజ్ చేస్తా!..
ఓ రెండు కళ్లు నన్ను సంకెళ్లలా ఎటూ కదలనీయకుండా కట్టిపడేస్తాయని నేనెన్నడూ అనుకోలేదు. బస్‌లో మొదటిసారి తన కళ్లల్లోకి సూటిగా చూసేవరకు. ఆమె చూపు మరల్చినా నేనుమాత్రం ఆమె వైపు నుంచి నా చూపు తిప్పుకోలేకపోయాను. కొద్దిసేపటి తర్వాత ఎవరో పిలిచినట్లై వెనక్కుతిరిగాను. వెనకాల మా మామయ్య.. ‘ఏంట్రా ఊరికేనా?’ అడిగాడు. అవునని చెప్పా. మామయ్య నాతో మాట్లాడుతున్నా.. అవేవీ నాకు వినిపించటంలేదు. నా ధ్యాసంతా ఆమెమీదే ఉంది. ‘ ఊరొచ్చింది, ముందుకు పద’ అంటు దారి తీశాడు మామయ్య. నేను ఆమెకోసం వెతికాను. తను కూడా పుట్‌బోర్డు దగ్గరకు నడిచింది. అంటే తనది కూడా ఈ ఊరే అనుకున్నా మనసులో. తను ముందు నడుస్తుంటే మామయ్యతో పాటు నేను ఆమె వెకనాల నడుస్తున్నా. తన ఇళ్లు కూడా మామయ్యవాళ్ల ఇంటి దగ్గరే. సాయంత్రం వరకు తన కోసం వాళ్ల ఇంటివైపు చూస్తూ ఉన్నా! కానీ, ఆమె బయటకు కూడా రాలేదు. ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నాను. తన పేరు భాను అని తెలుసుకోవటానికి రెండు రోజులు పట్టింది. కొద్దిరోజుల తర్వాత తనతో పరిచయం పెంచుకున్నాను. ప్రతిరోజూ బాగా మాట్లాడుకునే వాళ్లం. మా మధ్య స్నేహం పెరిగింది. ఆ రోజు ఊర్లో జాతర జరుగుతోంది. ఊరంతా చాలా సందడిగా ఉంది. వాళ్లిళ్లు మా ఇళ్లు బంధువులతో నిండిపోయాయి. మేము కలుసుకోవటానికి, మాట్లాడుకోవటానికి కుదరలేదు. ఆ రాత్రి ఊర్లో ఆర్కేస్ట్రా జరిగింది. అక్కడికి తను కూడా వచ్చింది. ఆ రాత్రి భానును చూస్తూ పాటలు వినడం కొత్తగా ఉంది. తను కూడా నన్ను చూస్తోందన్న సంతోషం మరింత కొత్తగా ఉంది. ‘ కొంటె చూపుతో.. ఓ కొంటె చూపుతో .. నా మనసు మెల్లగా చల్లగా దోచావే..’ అంటూ మనసులో పాట పాడుకున్నా. నేను ఊర్లో ఉన్నన్ని రోజులు ఇట్టే గడిచిపోయాయి. భానుతో స్నేహం మరింత పెరిగింది. తనను వదిలి రావాల్సి వచ్చినపుడు చాలా బాధేసింది! అక్కడినుంచి కదలేకపోయాను. పోయిన సంక్రాంతి సెలవుల్లో నా ప్రేమ కథ మొదలైంది. తర్వాత ఆ ఊరు వెళ్లలేదు. ఈ సారి వేసవి సెలవులకు నా ప్రేమను ఆమెకు తెలియజేస్తా! కచ్చితంగా ఒప్పుకుంటుందని... - వినయ్, కొత్తపేట -
ఈ ప్రేమికులరోజున కూడా అదే చేస్తాం..
నాకు మా మామయ్య ఆది నారాయణ అంటే చాలా ఇష్టం. ఆయన చిన్న కూతురు దుర్గ శ్రీ అంటే చెప్పలేని ప్రేమ. తను ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను తనకి ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేయగానే నా వైపు చాలా కోపంగా చూసింది. ‘నువ్వంటే నాకూ ఇష్టమే! కానీ, మా నాన్నని అడుగు’ అంది. నాకు మా మామయ్యను నేరుగా అడిగేంత ధైర్యం లేదు. ఆయనను అడిగితే ఏం అంటాడేమోనని భయమేసింది. ఒక సారి మా మామయ్య పెద్ద అల్లుడు శ్రీను అన్నతో అడిగించాను. అప్పుడు మామయ్య అన్నాడట ‘వాడంటే నాకూ ఇష్టమే’ అని. ఈ విషయమే అన్న నాకు చెప్పాడు. ఇక నా ఆనందానికి అవధులు లేవు. తను కూడా నా ప్రేమని అంగీకరించింది. మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు. తనకి ఓ వాలెంటైన్స్ డేన చాక్లెట్ ఇస్తే వద్దు అంది. ‘ఎందుకు వద్దు’ అని అడిగాను. అప్పుడు ఇలా అంది ‘ప్రతి ప్రేమికుల దినోత్సవం రోజున ఒక 5గురు అనాథ పిల్లలకి భోజనం పెడదాం’ అని. అప్పుడు నేను తనని హగ్ చేసుకుని ‘చాలా మంచి ఆలోచన’ అని చెప్పి ‘అలానే చేద్దాం’ అన్నాను. అప్పటినుండి ప్రతి వాలెంటైన్స్ డేకు ఐదుగురు అనాథ పిల్లలకి భోజనం పెట్టేవాళ్లం. ఈ వాలెంటైన్స్ డేన కూడా అలానే చేస్తాం. - సుబ్బు, పెద్ద దేవరంపాడు చదవండి : ప్రేమను వ్యక్తపర్చడానికి ఇదే మంచి మార్గం! ప్రేమలో ఉన్న వారికి కచ్చితంగా గుర్తొచ్చేవి! -
నీతో కలిసి రోడ్డు మీద అడుక్కుతినాలా?
సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం మొదలైంది నా తొలిప్రేమ. తన పేరు లక్ష్మీ ప్రియ, మా దగ్గరి బంధువు! మరదలవుతుంది వరుసకు. మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే మొదటిసారి చూశాను ప్రియని. చూడగానే నచ్చేసింది. తనతో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని ఉండేది. పెళ్లికాని అమ్మాయితో చనువుగా మాట్లాడితే బంధువులు ఏమనుకుంటారోనని ఆగిపోయేవాడిని. కానీ, వీలైనన్ని ఎక్కువసార్లు ఆమెను చూడటానికి ప్రయత్నించేవాడిని. ఎవరికీ అనుమానం రాకుండా ఫాలో అయ్యేవాడిని. నేను ఫాలో అవుతున్నట్లు ప్రియకు తెలిసిపోయింది. తనకూడా నన్ను చూసేది. ‘‘ఫంక్షన్లకు ఎంతో మంది బంధువులు వస్తుంటారు.. పోతుంటారు.. సన్నీగాడు లోకల్’ అనుకున్నా మనసులో. ధైర్యం చేసి మొదటిమాట మాట్లాడా‘ మీ అమ్మ పిలుస్తోంది’ అని. ఆ తర్వాత మరింత ధైర్యం తెచ్చుకుని మరో మూడు ముక్కలు మాట్లాడా. మొదటిది తను టీ నా చేతికిచ్చినపుడు‘‘ థాంక్స్’’ అని.. రెండోది భోజనాల సమయంలో అన్నం ఎక్కువగా వడ్డిస్తోంటే.. ‘చాలు’ అని.. చివరగా ఫంక్షన్ అయిపోయి ఇంటికి వెళుతూ.. ‘వెళ్లోస్తాను’ అంటే సరేనని. ప్రియ వెళ్లిపోయిన తర్వాత నా మనసు మనసులో లేదు. ప్రతీరోజు తనగురించే ఆలోచించేవాడిని. అలాంటి సమయంలో ఓ రోజు తననుంచి ఫోన్ వచ్చింది. నేను మొదట గుర్తు పట్టలేదు. తర్వాత ప్రియ అని తెలిసి, ఊపిరి ఆడనంత పనైంది. ఎలాగోలా మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ తర్వాతి నుంచి ప్రతిరోజూ నేను ఫోన్ చేసేవాడిని. కొద్దిరోజులకే మా మధ్య స్నేహం బలపడింది. మా రెండు కుటుంబాల ఫంక్షన్లనో తరచూ కలుసుకునేవాళ్లం. నా ప్రేమను ఎలా చెప్పాలా అనుకుంటున్న సమయంలో తనే నాకు ‘ఐ లవ్ యూ’ చెప్పింది. ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రేమలో నాలుగు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఈ నాలుగు సంవత్సరాలలో ఆర్థికంగా మా కుటుంబం బాగా వెనకబడిపోయింది. అక్కపెళ్లి చేయటంతో అప్పుల్లో కూరుకుపోయాం. వడ్డీలు కట్టడానికి ఉన్న పొలంలో చాలా భాగం అమ్మాల్సి వచ్చింది. బంధువులందరికీ ఈ విషయం తెలిసిపోయింది. తలో రకంగా అనుకోవటం మొదలుపెట్టారు. నేను ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాను. ప్రియతో మాట్లాడటం తగ్గించేశాను. తను కూడా పెద్దగా నా గురించి పట్టించుకునేది కాదు! నేను ఫోన్ చేయకపోతే’ ఎందుకు ఫోన్ చేయలేదు’ అని అడిగేది కూడా కాదు. ఫోన్ చేసినపుడు మాత్రం బాగానే మాట్లాడేది. ఓ రోజు దూరపు చుట్టం ఒకరు మా ఇంటి కొచ్చాడు. మాటల సందర్భంలో ప్రియను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. తను నన్ను కాదని వేరే వాడ్ని చేసుకోదనుకుని పెద్దగా పట్టించుకోలేదు. మేము మాట్లాడుకుంటున్నపుడు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కొన్ని రోజుల తర్వాత తనకు పెళ్లి నిశ్చయమైనట్లు తెలిసింది. తనను అడిగితే అలాంటిదేమీ లేదంది. ఆ కొద్దిరోజులకే ప్రియ నిశ్చితార్థానికి మా కుటుంబానికి పిలుపొచ్చింది. నా దిమ్మతిరిగిపోయింది. షాక్‌నుంచి తేరుకోవటానికి చాలా సమయం పట్టింది. వెంటనే తనకు ఫోన్ చేశాను. స్విచ్ఛాఫ్ వచ్చింది. నిశ్ఛితార్థం అయిపోయిన తర్వాత ఫోన్ కలిసింది. నిశ్చితార్థం గురించి అడిగా..సరిగా స్పందించలేదు. క్యాన్సిల్ చేసుకోమన్నాను. ‘‘ నీతో కలిసి రోడ్డుమీద అడుక్కుతినమంటావా’’ అంది. నాకేం అర్థం కాలేదు. ఏంటని అడిగా.. ‘‘ ఉన్న ఆస్తి పోయింది. నువ్వే ఇప్పుడు ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు. నేను మీ ఇంట్లో అడుగుపెట్టి సంతోషంగా ఎలా ఉండగలను. నన్ను అర్థం చేసుకో! ఇకపై ఫోన్లు చేయటం మానేయ్’’ అని ఫోన్ కట్ చేసింది. నా మనసు ముక్కలైంది. - సన్నీ, హైదరాబాద్ -
ఆమెతో మాట్లాడటం నా భార్యకు నచ్చడంలేదు
నేను మా ఊర్లో స్కూలింగ్ కంప్లీట్ చేసి, ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లాను. ఒక రెండు సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా నాతో స్కూల్లో చదువుకున్న అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టాను. అలా చాలా రోజులు మాట్లాడుకున్నాం. తను నాకు మంచి ఫ్రెండ్ అయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కోపంగా ఉన్నా.. బాధ అనిపించినా తనతోనే పంచుకునేవాడిని. తనతో మాట్లాడకుండా ఒక రోజైనా ఉండేవాడిని కాదు. నాలైఫ్‌లో జరిగిన ప్రతీచిన్న విషయాన్ని తనతో పంచుకునే వాడిని. తను నాతో మాట్లాడకపోతే మరుసటి రోజు నేను తనని తిట్టేవాడిని. తనునాకు చాలా సపోర్టివ్‌గా ఉండేది. చాలా కేరింగ్‌గా ఉండేది. నేనంటే తనకు ఇష్టం.. తనంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు నా మరదలితో ఎంగేజ్మెంట్ అయింది. అప్పటికి కూడా తనతో చాలా క్లోస్‌గా ఉండేవాడిని. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. నేను తనని ముద్దగా సెల్ఫీ అని పిలిచేవాడిని. నా ఎంగేజ్మెంట్కి, పెళ్లికి మధ్యకాలంలో మరింత క్లోజ్ అయ్యాం. మ్యారేజ్ తర్వాత మాట్లాడుకోవటం మంచిది కాదని చెప్పేవాడిని. తను మాత్రం ఎంగేజ్మెంట్కు ముందు ఎలా ఉండేవాళ్లమో అలానే ఉండాలి అనేది. తనతో మాట్లాడటం మా భార్యకు నచ్చనం లేదు. తనకు తెలియకుండా మాట్లాడుతూ ఉండేవాడ్ని. కానీ, తను మాత్రం ప్రతీదానికి అలగటం నువ్వు మారిపోయావ్ అని గొడవ పెట్టడం చేసేది. ఏం జరిగినా తను ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకుని పెట్టుకుని అలగటం మొదలుపెట్టేది. తను చేసేది నాకు కోపం వచ్చి గట్టిగా అరిచేవాడిని. మూడు నెలలక్రితం కూడా అదే జరిగింది. తను ఏమనుకుందో ఏమో నాతో మాట్లాడటం మానేసింది. నేను తనను చాలా మిస్ అవుతున్నా. ఎక్కడ ఉన్నా తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.. .. నీ చిన్నా -
శేషు ప్లీజ్ వెళ్లిపో!..
తన పేరు లక్ష్మి! ప్రైవేట్ జాబ్ చేసేది. మా ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. దీంతో మేము బాగా మాట్లాడుకునేవాళ్లం. కానీ, ఎప్పుడు కూడా లవ్ చేస్తున్నానని తనకు చెప్పలేదు. అప్పుడప్పుడు ‘ఐ లవ్ యూ’ అని లిప్ మూవ్మెంట్ ఇచ్చేవాడిని. అది చూసి ఏమీ అనేది కాదు. తర్వాత తను జాబ్ మానేసింది. అలా కొన్ని నెలల తర్వాత ఓ రోజు ‘నీ తో ఓ విషయం చెప్పాలి’ అన్నాను తనతో. ఆ వెంటనే ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పేశాను. ‘ఏంటి వినబడలేదు! ఏమంటున్నారు’ అని నాతో మూడు సార్లు ఐ లవ్ యూ చెప్పించుకుంది. తర్వాత తను అన్న మాటకు నీరసం వచ్చింది. ‘ ఇది చెప్పటానికి ఇంత టైం పట్టిందా. ఎంత ఎదురుచూస్తున్నానో’ అంది. తను ప్రతి రోజూ చాల చక్కగా తయారయ్యేది. నాకు బొట్టుబిళ్లలంటే చాలా ఇష్టం. చాలా ప్యాకేట్లు ఇచ్చేవాడిని. తనతో ఏ రోజూ కూడా తప్పుగా ప్రవర్తించలేదు. బయట ఎక్కడికీ వెళ్లలేదు. ఒకరోజు మా ఫ్యామిలీల మధ్య గొడవైంది. దాంతో తను నాతో మాట్లాడటం మానేసింది. ‘నీకు నాకు మధ్య గొడవలేమీ లేవు కదా!’ అన్నా నేను. ‘వద్దు! ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది’ అని మాట్లాడేది కాదు. అలా నన్ను చూస్తూ ఉండేది అంతే. మా ఇంటి పనిమనిషికి మా ప్రేమ విషయం తెలుసు. గొడవలు అయినపుడు మా విషయం మా వాళ్లకు చెప్పేసిందనుకుంటా! నా మీద నిఘా పెట్టారు. ఈ లోపు వాళ్ల ఫాదర్ రిటైర్ అయ్యాక సడన్‌గా వేరే ఏరియాకు షిఫ్ట్ అయ్యారు. నేను ఫాలో అవుదాం అని బయటకు వెళ్తుంటే అమ్మ చూసి ‘ఎక్కడికి.. తర్వాత వెళ్లొచ్చు! వచ్చి కూర్చో’ అంది. అలా వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. తనని మిస్ అయ్యా. చాలా వెతికాను! కొన్ని నెలలకి వాళ్లు ఉండే హౌస్ దొరికింది. నన్ను చూసి ఎంతో సంతోషించి నవ్వింది. ఎలా ఉన్నారని అడిగింది. ఈ లోపు వాళ్ల చెల్లి వచ్చేసింది. వాళ్ల వాళ్లని పిలిచింది. తను ‘శేషు ప్లీజ్ వెళ్లిపో!’ అంది. నేను ఇంటికి వచ్చేశా. తరువాత ఎన్నో సార్లు వాళ్ల వీధిలోకి వెళ్లా. ఎప్పుడూ బయట ఉండేది కాదు. అలా ఒకరికి ఒకరం ఇష్టపడ్డా ఫ్యామిలీల వల్ల వేరయ్యాం. తను ఎక్కడవుందో తెలియదు. మ్యారేజై ఉంటుంది. ‘శేషు! నీ నవ్వు, నువ్వు ఏమిటో.. ఎందుకో..’ అని తను దీర్ఘం తీస్తూ అనే మాటలు ఇప్పటికి మర్చిపోలేదు. ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నా. .. నీ శేఖర్ చదవండి : ప్రేమ ప్రయోగం నా కొంపముంచింది! -
ప్రేమ ప్రయోగం నా కొంపముంచింది!
నేను డిగ్రీ చదువుతున్న రోజులు. ఇంటర్ తర్వాత డిగ్రీకి మా ఊరు నుంచి టౌన్‌కు డైలీ అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చింది. కొత్తలో బస్‌స్టాండ్‌లోకి.. ముఖ్యంగా నలుగురు ముందుకు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాన్ని. అలా రోజులు గడిచిపోతున్నాయి. నాకు చిన్నప్పటినుంచి హీరో సూర్య అంటే చాలా ఇష్టం. అతడి సినిమాలు బాగా చూసేవాడ్ని. సూర్య సన్ఆఫ్ కృష్ణన్ సినిమాను డీవీడీలో ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. ముఖ్యంగా అందులోని ట్రైన్ సీన్ నన్ను బాగా ఆకట్టుకుంది. నాకప్పుడు అనిపించింది.. ఓ అమ్మాయి వైపు చూడగానే ప్రేమలో పడతామా అని! ఆలోచించాను.. మరీ ఎక్కువగా ఆలోచించి జుట్టుపీక్కోవటం ఇష్టంలేక ఓ నిర్ణయానికి వచ్చాను. ఎవరైనా ఓ అందమైన అమ్మాయి మీద ప్రయోగం చేద్దామనుకున్నాను. అప్పుడప్పుడు మా బస్సులో కనిపించేది ఓ అమ్మాయి.. మా కంటే సీనియర్! అప్పుడు తను ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె అయితే బాగుంటుంది అనుకున్నాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ రోజు బస్సులు ఆలస్యంగా వచ్చాయి. వెంటవెంటనే రెండు బస్సులు రావటంతో అందరూ ముందుగా కదిలే బస్సు ఎక్కి వెళ్లిపోయారు. వేళ్ల మీద లెక్కపెట్టే మందిమి మాత్రమే రెండో బస్సులో ఉన్నాము. అందులో ఆమె కూడా ఉంది. వెన్నెల రాత్రిలో.. బస్సులోకి చల్లగా వీస్తోంది గాలి. అంతా ఓ కళలా ఉంది! తను ఎడమ వైపు ఉండే సీట్లో నా ముందుగా కూర్చుంది. ఆమె వైపే చూస్తూ ఉండిపోయాను. ఎంత సేపు చూస్తూ ఉన్నానో నాకు తెలియదు.. గంట ఇట్టే గడిచిపోయింది. అంతలోనే నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది. అయిష్టంగానే దిగివెళ్లిపోయాను కానీ, తనంటే అప్పటినుంచి ఇష్టం ఏర్పడింది. ఇక ప్రతి రోజూ తన కోసం బస్సు వెతికే వాడ్ని. తను రోజూ వచ్చే బస్సుకే నేను కూడా ఎక్కేవాడ్ని. ఒక వేళ తను ఆ బస్సుకు రాకపోతే! మధ్యలో బస్సు దిగి ఆమె వస్తుందనే నమ్మకం ఉన్న వేరే బస్సు ఎక్కేవాడ్ని. తను కనిపించపోతే ఏదోలా ఉండేది. కొన్ని నెలల తర్వాత నేను తనని చూస్తూన్నానని తనుకు కూడా తెలిసిపోయింది. ఎవరా! అని నన్ను చూడటం మొదలుపెట్టింది. నేను కొద్దిగా ధైర్యం చేసి తన సీటు పక్కగా నిలబడటం, లేదా ఆమె దగ్గరిగా ఉండే సీట్లో కూర్చోవటం చేసేవాడ్ని. కొన్ని రోజుల తర్వాత తను కనిపించలేదు. ఎందుకని ఆరా తీస్తే! ఫైనల్ సెమిస్టర్ ఎక్షామ్ అని.. ఆ తర్వాతినుంచి తను రాదని తెలిసింది. అంతే! నా మనసు మనసులో లేదు. రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. నాకు మొదటిసారి మా హీరో మీద కోపం వచ్చింది.. ప్రేమ ప్రయోగం నా కొంపముంచిందనిపించింది. ఓ వారంరోజుల తర్వాత తను కనిపించింది. అదే తనని చివరి సారి చూడటం. తను కనిపించని రోజులు నేను పడ్డ బాధ ఆ దేవుడికే తెలుసు ఆ బాధనుంచి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది. ఇంకెప్పుడూ ప్రేమ ప్రయోగాల జోలికి పోకూడదనిపించింది. - శేషు, చెన్నై -
‘మీ ఆయనకు విడాకులిచ్చేయ్..’
2017లో డిగ్రీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నా. అప్పుడే ఆర్ఆర్బీ పోస్టులు పడితే అప్లై చేసి కోచింగ్ తీసుకుంటున్నాను. కోచింగ్ సెంటర్లో చేరినపుడు స్టడీ.. హోమ్ తప్ప ఇంకేమీ ఉండేది కాదు. ఆ ఇన్స్టిట్యూట్లో చాలా మంది నాకు ప్రపోజ్ చేశారు. బట్ పెద్దగా పట్టించుకునేదాన్ని కాను. ఓ రోజు మధ్యాహ్నం ఒక అబ్బాయి నాతో మాట్లాడటానికి ట్రై చేశాడు. సైన్స్ బుక్ గురించి అడుగుతున్నాడు.. మా ఫ్రెండ్ రెస్పాండ్ అవుతోంది‘ మేము తీసుకోలేదు.. వేరే వాళ్ల దగ్గర జిరాక్స్ ఉంది తీసుకోండి’ అంది. తర్వాత తను నాకు సైట్ కొడుతున్నాడని తెలిసింది. ఓ రోజు ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ ఐడీలు అడిగాడు. ఇవ్వాలా? వద్దా? అనుకున్నా.. తను ఫ్రెండ్లీగా అడుగుతున్నాడేమో అనుకుని చెప్పేశా. తర్వాతి రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేశాడు. ‘హాయ్’ అని. అలా పరిచయం మొదలైంది. ఎంతో రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడేవాడు. కొన్ని రోజుల తర్వాత ప్రపోజ్ చేశాడు. నేనపుడు ఒప్పుకోలేదు. తను ఏప్రిల్‌లో ప్రపోజ్ చేస్తే నేను డిసెంబర్లో ఓకే చెప్పాను. ప్రేమించుకున్నప్పటికి ఎప్పుడు కూడా మేము బయట తిరగలేదు! కాల్స్, చాటింగ్స్ అంతే.. తనకు డిసెంబర్లో జాబ్ వచ్చి వెళ్లిపోయాడు. మా మధ్యలో అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది కాదు. ఏదో మాట్లాడుకున్నామా అంతే! అలా మా రిలేషన్లో గొడవలు కూడా అయ్యేవి. ఒకసారి ఓ నెల రోజులు ఏమీ మాట్లాడుకోలేదు. తర్వాత మాట్లాడుకున్నాం. ఇంట్లో వాళ్లు నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తనకు చెప్పా! పెద్దగా రియాక్ట్ కాలేదు. ‘ అనవసరమైన విషయాలు నాకెందుకు చెబుతున్నావ్!’ అన్నాడు ఒకసారి. ఆ రోజునుంచి నేను తనతో మ్యాచెస్ గురించి చెప్పటం మానేశాను. కొన్ని రోజులకు నాకు పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి కుదిరిన రెండురోజులకు తనకి మెసేజ్ చేశా. శుభాకాంక్షలు చెప్పాడు. ఏమీ అనలేకపోయా! తర్వాతి రోజు నాతో‘ మ్యారేజ్ క్యాన్సిల్ చేస్కో! నువ్వు నాకు కావాలి.’ అనటం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు ఏమైంది అనుకున్నా మనసులో. నిజానికి తనంటే నాకు కూడా ఇష్టమే.. తనే చాలా నార్మల్‌గా ఉండేవాడు మా రిలేషన్లో. నేను కూడా అలాగే ఉండేదాన్ని. ‘నేనిపుడు ఏమీ చేయలేను! ఇప్పుడంతా అయిపోయింది. మా వాళ్లు అబ్బాయి వాళ్లకు డౌరీ కూడా ఇచ్చేశారు. అందరికీ చెప్పేసుకున్నారు. నాకసలు ఈ పెళ్లి ఇష్టంలేదు. కానీ, మా వాళ్లు బలవంతపెట్టేసరికి ఒప్పుకోవల్సి వచ్చింది’ తనకు అంతా క్లియర్‌గా చెప్పేశాను. అతను చాలా ఏడ్చాడు! సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. కానీ, నా పెళ్లి అయిపోయింది. నేనిప్పుడు ఢిల్లీలో ఉంటున్నా. ఓ రోజు ఓ ఈవెంట్ ఉంటే ఊరికి వచ్చాను. ఆ విషయం తెలుసుకుని ఆ ఈవెంట్‌కు వచ్చేశాడు. నేను ఆటో దిగేసరికి అక్కడ ఉన్నాడు. ‘అతనేంటి ఇక్కడ’ అని షాక్ అయ్యాను. ‘నీతో కొంచెం మాట్లాడాలి! బైక్ ఎక్కు బయటకు వెళదాం’ అన్నాడు. నేను వినిపించుకోలేదు. అతన్ని వెళ్లిపోమని చెప్పి లోపలికి నడిచా. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. మా స్నేహితులు వార్నింగ్ ఇద్దామనుకున్నారు. మేము బయటకు వచ్చేలోపు వెళ్లిపోయాడు. చాలాసార్లు కాల్ చేశాడు. ఏంటో అని నేను లిఫ్ట్ చేశా. ‘నాకు నువ్వు కావాలి. నువ్వులేకుండా ఉండలేను’ అని చెప్పుకుంటుపోయాడు. నేను నచ్చచెప్పటానికి ఎంతో ట్రై చేశా. వాడికి తెలుసు.. వాడంటే నాకు చాకు చాలా ఇష్టం అని. ఆ రోజు మాకు గొడవ కాకుండా ఉండిఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదేమో.. వాడు ఇప్పుడు ఇస్తున్న ప్రాధాన్యత, చూపిస్తున్న ప్రేమ అప్పుడు చూపించి ఉంటే అసలు ఈ పెళ్లి జరగకపోయేది. మ్యారేజ్ గురించి చెప్పినా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని అడిగా. ‘నాకు నీపై నమ్మకంరా నువ్వు వేరే మ్యారేజ్ చేసుకోవని, అందుకే రియాక్ట్ కాలేదు. సరే నా తప్పు ఒప్పుకుంటున్నా. ఇప్పుడు పెళ్లి చేసుకుందాంరా! మీ ఆయనకు విడాకులు ఇచ్చేయ్’ అన్నాడు. వాడిని చూస్తుంటే ఏం చేసుకుంటాడో అని భయం వేస్తోంది. ‘ సరే చేసుకుందాం. నువ్వేమీ చేసుకోకు’ అన్నా. అప్పటినుంచి పిచ్చిపిచ్చిగా చేయటం మానేశాడు. నేను ఇప్పటికీ చెబుతూనే ఉన్నా మన మ్యారేజ్ జరగదురా అని కానీ తను అస్సలు అర్థం చేసుకోవటం లేదు. డైలీ ఏదో ఒకటి చేసుకుంటున్నాడు.. ఏడుస్తున్నాడు. ఎప్పుడైనా వీడియో కాల్ చేస్తే! చాలా ఎమోషనల్ అయిపోతాడు. వాడికి ఎలా నచ్చచెప్పాలో అర్థంకావటం లేదు. పోనీ మొత్తానికే వదిలేద్దామనుకుంటే ఏమన్నా చేసుకుంటాడేమోనని భయం. ఏమైనా అంటే ‘నువ్వు నా దానివి అంతే’ అంటాడు. తను కోరుకున్న చిరునామా తనది కాదని చెప్పినా అర్థంకాదు. నేను మా భర్తతో దిగిన ఫొటోలు ఎఫ్బీలో చూసినపుడు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ ఫొటోలు తీసేదాకా ఊరుకోడు. వాడికి కోపం ఎక్కువే.. ప్రేమ ఎక్కువే. చాలా సార్లు చెప్పా‘ నీకు మంచి జాబ్ ఉంది. పెళ్లైన అమ్మాయిని చేసుకోవల్సిన అవసరం ఏముంది. చక్కగా వేరే అమ్మాయిని చేసుకో.. నువ్వు అనుకుంటున్నవి ఏవీ జరగవు’అని. నాకు పెళ్లైందన్న మాట వింటేనే అతడికి చాలా కోపం వస్తుంది. ‘ నా దృష్టిలో నీకు ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు ఆ టాపిక్ తీయకు’ అంటాడు. ‘ ఈ ప్రేమ మనం ప్రేమించుకునే సమయంలో చూపించాల్సింది. ఇప్పుడుకాదు’ అంటే. ‘ అపుడు నువ్వు నాతోనే ఉంటావనుకున్నా’ అని అంటాడు. ఏది ఏమైనా వాడికి ఇంకా అర్థం కావటం లేదు. రీసెంట్గా మిర్రర్ పగులగొట్టి చెయ్యి మొత్తం కోసుకున్నాడు. అర్థం చేసుకోవట్లేదు. నా మాట అస్సలు వినటం లేదు. ఈ విలువలు కట్టుబాట్లు తెంచుకుని నీ కోసం రాలేనురా! నన్ను క్షమించు.. దయచేసి నాపై కాకుండా నీ కెరీర్‌పై దృష్టి పెట్టు. నీకు మంచి వైఫ్ వస్తుంది. ఇదంతా నీకు అర్థం కావాలని కోరుకుంటున్నా. .. నీ లవ్లీ స్వీటీ -
నన్ను కాదని పెళ్లైన వ్యక్తి మాయలో..
నేను హైదరాబాద్‌లో ఓ ఇంట్లో అద్దెకి ఉండేవాన్ని. ఆ ఇంట్లో నేను పై పోర్షన్లో ఉండేవాన్ని.. క్రింద ఉన్న ఓ పోర్షన్లో ఓ అమ్మాయి ఉండేది. తను అప్పుడే ఎంబీఏ జాయిన్ అయ్యింది. నేను కాంట్రాక్టు వర్క్ మీద బాన్సువాడకి పోయాను. అప్పడు తను చేసిన కాల్‌తో మా మధ్య పరిచయం ఏర్పడింది. చిన్న పరిచయం కాస్తా స్నేహంగా మారింది. మొదట్లో నేను వద్దనుకున్నా కానీ, ఆమె చూపించే ప్రేమకి నేను కూడా పడిపోయాను. ఈ లోపు ఎలా మారిందో తెలియదు కానీ స్నేహం కాస్తా నా వైపు నుంచి ప్రేమగా మారింది. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంతగా అంటే తెలియకుండానే రోజులు గడిచిపోయాయి. మా కబుర్లకు గంటలు కూడా సెకన్లలా గడిచిపోయేవి. తనకి దేవాలయాలు అంటే చాలా ఇష్టం! నన్ను అన్ని టెంపుల్స్‌కి తిప్పేది. నాతో చేయించని పూజలు లేవు. ఒకరిని విడిచి ఒకరం ఉండలేని అనుబంధం మా మధ్య ఏర్పడింది. తెలియకుండానే ఒకరంటే ఒకరికి ప్రాణమైపోయాం. ఏ దేవుడు మమ్మల్ని విడదీయలేడు అనుకున్నా. నా రోజు తన మాటతోనే మొదలవుతుంది.. ముగుస్తుంది. ఎంత బిజీగా ఉన్నా.. నాకు ఐ లవ్ యూ, గుడ్ నైట్ చెప్పనిదే పడుకునేది కాదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకుందామని చాలా సార్లు అనుకున్నాం. ఒకసారి టెంపుల్‌కి వెళ్లాం. కానీ, వేరే కారణం వల్ల తిరిగి వచ్చేశాము. నా ఫోన్ కలువకుంటే తను మా ఫ్రెండ్స్‌కి చేసేది. అంతగా ఇష్టపడేది. తను మా ఇంట్లో వాళ్లతో.. మా బంధువులందరితో మాట్లాడేది. నన్నే పెళ్లి చేసుకుంటానని అందరికీ చెప్పేది. ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అలానే దాచుకున్నాను. ఎంగేజ్మెంట్ అయ్యాక వేరే అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటానని తనే అన్నది. అవన్నీ మరచిపోని అనుభూతులు. తన ఎంబీఏ కంప్లీట్ అయ్యాక కొన్ని రోజులకి తనకు జాబ్ వచ్చింది. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత జాబ్ చేయటం ఇష్టం లేదంది. ‘మొదట్లో ఎక్కడైనా అలానే ఉంటది’ అని చెప్పి నేనే పంపించాను. అదే నేను చేసిన మిస్టేక్.. తన మీద నమ్మకం చాలా ఉండేది. ఆఫీస్‌కు పోయినప్పటి నుండి ఇంటికి వెళ్ళేదాక ఎప్పుడు టైం దొరికినా కాల్ చేసేది. ప్రశాంతంగా సాగిపోతున్న నా ప్రేమ కథలోకి వచ్చిందో ప్రమాదం. ఆఫీస్‌లో పని చేస్తున్న ఓ పెళ్లైన వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి అంత వయస్సు ఉన్న కూతురు.. ఒక అబ్బాయి ఉన్నాడు. కానీ, అతడి ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండదు. అదే తనకి కలిసి వచ్చింది. వాళ్ల మధ్య ఏ బంధం లేదని తను చెబితే నమ్మాను. నేను కూడా అసలు అలా అనుకోలేదు కొన్ని రోజులు. కానీ తను ఫస్ట్‌లో తండ్రి లాంటి వ్యక్తి అంది. పోను పోనూ వాళ్ల మధ్య బంధం దగ్గర అవుతూ.. మా మధ్య బంధం దూరం అవుతూ వచ్చింది. నేను ఫోన్ చేసిన ప్రతీసారి కాల్ వెయిటింగ్ అని వచ్చేది. అడిగితే అమ్మ అనేది. నా కాల్ కట్ చేసి ఆఫీస్‌లో బిజీగా ఉన్నా అని మెసేజ్ పెట్టడం.. ఆఫీస్ అయ్యాక అతడి కార్లో పోతూ మెట్రోలో పోతున్నా అని చెప్పేది. ఆ వ్యక్తి ఇల్లు ఆఫీస్ దగ్గరే.. అయినా ఆమె కోసం ఎక్కడో దూరంగా వున్న తన ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యటం చేసేవాడు. నేను అడిగితే మెట్రోలో పోతున్నా అనటం నాకు అనుమానాన్ని తెచ్చాయి. కొన్ని పరిణామాలతో నాలో అనుమానాలు బలపడ్డాయి. తను నాతో ఉన్నా కూడా ఆ వ్యక్తితో ఫోన్ మాట్లాడేది. నెంబర్ చూపించమంటే తీసేసేది. ఎందుకంటే వేరే ఫ్రెండ్ అని చెప్పేది. నన్ను కాదని ఆ వ్యక్తితో సినిమాలకి షాపింగ్‌లకి పోవడం నాలో భరించలేని బాధని తెచ్చాయి. ఓసారి ఇద్దరూ నా కంట పడ్డారు. సరే అని వదిలేసాను. తర్వాత అడిగాను ‘మీరిద్దరూ ఆఫీస్‌లో ఉండేటోళ్లు కదా మళ్లీ ఎందుకు అక్కడ ఆగటం?’ అని. తనకు చాలా సార్లు చెప్పి చూశాను. కానీ, తను వినలేదు. ‘అలా ఎందుకు చేస్తున్నావ్?’ అని అడగటమే నేను చేసిన తప్పు. ఆ వెంటనే నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. నా నెంబర్ కూడా బ్లాక్ చేసింది. అసలు నేనేమి తప్పు చేశానో నాకే అర్థమవ్వట్లే.. అసలు తను ఎందుకు అలా చేస్తుందో, తను చేసేది తప్పని తనకి ఎందుకు అర్దమవ్వట్లే. ఆ వ్యక్తికి అయినా అది తప్పని అనిపించట్లేదా? తను ఆ వ్యక్తి మాయలో పడటం నాకు ఇంకా బాధగా ఉంది. భరించరాని నరకంలా ఉంది. ప్రేమంటే స్థాయి, అంతస్తులు చూసి లెక్కలేసుకోవడం కాదు. ఏమీ లేకున్నా, ఏమీ ఆశించకుండా నేనున్నాను అనే భరోసా ఇవ్వడం. కానీ, నీకోసం పడే ఈ బాధ కూడా నాకు మధురంగానే ఉంది. తనని వదిలి వస్తాను అని హామీ ఇస్తానంటే జీవితాంతం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. లేదంటే ఇక నువ్విచ్చిన ఈ మధురస్మృతులతోనే జీవితం గడిపేస్తాను.. - నీ నాని -
ఇద్దరం విడిపోయేదాకా వెళ్లాం.. ఆయన వల్ల..
‘ప్రేమ’ .. ఈ పదం వినటానికి బాగుంటుంది! అనుభవించేదాకా తెలీదు ఆ ఎదలోని చిక్కులు. ఆ చిక్కుముడుల్ని విప్పినపుడే ఆ ప్రేమ ఫలిస్తుంది. కాదని లాగావో అదింకా చిక్కుపడిపోతుంది. చాలా ఓపికగా నేను ఆ ముడుల్ని విప్పాననే అనుకుంటున్నా. దాని ఫలితమే నా ప్రేమ.. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులవి. రోజూ కాలేజీకి వెళ్లడం, రావడం, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయటం, చదువుకోవటం.. ఇదే నాలోకం. అయితే ఒకరోజు అనుకోకుండా ఓ పెళ్లికి బంధువుల ఇంటికి నేనొక్కదాన్నే వెళ్లాల్సివచ్చింది. ఆ పెళ్లిలోనే పరిచయమయ్యాడు హరీష్. అతని రాకతో నా జీవితం చాలా పెద్ద మలుపు తిరిగిందనే చెప్పాలి. అతను నాకు వరసకు బావ అవుతాడు. చిన్నప్పటినుంచి పరిచయమున్నా. అతనితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కానీ, అతనికి నేనంటే ఎప్పటినుంచో ఇష్టమని ఆ రోజే తెలిసింది. పెళ్లిలో అతను అందరితో కలిసిపోవటం అందరినీ బాగా చూసుకోవటం, పెళ్లి బాధ్యతంతా తనదే అయినట్టు నడుచుకోవటంతో అతనిపై నాకు మంచి అభిప్రాయం కల్గింది. ఫంక్షన్ అయ్యేసరికి చాలా ఆలస్యం అవడంతో అతను నన్ను ఇంటి దగ్గర దింపటానికి వచ్చాడు. ఆ జర్నీలోనే అతడు నాకు ప్రపోజ్ చేశాడు. ముందుగా నేను ఆశ్చర్యపోయాను. కానీ, నాక్కూడా అతని ప్రవర్తన నచ్చింది. తెలిసిన వ్యక్తే కావడంతో ఓకే చెప్పేశా. ఇక అప్పటినుంచి అన్నీ తానే అయ్యాడు. చాలా ప్రేమగా చూసుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒకమ్మాయిని పరిచయం చేసి తను నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాడు. తన పేరు స్వాతి! నేను తనతో బాగా మాట్లాడేదాన్ని. తనూ నాతో అలాగే మాట్లాడేది. కానీ, మాటిమాటికీ.. మా బావ అలా.. మీ బావ ఇలా.. నువ్వు బాగా చూసుకోవాలి.. నీకేం తెలీదు అని చెప్తూ ఉండేది. మొదట్లో ఏం అనిపించకపోయినా, తర్వాతర్వాత కోపం వచ్చేది. మా బావ గురించి నాకు తెలీకపోవడమేంటి? రెండు సంవత్సరాలనుంచి తనతో ఉంటున్నా కదా అనిపించేది. అయినా అంతగా పట్టించుకునేదాన్ని కాదు. గడుస్తున్న కొద్దీ మా బావంటే తనకూ ఇష్టమని నాకు తెలిసింది. కానీ, ఆ విషయం బావకి తెలీకపోవడటంతో ఆమెకే ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చేవాడు. నాకు నచ్చేది కాదు. ఏమైనా అంటే తను నా ఫ్రెండ్ అనేవాడు. ఆమె మాత్రం మేము విడిపోవడానికి చేయాల్సిన పనులన్నీ చేసేది. కానీ, నా ప్రేమ ముందు అవేవీ నిలబడలేదేమో. నా బాధ చూడలేక ఆ దేవుడే మా బావని తనకు దూరం చేశాడేమో అనిపిస్తుంది.. కాకపోతే ఏంటి? దాదాపు విడిపోయేదాకా వెళ్లిన మేము, స్వాతి వాళ్ల నాన్న వల్ల ఒక్కటయ్యాం. వాళ్ల నాన్నకి నేనెవరో తెలీకపోవచ్చు. కానీ, తన కూతురి జీవితం బాగుండాలని చేసిన ఒక పని వల్ల నా జీవితం నిలబడింది. తన తండ్రికిచ్చిన మాట వల్ల తనూ సంతోషంగా ఉంది. నేను నా బావతో సంతోషంగా ఉన్నా.. మొదట్లో ఆమె మాట్లాడకపోతే ఎంతో బాధపడిన బావే.. మెల్లిమెల్లిగా తన పనిలో పడిపోయాడు. నన్ను మొదటికన్నా ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నాడు. మా ఇంట్లో వాళ్లని కూడా మా పెళ్లికి ఒప్పించాడు. ఇక మిగిలింది మా పెళ్లిరోజే అందుకే అంటారేమో.. ఎప్పుడు ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. ఆవేశపడకుండా కాస్త వేచి చూడటం ఉత్తమం.. - దీప్తి, జగిత్యాల