
నా పేరు రాజు. మాది హైదరాబాద్. 2006లో పనిమీద నెలరోజులు ఓ గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నేనుండే ఇంటి పక్కన అమ్మాయికి,నాకు అస్సలు పడేది కాదు. ప్రతీ విషయంలో నాతో గొడవ పడేది. అలా మొదటి 15 రోజులు గడిచిపోయాయి. ఆ ఊర్లో జరిగిన ఓ పండుగకి నేను కూడా వెళ్లా. నేను స్వతహాగా డాన్సర్‌ని కావడంతో ఆ వేడుకలో డాన్స్ చేశా. ఆ అమ్మాయి వాళ్ల బంధువులతో సహా అక్కడికి చేరుకుంది. వాళ్లంతా నన్ను బాగా మెచ్చుకున్నారు. ఎందుకో తెలీదు ఆ రోజు తర్వాత నుంచి తను నాతో గొడవ పడటం మానేసింది. నన్ను చూసి నవ్వుతూ పలకరించింది. సమయం దొరికినప్పుడల్లా నాతోనే గడిపేది. అది లవ్ అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అనుకోకుండానే మా ప్రేమకథ మొదలయ్యింది.
నా పని పూర్తవడంతో నేను మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చేశాను. అప్పుడు తను ఎంత బాధపడిందో..ఇంట్లో మా విషయం చెప్పాను. అన్నయ్య తప్పా ఎవరూ నో చెప్పలేదు. వాళ్లింట్లో కుల పిచ్చి చాలా ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. తనకి సంబంధాలు చూడటం మొదలుపెట్టారని తెలిసి హైదరాబాద్‌లోనే ఓ గుళ్లో పెళ్లిచేసుకుందాం అని డిసైడ్ అయ్యాం. దానికి తగ్గ ఏర్పాట్లన్ని మా ఫ్రెండ్స్ చూసుకున్నారు. తీరా తను బస్ ఎక్కే టైంకి వాళ్ల అన్నయ్య చూశాడు. విషయం మొత్తం వాళ్లింట్లో తెలిసి చాలా పెద్ద రచ్చ జరిగింది. మా ఇంట్లోనూ చాలా గొడవలు జరిగాయి. వాళ్లింట్లో వాళ్లను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను. ఫలితం శూన్యం.
తర్వాత కొన్నాళ్లకు నాకు ఇష్టం లేకుండానే మా బంధువుల అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. విషయం తెలిసి తను చాలా ఏడ్చింది. తనతో మాట్లాడటానికి వాళ్ల కాలేజీకి కూడా వెళ్లాను. నాతో మాట్లాడటానికి ఒప్పుకోలేదు. నాకు పెళ్లయ్యింది. కానీ తను నాకు ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది. ఫస్ట్ లవ్ కదా..మరిచిపోలేకపోతున్నా. రెండేళ్లకి తనకి కూడా పెళ్లయ్యింది. ఆ తర్వాత తనని చూసింది లేదు. అనుకోకుండా ఒక ఫ్రెండ్ ద్వారా తన నెంబర్ దొరికింది. కాల్ చేశా. నా గొంతు గుర్తుపట్టి నెంబర్ బ్లాక్ లేసింది. కొన్నిరోజులకి తనే కాల్ చేసింది. నన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయావురా అన్నప్పడు మానసికంగా చచ్చిపోయా ఆ క్షణం. ఆరోజు నేనేమీ చేయలేకపోయాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో. నీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నేనున్నాను నీకు. త్వరలోనే నీ పేరు మీద ఓ అనాధశ్రమం పెడుతున్నా.
--రాజు (హైదరాబాద్)