
ప్రతీకాత్మక చిత్రం
నాది నల్గొండ జిల్లాలో ఓ మారు మూల గ్రామం. నేను తను ఒకే స్కూల్‌లో చదువుకున్నాం! తను మా జూనియర్ ఆ సమయంలోనే మా మధ్య ప్రేమ పుట్టింది. ప్రతిరోజూ నన్ను చూసేది. అప్పుడు తెలియదు అది లవ్వా! లేక ఆకర్షణా అని. ఏదైతేనేం మా మధ్య ప్రేమ మొదలైంది. అలా నా పదవతరగతి అయిపోయింది. నేను కాలేజ్‌లో చేరాను. తను ఇంకా స్కూల్‌లోనే ఉంది. తనది నాది వేరువేరు ఊర్లు. తను నాకు డైలీ లెటర్లు పంపేది. అప్పట్లో ఫోన్లు లేవు కదా! ఓన్లీ లెటర్లు మాత్రమే. అలా మా ప్రేమ కంటిన్యూ అయ్యింది. ఇంటర్‌లో ఇద్దరం వేరువేరు కాలేజ్‌లు. అయినా మా మధ్య ప్రేమ కంటిన్యూ అయ్యింది. ఫైనల్‌గా డిగ్రీలో తను మా కాలేజ్లో జాయిన్ అయ్యింది. రెండేళ్లు కలిసి చదువుకున్నాం. అలా ఫైనల్ ఇయర్‌కు వచ్చాం. పరీక్షలు అయిపోగానే ఆమెలో అలజడి మొదలైంది. నేను తనని పట్టించుకోనని. పరీక్షల తర్వాత ఐసెట్ ప్రిపరేషన్ కోసం నేను హైదరాబాద్ వచ్చేశాను. తను డైలీ నాతో ఫోన్‌లో మాట్లాడేది. అలా మా విషయం వాళ్ల ఇంట్లో తెలిసిపోయింది.
తనను ఇంట్లోంచి బయటకు రానీయలేదు. తను ఇంట్లో, నేను హైదరబాద్‌లో.. అంతా టెన్షన్ టెన్షన్. తను వాళ్ల ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తను నన్ను తప్ప వేరే వాడిని చేసుకోనని తెగేసి చెప్పింది. నేను ఈ టెన్షన్‌లో ఐసెట్ కోచింగ్‌కు వెళ్లలేదు. ఫైనల్‌గా ఒకరోజు ఎవ్వరికీ తెలియకుండా హైదరాబాద్ వచ్చేసింది. తన కళ్లలో ఏదో తెలియని సంతోషం. అప్పుడు అర్థం అయ్యింది. అమ్మాయిలు లవ్ చేస్తే ఏమీ ఆలోచించరని. తనను తీసుకుని మా కజిన్ బ్రదర్ రూంకు వెళ్లా. వాడే మా మొదటి దేవుడు! ఎందుకంటే మమ్మల్ని ఏం అనకుండా తన రూంలో చోటిచ్చాడు. అప్పుడు నా దగ్గర మూడు వేలు మాత్రమే ఉన్నాయి. నాకు తెలుసు! తన దగ్గర ఏమీలేదని.
ఉన్న రూ. 200లు బస్ చార్జస్‌కి అయిపోయాయని. తర్వాత తనని పేయింగ్ గెస్ట్‌గా హాస్టల్‌లో ఉంచాను. మా విషయం మా ఊర్లో పాకిపోయింది. ఫోన్లు రావటం మొదలైంది. అన్ని రకాల ఫంక్షన్‌లు అయిపోయినాయి. తర్వాత నాలుగురోజులకు మేము పెళ్లి చేసుకున్నాం. రూం కోసం వెళితే ఎవ్వరూ ఇవ్వలేదు. ఏదో అలాగ ఒక చిన్న రూం తీసుకున్నాం. మా జర్నీ స్టార్ట్ అయ్యిందని అనుకున్నాం కానీ, అక్కడే పెద్ద సమస్య మొదలైంది. ఉన్న డబ్బుమొత్తం అయిపోయింది. నాకేమో ఇగో ప్రాబ్లమ్. ఎవర్నీ అడగను. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడే తను ఒక ఐడియా ఇచ్చింది. ‘ నా ఇయర్ రింగ్స్ అమ్మేసి డబ్బు తీసుకుందాం. అవసరానికి ఉంటాయ్’ అని చెప్పింది.
ఆ పనికి నా మనసు ఒప్పుకోలేదు. ఎవరో తెలిసిన వాళ్ల ద్వారా తన ఇయర్ రింగ్స్‌ను ప్రైవేట్ ఫైనాన్స్‌లో పెట్టి కొంచెం లోన్ తీసుకున్నాం. ఆ డబ్బుతో మా జర్నీ స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత జాబ్ సెర్చింగ్‌లో తనకి ఒక బిగ్ షోరూంలో సేల్స్ గాళ్‌గా జాబ్ వచ్చింది. నాకు జాబ్ రావటానికి ఓ నెలపట్టింది. ఏదో అలా జాబ్‌లో జాయిన్ అయ్యాను. ఒకరోజు కూడా లీవ్ పెట్టకుండా ఇద్దరం కష్టపడ్డాం. రెండు నెలల్లో లోన్ క్లోజ్ చేసి తన ఇయర్‌రింగ్స్ తనకు తెచ్చి ఇచ్చాను. అప్పుడే అర్థం అయ్యింది.. అర్థం చేసుకుంటే ప్రేమ పెళ్లిళ్లు ఫేయిల్ అవ్వవని. అప్పుడు చాలా మంది సహాయం చేయటానికి ముందుకు వచ్చారు.
కానీ, మేము వద్దు అన్నాం. ఎందుకంటే కష్టం అంటే ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాం! ట్రై చేశాము.. సక్సెస్ అయ్యాము. అలా అలా క్రమక్రమంగా ప్లాన్‌లు చేసుకుంటూ మా జర్నీ కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మాకిద్దరు పిల్లలు. కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని ఎదుర్కొని ఫైట్ చేసే వాళ్లకే గెలుపు తోడుగా ఉంటది. చాలా మంది అంటూ ఉంటారు. లవ్ మ్యారేజెస్ ఫేయిల్ అవుతాయని. అలా ఏమీ అవ్వదు. ఒకరినిఒకరు అర్థం చేసుకుంటే ఏ బంధం ఫేయిల్ కాదు. అందులో ఉండే థ్రిల్ వేరు. అర్థం చేసుకుంటూ పోతే ప్రేమకు ఎప్పటికీ అంతం అనేది ఉండదు.
- బొమ్మిశెట్టి శ్రీనివాస్, హైదరాబాద్
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి