
ప్రాణంగా ప్రేమించాను. తనే జీవితం అనుకున్నాను. తన కోసం ఎవరినైనా ఎదురించాలి. తనతోనే జీవితం పంచుకోవాలనుకున్నా. కానీ తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. తనను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నా తను నా జీవితంలో ఉంటే ఎంత బావుండు అని. తననే చూస్తూ ఉండిపోయా. తన కళ్లు నన్ను మరింత ఆకర్షించాయి. కాసేపటికి తను వెళ్లిపోయింది. కానీ నా మనసు మాత్రంతన చుట్టే తిరిగేది. తన ఊహల్లో విహరిస్తున్న నాకు మళ్లీ తను ఎదురుపడింది. తను ఉండేది మేం ఉంటున్న వీధిలోనే అని తెలిసి చాలా సంతోషించా. ఓరోజు తనతో మాట కలిపా. సీరియస్‌గా చూసి వెళ్లిపోయింది. రోజూ నేను వెళ్లే దారిలోనే తను కూడా కాలేజీకి వెళ్తుంది అని తెలిసి..నా మొదటి క్లాస్ ఎగ్గొట్టి మరీ తన కోసం నిరీక్షించేవాడిని. ఫలితంగా కొద్ది రోజులకు ఫోన్‌నంబర్లు మారాయి. మాటలు పెరిగాయి. దూరం తగ్గింది. తనకి నేనంటే చాలా ఇష్టమని తను ప్రపోజ్ చేయగానే ఆనందంతో ఎగిరి గంతులేశా. అలా సరదాగా ఏడాది గడిచింది.
నేను ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లాను. అప్పటినుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేసేది కాదు, మళ్లీ ఫోన్ చేస్తే కాల్‌వెయిటింగ్ వచ్చేది. కొత్త సిమ్‌కార్డులు కొనేది. నేను కలవడానికి వెళ్లినప్పుడు అవి దాచిపెట్టేది. ఏదో నెంబర్‌నుంచి మెసేజ్ వస్తే ఎవరు అని అడిగా. అన్నయ్య అని బదులిచ్చింది. ఆ నెంబర్‌కు నేను కాల్‌చేశా. నన్ను తన అన్నయ్యగా ఆ వ్యక్తికి చెప్పిందని తెలిసి మనసు విరిగిపోయింది.
తర్వాత మరో వ్యక్తి అర్ధరాత్రిపూట కాల్ చేసి బయటకు వెళ్దాం అన్నాడు. ఎవరు అని ప్రశ్నిస్తే తన నుంచి సమాధానం లేదు. ఎదురింటి వ్యక్తి అని తర్వాత తెలిసింది. అతనికి నన్ను అన్నయ్యగా పరిచయం చేసింది. నాకోసం హైదరాబాద్ వెళ్తున్న అని ఎదురింటి వ్యక్తితో చెప్పి ..మొదట నన్ను అన్నయ్యగా చెప్పిన వ్యక్తితో కలిసి వారం రోజులు హైదరాబాద్ తిరిగి వాళ్లింట్లోనే ఉందని తర్వాత తెలిసింది. తను ఇన్ని చేసినా..నా మనసు మాత్రం తననే కోరుకుంది. కానీ తను మాత్రంనన్ను దారుణంగా మోసం చేసి నువ్వు నాకొద్దు అని చెప్పి వెరెవరినో పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది. తను చేసిన మోసాన్ని భరించలేకపోయా. ఉన్న ఉద్యోగం వదిలేశా. పిచ్చోడిలా చీకటి గదిలో రోజుల తరబడి కూర్చుని ఏడ్చా... ఇప్పుడు నన్ను ఇష్టపడ్డ మనిషిని పెళ్లి చేసుకున్నా. తన పేరు వినిపించిన ప్రతిసారి పాత గాయం నొప్పెడుతూనే ఉంది.
-సంతోష్
Comments
Please login to add a commentAdd a comment