
ప్రతీకాత్మక చిత్రం
ఆమె చూడ ముచ్చటగా ఉంటుంది. సప్తవర్ణ శోభితం. ఇట్టే అల్లుకుపోయే వెన్నలాంటి మనసు. చలాకీగా ఉంటూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ, తనపనేదో తాను చేసుకుంటూ ఉన్నంతలో సరిపెట్టుకునే తత్త్వం. గుడికి వెళ్లడం, వాకింగ్ చేయడం ఆమె అలవాటు. తన పేరు బంగారు లక్ష్మి. 24కేరట్స్ బంగారమే ఆమె. అందుకే నిన్ను ఇష్టపడ్డానంటూ తారసపడ్డా. నువ్వంటే ఇష్టం అని చెబుతూ మెల్లగా నా మనసులో మాట బయట పెట్టా. చిత్రం ఏమిటంటే, దగ్గరమ్మాయే. ఒక దశాబ్ద కాలంగా ఆమె తెలుసు. అయితే ఎన్నోసార్లు ఎదురు పడ్డా, పలకరించడానికి కూడా బిడియపడుతూ వెళ్లిపోయేవాడిని. కానీ ఎందుకో ఆమెపై సడన్‌గా ప్రేమ పుట్టింది. దీనికి కారణం ఒకరోజు ఆమె కలలో ప్రత్యక్షమయింది. అప్పటికే సమస్యలతో సతమతమవుతున్న నా జుట్టు నిమురుతూ ‘ఢీలా పడ్డం కాదు.. ధైర్యంగా ఉండు. నీకు నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చింది.
చాలాసేపు కబుర్లు చెప్పి మాయమైంది. కళ్లు తెరిచి చూసేసరికి అది కలో, నిజమో బోధ పడలే. అలా రోజూ కలలోకి రావడం, మైమరపించడంతో ఉండబట్టలేకపోయా. ఎన్నో బాధలతో సతమయ్యే నాకు ఆమె ఓ స్వప్న దేవతగా వచ్చి, మురిపించడంతో ఆ బాధలనుంచి విముక్తి లభించినట్టు ఫీలయ్యా. ఏమిటి ఇలా జరుగుతోందంటూ మదనపడ్డా. ఆమెకు ఎలా చెప్పాలని పరితపించా. ఒకటి రెండుసార్లు ఫోన్ చేసి పలకరించాలని చూసినా ధైర్యం చాలలేదు. కానీ ఒకసారి ఆమెను దగ్గరి నుంచి చూడటంతో ఆమెపై నిజంగా ప్రేమ పుట్టింది. కలలో చూసినట్టే సరిగ్గా ఆమె పొందికగా ఉంది.
విశాలమైన నుదురు. ఆకర్షించే కనులు.. తొలిచూపులోనే కట్టి పడేసింది. ఆమెను భువిలోని ఓ దేవతగా ఆరాధిస్తూ, ఆమెకోసం జపిస్తూ, పరితపిస్తూనే ఉన్నా. ఏదైతే అది అయిందిలే అని, ఆమెకు ఫోన్ చేయడం, ఆమెతో మాటలు కలపడం. అలా అక్కడున్నన్నాళ్లు ఫోన్ సంభాషణ సాగింది. మెల్లిగా నా మనసులో మాట, తనపై నాకు ఉన్న ఇష్టం గురించి చెప్పడం జరిగిపోయాయి. కానీ అవతలనుంచి రెస్పాన్స్ రాలేదు.
ఆమెను గుడి దగ్గర కలవాలని చూశా. ఆమె వచ్చింది! కానీ, ఆమెతో మాట్లాడ్డానికి నా కాళ్లు చేతులు వణికిపోయాయి. ఆమెలో మాత్రం ఎక్కడా తొణికిసలాట లేనేలేదు. ఏదో తూతూ మంత్రంగా మాట్లాడేసి వెళ్లిపోయా. ఆ తర్వాత మెల్లిగా మాటలు కలవడం, పార్క్, గుడి ఇలా నడిచాయి. ప్రేమను కొంచెం గుర్తించింది. కానీ ఆమె ఎందుకో తటపటాయించింది. ఆమె కంఠం కూడా మధురం కావడంతో అడిగి మరీ పాటలు పాడించుకుని తన్మయత్వం చెందేవాడిని. ఏ చిన్న మంచి జరిగినా, దానికి ఆమె కారణమని మురిసిపోవడం.. ఆమెను లోకంగా భావించడం నా వంతయింది.
కానీ ఆమెకు ఎక్కడో అనుమానం.. వీలుచిక్కినప్పుడల్లా దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. తట్టుకోలేక విలవిల లాడిపోయా. ఆమెపై బెంగ నన్ను నిలువనీయలేదు. దూరంగా జరగలేను. ఆమె నా ఊపిరి.. ఆమె నామస్మరణే నా నిత్య విధి.. ఫలించేరోజు, దేవత కరుణించేరోజు కోసం నా నిరీక్షణ. కానీ, ఆమెలో ఎక్కడో జంకు.. నా ప్రేమను అంగీకరించినా, నన్ను డైలామాలో పెట్టేసింది. 3 దశాబ్దాలు అవుతున్నా సరే, ఆమె జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి.
- పూర్ణ, రాజనగరం
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment