దానికి వచ్చే జన్మ వరకు ఎదురుచూడాలా? | Breakup Love Stories In Telugu : Raju Sad Love | Sakshi
Sakshi News home page

దానికి వచ్చే జన్మ వరకు ఎదురుచూడాలా?

Published Fri, Jan 10 2020 11:07 AM | Last Updated on Fri, Jan 10 2020 11:39 AM

Breakup Love Stories In Telugu : Raju Sad Love - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

9వ తరగతి చదువుతున్నపుడు మా క్లాసులోకి కొత్తగా ఓ తమిళమ్మాయి వచ్చింది. తను ఏమంత అందంగా లేదు, నాకు అప్పట్లో ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఓసారి బయట గొడవలలో ఆ అమ్మాయి అన్నతో గొడవ పడ్డాము. వాళ్ల అన్నతో గొడవపడినందుకు తను నాతో గొడవపెట్టుకుంది. అలా అలా ఎప్పుడూ క్లాస్లో గొడవపడే వాళ్లము. నేను లెక్కలు బాగా చేసేవాడిని. అందువల్ల నేను గ్రూప్ లీడర్‌గా ఉండే వాడిని. ఆ అమ్మాయి నా గ్రూప్లో మెంబర్. అలా మా మధ్య ఫ్రెండ్షిప్ మొదలయింది. 10వ తరగతిలో వేరే అమ్మాయి నాతో క్లోజ్‌గా ఉంటే తను నన్ను తిట్టేది. రోజు నా కోసమే త్వరగా స్కూల్కు వచ్చేది. అలా స్కూల్ లైఫ్ అయిపోయింది. అప్పట్లో ఫోన్స్ వాడకం లేకపోవడం వలన మా మధ్య ఎలాంటి పరిచయం లేకుండా పోయింది. ఇంటర్లో తను ఏదో సిటీలో.. నేను మా ఊరిలో చదువుకున్నాము. ఆ తర్వాత నేను బీటెక్ సిటీలోని మంచి కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. క్లాస్‌లో మొదటి రోజు మొదటి బెంచ్లో ఒక అమ్మాయి కూర్చుని ఉంది. వెనుక నుండి చూడడానికి తను ఆచ్చం నా స్కూల్ ఫ్రెండ్లానే ఉంది.

పలకరించడానికి వెళ్లాను కానీ తను వేరు. అలా నా బీటెక్ లైఫ్‌లో మొదటిగా ఒక అమ్మాయితో పరిచయం.. అదీ నా స్కూల్ ఫ్రెండ్ ఆలోచనలతో మొదలయింది. 7 సంవత్సరాల తరువాత టెన్త్‌ క్లాస్ వాళ్లము గెట్‌టుగెదర్‌ అయ్యాం. కానీ తను రాలేదు. ఇంకొక అమ్మాయి ద్వారా ఆ అమ్మాయి నెంబర్ దొరికింది. పలకరించడానికి కాల్ చేశా! తను నా కాల్ ఆన్సర్ చేసి ‘నేను బిజీగా ఉన్నా’ అని రిజెక్ట్ చేసింది. తరువాత రోజు తనే కాల్ చేసి సారీ అంది. బాగోగులు తెలుసుకున్నాం. అప్పటి నుండి నాలుగు నెలలు బాగా చాట్, కాల్స్ చేసుకునేవాళ్లము. ఒక రోజు తను పంపిన ప్రశ్న" వచ్చే జన్మలో నాతో నీకు ఎటువంటి రిలేషన్ కావాలి " దానికి నేను ‘ఫ్రెండ్’ అని సమాధానం ఇచ్చాను. అదే ప్రశ్న తనకు పంపి తన సమాధానం అడిగితే " భర్త " అని సమాధానం పంపింది.

తన మీదున్న ఆసక్తి లేదా ఇష్టమో తెలియదు వెంటనే నా సమాధానం " దానికి వచ్చే జన్మ వరకు ఎదురుచూడాలా? " అని అడిగాను. తను " ఐ లవ్ యూ " అని మెసేజ్ పంపింది. నేను ‘లవ్ యు టూ’ అని రిప్లై పెట్టాను. అలా మొదలైన మా రిలేషన్ చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవలుగా మారి ఇద్దరం విడిపోయే వరకు వచ్చి.. మళ్లీ ఒకరికొకరు ఎదురు పడితే అన్ని విషయాలు మరచిపోయి జీవితంలో ముందుకు వెళ్లే వాళ్లము. అలా ఇద్దరం 11  సంవత్సరాలు ప్రేమలో గడిపాము. తను నా కోసం చాలా మారింది. నన్ను మా అమ్మలా చూసుకునేది. నా కోపాన్ని ముందే పసిగట్టేది. నాకు ఇష్టం లేని పని తనకు ఎంత ఇష్టమైనదైనా చేసేది కాదు. ఎప్పుడు నా ఆలోచనలతో నాతో మాత్రమే ఫోన్లో మాట్లాడేది. రోజులో చివరి మాటా నాతోనే మొదటి మాటా నాతోనే. ఇద్దరం మంచి పోజిషన్‌లో సెటిల్ అయ్యాము.

నేను బిజినెస్‌లో.. తను జాబ్లో. హ్యాపీగా లైఫ్ వెళ్తున్న సమయంలో మా ఇంట్లో పెళ్లి చూపులు అరెంజ్ చేశారు. వెంటనే మా అమ్మకు మా విషయం మొత్తం చెప్పాను . తను వేరే కులం అని, వేరే ప్రాంతం అని ఒప్పుకోలేదు. చాలా సార్లు చెప్పిచూశా.. గొడవ పడినా మా ఇంట్లో వాళ్లు మారలేదు. అప్పుడు కూడా తనకు విషయాలు చెప్తూ ఫోన్లో మాట్లాడేవాడిని. నా బిజినెస్‌లో కష్టం వచ్చిన ప్రతిసారి తను నా పక్కన నిలబడి నాకు ఒక సపోర్ట్ ఇచ్చేది. ఇంటిలో గొడవలు, బిజినెస్ టెన్సన్స్.. తనకు జాబ్ టెన్సన్స్. ఇద్దరి వయసులు పెళ్లికి దగ్గరగా వస్తున్నాయి. ఇంట్లో వాళ్లు ఫోర్స్ చేస్తున్నారు. ఎంత చెప్పినా ఇంట్లో ఒప్పుకోలేదు. ఒకసారి ఆమెను కలిసి విషయం చెప్పి పట్టుకుని ఏడ్చేశా. 

నా లైఫ్‌లో 22  సంవత్సరాల తరువాత నేను ఏడవడం చూసి తను ఏమనుకుందో తెలియదు . తరువాత తను, నన్ను నా ఫ్యామిలీ కోసం త్యాగం చేసింది. నా నెంబర్ బ్లాక్ చేసింది, ఎంత ప్రయత్నించినా తను నాతో మాట్లాడలేదు. కానీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటే తను 23  రోజులు రూమ్ నుండి బయటకు రాకుండా ఏడుస్తూ గడిపిందని. మూడు నెలలు తను నా ఆలోచనలతో రోజులు గడిపిందని తెలిసింది. నా ఫ్యామిలీ ఆనందం కోసం నన్నే త్యాగం చేసిన అమ్మాయిని కోల్పోయి నేను జీవితంలో ఓడిపోయాను. ప్రతి రోజు తన ఆలోచనలు, తన జ్ఞాపకాలే. బహుశా ప్రేమలో ఆనందం కన్నా బాధ ఎక్కువ ఉంటుందనడానికి మా జీవితాలు ఒక ఉదాహరణ. నా ప్రాణం ఉన్నంత వరకు తను ఎప్పటికి నా ప్రియురాలే తనే నా మొదటి ప్రేమ.. చివరి ప్రేమ.
ఇట్లు
నా" సిరి "ని అందుకోలేని దురదృష్టవంతుడు.. రాజు


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement