ప్రతీకాత్మక చిత్రం
‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ ఆడవాళ్లను ఉద్ధేశించి ఓ సినీకవి రాసిన పాట ఇది. ఈ పాట విన్నప్పుడల్లా నా మనసులో మరో పాట మెదిలేది! ‘ ప్రేమ ఎంత మధురం చెలికాడు అంత కఠినం’ అని. ఓ మగాడి బాధకు ఆడది ఎంత కారణమవుతుందో.. ఓ ఆడదాని బాధకు మగాడు కూడా అంతే కారణం అవుతాడు. నా కష్టాలకు నిలువెత్తు రూపం భార్గవ్! ఎంబీఏ చదువుతున్నపుడు పరిచయమయ్యాడు. తనది ఎంఎస్‌సీ! ఇద్దరం ఒకే క్యాంపస్‌లో చదువుకునేవాళ్లం. మా కాలేజ్‌లో జరిగే ఈవెంట్స్‌లో చురుగ్గా పార్టిసిపేట్ చేసేవాడు. డ్యాన్స్ చేసేవాడు, డ్రామాలువేసేవాడు. అతడంటే ఇష్టం పెరగటానికి అవికూడా ఓ కారణం అని చెప్పొచ్చు. ఓ సాంఘీక నాటకం వేయటానికి నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు యాక్టింగ్ రాదన్నా వినలేదు! పట్టుబట్టి మరీ లాక్కెళ్లారు. క్లాసులు జరుగుతున్నా ఓ గంట పాటు రిహార్సల్స్ చేసేవాళ్లం. అప్పుడే మా ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. నాటకం వేయటం అయిపోయినా మా స్నేహం కొనసాగింది. తరచు ఫోన్‌లలో మాట్లాడుకునే వాళ్లం. ఓ రోజు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నపుడు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు.
అతనంటే నాకూ ఇష్టం కాబట్టి సరే అన్నాను. ఓ 6నెలలు ఫోన్‌లలోనే గడిపాం. తర్వాత అప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్లే వాళ్లం. ఇద్దరి చదువులు పూర్తయి కాలేజీనుంచి బయటపడ్డాం.. ఆ తర్వాతి నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. తనకు బుద్ధిపుట్టినప్పుడల్లా నాకు ఫోన్‌చేసేవాడు. ఇంట్లో ఉండటం వల్ల అతడి ఫోన్‌ను తీయటం సరిగా కుదిరేది కాదు. బాగా తిట్టేవాడు! ఎంత చెప్పినా నా పరిస్థితి అర్థం చేసుకునేవాడు కాదు. ఓ రోజు ఫోన్ చేసి ‘బయటకు వెళదాం రా!’ అన్నాడు. ఇంట్లో పరిస్థితి చెప్పి రావటం కుదరదన్నా. తిట్టాడు, తర్వాత ‘ నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది’ అంటూ ఏడ్చినంత పనిచేశాడు.
నాకు బాధేసింది.. తర్వాత భయమేసింది. ఫోన్ పెట్టేసి ఆలోచనల్లో పడ్డా. ఓ రోజు ఫోన్ చేశాడు.. నేను వెంటనే ఫోన్ తీశా ‘నీకూ నాకు సెట్ అవ్వదు. విడిపోదాం’ అని ఫోన్ పెట్టేశాడు. నేను ఫోన్ చేసినా తీయలేదు. ఇలా నెల రోజులు.. చాలా బాధపడ్డా. ఓ రోజు రాత్రి 11 గంటలకు బాగా తాగి నాకు ఫోన్ చేశాడు. ‘ సారీ! ఆ రోజు నేను జోక్ చేశా. నువ్వంటే నాకు ప్రాణం, నిన్నెలా వదులుకుంటా’ అన్నాడు. నా మతి పోయింది! ఏం మాట్లాడుతున్నాడో అతడికైనా అర్థం అయ్యుండదు.. దాదాపు ఒంటి గంట వరకు నాన్‌స్టాప్‌గా మాట్లాడాడు. ఫోన్ పెట్టేద్దామంటే ఏమనుకుంటాడో అన్న భయం. చెవులు చిల్లులు పడ్డాయి.. కళ్లు మంటలు పుట్టాయి.
అతన్ని ప్రేమించినందుకు నా మీద నాకే జాలేసింది. నేను ఎంత బిజీగా ఉన్నా అతడి ఫోన్ వస్తే మాత్రం తీసేదాన్ని. కొద్దిసేపు నవ్వుతూ మాట్లాడేవాడు.. తర్వాత కోపం.. ఏడుపు.. ఫోన్‌లోనే నవరసాలు పండించేవాడు. అతనితో ఫోన్ మాట్లాడటం కమల్ హాసన్ సినిమా చూసినట్లు ఉండేది. ఓ సైకోలాగా నన్ను ప్రతీరోజు టార్చర్ చేసేవాడు. మొన్న డిసెంబర్ 31నుంచి నాతో కాంటాక్ట్‌లో లేడు. విచారిస్తే బాగా తప్పతాగి ఎవరితోనో గొడవపడితే బాగా కొట్టారంట, ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ విషయం తెలియగానే నా ముఖంలో ఓ క్వచ్ఛన్ మార్క్! పీడాపోయిందని సంతోషించాలా? బాధపడాలా?
- నవ్య
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment