Breakup Love Stories
-
మీది లవ్ బ్రేకపా? అయితే ఇక్కడకు వెళ్లండి
డెహ్రాడూన్: నలుగురూ బాగుండాలి, అందులో నేనుండాలి... అనుకున్నాడు డెహ్రాడూన్‌కు చెందిన ఓ వ్యక్తి. అందుకే పగిలిన హృదయాలను అతికించలేకపోయినా కనీసం వారి మనసుకు స్వాంతన చేకూర్చాలనుకున్నాడు. అర్థం కాలేదా? అయితే ఈ స్టోరీ చదివేయండి.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన దివ్యాన్షు బాత్రాకు 21 ఏళ్లుంటాయి. అతడు ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగాడు. కానీ లాక్డౌన్లో అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలిసి ఈ ప్రేమజంటను విడదీశారు. నెచ్చెలి దూరం కావడంతో కుంగిపోయాడు. హైస్కూల్ నుంచి ప్రేమిస్తున్న అమ్మాయిని హఠాత్తుగా మర్చిపోలేక నరకం అనుభవించాడు. ఆరు నెలలు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. పబ్జీకి బానిసగా మారాడు. ఈ మనోవేదనలోనే కొట్టుమిట్టాడుతున్న అతడికి హఠాత్తుగా ఓ రోజు ఇలా ఎంకెంతకాలం ఆమెను గుర్తు చేసుకుంటూ పిచ్చివాన్నైపోవాలి అన్న ఆలోచన వచ్చింది. అంతే, ఆమె జ్ఞాపకాలకు తాళం వేసి ఓ కెఫేను ప్రారంభించాడు. దానికి దిల్ తుట ఆషికి-చాయ్‌వాలా అన్న పేరును ఖరారు చేశాడు. ఇక్కడ లవ్‌లో ఫెయిలయిన వాళ్లు వారి బాధను మనసారా చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడిది బ్రేకప్ అయిన ఎంతోమందికి ఆశాదీపంగా కనిపిస్తోంది. (చదవండి: ఈ అగ్నిప్రమాదం గచ్చిబౌలిలో జరిగిందా?) ఈ కెఫే గురించి దివ్యాన్షు మాట్లాడుతూ.. "నాలానే చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు. వాళ్ల మనసులోని బాధనంతా కక్కేస్తే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే బ్రేకప్ అయినవాళ్లను నా కెఫెకు వచ్చి వాళ్ల కథలను చెప్పమంటాను. అలా వారి భారాన్ని ఇక్కడే దించేసుకుని జీవితంలో ముందుకెళ్లేందుకు సహాయం చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ కెఫే ఐడియా విని దివ్యాన్షు తండ్రి కోప్పడ్డాడట. దీని గురించి అతడు మాట్లాడుతూ... "ఒక అమ్మాయి కోసం నేను పిచ్చోడిలా అయిపోయాను. అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చి నా కాళ్ల మీద నేను నిలబడతాను అన్నప్పుడు అమ్మ నాకు సపోర్ట్ చేసింది. కానీ కెఫే పేరు చెప్పగానే నాన్న ఒప్పుకోలేదు. కానీ ఓ రోజు నాన్న స్నేహితుడు ఆయన దగ్గరకు వచ్చి కెఫె గురించి, దాని ప్రాముఖ్యతను గూర్చి మెచ్చుకున్నాడు. అప్పుడు కానీ మా నాన్న నేనో మంచి పని చేస్తున్నానని అంగీకరించలేకపోయాడు" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన తమ్ముడు రాహుల్ బాత్రాతో కలిసి కెఫెను నడిపిస్తున్న దివ్యాన్షు త్వరలోనే హరిద్వార్‌లో కూడా ఈ కెఫెను ప్రారంభించాలనుకుంటున్నాడు. (చదవండి: బైక్, వ్యాన్ కాదు గుర్రంపై డెలివరీ.. కారణం ఇదేనట!) -
వాడో సైకో! టార్చర్ పెట్టేవాడు..
‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ ఆడవాళ్లను ఉద్ధేశించి ఓ సినీకవి రాసిన పాట ఇది. ఈ పాట విన్నప్పుడల్లా నా మనసులో మరో పాట మెదిలేది! ‘ ప్రేమ ఎంత మధురం చెలికాడు అంత కఠినం’ అని. ఓ మగాడి బాధకు ఆడది ఎంత కారణమవుతుందో.. ఓ ఆడదాని బాధకు మగాడు కూడా అంతే కారణం అవుతాడు. నా కష్టాలకు నిలువెత్తు రూపం భార్గవ్! ఎంబీఏ చదువుతున్నపుడు పరిచయమయ్యాడు. తనది ఎంఎస్సీ! ఇద్దరం ఒకే క్యాంపస్‌లో చదువుకునేవాళ్లం. మా కాలేజ్‌లో జరిగే ఈవెంట్స్‌లో చురుగ్గా పార్టిసిపేట్ చేసేవాడు. డ్యాన్స్ చేసేవాడు, డ్రామాలువేసేవాడు. అతడంటే ఇష్టం పెరగటానికి అవికూడా ఓ కారణం అని చెప్పొచ్చు. ఓ సాంఘీక నాటకం వేయటానికి నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు యాక్టింగ్ రాదన్నా వినలేదు! పట్టుబట్టి మరీ లాక్కెళ్లారు. క్లాసులు జరుగుతున్నా ఓ గంట పాటు రిహార్సల్స్ చేసేవాళ్లం. అప్పుడే మా ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. నాటకం వేయటం అయిపోయినా మా స్నేహం కొనసాగింది. తరచు ఫోన్లలో మాట్లాడుకునే వాళ్లం. ఓ రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నపుడు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. అతనంటే నాకూ ఇష్టం కాబట్టి సరే అన్నాను. ఓ 6నెలలు ఫోన్లలోనే గడిపాం. తర్వాత అప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్లే వాళ్లం. ఇద్దరి చదువులు పూర్తయి కాలేజీనుంచి బయటపడ్డాం.. ఆ తర్వాతి నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. తనకు బుద్ధిపుట్టినప్పుడల్లా నాకు ఫోన్‌చేసేవాడు. ఇంట్లో ఉండటం వల్ల అతడి ఫోన్‌ను తీయటం సరిగా కుదిరేది కాదు. బాగా తిట్టేవాడు! ఎంత చెప్పినా నా పరిస్థితి అర్థం చేసుకునేవాడు కాదు. ఓ రోజు ఫోన్ చేసి ‘బయటకు వెళదాం రా!’ అన్నాడు. ఇంట్లో పరిస్థితి చెప్పి రావటం కుదరదన్నా. తిట్టాడు, తర్వాత ‘ నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది’ అంటూ ఏడ్చినంత పనిచేశాడు. నాకు బాధేసింది.. తర్వాత భయమేసింది. ఫోన్ పెట్టేసి ఆలోచనల్లో పడ్డా. ఓ రోజు ఫోన్ చేశాడు.. నేను వెంటనే ఫోన్ తీశా ‘నీకూ నాకు సెట్ అవ్వదు. విడిపోదాం’ అని ఫోన్ పెట్టేశాడు. నేను ఫోన్ చేసినా తీయలేదు. ఇలా నెల రోజులు.. చాలా బాధపడ్డా. ఓ రోజు రాత్రి 11 గంటలకు బాగా తాగి నాకు ఫోన్ చేశాడు. ‘ సారీ! ఆ రోజు నేను జోక్ చేశా. నువ్వంటే నాకు ప్రాణం, నిన్నెలా వదులుకుంటా’ అన్నాడు. నా మతి పోయింది! ఏం మాట్లాడుతున్నాడో అతడికైనా అర్థం అయ్యుండదు.. దాదాపు ఒంటి గంట వరకు నాన్‌స్టాప్‌గా మాట్లాడాడు. ఫోన్ పెట్టేద్దామంటే ఏమనుకుంటాడో అన్న భయం. చెవులు చిల్లులు పడ్డాయి.. కళ్లు మంటలు పుట్టాయి. అతన్ని ప్రేమించినందుకు నా మీద నాకే జాలేసింది. నేను ఎంత బిజీగా ఉన్నా అతడి ఫోన్ వస్తే మాత్రం తీసేదాన్ని. కొద్దిసేపు నవ్వుతూ మాట్లాడేవాడు.. తర్వాత కోపం.. ఏడుపు.. ఫోన్లోనే నవరసాలు పండించేవాడు. అతనితో ఫోన్ మాట్లాడటం కమల్ హాసన్ సినిమా చూసినట్లు ఉండేది. ఓ సైకోలాగా నన్ను ప్రతీరోజు టార్చర్ చేసేవాడు. మొన్న డిసెంబర్ 31నుంచి నాతో కాంటాక్ట్‌లో లేడు. విచారిస్తే బాగా తప్పతాగి ఎవరితోనో గొడవపడితే బాగా కొట్టారంట, ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ విషయం తెలియగానే నా ముఖంలో ఓ క్వచ్ఛన్ మార్క్! పీడాపోయిందని సంతోషించాలా? బాధపడాలా? - నవ్య లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నీతో కలిసి రోడ్డు మీద అడుక్కుతినాలా?
సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం మొదలైంది నా తొలిప్రేమ. తన పేరు లక్ష్మీ ప్రియ, మా దగ్గరి బంధువు! మరదలవుతుంది వరుసకు. మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే మొదటిసారి చూశాను ప్రియని. చూడగానే నచ్చేసింది. తనతో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని ఉండేది. పెళ్లికాని అమ్మాయితో చనువుగా మాట్లాడితే బంధువులు ఏమనుకుంటారోనని ఆగిపోయేవాడిని. కానీ, వీలైనన్ని ఎక్కువసార్లు ఆమెను చూడటానికి ప్రయత్నించేవాడిని. ఎవరికీ అనుమానం రాకుండా ఫాలో అయ్యేవాడిని. నేను ఫాలో అవుతున్నట్లు ప్రియకు తెలిసిపోయింది. తనకూడా నన్ను చూసేది. ‘‘ఫంక్షన్లకు ఎంతో మంది బంధువులు వస్తుంటారు.. పోతుంటారు.. సన్నీగాడు లోకల్’ అనుకున్నా మనసులో. ధైర్యం చేసి మొదటిమాట మాట్లాడా‘ మీ అమ్మ పిలుస్తోంది’ అని. ఆ తర్వాత మరింత ధైర్యం తెచ్చుకుని మరో మూడు ముక్కలు మాట్లాడా. మొదటిది తను టీ నా చేతికిచ్చినపుడు‘‘ థాంక్స్’’ అని.. రెండోది భోజనాల సమయంలో అన్నం ఎక్కువగా వడ్డిస్తోంటే.. ‘చాలు’ అని.. చివరగా ఫంక్షన్ అయిపోయి ఇంటికి వెళుతూ.. ‘వెళ్లోస్తాను’ అంటే సరేనని. ప్రియ వెళ్లిపోయిన తర్వాత నా మనసు మనసులో లేదు. ప్రతీరోజు తనగురించే ఆలోచించేవాడిని. అలాంటి సమయంలో ఓ రోజు తననుంచి ఫోన్ వచ్చింది. నేను మొదట గుర్తు పట్టలేదు. తర్వాత ప్రియ అని తెలిసి, ఊపిరి ఆడనంత పనైంది. ఎలాగోలా మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ తర్వాతి నుంచి ప్రతిరోజూ నేను ఫోన్ చేసేవాడిని. కొద్దిరోజులకే మా మధ్య స్నేహం బలపడింది. మా రెండు కుటుంబాల ఫంక్షన్లనో తరచూ కలుసుకునేవాళ్లం. నా ప్రేమను ఎలా చెప్పాలా అనుకుంటున్న సమయంలో తనే నాకు ‘ఐ లవ్ యూ’ చెప్పింది. ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రేమలో నాలుగు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఈ నాలుగు సంవత్సరాలలో ఆర్థికంగా మా కుటుంబం బాగా వెనకబడిపోయింది. అక్కపెళ్లి చేయటంతో అప్పుల్లో కూరుకుపోయాం. వడ్డీలు కట్టడానికి ఉన్న పొలంలో చాలా భాగం అమ్మాల్సి వచ్చింది. బంధువులందరికీ ఈ విషయం తెలిసిపోయింది. తలో రకంగా అనుకోవటం మొదలుపెట్టారు. నేను ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాను. ప్రియతో మాట్లాడటం తగ్గించేశాను. తను కూడా పెద్దగా నా గురించి పట్టించుకునేది కాదు! నేను ఫోన్ చేయకపోతే’ ఎందుకు ఫోన్ చేయలేదు’ అని అడిగేది కూడా కాదు. ఫోన్ చేసినపుడు మాత్రం బాగానే మాట్లాడేది. ఓ రోజు దూరపు చుట్టం ఒకరు మా ఇంటి కొచ్చాడు. మాటల సందర్భంలో ప్రియను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. తను నన్ను కాదని వేరే వాడ్ని చేసుకోదనుకుని పెద్దగా పట్టించుకోలేదు. మేము మాట్లాడుకుంటున్నపుడు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కొన్ని రోజుల తర్వాత తనకు పెళ్లి నిశ్చయమైనట్లు తెలిసింది. తనను అడిగితే అలాంటిదేమీ లేదంది. ఆ కొద్దిరోజులకే ప్రియ నిశ్చితార్థానికి మా కుటుంబానికి పిలుపొచ్చింది. నా దిమ్మతిరిగిపోయింది. షాక్‌నుంచి తేరుకోవటానికి చాలా సమయం పట్టింది. వెంటనే తనకు ఫోన్ చేశాను. స్విచ్ఛాఫ్ వచ్చింది. నిశ్ఛితార్థం అయిపోయిన తర్వాత ఫోన్ కలిసింది. నిశ్చితార్థం గురించి అడిగా..సరిగా స్పందించలేదు. క్యాన్సిల్ చేసుకోమన్నాను. ‘‘ నీతో కలిసి రోడ్డుమీద అడుక్కుతినమంటావా’’ అంది. నాకేం అర్థం కాలేదు. ఏంటని అడిగా.. ‘‘ ఉన్న ఆస్తి పోయింది. నువ్వే ఇప్పుడు ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు. నేను మీ ఇంట్లో అడుగుపెట్టి సంతోషంగా ఎలా ఉండగలను. నన్ను అర్థం చేసుకో! ఇకపై ఫోన్లు చేయటం మానేయ్’’ అని ఫోన్ కట్ చేసింది. నా మనసు ముక్కలైంది. - సన్నీ, హైదరాబాద్ -
ఆమెతో మాట్లాడటం నా భార్యకు నచ్చడంలేదు
నేను మా ఊర్లో స్కూలింగ్ కంప్లీట్ చేసి, ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లాను. ఒక రెండు సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా నాతో స్కూల్లో చదువుకున్న అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టాను. అలా చాలా రోజులు మాట్లాడుకున్నాం. తను నాకు మంచి ఫ్రెండ్ అయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కోపంగా ఉన్నా.. బాధ అనిపించినా తనతోనే పంచుకునేవాడిని. తనతో మాట్లాడకుండా ఒక రోజైనా ఉండేవాడిని కాదు. నాలైఫ్‌లో జరిగిన ప్రతీచిన్న విషయాన్ని తనతో పంచుకునే వాడిని. తను నాతో మాట్లాడకపోతే మరుసటి రోజు నేను తనని తిట్టేవాడిని. తనునాకు చాలా సపోర్టివ్‌గా ఉండేది. చాలా కేరింగ్‌గా ఉండేది. నేనంటే తనకు ఇష్టం.. తనంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు నా మరదలితో ఎంగేజ్మెంట్ అయింది. అప్పటికి కూడా తనతో చాలా క్లోస్‌గా ఉండేవాడిని. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. నేను తనని ముద్దగా సెల్ఫీ అని పిలిచేవాడిని. నా ఎంగేజ్మెంట్కి, పెళ్లికి మధ్యకాలంలో మరింత క్లోజ్ అయ్యాం. మ్యారేజ్ తర్వాత మాట్లాడుకోవటం మంచిది కాదని చెప్పేవాడిని. తను మాత్రం ఎంగేజ్మెంట్కు ముందు ఎలా ఉండేవాళ్లమో అలానే ఉండాలి అనేది. తనతో మాట్లాడటం మా భార్యకు నచ్చనం లేదు. తనకు తెలియకుండా మాట్లాడుతూ ఉండేవాడ్ని. కానీ, తను మాత్రం ప్రతీదానికి అలగటం నువ్వు మారిపోయావ్ అని గొడవ పెట్టడం చేసేది. ఏం జరిగినా తను ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకుని పెట్టుకుని అలగటం మొదలుపెట్టేది. తను చేసేది నాకు కోపం వచ్చి గట్టిగా అరిచేవాడిని. మూడు నెలలక్రితం కూడా అదే జరిగింది. తను ఏమనుకుందో ఏమో నాతో మాట్లాడటం మానేసింది. నేను తనను చాలా మిస్ అవుతున్నా. ఎక్కడ ఉన్నా తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.. .. నీ చిన్నా -
శేషు ప్లీజ్ వెళ్లిపో!..
తన పేరు లక్ష్మి! ప్రైవేట్ జాబ్ చేసేది. మా ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. దీంతో మేము బాగా మాట్లాడుకునేవాళ్లం. కానీ, ఎప్పుడు కూడా లవ్ చేస్తున్నానని తనకు చెప్పలేదు. అప్పుడప్పుడు ‘ఐ లవ్ యూ’ అని లిప్ మూవ్మెంట్ ఇచ్చేవాడిని. అది చూసి ఏమీ అనేది కాదు. తర్వాత తను జాబ్ మానేసింది. అలా కొన్ని నెలల తర్వాత ఓ రోజు ‘నీ తో ఓ విషయం చెప్పాలి’ అన్నాను తనతో. ఆ వెంటనే ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పేశాను. ‘ఏంటి వినబడలేదు! ఏమంటున్నారు’ అని నాతో మూడు సార్లు ఐ లవ్ యూ చెప్పించుకుంది. తర్వాత తను అన్న మాటకు నీరసం వచ్చింది. ‘ ఇది చెప్పటానికి ఇంత టైం పట్టిందా. ఎంత ఎదురుచూస్తున్నానో’ అంది. తను ప్రతి రోజూ చాల చక్కగా తయారయ్యేది. నాకు బొట్టుబిళ్లలంటే చాలా ఇష్టం. చాలా ప్యాకేట్లు ఇచ్చేవాడిని. తనతో ఏ రోజూ కూడా తప్పుగా ప్రవర్తించలేదు. బయట ఎక్కడికీ వెళ్లలేదు. ఒకరోజు మా ఫ్యామిలీల మధ్య గొడవైంది. దాంతో తను నాతో మాట్లాడటం మానేసింది. ‘నీకు నాకు మధ్య గొడవలేమీ లేవు కదా!’ అన్నా నేను. ‘వద్దు! ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది’ అని మాట్లాడేది కాదు. అలా నన్ను చూస్తూ ఉండేది అంతే. మా ఇంటి పనిమనిషికి మా ప్రేమ విషయం తెలుసు. గొడవలు అయినపుడు మా విషయం మా వాళ్లకు చెప్పేసిందనుకుంటా! నా మీద నిఘా పెట్టారు. ఈ లోపు వాళ్ల ఫాదర్ రిటైర్ అయ్యాక సడన్‌గా వేరే ఏరియాకు షిఫ్ట్ అయ్యారు. నేను ఫాలో అవుదాం అని బయటకు వెళ్తుంటే అమ్మ చూసి ‘ఎక్కడికి.. తర్వాత వెళ్లొచ్చు! వచ్చి కూర్చో’ అంది. అలా వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. తనని మిస్ అయ్యా. చాలా వెతికాను! కొన్ని నెలలకి వాళ్లు ఉండే హౌస్ దొరికింది. నన్ను చూసి ఎంతో సంతోషించి నవ్వింది. ఎలా ఉన్నారని అడిగింది. ఈ లోపు వాళ్ల చెల్లి వచ్చేసింది. వాళ్ల వాళ్లని పిలిచింది. తను ‘శేషు ప్లీజ్ వెళ్లిపో!’ అంది. నేను ఇంటికి వచ్చేశా. తరువాత ఎన్నో సార్లు వాళ్ల వీధిలోకి వెళ్లా. ఎప్పుడూ బయట ఉండేది కాదు. అలా ఒకరికి ఒకరం ఇష్టపడ్డా ఫ్యామిలీల వల్ల వేరయ్యాం. తను ఎక్కడవుందో తెలియదు. మ్యారేజై ఉంటుంది. ‘శేషు! నీ నవ్వు, నువ్వు ఏమిటో.. ఎందుకో..’ అని తను దీర్ఘం తీస్తూ అనే మాటలు ఇప్పటికి మర్చిపోలేదు. ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నా. .. నీ శేఖర్ చదవండి : ప్రేమ ప్రయోగం నా కొంపముంచింది! -
ప్రేమ ప్రయోగం నా కొంపముంచింది!
నేను డిగ్రీ చదువుతున్న రోజులు. ఇంటర్ తర్వాత డిగ్రీకి మా ఊరు నుంచి టౌన్‌కు డైలీ అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చింది. కొత్తలో బస్‌స్టాండ్‌లోకి.. ముఖ్యంగా నలుగురు ముందుకు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాన్ని. అలా రోజులు గడిచిపోతున్నాయి. నాకు చిన్నప్పటినుంచి హీరో సూర్య అంటే చాలా ఇష్టం. అతడి సినిమాలు బాగా చూసేవాడ్ని. సూర్య సన్ఆఫ్ కృష్ణన్ సినిమాను డీవీడీలో ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. ముఖ్యంగా అందులోని ట్రైన్ సీన్ నన్ను బాగా ఆకట్టుకుంది. నాకప్పుడు అనిపించింది.. ఓ అమ్మాయి వైపు చూడగానే ప్రేమలో పడతామా అని! ఆలోచించాను.. మరీ ఎక్కువగా ఆలోచించి జుట్టుపీక్కోవటం ఇష్టంలేక ఓ నిర్ణయానికి వచ్చాను. ఎవరైనా ఓ అందమైన అమ్మాయి మీద ప్రయోగం చేద్దామనుకున్నాను. అప్పుడప్పుడు మా బస్సులో కనిపించేది ఓ అమ్మాయి.. మా కంటే సీనియర్! అప్పుడు తను ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె అయితే బాగుంటుంది అనుకున్నాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ రోజు బస్సులు ఆలస్యంగా వచ్చాయి. వెంటవెంటనే రెండు బస్సులు రావటంతో అందరూ ముందుగా కదిలే బస్సు ఎక్కి వెళ్లిపోయారు. వేళ్ల మీద లెక్కపెట్టే మందిమి మాత్రమే రెండో బస్సులో ఉన్నాము. అందులో ఆమె కూడా ఉంది. వెన్నెల రాత్రిలో.. బస్సులోకి చల్లగా వీస్తోంది గాలి. అంతా ఓ కళలా ఉంది! తను ఎడమ వైపు ఉండే సీట్లో నా ముందుగా కూర్చుంది. ఆమె వైపే చూస్తూ ఉండిపోయాను. ఎంత సేపు చూస్తూ ఉన్నానో నాకు తెలియదు.. గంట ఇట్టే గడిచిపోయింది. అంతలోనే నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది. అయిష్టంగానే దిగివెళ్లిపోయాను కానీ, తనంటే అప్పటినుంచి ఇష్టం ఏర్పడింది. ఇక ప్రతి రోజూ తన కోసం బస్సు వెతికే వాడ్ని. తను రోజూ వచ్చే బస్సుకే నేను కూడా ఎక్కేవాడ్ని. ఒక వేళ తను ఆ బస్సుకు రాకపోతే! మధ్యలో బస్సు దిగి ఆమె వస్తుందనే నమ్మకం ఉన్న వేరే బస్సు ఎక్కేవాడ్ని. తను కనిపించపోతే ఏదోలా ఉండేది. కొన్ని నెలల తర్వాత నేను తనని చూస్తూన్నానని తనుకు కూడా తెలిసిపోయింది. ఎవరా! అని నన్ను చూడటం మొదలుపెట్టింది. నేను కొద్దిగా ధైర్యం చేసి తన సీటు పక్కగా నిలబడటం, లేదా ఆమె దగ్గరిగా ఉండే సీట్లో కూర్చోవటం చేసేవాడ్ని. కొన్ని రోజుల తర్వాత తను కనిపించలేదు. ఎందుకని ఆరా తీస్తే! ఫైనల్ సెమిస్టర్ ఎక్షామ్ అని.. ఆ తర్వాతినుంచి తను రాదని తెలిసింది. అంతే! నా మనసు మనసులో లేదు. రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. నాకు మొదటిసారి మా హీరో మీద కోపం వచ్చింది.. ప్రేమ ప్రయోగం నా కొంపముంచిందనిపించింది. ఓ వారంరోజుల తర్వాత తను కనిపించింది. అదే తనని చివరి సారి చూడటం. తను కనిపించని రోజులు నేను పడ్డ బాధ ఆ దేవుడికే తెలుసు ఆ బాధనుంచి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది. ఇంకెప్పుడూ ప్రేమ ప్రయోగాల జోలికి పోకూడదనిపించింది. - శేషు, చెన్నై -
‘మీ ఆయనకు విడాకులిచ్చేయ్..’
2017లో డిగ్రీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నా. అప్పుడే ఆర్ఆర్బీ పోస్టులు పడితే అప్లై చేసి కోచింగ్ తీసుకుంటున్నాను. కోచింగ్ సెంటర్లో చేరినపుడు స్టడీ.. హోమ్ తప్ప ఇంకేమీ ఉండేది కాదు. ఆ ఇన్స్టిట్యూట్లో చాలా మంది నాకు ప్రపోజ్ చేశారు. బట్ పెద్దగా పట్టించుకునేదాన్ని కాను. ఓ రోజు మధ్యాహ్నం ఒక అబ్బాయి నాతో మాట్లాడటానికి ట్రై చేశాడు. సైన్స్ బుక్ గురించి అడుగుతున్నాడు.. మా ఫ్రెండ్ రెస్పాండ్ అవుతోంది‘ మేము తీసుకోలేదు.. వేరే వాళ్ల దగ్గర జిరాక్స్ ఉంది తీసుకోండి’ అంది. తర్వాత తను నాకు సైట్ కొడుతున్నాడని తెలిసింది. ఓ రోజు ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ ఐడీలు అడిగాడు. ఇవ్వాలా? వద్దా? అనుకున్నా.. తను ఫ్రెండ్లీగా అడుగుతున్నాడేమో అనుకుని చెప్పేశా. తర్వాతి రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేశాడు. ‘హాయ్’ అని. అలా పరిచయం మొదలైంది. ఎంతో రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడేవాడు. కొన్ని రోజుల తర్వాత ప్రపోజ్ చేశాడు. నేనపుడు ఒప్పుకోలేదు. తను ఏప్రిల్‌లో ప్రపోజ్ చేస్తే నేను డిసెంబర్లో ఓకే చెప్పాను. ప్రేమించుకున్నప్పటికి ఎప్పుడు కూడా మేము బయట తిరగలేదు! కాల్స్, చాటింగ్స్ అంతే.. తనకు డిసెంబర్లో జాబ్ వచ్చి వెళ్లిపోయాడు. మా మధ్యలో అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది కాదు. ఏదో మాట్లాడుకున్నామా అంతే! అలా మా రిలేషన్లో గొడవలు కూడా అయ్యేవి. ఒకసారి ఓ నెల రోజులు ఏమీ మాట్లాడుకోలేదు. తర్వాత మాట్లాడుకున్నాం. ఇంట్లో వాళ్లు నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తనకు చెప్పా! పెద్దగా రియాక్ట్ కాలేదు. ‘ అనవసరమైన విషయాలు నాకెందుకు చెబుతున్నావ్!’ అన్నాడు ఒకసారి. ఆ రోజునుంచి నేను తనతో మ్యాచెస్ గురించి చెప్పటం మానేశాను. కొన్ని రోజులకు నాకు పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి కుదిరిన రెండురోజులకు తనకి మెసేజ్ చేశా. శుభాకాంక్షలు చెప్పాడు. ఏమీ అనలేకపోయా! తర్వాతి రోజు నాతో‘ మ్యారేజ్ క్యాన్సిల్ చేస్కో! నువ్వు నాకు కావాలి.’ అనటం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు ఏమైంది అనుకున్నా మనసులో. నిజానికి తనంటే నాకు కూడా ఇష్టమే.. తనే చాలా నార్మల్‌గా ఉండేవాడు మా రిలేషన్లో. నేను కూడా అలాగే ఉండేదాన్ని. ‘నేనిపుడు ఏమీ చేయలేను! ఇప్పుడంతా అయిపోయింది. మా వాళ్లు అబ్బాయి వాళ్లకు డౌరీ కూడా ఇచ్చేశారు. అందరికీ చెప్పేసుకున్నారు. నాకసలు ఈ పెళ్లి ఇష్టంలేదు. కానీ, మా వాళ్లు బలవంతపెట్టేసరికి ఒప్పుకోవల్సి వచ్చింది’ తనకు అంతా క్లియర్‌గా చెప్పేశాను. అతను చాలా ఏడ్చాడు! సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. కానీ, నా పెళ్లి అయిపోయింది. నేనిప్పుడు ఢిల్లీలో ఉంటున్నా. ఓ రోజు ఓ ఈవెంట్ ఉంటే ఊరికి వచ్చాను. ఆ విషయం తెలుసుకుని ఆ ఈవెంట్‌కు వచ్చేశాడు. నేను ఆటో దిగేసరికి అక్కడ ఉన్నాడు. ‘అతనేంటి ఇక్కడ’ అని షాక్ అయ్యాను. ‘నీతో కొంచెం మాట్లాడాలి! బైక్ ఎక్కు బయటకు వెళదాం’ అన్నాడు. నేను వినిపించుకోలేదు. అతన్ని వెళ్లిపోమని చెప్పి లోపలికి నడిచా. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. మా స్నేహితులు వార్నింగ్ ఇద్దామనుకున్నారు. మేము బయటకు వచ్చేలోపు వెళ్లిపోయాడు. చాలాసార్లు కాల్ చేశాడు. ఏంటో అని నేను లిఫ్ట్ చేశా. ‘నాకు నువ్వు కావాలి. నువ్వులేకుండా ఉండలేను’ అని చెప్పుకుంటుపోయాడు. నేను నచ్చచెప్పటానికి ఎంతో ట్రై చేశా. వాడికి తెలుసు.. వాడంటే నాకు చాకు చాలా ఇష్టం అని. ఆ రోజు మాకు గొడవ కాకుండా ఉండిఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదేమో.. వాడు ఇప్పుడు ఇస్తున్న ప్రాధాన్యత, చూపిస్తున్న ప్రేమ అప్పుడు చూపించి ఉంటే అసలు ఈ పెళ్లి జరగకపోయేది. మ్యారేజ్ గురించి చెప్పినా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని అడిగా. ‘నాకు నీపై నమ్మకంరా నువ్వు వేరే మ్యారేజ్ చేసుకోవని, అందుకే రియాక్ట్ కాలేదు. సరే నా తప్పు ఒప్పుకుంటున్నా. ఇప్పుడు పెళ్లి చేసుకుందాంరా! మీ ఆయనకు విడాకులు ఇచ్చేయ్’ అన్నాడు. వాడిని చూస్తుంటే ఏం చేసుకుంటాడో అని భయం వేస్తోంది. ‘ సరే చేసుకుందాం. నువ్వేమీ చేసుకోకు’ అన్నా. అప్పటినుంచి పిచ్చిపిచ్చిగా చేయటం మానేశాడు. నేను ఇప్పటికీ చెబుతూనే ఉన్నా మన మ్యారేజ్ జరగదురా అని కానీ తను అస్సలు అర్థం చేసుకోవటం లేదు. డైలీ ఏదో ఒకటి చేసుకుంటున్నాడు.. ఏడుస్తున్నాడు. ఎప్పుడైనా వీడియో కాల్ చేస్తే! చాలా ఎమోషనల్ అయిపోతాడు. వాడికి ఎలా నచ్చచెప్పాలో అర్థంకావటం లేదు. పోనీ మొత్తానికే వదిలేద్దామనుకుంటే ఏమన్నా చేసుకుంటాడేమోనని భయం. ఏమైనా అంటే ‘నువ్వు నా దానివి అంతే’ అంటాడు. తను కోరుకున్న చిరునామా తనది కాదని చెప్పినా అర్థంకాదు. నేను మా భర్తతో దిగిన ఫొటోలు ఎఫ్బీలో చూసినపుడు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ ఫొటోలు తీసేదాకా ఊరుకోడు. వాడికి కోపం ఎక్కువే.. ప్రేమ ఎక్కువే. చాలా సార్లు చెప్పా‘ నీకు మంచి జాబ్ ఉంది. పెళ్లైన అమ్మాయిని చేసుకోవల్సిన అవసరం ఏముంది. చక్కగా వేరే అమ్మాయిని చేసుకో.. నువ్వు అనుకుంటున్నవి ఏవీ జరగవు’అని. నాకు పెళ్లైందన్న మాట వింటేనే అతడికి చాలా కోపం వస్తుంది. ‘ నా దృష్టిలో నీకు ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు ఆ టాపిక్ తీయకు’ అంటాడు. ‘ ఈ ప్రేమ మనం ప్రేమించుకునే సమయంలో చూపించాల్సింది. ఇప్పుడుకాదు’ అంటే. ‘ అపుడు నువ్వు నాతోనే ఉంటావనుకున్నా’ అని అంటాడు. ఏది ఏమైనా వాడికి ఇంకా అర్థం కావటం లేదు. రీసెంట్గా మిర్రర్ పగులగొట్టి చెయ్యి మొత్తం కోసుకున్నాడు. అర్థం చేసుకోవట్లేదు. నా మాట అస్సలు వినటం లేదు. ఈ విలువలు కట్టుబాట్లు తెంచుకుని నీ కోసం రాలేనురా! నన్ను క్షమించు.. దయచేసి నాపై కాకుండా నీ కెరీర్‌పై దృష్టి పెట్టు. నీకు మంచి వైఫ్ వస్తుంది. ఇదంతా నీకు అర్థం కావాలని కోరుకుంటున్నా. .. నీ లవ్లీ స్వీటీ -
నన్ను కాదని పెళ్లైన వ్యక్తి మాయలో..
నేను హైదరాబాద్‌లో ఓ ఇంట్లో అద్దెకి ఉండేవాన్ని. ఆ ఇంట్లో నేను పై పోర్షన్లో ఉండేవాన్ని.. క్రింద ఉన్న ఓ పోర్షన్లో ఓ అమ్మాయి ఉండేది. తను అప్పుడే ఎంబీఏ జాయిన్ అయ్యింది. నేను కాంట్రాక్టు వర్క్ మీద బాన్సువాడకి పోయాను. అప్పడు తను చేసిన కాల్‌తో మా మధ్య పరిచయం ఏర్పడింది. చిన్న పరిచయం కాస్తా స్నేహంగా మారింది. మొదట్లో నేను వద్దనుకున్నా కానీ, ఆమె చూపించే ప్రేమకి నేను కూడా పడిపోయాను. ఈ లోపు ఎలా మారిందో తెలియదు కానీ స్నేహం కాస్తా నా వైపు నుంచి ప్రేమగా మారింది. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంతగా అంటే తెలియకుండానే రోజులు గడిచిపోయాయి. మా కబుర్లకు గంటలు కూడా సెకన్లలా గడిచిపోయేవి. తనకి దేవాలయాలు అంటే చాలా ఇష్టం! నన్ను అన్ని టెంపుల్స్‌కి తిప్పేది. నాతో చేయించని పూజలు లేవు. ఒకరిని విడిచి ఒకరం ఉండలేని అనుబంధం మా మధ్య ఏర్పడింది. తెలియకుండానే ఒకరంటే ఒకరికి ప్రాణమైపోయాం. ఏ దేవుడు మమ్మల్ని విడదీయలేడు అనుకున్నా. నా రోజు తన మాటతోనే మొదలవుతుంది.. ముగుస్తుంది. ఎంత బిజీగా ఉన్నా.. నాకు ఐ లవ్ యూ, గుడ్ నైట్ చెప్పనిదే పడుకునేది కాదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకుందామని చాలా సార్లు అనుకున్నాం. ఒకసారి టెంపుల్‌కి వెళ్లాం. కానీ, వేరే కారణం వల్ల తిరిగి వచ్చేశాము. నా ఫోన్ కలువకుంటే తను మా ఫ్రెండ్స్‌కి చేసేది. అంతగా ఇష్టపడేది. తను మా ఇంట్లో వాళ్లతో.. మా బంధువులందరితో మాట్లాడేది. నన్నే పెళ్లి చేసుకుంటానని అందరికీ చెప్పేది. ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అలానే దాచుకున్నాను. ఎంగేజ్మెంట్ అయ్యాక వేరే అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటానని తనే అన్నది. అవన్నీ మరచిపోని అనుభూతులు. తన ఎంబీఏ కంప్లీట్ అయ్యాక కొన్ని రోజులకి తనకు జాబ్ వచ్చింది. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత జాబ్ చేయటం ఇష్టం లేదంది. ‘మొదట్లో ఎక్కడైనా అలానే ఉంటది’ అని చెప్పి నేనే పంపించాను. అదే నేను చేసిన మిస్టేక్.. తన మీద నమ్మకం చాలా ఉండేది. ఆఫీస్‌కు పోయినప్పటి నుండి ఇంటికి వెళ్ళేదాక ఎప్పుడు టైం దొరికినా కాల్ చేసేది. ప్రశాంతంగా సాగిపోతున్న నా ప్రేమ కథలోకి వచ్చిందో ప్రమాదం. ఆఫీస్‌లో పని చేస్తున్న ఓ పెళ్లైన వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి అంత వయస్సు ఉన్న కూతురు.. ఒక అబ్బాయి ఉన్నాడు. కానీ, అతడి ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండదు. అదే తనకి కలిసి వచ్చింది. వాళ్ల మధ్య ఏ బంధం లేదని తను చెబితే నమ్మాను. నేను కూడా అసలు అలా అనుకోలేదు కొన్ని రోజులు. కానీ తను ఫస్ట్‌లో తండ్రి లాంటి వ్యక్తి అంది. పోను పోనూ వాళ్ల మధ్య బంధం దగ్గర అవుతూ.. మా మధ్య బంధం దూరం అవుతూ వచ్చింది. నేను ఫోన్ చేసిన ప్రతీసారి కాల్ వెయిటింగ్ అని వచ్చేది. అడిగితే అమ్మ అనేది. నా కాల్ కట్ చేసి ఆఫీస్‌లో బిజీగా ఉన్నా అని మెసేజ్ పెట్టడం.. ఆఫీస్ అయ్యాక అతడి కార్లో పోతూ మెట్రోలో పోతున్నా అని చెప్పేది. ఆ వ్యక్తి ఇల్లు ఆఫీస్ దగ్గరే.. అయినా ఆమె కోసం ఎక్కడో దూరంగా వున్న తన ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యటం చేసేవాడు. నేను అడిగితే మెట్రోలో పోతున్నా అనటం నాకు అనుమానాన్ని తెచ్చాయి. కొన్ని పరిణామాలతో నాలో అనుమానాలు బలపడ్డాయి. తను నాతో ఉన్నా కూడా ఆ వ్యక్తితో ఫోన్ మాట్లాడేది. నెంబర్ చూపించమంటే తీసేసేది. ఎందుకంటే వేరే ఫ్రెండ్ అని చెప్పేది. నన్ను కాదని ఆ వ్యక్తితో సినిమాలకి షాపింగ్‌లకి పోవడం నాలో భరించలేని బాధని తెచ్చాయి. ఓసారి ఇద్దరూ నా కంట పడ్డారు. సరే అని వదిలేసాను. తర్వాత అడిగాను ‘మీరిద్దరూ ఆఫీస్‌లో ఉండేటోళ్లు కదా మళ్లీ ఎందుకు అక్కడ ఆగటం?’ అని. తనకు చాలా సార్లు చెప్పి చూశాను. కానీ, తను వినలేదు. ‘అలా ఎందుకు చేస్తున్నావ్?’ అని అడగటమే నేను చేసిన తప్పు. ఆ వెంటనే నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. నా నెంబర్ కూడా బ్లాక్ చేసింది. అసలు నేనేమి తప్పు చేశానో నాకే అర్థమవ్వట్లే.. అసలు తను ఎందుకు అలా చేస్తుందో, తను చేసేది తప్పని తనకి ఎందుకు అర్దమవ్వట్లే. ఆ వ్యక్తికి అయినా అది తప్పని అనిపించట్లేదా? తను ఆ వ్యక్తి మాయలో పడటం నాకు ఇంకా బాధగా ఉంది. భరించరాని నరకంలా ఉంది. ప్రేమంటే స్థాయి, అంతస్తులు చూసి లెక్కలేసుకోవడం కాదు. ఏమీ లేకున్నా, ఏమీ ఆశించకుండా నేనున్నాను అనే భరోసా ఇవ్వడం. కానీ, నీకోసం పడే ఈ బాధ కూడా నాకు మధురంగానే ఉంది. తనని వదిలి వస్తాను అని హామీ ఇస్తానంటే జీవితాంతం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. లేదంటే ఇక నువ్విచ్చిన ఈ మధురస్మృతులతోనే జీవితం గడిపేస్తాను.. - నీ నాని -
దానికి వచ్చే జన్మ వరకు ఎదురుచూడాలా?
9వ తరగతి చదువుతున్నపుడు మా క్లాసులోకి కొత్తగా ఓ తమిళమ్మాయి వచ్చింది. తను ఏమంత అందంగా లేదు, నాకు అప్పట్లో ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఓసారి బయట గొడవలలో ఆ అమ్మాయి అన్నతో గొడవ పడ్డాము. వాళ్ల అన్నతో గొడవపడినందుకు తను నాతో గొడవపెట్టుకుంది. అలా అలా ఎప్పుడూ క్లాస్‌లో గొడవపడే వాళ్లము. నేను లెక్కలు బాగా చేసేవాడిని. అందువల్ల నేను గ్రూప్ లీడర్‌గా ఉండే వాడిని. ఆ అమ్మాయి నా గ్రూప్‌లో మెంబర్. అలా మా మధ్య ఫ్రెండ్షిప్ మొదలయింది. 10వ తరగతిలో వేరే అమ్మాయి నాతో క్లోజ్‌గా ఉంటే తను నన్ను తిట్టేది. రోజు నా కోసమే త్వరగా స్కూల్‌కు వచ్చేది. అలా స్కూల్ లైఫ్ అయిపోయింది. అప్పట్లో ఫోన్స్ వాడకం లేకపోవడం వలన మా మధ్య ఎలాంటి పరిచయం లేకుండా పోయింది. ఇంటర్లో తను ఏదో సిటీలో.. నేను మా ఊరిలో చదువుకున్నాము. ఆ తర్వాత నేను బీటెక్ సిటీలోని మంచి కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. క్లాస్‌లో మొదటి రోజు మొదటి బెంచ్‌లో ఒక అమ్మాయి కూర్చుని ఉంది. వెనుక నుండి చూడడానికి తను ఆచ్చం నా స్కూల్ ఫ్రెండ్‌లానే ఉంది. పలకరించడానికి వెళ్లాను కానీ తను వేరు. అలా నా బీటెక్ లైఫ్‌లో మొదటిగా ఒక అమ్మాయితో పరిచయం.. అదీ నా స్కూల్ ఫ్రెండ్ ఆలోచనలతో మొదలయింది. 7 సంవత్సరాల తరువాత టెన్త్ క్లాస్ వాళ్లము గెట్టుగెదర్ అయ్యాం. కానీ తను రాలేదు. ఇంకొక అమ్మాయి ద్వారా ఆ అమ్మాయి నెంబర్ దొరికింది. పలకరించడానికి కాల్ చేశా! తను నా కాల్ ఆన్సర్ చేసి ‘నేను బిజీగా ఉన్నా’ అని రిజెక్ట్ చేసింది. తరువాత రోజు తనే కాల్ చేసి సారీ అంది. బాగోగులు తెలుసుకున్నాం. అప్పటి నుండి నాలుగు నెలలు బాగా చాట్, కాల్స్ చేసుకునేవాళ్లము. ఒక రోజు తను పంపిన ప్రశ్న" వచ్చే జన్మలో నాతో నీకు ఎటువంటి రిలేషన్ కావాలి " దానికి నేను ‘ఫ్రెండ్’ అని సమాధానం ఇచ్చాను. అదే ప్రశ్న తనకు పంపి తన సమాధానం అడిగితే " భర్త " అని సమాధానం పంపింది. తన మీదున్న ఆసక్తి లేదా ఇష్టమో తెలియదు వెంటనే నా సమాధానం " దానికి వచ్చే జన్మ వరకు ఎదురుచూడాలా? " అని అడిగాను. తను " ఐ లవ్ యూ " అని మెసేజ్ పంపింది. నేను ‘లవ్ యు టూ’ అని రిప్లై పెట్టాను. అలా మొదలైన మా రిలేషన్ చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవలుగా మారి ఇద్దరం విడిపోయే వరకు వచ్చి.. మళ్లీ ఒకరికొకరు ఎదురు పడితే అన్ని విషయాలు మరచిపోయి జీవితంలో ముందుకు వెళ్లే వాళ్లము. అలా ఇద్దరం 11 సంవత్సరాలు ప్రేమలో గడిపాము. తను నా కోసం చాలా మారింది. నన్ను మా అమ్మలా చూసుకునేది. నా కోపాన్ని ముందే పసిగట్టేది. నాకు ఇష్టం లేని పని తనకు ఎంత ఇష్టమైనదైనా చేసేది కాదు. ఎప్పుడు నా ఆలోచనలతో నాతో మాత్రమే ఫోన్లో మాట్లాడేది. రోజులో చివరి మాటా నాతోనే మొదటి మాటా నాతోనే. ఇద్దరం మంచి పోజిషన్లో సెటిల్ అయ్యాము. నేను బిజినెస్‌లో.. తను జాబ్‌లో. హ్యాపీగా లైఫ్ వెళ్తున్న సమయంలో మా ఇంట్లో పెళ్లి చూపులు అరెంజ్ చేశారు. వెంటనే మా అమ్మకు మా విషయం మొత్తం చెప్పాను . తను వేరే కులం అని, వేరే ప్రాంతం అని ఒప్పుకోలేదు. చాలా సార్లు చెప్పిచూశా.. గొడవ పడినా మా ఇంట్లో వాళ్లు మారలేదు. అప్పుడు కూడా తనకు విషయాలు చెప్తూ ఫోన్లో మాట్లాడేవాడిని. నా బిజినెస్‌లో కష్టం వచ్చిన ప్రతిసారి తను నా పక్కన నిలబడి నాకు ఒక సపోర్ట్ ఇచ్చేది. ఇంటిలో గొడవలు, బిజినెస్ టెన్సన్స్.. తనకు జాబ్ టెన్సన్స్. ఇద్దరి వయసులు పెళ్లికి దగ్గరగా వస్తున్నాయి. ఇంట్లో వాళ్లు ఫోర్స్ చేస్తున్నారు. ఎంత చెప్పినా ఇంట్లో ఒప్పుకోలేదు. ఒకసారి ఆమెను కలిసి విషయం చెప్పి పట్టుకుని ఏడ్చేశా. నా లైఫ్‌లో 22 సంవత్సరాల తరువాత నేను ఏడవడం చూసి తను ఏమనుకుందో తెలియదు . తరువాత తను, నన్ను నా ఫ్యామిలీ కోసం త్యాగం చేసింది. నా నెంబర్ బ్లాక్ చేసింది, ఎంత ప్రయత్నించినా తను నాతో మాట్లాడలేదు. కానీ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటే తను 23 రోజులు రూమ్ నుండి బయటకు రాకుండా ఏడుస్తూ గడిపిందని. మూడు నెలలు తను నా ఆలోచనలతో రోజులు గడిపిందని తెలిసింది. నా ఫ్యామిలీ ఆనందం కోసం నన్నే త్యాగం చేసిన అమ్మాయిని కోల్పోయి నేను జీవితంలో ఓడిపోయాను. ప్రతి రోజు తన ఆలోచనలు, తన జ్ఞాపకాలే. బహుశా ప్రేమలో ఆనందం కన్నా బాధ ఎక్కువ ఉంటుందనడానికి మా జీవితాలు ఒక ఉదాహరణ. నా ప్రాణం ఉన్నంత వరకు తను ఎప్పటికి నా ప్రియురాలే తనే నా మొదటి ప్రేమ.. చివరి ప్రేమ. ఇట్లు నా" సిరి "ని అందుకోలేని దురదృష్టవంతుడు.. రాజు లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
కొట్టినా, తిట్టినా.. పెళ్లంటూ చేసుకుంటే బావనే!..
నేను 2010లో 10వ తరగతి మా మావయ్య వాళ్ల ఇంట్లో ఉండి చదువుకున్నా. మావయ్యకి ఒక అమ్మాయి ఉంది. తన పేరు రేణుక తను నా కన్నా 2 ఏళ్లు చిన్నది. తనంటే నాకు చాలా ఇష్టం! నేనంటే కూడా తనకి చాలా ఇష్టం. మేము ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్లం. నా 10వ తరగతి అయిపోయాక నేను మా ఊరికి వెళ్లిపోయా. వాళ్ల ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి నాకు నా మరదలే గుర్తొచ్చేది. తనకి ఎలాగైనా నా ప్రేమ గురించి చెప్పాలనుకున్నా. ఒక రోజు వాళ్ల ఇంటికి వెళ్లా. ’నీతో మాట్లాడాలి’ అని అన్నా. తను ‘ఏంటి చెప్పు!’ అంది. నాకు ధైర్యం చాలలేదు.. చాలా భయం వేసింది. మేము భోజనం చేసే టైమ్‌లో నా దగ్గర ఉన్న కీ పాడ్ సెల్ ఫోన్లో ఐ లవ్ యూ సింబల్స్ చూపించా. అది చూసి నా మరదలు ‘ఏంటి’ అని నవ్వింది. నేను కొంచెం ధైర్యం చేసి ‘నేను నిన్ను ప్రేమస్తున్నాను’ అని చెప్పేశా. తను ఏం మాట్లాడలేదు. ఆ రోజు నేను మా ఇంటికి వెళ్లిపోయాను. రెండురోజుల తర్వాత తను నాకు ఫోన్ చేసింది! వాళ్ల నాన్న ఫోన్ నుండి. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది 2010 నవంబర్ 15. ఆ రోజు తను ఫోన్ చేసి ‘నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం’ అని చెప్పింది. ఇక చూడు నా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ రోజు అంతా నిద్ర కూడా పట్టలేదు. తన గురించే ఆలోచిస్తూ ఉండిపోయా. అలా రెండు సంవత్సరాలు గడిచిపోయింది. 2012లో నేను పాలిటెక్నిక్ మూడో సంవత్సరం. తనేమో పదో తరగతి చదువుతోంది. అప్పుడే మా విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఆ రోజు చాలా పెద్ద గొడవ అయ్యింది. మా మావయ్య నా మరదలని కొట్టాడు కూడా. ఇంట్లో ఎంత తిట్టినా, కొట్టినా నేనే కావాలని చెప్పేసింది. ‘పెళ్లంటూ చేసుకుంటే బావనే చేసుకుంటా’ అని చెప్పింది. ఆ రోజు నుంచి వాళ్ల ఇంటికి వెళ్లడం మానేశా. ఓ సంవత్సరంనర్ర పాటు మేము ఒకరినొకరం కలవలేదు, మాట్లాడుకోలేదు. మా ప్రేమ గురించి మా ఇంట్లో.. వాళ్ల ఇంట్లో మా బంధువులందరికీ తెలిసిపోయింది. 2013లో పాలిటెక్నిక్ కంప్లీట్ అయ్యాక నాకు జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ ఆ అమ్మాయిని తలుచుకుంటూ అలా రోజులు గడిచిపోయాయి. తను ఇంటర్ కాలేజ్‌లో జాయినయ్యింది. ఒకరోజు తను నాకు ఫోన్ చేసింది. వాళ్ల ఫ్రెండ్ మొబైల్ నుంచి. ఆ రోజు మేము చాలా మాట్లాడుకున్నాం. వాళ్ల ఇంట్లో ఏమంటున్నారో చెప్పింది. ‘తనకి ఇష్టమైన వాళ్లనే ఇచ్చి పెళ్లి చేస్తా’ అని వాళ్ల నాన్న అన్నాడని చెప్పింది. నాకు చాలా ఆనందం వేసింది. అప్పటినుంచి మేము మళ్లీ డైలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేసుకునే వాళ్లం. నేను డైలీ వాళ్ల కాలేజీ దగ్గరకు వెళ్లి కలిసేవాడిని. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. 2015లో నేను ఇంటిదగ్గరలో జాబ్ చేస్తే వాళ్ల నాన్నకి ఎక్కువుగా కనిపిస్తూ ఉంటానని హైదరాబాద్‌లో జాబ్ చూసుకుని వెళ్లిపోయా. అలా మూడు సంవత్సరాలు గడిచిపోయింది. 2018 నా మరదలు డిగ్రీ అయిపోయింది. తనకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. విప్రో కంపెనీ హైదరాబాద్‌లో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను హైదరాబాద్ వచ్చేసింది. మేము డైలీ మీట్ అయ్యేవాళ్లం. ఫోన్ కాల్స్, మెసేజెస్ ఇలా మేము చాలా దగ్గరైపోయాం. - రాజు, కాకినాడ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఎందుకు బావ అవాయిడ్ చేస్తున్నావ్?
నేను బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నాను. అప్పుడు మా నాన్న గారికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ ఉన్నాను. ఒక వారం రోజులు అక్కడే ఉన్నాను. నేను మా అమ్మ, నాన్నమ్మ అక్కడే ఉన్నాం. అప్పుడే ఫేసుబుక్‌లో ఒక మెసేజ్ వచ్చింది ‘హాయ్’ అని, నేను కూడా ‘హాయ్’ అని రిప్లై ఇచ్చాను. తనకి నేను తెలిసిన వారిలా చాట్ చేశాడు. నేను మా బాబాయిని అడిగాను.. ఇలా ఎవరో చాట్ చేస్తున్నారని. తను నీకు వరసకి బావ అవుతాడని చెప్పాడు. మన వాళ్లే కదా అని చాట్ చేశాను. చాటింగ్ తరవాత కాల్స్.. అలా అలా చాలా మాట్లాడుకున్నాము. తను నాకు ప్రపోస్ చేశాడు. నాకు అలాంటి ఆలోచన లేదన్నాను. నాకు చదువు, మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటం అదే తెలుసు. తను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నాకు కొంత టైం కావాలి అన్నాను. ఒక రోజు నాన్న గారిని హాస్పిటల్ తీసుకుని వెళ్లాం. తను ఆ రోజు మా దగ్గరకు వచ్చాడు. అదే ఫస్ట్ టైం తనని చూడటం! చూడగానే తను నాకు నచ్చారనిపించింది. మా ఇంట్లో చెప్పాను. కులాలు కూడా ఒక్కటే అవ్వటం వల్ల మా ఇంట్లో ఒపుకున్నారు. ‘మా ఇంట్లో ఒప్పుకోవాలంటే మంచి జాబ్ తెచ్చుకోవాలి. అప్పుడే మా ఇంట్లో చెప్తాను’ అన్నాడు. అవును కదా మంచి పొజిషన్లో ఉంటే అందరికీ మంచిది కదా అని అనుకున్నాను. తను జాబ్ కోసం హైదరాబాద్ వెళ్లాడు. కానీ తనకి జాబ్ రాలేదు. నాకు హైదరాబాద్‌లో జాబ్ వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్లాను. రోజులు గడుస్తున్నా తనకి జాబ్ రాలేదు. మా ఇంట్లో నాకు మంచి సంబంధాలు వస్తున్నాయి. ‘తనకి జాబ్ లేదు కదా! ఈ సంబంధం చేసుకో’ అని మా నాన్నమ్మ ఫోర్స్ చేసింది. అప్పుడే తనకి నాకు తెలిసిన ఆఫీసులోనే జాబ్ ఇప్పించాను. మా ఇంట్లో ‘పెళ్లి చూపులకు వచ్చి వెళ్లు’ అని ఫోర్స్ చేశారు. నేను ఆ విషయం తనకి చెప్పాను. ఒకసారి వెళ్లిరా .. అని చెప్పాడు. కానీ తనకు జాబ్ చేసే దగ్గర ఒక అమ్మాయి పరిచయం అయింది. తను నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. కానీ నాకు నాకు తెలియదు వాళ్లు లవ్ చేసుకుంటున్నారని. నేను అడిగాను ‘ఎందుకు బావ నన్ను అవాయిడ్ చేస్తున్నావ్! అని అప్పుడు నన్ను చాలా తిట్టాడు. పెళ్లి చూపులకి ఎందుకు వెళ్లావ్ అని. కానీ, నిజం ఏమిటంటే తను వెళ్లమంటేనే నేను వెళ్లాను. మా ఇంట్లో టైం అడిగి వచ్చాను. అది తను నమ్మలేదు. నన్ను వదిలించుకోవడానికే ఇదంతా చేశారని నాకు తెలిసింది. నాకు తనంటే చాలా ఇష్టం తన కోసం ఏమైనా చేస్తా అని తెలుసు. అందుకేనేమో తను త్వరగా ఆ అమ్మాయిని వాళ్ల ఇంట్లో చెప్పి 15రోజులకే పెళ్లి చేసుకున్నారు. నాకు చచ్చిపోవాలనిపించింది. చాలా ఏడ్చాను, కానీ తను చాలా హ్యాపీగా ఉన్నాడు. అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. అదే నా ఫస్ట్ లవ్ కూడా. కానీ ఎప్పుడు తను హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. - బుజ్జి, గుంటూరు లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆమె చేసిన మోసాన్ని భరించలేకపోయా!
ఉన్నత చదువుల కోసం స్వగ్రామాన్ని వదిలి విశాఖపట్నంలో చదువుకుంటున్న రోజులవి. 2010 అక్టోబర్ 10న అమ్మ డబ్బులు పంపితే తీసుకోవడానికి ఆర్టీసీ బస్టాండుకు వెళ్లా. అక్కడే తనని మొదటిసారి చూశా. తనకి, నాకు సుమారు 50 అడుగులకుపైగా దూరం. తన కళ్లు నన్ను ప్రత్యేకంగా ఆకర్షించాయి. నేను కూడా తననే చూస్తూ ఉండిపోయా. కాసేపటికి తను వెళ్లిపోయింది. తన వెంటే వెళ్దాం అనుకున్నా. కానీ కుదరలేదు. అలా అప్పటికి తనని మిస్ అయ్యా. కానీ తన ఊహల నుండి దూరం కాలేకపోయా. దాదాపు పది రోజులు గడిచింది. మళ్లీ నేను బస్సులో ఉండగా.. తను ఎదురుగా బస్సు కోసం చూస్తోంది. అప్పుడూ తను నన్ను చూసింది. తన కళ్లు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మరో నాలుగు రోజులకి అంటే అక్టోబర్ 24న మేం ఉంటున్న వీధిలో కనిపించింది. నాకోసమే వచ్చిందేమో అనుకున్నా. కానీ తను ఉండేది మా వెనుక వీధిలోనేనని తెలిసింది. ఆలస్యం చేయడం ఇష్టం లేక వెంటనే పేరు అడిగి తెలుసుకున్నా. పేరు కాస్త పాతగానే ఉండడంతో ఓ... అన్నా. అంతే నా వైపు సీరియస్‌గా చూసింది. నేను సర్ది చెప్పేలోగా వెళ్లిపోయింది. తన వెంటే వెళ్లా. తను రోజూ ఆ దారిలోనే కాలేజీకి వెళ్తోందని తెలిసి.. నా మొదటి క్లాస్ ఎగ్గొట్టి మరీ తనకోసం ఎదురు చూసేవాణ్ని. తర్వాత కొద్ది రోజులకు ఫోన్ నెంబర్లు మారాయి, మాటలు పెరిగాయి. నిజానికి తనంటే నాకు ఎంత ఇష్టమో తనకి నేనంటే అంతకంటే ఇష్టమని చెప్పింది. తనే ప్రపోజ్ చేసింది. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పా. అలా ఏడాది గడిచింది. నేను పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చా. అప్పటి నుండి తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేసేది కాదు. ఎప్పుడూ కాల్ వెయిటింగ్. కొత్త కొత్త సిమ్ కార్డులు తీసుకునేది. కలిసినప్పుడు ఆ సిమ్ కార్డులు తీసి తన పర్సులో పెట్టేది. ఒక సారి ఏదో నెంబర్ నుండి మెసేజ్ వస్తే ‘ఎవరు’ అని అడిగా ‘అన్నయ్య’ అని చెప్పింది. ఆ నెంబర్‌కు కాల్ చేశా. నన్ను తన అన్నయ్యగా ఆ వ్యక్తికి చెప్పిందన్నాడు. మనసు విరిగిపోయింది. తర్వాత మరో వ్యక్తి అర్ధరాత్రిపూట కాల్ చేసి బయటకు వెళ్దాం అన్నాడు. ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఎదురింటి వ్యక్తి అని తర్వాత తెలిసింది. చివరికి నేను హైదరాబాద్‌లో ఉంటే నాకోసం హైదరాబాద్ వెళ్తున్నా అని తన ఎదురింటి వ్యక్తికి చెప్పింది. కానీ నన్ను అన్నయ్యగా పరిచయం చేసిన వ్యక్తితో కలిసి హైదరాబాద్ మొత్తం తిరిగి వారం రోజులు వాళ్లింట్లోనే ఉందని తర్వాత తెలిసింది. అయినా తనే కావాలనుకున్నా. చివరికి నువ్వు నాకొద్దు అంటూ వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. నాకు కన్నీరు మిగిల్చింది. తను చేసిన మోసాన్ని భరించలేకపోయా. ఉన్న ఉద్యోగం వదిలేశా. పిచ్చోడిలా చీకటి గదిలో రోజుల తరబడి కూర్చుని ఏడ్చా. ఇప్పుడు నన్ను ఇష్టపడ్డ మనిషిని పెళ్లి చేసుకున్నా. తన పేరు వినిపించిన ప్రతిసారి పాత గాయం నొప్పెడుతూనే ఉంది.. గొంతు మెలిపెడుతూనే ఉంది. - సంతోష్, విజయవాడ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
‘హాయ్!’.. ‘హాయ్ పవర్ స్టార్’..
నేను ఆరవ తరగతి కంప్లీట్ చేసుకుని ఏడవ తరగతికి స్కూల్ మారాను. 2008లో మొదటిసారి స్కూల్లోకి అడుగుపెట్టాను. అలా స్కూల్లోకి అడుగుపెట్టిన మొదటిసారి నేను చూసిన అమ్మాయి తను. 2012లో నా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యేవరకు నేను మాట్లాడలేదు. చివరి రోజు తనతో మాట్లాడిన మాటలు ‘ఎగ్జామ్ ఎలా రాశావ్?’ అని. తను బాగా రాశానని చెప్పింది. తనను ఆ రెండు మాటలు అడగటానికి చాలా ధైర్యం తెచ్చుకుని వెళ్లాను. నాలో ఉన్న ప్రేమను మాత్రం చెప్పలేకపోయాను. తర్వాత నా పదో తరగతి క్లాస్‌మేట్స్‌తో ఎవరితోనూ నేను టచ్‌లో లేను. నాలుగేళ్ల తర్వాత మా స్కూల్ ఫ్రెండ్ ‘ఫేస్బుక్లో తన ఐడీ చూసి రిక్వెస్ట్ పంపించు’ అని ఐడియా ఇచ్చాడు. 2011- 2012లో మా స్కూల్ రీయూనియన్ అయ్యాము. అలా మళ్లీ తనని కలుసుకున్నా. అప్పుడు కూడా మాట్లాడలేదు. తన మొబైల్ నెంబర్ తీసుకుని మా ఫ్రెండ్ దగ్గర నుంచి హాయ్ అని మెసేజ్ చేస్తే తను ఇచ్చిన రిప్లై ఇప్పటికీ మర్చిపోలేను. ‘హాయ్ పవర్ స్టార్’ అని తను రిప్లై ఇచ్చింది. తర్వాత ఓ రెండు నెలలు బాగా మాట్లాడుకున్నాం. నా ప్రేమను ఎలాగైనా తనకు చెప్పాలని మెసేజ్ చేశా. తను నా ప్రేమను ఒప్పుకోలేదు. అలా అని ఎవర్నీ ప్రేమించలేదు. అమ్మానాన్న చూసిన అతన్ని చేసుకుంటా అంది. నేను తనకు ఇష్టం లేకపోయినా ప్రేమించు అని బ్యాడ్‌గా బిహేవ్ చేశా. తను నాకు దూరమై 3 సంవత్సరాలు గడిచింది. తను దూరమైన తర్వాత నాకు అర్థమైంది. నేను ప్రేమించటం.. తను నన్ను ప్రేమించాలని అనుకోవటం నా తప్పు. ఇద్దరూ ప్రేమించుకునే అవకాశం దేవుడు కొందరికి మాత్రమే ఇస్తాడు. అలాంటి వాళ్లు చాలా లక్కీ.. తను చెన్నైలో ఉంటుంది. 2017లో వరదలు వచ్చినపుడు తనకోసం వెళ్లాను. ఓ రెండు రోజులు తిరిగాను. తను కనిపించలేదు. తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. ఆమె కోసం తీసుకెళ్లిన ఫుడ్ అక్కడున్న వాళ్లకు ఇచ్చేశాను. వాళ్లతో కలిసి అక్కడే నేనూ తిన్నాను. తర్వాత తనని నేను కలవలేదు. తను లేదని నేను ఎప్పుడూ బాధపడలేదు! తనెప్పుడూ నాతోనే ఉంది. - జగదీశ్వర్‌రెడ్డి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఓ విలువైన ముత్యాన్ని కోల్పోయా..
నా మరదలు అంటే నాకు చిన్నప్పటి నుంచి మహా ఇష్టం. ఆమె గుణం మంచిది! అందుకే ఇష్టపడేవాడ్ని. మేము పెద్దగా మాట్లాడుకోలేదు కానీ ఫంక్షన్స్‌కు వెళ్లినపుడు ఆమెని చూసేవాడిని. కాలం గడిచింది. ఆమె డిగ్రీ చేసే టైంలో ఫోన్లో మాట్లాడేవాడిని. సంతోషంగా అనిపించేది. ఆమె గురించి ఇంకా ఎక్కువ తెల్సింది. ఇంకా ఇష్టపడ్డాను. నాకు పెళ్లి సంబంధాలు చూసే సమయం అది. నా మరదలిని చేసుకోవటం నాకు ఇష్టం. కానీ, ఆమెకి నేను అంటే ఇష్టమో కాదో తెలీదు. మా మధ్య వయస్సు కూడా పది సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. ఇంకోటి ఆమె ఇంకా చదువుతూనే ఉంది. వాళ్లకి మాకు కూడా అప్పట్లో అంత మంచి సంబంధాలు లేవు. అందుకే ఆ అమ్మాయి నా జీవితంలోనుంచి మిస్ అయిపోయింది. కొంత కాలానికి గాని నాకు అర్ధం కాలేదు! జీవితంలో ఒక విలువైన ముత్యాన్ని కోల్పోయా అని. ఇప్పటికి ఆమెతో మాట్లాడే అవకాశం ఉంది. కానీ నా ప్రేమను మాత్రం ఆమెకి వ్యక్తపర్చలేను. అమ్ములు నిన్ను నా మనసులో నుంచి.. హృదయంలో నుంచి ఎప్పటికీ తీసివేయలేను. అది నా వల్ల కాదు. అతి ప్రేమ వల్ల నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టాను. నన్ను క్షమించి అర్ధం చేసుకో. నాకు ఇక ఎవరూ లేరు. నీ స్థానం భర్తీ చేసేవాళ్లు కూడా లేరు. - ప్రేమ్ సాగర్, ఖమ్మం చదవండి : నా మీద కేసు పెట్టింది.. భయంగా ఉంది షాకింగ్ న్యూస్! చాలా కూల్‌గా చెప్పింది! లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నా మీద కేసు పెట్టింది.. భయంగా ఉంది
మేమిద్దరం దాదాపు 14ఏళ్లనుంచి ప్రేమించుకుంటున్నాము. తను నన్ను చాలా ఇష్టపడింది. నన్ను చాలా బాగా చూసుకునేది. మేమిద్దరం కలిసి తిరగని ప్రదేశమంటూ ఏదీ లేదు. షాపింగ్‌లు, సినిమాలు, బీచ్‌లు ఎక్కడికిపడితే అక్కడికి వెళ్లేవాళ్లము. అమ్మ చనిపోయినపుడు నాకు ఫోన్ చేసి ‘నేనే మీ అమ్మను’ అని చెప్పింది. అప్పటినుంచి తనంటే నాకు ప్రాణం. తను లేకుండా నేను అసలు ఉండలేకపోయేవాడిని. నా కోసం చాలా రిస్క్‌లు చేసింది. ఇద్దరం ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నాం. సడెన్‌గా ఓ రోజు మా ఇద్దరి సంగతి మా వాళ్లకు తెలిసిపోయింది. ఆ అమ్మాయికి ఏం చెప్పారో తెలియదు కానీ, పదిరోజుల్లో నన్ను వదిలేసింది. నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేసింది. నాతో మాట్లాడటం మానేసింది. నన్ను మానసికంగా కృంగదీసింది. నిద్ర మాత్రలు వేసుకుంటేనే కానీ, నిద్రరాని పరిస్థితి ఏర్పడింది. ఏం జరిగిందో నాకేమీ అర్థంకావటం లేదు. దానికి తోడు నామీద కేసుకూడా పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నడుస్తోంది. నేనేమి తప్పు చేశానో నాకు తెలియటం లేదు. నా బాధ ఏమిటంటే రేపు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే. ఆ వ్యక్తికి మా పెళ్లి విషయం తెలిస్తే తనను ఏం చేస్తాడోనని భయంగా ఉంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నా. వాళ్ల పేరెంట్స్ ఆడిన గేమ్‌లో బలిపశువునయ్యాను. - రాజు, రాజమండ్రి. చదవండి : షాకింగ్ న్యూస్! చాలా కూల్‌గా చెప్పింది! ప్రేమ ఓకే! పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరు.. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
షాకింగ్ న్యూస్! చాలా కూల్‌గా చెప్పింది!
2016 అక్టోబర్ 12న ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా తనతో పరిచయం ఏర్పడింది. తను నా ఫ్రెండ్ వాళ్ల కజిన్ సిస్టర్. ఉద్యోగం కోసం నా ఫ్రెండ్ తనకు నా ఫోన్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వమంది. అందుకే తను నాకు మెసేజ్ చేసింది. వాట్సాప్‌లో తన డీపీ చూడగానే తనతో ప్రేమలో పడిపోయా. బహుశా అది లవ్ ఆట్ ఫస్ట్ సైట్ అనుకుంటా. ఇలా డైలీ మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో మా పరిచయం ప్రేమగా మారింది. ఓ రోజు నేను తనకు ప్రపోజ్ చేశా. తను నా ప్రేమను అంగీకరించింది. ఓ సంవత్సరం పాటు డీప్ లవ్‌లో ఉన్నాము. లేట్ నైట్ చాటింగ్స్, ఫోన్లు మాట్లాడుకునేవాళ్లం. ఓ రోజు నేను మా పేరెంట్స్‌కు మా ప్రేమ విషయం చెప్పేశాను. మా వాళ్లు ఒప్పుకున్నారు. మా పేరెంట్స్ వెళ్లి తన పేరెంట్స్‌తో మాట్లాడారు. అయితే వాళ్లు ఒప్పుకోలేదు. మేము మా పేరెంట్స్‌కు తెలియకుండా మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. తను ఎప్పుడైనా నన్ను పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉండేది. కానీ, నేను కొద్దిగా టైం తీసుకుని పెళ్లి చేసుకుందాం అని కన్విన్స్ చేస్తూ వచ్చాను. అలా 2019 ఆగస్టు వరకు టైం వేస్ట్ చేశాను. తను సడెన్‌గా నా మెసేజ్‌లకు, కాల్స్‌కు రిప్లై ఇవ్వటం మానేసింది. నేను తన రిప్లై కోసం ఓ రెండు, మూడు రోజులు ఎదురుచూశాను. కానీ, లాభం లేకపోయింది. నేను వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న కారణంగా తనని నేరుగా కలవటం వీలుకాలేదు. ఓ వారం తర్వాత తనని కలిశాను. ‘ఏంటి ప్రాబ్లమ్’ అని తనని అడిగా.’ అప్పుడు తను ‘నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది.’ అని షాకింగ్ న్యూస్‌ను కూడా చాలా కూల్‌గా చెప్పింది. ఆ నిమిషం నేనేం చేయాలో అర్థం కాలేదు. తనను కన్విన్స్ చేయటానికి చాలా ట్రై చేశాను. తను ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఫోన్ నెంబర్ మార్చేసింది. నేరుగా వాళ్ల ఇంటికి వెళితే.. తన పేరెంట్స్ నన్ను తనతో మాట్లాడనివ్వటం లేదు. గత డిసెంబర్ 12న తన ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పటికీ నేను తనని ప్రేమిస్తున్నాను. ఈ బాధనుంచి నేనెలా బయటపడాలో అర్థం కావటం లేదు. అమ్మాయిలు మారిపోవటానికి ఒక్కక్షణం కూడా పట్టదు. తను మాత్రం చాలా హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. నా గురించి ఒక్క నిమిషంకూడా ఆలోచించలేదు. నేను మాత్రం తన ప్రేమలోనుంచి బయటకు రాలేకపోతున్నా. ఇప్పటికైనా తను నాకోసం వస్తుందనే నమ్మకంతో.. - శ్రీకాంత్‌రెడ్డి, కడప లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ప్రేమ ఓకే! పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరు..
నేను 2011నుంచి 2017వరకు హైదరాబాద్‌లో జాబ్ చేసేవాడిని. అలా చేస్తున్న టైంలో ఫేస్బుక్ రవి, లాస్య గ్రూపులో ఒక పోస్ట్‌పై ఓ అమ్మాయి కామెంట్ చేసింది. ఆ ఫ్రోఫైల్ చూసి నేను ‘హాయ్’ అని మెసేజ్ పెట్టా. కొద్దిసేపటికే తను కూడా ‘హాయ్’ అని రిప్లై ఇచ్చింది. అలా మా మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి బాగా మెసేజ్‌లు చేసుకునేవాళ్లం. తర్వాత తను ఫోన్ నెంబర్ ఇచ్చింది. తర్వాతినుంచి మెసేజ్‌లు, కాల్స్ చేసుకునేవాళ్లం. ఒకరి ఫోటోస్ ఒకరం పంపుకున్నాం. ఒకరోజు కలుద్దామని అనుకున్నాం. తను పురానాపూల్ దగ్గర ఉంటుంది, నేను కేపీహెచ్పీలో ఉంటాను. ఇద్దరం జూపార్క్‌లో కలుసుకున్నాం. తర్వాతినుంచి ఇద్దరి మధ్యా ప్రేమ మొదలైంది. నేను నా లవ్‌ని చెప్పాను. మొదట్లో తను నో చెప్పినా.. తర్వాత ‘‘ఓన్లీ ప్రేమ మాత్రమే.. పెళ్లికి ఇంట్లోవాళ్లు ఒప్పుకోరు! ప్లీజ్’’ అంది. నేను సరే అన్నాను. అలా మేము చాలా హ్యాపీగా ఓ సంవత్సరం ప్రేమించుకున్నాం. తనప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేది. తన చదువు పూర్తయిన తర్వాత ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తామని అన్నారంట. పెళ్లి చేసుకుందామని బ్రతిమలాడినా కూడా వినలేదు! ఏడ్చాను కూడా. ‘ మన కులాలు వేరు మా ఇంట్లో తెలిస్తే గొడవలు అయిపోతాయి.’ అని చెప్పింది. 2017లో తను మ్యారేజ్ చేసుకుంది. సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది. పెళ్లికి ముందు తను చూపిన ప్రేమ జన్మలో మర్చిపోలేను. తను చాలా చాలా మంచిది. ఇప్పుడు హ్యాపీగా ఉంది అదిచాలు నాకు. నేను నా జాబ్‌లో బిజీ అయిపోయాను.‘‘ నాకు ఫోన్ కానీ, వాట్సాప్ కానీ చేయోద్దు. మా హబ్బీ చూస్తే నాకు డేంజర్’ అంది. సో నేను తనను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే తనంటే నాకు చాలా ఇష్టం. ఆమె హ్యాపీగా ఉంది అది చాలు. - రామ్, పుట్టపర్తి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నాకు ధైర్యం వచ్చింది.. ఆమె రిప్లై ఇచ్చింది
నేను, తను చిన్నప్పుడు 5వ తరగతి వరకు కలిసి చదువుకున్నాము. నేను తనతో తప్ప అందరితో మాట్లాడేవాడిని. తను కూడా నాతో అంతగా మాట్లాడేది కాదు.. ఏదో ఒక సందర్భంలో మాట్లాడేవాళ్లం. అలా ఉండగా తరువాతి సంవత్సరం తను వేరే స్కూల్‌కు వెళ్లిపోయింది. నాతో మాట్లాడే నలుగురు నా పక్కనే ఉన్నా ఏదో తెలియని వెలితి ఉండేది. సరిగ్గా తొమ్మిది సంవత్సరాల తరువాత నేను బీటెక్ రెండవ సంవత్సరంలో ఉన్నపుడు తన కోసం ఫేస్బుక్లో వెతికి చూశాను. తన ఐడీ దొరికింది కానీ, రిక్వెస్ట్ పంపడానికి రెండు నెలలు పట్టింది. రిక్వెస్ట్ పంపిన చాలా రోజుల తర్వాత ఒక రోజు తను ఆక్సెప్ట్ చేసినట్లు నోటిఫికేషన్ వచ్చింది. రెండు వారాల తర్వాత మెసేజ్ చేయడానికి ధైర్యం వచ్చింది. తన దగ్గరినుంచి కూడా రిప్లై వచ్చింది. అలా వారానికి ఒకసారి మెసేజ్ చేసేవాడిని. ఓ రోజు తన నెంబర్ అడిగితే ‘ఎందుకు? ఫేస్బుక్ ఉందిగా’ అని తను నెంబర్ ఇవ్వలేదు. కొన్ని రోజుల తరువాత ఎగ్జామ్స్ ఉండడం వలన వేరే కారణం చెప్పి! ‘నేను ఫేస్‌బుక్‌లోకి రాను’ అని నా సెల్ నెంబర్ తనకిచ్చి ‘మెసేజ్ చేయాలనిపిస్తే చేయ్!’ అని చెప్పా. పది రోజుల తరువాత వాట్సాప్‌లో మెసేజ్ చేసింది. అలా రెండు సంవత్సరాలు ప్రతిరోజూ వాట్సాప్ ద్వారా మాట్లాడుకునేవాళ్లం. అనుకోకుండా కొన్ని రోజులు తను మెసేజ్ చేయడం మానేసింది. రెండు సార్లు అడిగాను ‘ఊరికే చేయలేదు. ఇంకో వాట్సాప్ వాడుతున్నా’ అని ఆన్లైన్ నుంచి వెళ్లిపోయేది. ‘సరే! ఇక నిన్ను డిస్ట్రబ్ చేయను’ అని చెప్పాను. ఈ జనవరి 2వ తేదికి మేము మాట్లాడక రెండు సంవత్సరాలు గడిచిపోయింది. తను నన్ను వదిలి వెళ్లిపోయినప్పుడు మొదలైన వెలితి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చినా అలానే ఉంది. ఈ రెండు సంవత్సరాలలో నేను నిన్ను డైరెక్ట్‌గా చూడకపోయినా భవిష్యత్‌లో ఎప్పుడన్నా చూస్తే నీ ముఖంలో చిరునవ్వుతో ఉంటావని కోరుకుంటున్నాను. ఇట్లు విజయ్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆ టైంలో ఎవడు మెసేజ్ చేయమన్నాడు!!
అది 2016 సంవత్సరం! నేను హైదరాబాద్‌లో అప్పుడే ఓ కొత్త కంపెనీలో జాబ్‌లో జాయిన్ అయ్యాను. చాలా ఏళ్లనుంచి నేను హైదరాబాద్‌లో ఉన్నా! అప్పడే ఓ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారిపోయాను. మా కంపెనీలో కొత్తగా ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు. నా ఎదురుగా ఓ అమ్మాయి కూర్చునేది. తన పేరు అనూష క్రిష్ణ, తన పేరు తెలుసుకోవటానికి నాకు వారం రోజులు పట్టింది. నిజంగా చెప్పాలంటే తొలిచూపులోనే తనను చూసి ప్రేమలో పడిపోయా! అంతలా నచ్చేసింది. ఆ అమ్మాయిని చూడటానికి కావాలనే సీటులోనుంచి పైకి లేచేవాడిని. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒక రోజు వేరే వాళ్ల ద్వారా తన నెంబర్ సంపాదించా. నెంబర్ అయితే దొరికింది కానీ, ఫోన్ చేయాలంటే భయం. ధైర్యం తెచ్చుకుని రాత్రి 11:30కి తనకు మెసేజ్ చేశా ‘హాయ్’ అని.. రిప్లై లేదు. తను పడుకుందనుకుంటా. తను మరుసటి రోజు ఆఫీసుకు రాగానే స్కైప్‌లో మెసేజ్ చేశా. నైట్ డిస్ట్రబ్ చేసుంటే సారీ అని. అంతే తను తిట్టేసింది.. ‘ ఎవడు నిన్ను ఆ టైంలో మెసేజ్ చేయమన్నాడు.’ అంది. నా ముఖం మాడిపోయింది. ఆరోజు ఆఫీసు అయిపోగానే నేను రూంకు వెళదామని బస్‌లో ఉండగా తన నుండి మెసేజ్ వచ్చింది.‘ సారీ! అలా అన్నందకు. అయినా ఆ టైంలో మెసేజ్ చేయోచ్చా.’ అని. ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అప్పటినుంచి మా ఇద్దరి మధ్యా రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. నాకైతే ఆ ధ్యాసలో పడి ఓ సంవత్సరం ఇంటి ముఖమే చూడలేదు. తనకి అంతలా అడిక్ట్ అయిపోయా. పరిచయం అయినా ఓ వారానికి తనకు ప్రపోజ్ చేశా. తను సీరియస్‌గా తీసుకోలేదు. రోజులు గడుస్తున్న తన పైన ప్రేమ పెరుగుతోందే తప్ప తగ్గలేదు. ఏమైందో ఏమో సడెన్‌గా అవాయిడ్ చేయటం మొదలుపెట్టింది. అది నేను తట్టుకోలేకపోయా. ఆఫీసులోనే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. ఆఫీసులో అందరూ వచ్చారు నన్ను చూడటానికి. అనూష మాత్రం రాలేదు. ఇంత చేసినా నాపైన తనకు ప్రేమ కలగలేదు. ఎందుకంటే నాకు ఇదివరకే మా ఇంట్లో వాళ్లు ఇష్టం లేని పెళ్లి చేశారు. అది తనకు చెప్పి కన్విన్స్ చేద్దామనేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన వల్ల జాబ్ వదులుకున్నా. నా జీవితం నాశనం అయింది. అయినా తననే కావాలనుకుంటున్నా. కానీ, తన మనసు కరగలేదు. అమ్మలా చూసుకుందామనుకున్నా. తన వల్ల జీవితమే లేకుండా పోయింది. అన్నీ పోయాక నాకు అర్థమైంది. ఆ అమ్మాయి మాత్రం ఏదీ పట్టనట్లు జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తోంది. ఇంత జరిగాక ఒకటే అనిపించింది. అమ్మానాన్న కోసం ఇష్టంలేని అమ్మాయి మెడలో తాళి కట్టానని. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి వల్ల జీవితం నాశనం చేసుకున్నా. నిజమైన ప్రేమకు ఎప్పటికైనా ఓటమి తప్పదు. - బాలు, చిత్తూరు లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఐ లవ్ యూ..ఏప్రిల్ కాదు కదా బావ!
2014లో ఓ పెళ్లికి వెళ్లా! అక్కడ ఓ అమ్మాయి చాలా చలాకీగా తిరుగుతూ కనపడింది. ఎవరు అని అడిగితే.. వరుసకు నాకు మరదలు అవుతుందని చెప్పారు. ఆ తర్వాత తనను ఆటపట్టించటం మొదలుపెట్టా. అలా పెళ్లి అయిపోయే వరకు తన వెంట తిరగటం, తనని ఆటపట్టించటం చేసేవాడిని. ఫంక్షన్ అయిపోయింది. నేను తన నెంబర్ అడుగుదామనుకున్నాను. కానీ, తను ఏమనుకుంటుందోనని అడగటం మానేశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేశా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమెకు చెప్పలేదు. రెండు రోజుల తర్వాత ఒక కాల్ వచ్చింది. ‘హాయ్ బావా!’ అని వినపడింది. ‘ఎవరు’ అని అడిగా. నేను షాక్ అయ్యాను! తనే. ‘ ఈ నెంబర్ నీకు ఎలా తెలిసింది. ఎవరిచ్చారు.’ అని అడిగా. మా బంధువులు తనకు బంధువులు అట, వరుసకు అక్క అవుతదంట. తన దగ్గర ఈ నెంబర్ తీసుకుంది. అప్పటినుంచి ప్రతి రోజూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం, మెసేజ్‌లు చేసుకునే వాళ్లం. ఓ రోజు ‘ఐ లవ్ యూ’ అని మెసేజ్ పెట్టా. తను ‘ ఏప్రిల్ కాదు కదా బావ!’ అని రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత‘ ఏప్రిల్ ఫూల్ అవటానికి ప్రేమ ఏంటి బావ. మన మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే’ అంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. తర్వాతనుంచి మెసేజ్‌లు చేయటం మానేశా. ఆ తర్వాత తనతో ఏమీ చెప్పలేకపోయా. తనకు మ్యారేజ్ అయింది. ఇది ఈ రవి గాడి ప్రేమ కథ! - రవి, వైజాగ్ చదవండి : అది తెలిసినా ఆమెతో ప్రేమలో పడ్డా! ఆమె ఎప్పటికీ నాకు ప్రాణం! అందుకోసమే.. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆమె ఎప్పటికీ నాకు ప్రాణం! అందుకోసమే..
తను నా మరదలు అనడం కన్నా.. నా ఆరాధ్య దేవత.. నా ప్రాణం అనొచ్చు. చిన్ననాటి నుండి తనంటే నాకు అమితమైన ఇష్టం! కానీ, అది ప్రేమ అని 8వ తరగతిలో కానీ తెలియలేదు. అది 2005వ సంవత్సరం ఏప్రిల్ నెల.. ఎర్రటి ఎండా కాలంలో తనపై నా ప్రేమ గాలులు చల్లగా వీస్తున్న రోజులు. తనకి నా ప్రేమ విషయాన్ని ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నా. ఆలోచనలతోటే రోజులు గడిచిపోతున్నాయి. కానీ, నా గుండెల్లో తన గుడిని నిర్మించానన్న విషయం తనకు ఎలా చెప్పాలి అన్న ఆలోచనలతోనే సమయం గడిచిపోతోంది. 2008లో మా పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్ మీడియట్లోకి ప్రవేశించాము. తను చదువుతున్న కాలేజీలోనే చదవాలని అనుకున్నాను. కానీ కుదరలేదు. పక్క కాలేజీలో జాయిన్ అయ్యాను. ఎలాగైనా నా ప్రేమ విషయం తనకు చెప్పాలని డిసైడ్ అయి 2009 జనవరిలో తనకు చెప్పాను. తనకు కూడా నాపై అంతే ప్రేమ ఉందని తెలుసుకుని చాలా సంతోషించాను. అలా 2012 వరకు మా ప్రేమ ప్రయాణం కొనసాగింది. కానీ, విధి మరోలా ఆలోచించింది. మేమిద్దరం కలిసి బ్రతకటం ఆ దేవుడికి ఇష్టం లేదేమో మమ్మల్ని విడదీశాడు. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిపోయింది. కారణాలు ఏమైనా కానీ తనంటే ఇప్పటికీ.. ఎప్పటికీ నాకు ప్రాణం! అందుకోసమే ఈ మధ్య తన కోసం ఒక కవిత రాశాను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా వేసిన ఆ మూడు ముళ్లను తెంపుకుని.. అతి కష్టం మీద వేసిన ఆ ఏడు అడుగులు దాటుకుని.. నీవు మెచ్చిన నీ బావతో నూరేళ్ల బతకడానికి ఎప్పుడు వస్తావు.. మోడు వారిన నా జీవితంలోకి ఓ ఉషోదయాన వెలుగులు నింపడానికి తప్పకుండా వస్తావు కదూ.. ప్రేమతో నీ ప్రేమకై ఎదురు చూసే నీ బావ - శివ శంకర్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నన్ను వదిలేయ్! నీకే మంచిది..
మాది మధ్య తరగతి కుటుంబం! నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా. నేను స్కూల్‌కు వెళ్లే దారిలోనే వాళ్ల ఇళ్లు కూడా ఉండేది. తను కూడా మా ఊరే! నేను పదిలో ఉన్నపుడు తన ఇంటర్ అయిపోయింది. నేను స్కూల్‌కి వెళ్లే టైంకు నా బస్ కోసం ఎదురు చూసేవాడు. అలా ఓ సంవత్సరం ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నాం. అలా ఓ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో ఒకసారి కూడా మేము మాట్లాడుకోలేదు. కానీ, మా కళ్లు చాలా మాట్లాడుకునేవి. తనకి డిఫెన్స్‌లో జాబ్ వచ్చింది. నేను అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నా. తను జాబ్ వచ్చి మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోతున్నాడు. అపుడు తను నాకు డేర్ చేసి నెంబర్ ఇచ్చాడు. అప్పటినుంచి మేము ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. అలా మా మధ్య తెలియకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి. తను ఎప్పుడు ఇంటికి వస్తాడా.. ఎప్పుడు తనని చూస్తానా అని చాలా వేయిట్ చేసేదాన్ని. అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న మా జీవితం ఒక్కసారిగా తల్లక్రిందులైంది. వాళ్ల ఇంట్లో మా లవ్ మ్యాటర్ తెలిసిపోయింది. వాళ్ల పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఎంత చెప్పి చూసినా వాళ్లు వినలేదు. అయినా మేము మాట్లాడుకోవటం మానుకోలేదు. ఎప్పటికైనా ఒప్పుకుంటారని చిన్న ఆశ. మా ఇంట్లో మా అమ్మకు మాత్రమే ఈ విషయం తెలుసు. తర్వాత తను కూడా నా నెంబర్ బ్లాక్ చేశాడు. నేను వేరే నెంబర్ నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు. ఒక రోజు మా ఫ్రెండ్ నెంబర్ నుండి కాల్ చేశాను. అప్పుడు లిఫ్ట్ చేశాడు. ‘‘ నన్ను వదిలేయ్! నీకే మంచిది. లేకపోతే నువ్వే చాలా బాధపడతావు. నేను మా ఇంట్లో వాళ్లని కాకుండా నిన్ను పెళ్లి చేసుకోలేను.’’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. నేను మళ్లీ చాలా సార్లు కాల్ చేశాను. కానీ, నో రిప్లై. నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నపుడు అతనికి వేరే అమ్మాయితో పెళ్లైంది. ఆ విషయం తెలిసాక నేను చాలా బాధపడ్డాను. మా అమ్మతో చెప్పి ఏడ్చేదాన్ని. అలా ఏడుస్తూనే నా బీటెక్ కంప్లీట్ చేశాను. నన్ను చేసుకోకపోయినా పర్లేదు తను హ్యాపీగా ఉంటే చాలు అనుకునేదాన్ని. కానీ, లోపల చాలా బాధపడ్డాను. నా ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇంకా బ్రతికేఉన్నా. వాళ్ల ఆశలన్నీ నా మీదే పెట్టుకుని ఉన్నారు. మా లవ్ విషయం ఇంత వరకు మా నాన్నకు తెలియదు. తనది కూడా మా ఊరే కాబట్టి ఎప్పడైనా భార్యతో చూసినపుడు నాకు చాలా బాధవేసేది. నేను ఉండాల్సిన స్థానంలో వేరే అమ్మాయి ఉందేఅని. బీటెక్ అయిపోయిన వెంటనే క్యాంపస్ సెలక్షన్లో నాకు మంచి జాబ్ వచ్చింది. జాబ్, నా ఫ్యామిలీ ఇదే నా లైఫ్ అయిపోయింది. నాకు సడెన్‌గా ఒక రోజు తన నుండి ఫోన్ వచ్చింది. నేను లిఫ్ట్ చేసి మాట్లాడాను. ‘ నేను నీకు చాలా మోసం చేశాన్రా! నువ్వు నాకు కావాలి. నిన్ను పెళ్లి చేసుకోనందకు దేవుడు నాకు తగిన శాస్తి చేశాడు.’ అని ఏడ్చాడు. నేను ఏమైందని అడిగా. ‘ నా వైఫ్ నన్ను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. తన క్యారెక్టర్ అసలు మంచిది కాదు. మా పేరేంట్స్ చెప్పారని పెళ్లి చేసుకున్నా. సరేరా నాక నువ్వు కావాలి. మనం పెళ్లి చేసుకుందాం.’ అని అన్నాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక కాల్ కట్ చేశా. తను నాకు మళ్లీ కాల్ చేశాడని మా అమ్మకు చెప్పలేదు. ఎందుకంటే అతను వేరే అమ్మాయిని చేసుకున్నపుడు నా కంటే తనే ఎక్కువగా బాధపడింది. ఒక పక్క తనకు అలా అయ్యిందనే బాధ, ఇంకో పక్క తనని పెళ్లి చేసుకుంటే మా పేరేంట్స్‌కు చెడ్డపేరు వస్తుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. లాస్ట్‌కు నా లవ్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుందో నాకే అర్థం కావటం లేదు. కానీ, నేను మాత్రం ఈ సారి మా అమ్మని బాధపెట్టాలని అనుకోవటం లేదు. ఈ విషయం మా అమ్మకు చెప్పి మా అమ్మ ఏం చెయ్యాలని చెప్తే అదే చెయ్యాలని డిసైడ్ అయ్యా. నేను చేస్తోంది కరెక్టో రాంగో నాకు తెలియడంలేదు. మా పేరేంట్స్‌ను ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అయ్యా. నా జీవితం మా పేరేంట్స్ మీద ఆధారపడి ఉంది. - అనిత, కడప లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అందరూ షాక్!.. నిశ్చితార్ధం క్యాన్సిల్..
ఇంటర్లో జాయినైన కొత్తలో ఒకరోజు నేను, నా ఫ్రెండ్ బస్ స్టాప్‌లో ఉన్నాం. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పింది ‘ఎవరో ఒకతను ఇటే చూస్తున్నాడు. మనల్ని ఫాలో కూడా అవుతున్నట్లు అనిపిస్తోంది’ అని. ‘అవును! నేను గమనించనే లేదు. ఈసారి చూపించు’ అన్నాను. తర్వాత తను మరచిపోయింది. నేను అడగలేదు! ఒకరోజు నా ఫ్రెండ్ రాలేదు. నేను ఒక్కదాన్నే బస్ స్టాప్‌లో ఉన్నా. బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా.. ఇంతలోనే ఎవరో వెనుకనుండి ‘ఏమండీ!’ అనే పిలుపు వినిపించింది. వెనుకకు తిరిగి చూశా. ‘మీ పేరు ఏంటండీ! ఏ ఊరు’ అని అడిగాడు. నేను ఏమీ మాట్లాడలేదు. బస్ వచ్చేసింది. ఒకరోజు నా ఫ్రెండ్ కాలేజీకి వచ్చింది. అప్పుడు చూపించింది.‘ అతను మన ఎదురుగా ఉన్నాడు చూడు! అతనే నిన్ను రోజు ఫాలో అయ్యేవాడు’ అని చెప్పింది. నన్ను ఊరు పేరు అడిగిన అతను ఇతను ఒక్కటే అని నేను గుర్తుపట్టలేదు.. ఒకరోజు మళ్లీ నా ఫ్రెండ్ రాలేదు. ఆ రోజు నా ఫ్రెండ్ ఇంటి పేరు నా పేరు కలిపి నన్ను పిలిచాడు. ఎవరా! అని చూసేసరికి నా ఫ్రెండ్ చూపించిన అతను. నా పేరు ఎలా తెలిసింది అని ఒకటే భయం. నా గుండెల్లో వేగం పెరిగింది. అక్కడినుంచి కొంచెం ముందుకు వచ్చి నిలబడ్డాను. నా ఫ్రెండ్‌ని కదా చూసేవారు.. ఇదేంటి! తను రాకపోయినా నన్ను చూస్తున్నాడు. ఎందుకిలా అని డౌట్ వచ్చి నా కజిన్‌కి చెప్పాను. అప్పుడు నా కజిన్ అతనికి వార్నిగ్ ఇచ్చింది. అయినా తను రోజు నన్ను ఫాలో అయ్యేవాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడే కనిపించేవాడు. ఆ రోజు మొదలు రోజూ నేను గమనించడం మొదలు పెట్టాను. ఎవరు ఇతను నా ఫ్రెండ్ కోసం కాదా! నాకోసమా అని ఒకటే సందేహం. నేను బస్ స్టాప్‌కి రాగానే నా ఎదురుగా ఉండే షాప్‌లోకి వెళ్లి ఇటే చూసేవాడు. నా బస్ వెనుకాల ఫాలో అయ్యేవాడు. రాను రాను తను కనిపించకపోతే ఎదురుచూసే పరిస్థితి. ఏదో వెలితి.. ఎక్కడ ఉన్నారా అని చూసేదాన్ని. కనిపించగానే అస్సలు చూసేదాన్ని కాను. ఫస్ట్‌లో భయం వేసేది. తరువాత మంచి ఫీల్ కలిగేది. ఎందుకంటే తను నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. వెనకే ఫాలో అవుతూ నేను ఇంటికి చేరుకునే వరకు వచ్చేవారు. నేను ఎవరితో ఐతే వార్నింగ్ ఇప్పించానో వాళ్లనే పరిచయం చేసుకుని నా డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాడు. నా కజిన్‌కి బాగా ఫ్రెండ్ అయిపోయాడు. నా కజిన్ అతడి గురించి చెప్తుంటే నాకు తెలీకుండానే నేను ప్రేమ పెంచుకున్నాను. ఒకరోజు మా ఇంట్లో నాకు సంబంధం ఒకటి తీసుకువచ్చారు. రెండు రోజులలో పెళ్లి చూపులు అన్నారు. వెంటనే నిశ్చితార్ధం అన్నీ మూడు రోజులలో జరిగిపోయాయి. ఈ విషయం నా కజిన్ ద్వారా తెలుసుకుని నాకు ఫోన్ చేశాడు. హలో అన్నా.. అతడి నోట మాట రాలేదు. అదే మొదటిసారి అతనితో మాట్లాడటం. ‘నీకు మ్యారేజ్ సెటిల్ అయిందని విన్నాను’ అని అడిగారు. నేను ఏమీ చెప్పలేదు. ‘పోనీ నేనంటే ఇష్టమా’ అని అడిగాడు. అయినా నా సమాధానం ఏమీ లేదు. ‘సరే ఐతే! నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి’ అని ఫోన్ పెట్టేశాడు. నా మనసులో ఏదో బాధ! ఏమీ చేయలేని పరిస్థితి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాతి రోజు కాలేజ్‌కు వెళ్లాను. ఆ రోజు కూడా కాలేజీకి వచ్చాడు. ఎప్పుడు లేనిది.. కాలేజీ క్లాస్ దగ్గరికి వచ్చి నా పేరు చెప్పి బయటకి పంపించమన్నాడు. నాకోసం ఎవరూ రారు.. ఎవరా ??? అని వెళ్లి చూసేసరికి అతను. అతని ఫ్రెండ్ అప్పుడు చూశాను దగ్గరినుండి. ఏదో తెలియని బాధ నాలో. ‘ఏమీ నిర్ణయంచుకున్నావు’ అని తను చెప్పకనే చెప్పారు కళ్లతో. ఫస్ట్ టైం తనతో మాట్లాడాను ఎదురుగా.. ‘మా ఇంట్లో అడగండి’ అని చెప్పాను. ఏమీ మాట్లాడకుండా వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారు. అదే రోజు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వెళ్లే సమయంలో వాళ్ల వదిన నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ‘మాది చాలా పెద్ద కుటుంబం! నువ్వు ఈ క్షణం వచ్చేయ్! పెళ్లి చేసేస్తాం. తరువాత మీ ఇంట్లో తెలిసినా మా కుటుంబం గురించి తెలిసి వాళ్లు ఏమీ అనరు. కట్టు బట్టలతో వచ్చేయ్’ అన్నారు. అప్పుడు కూడా మా ఇంట్లో చెప్పి ఒప్పిస్తాను అన్నాను కానీ వచ్చేస్తాను అనలేదు. కానీ ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారా అనే సందేహం! ఎలా చెప్పేది. అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వెళ్లేలోపు ఎన్నో ఆలోచనలు. ఏడుపు వచ్చేస్తుంది. ఇంటికి చేరుకున్నా. ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది ఏడ్చేశాను. అందరూ ఏంటి అని కంగారు పడ్డారు. విషయం చెప్పాను. ఇంట్లో అందరూ షాక్! నాన్నగారు ‘వాళ్లది చాలా మంచి కుటుంబం! కానీ, నిచ్చితార్ధం అయ్యాక ఎలా’ అన్నారు. కానీ, నాకు ఏడుపు ఆగటం లేదు. అంతే అందరూ ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక్కసారిగా నిశ్చితార్ధం క్యాన్సిల్ చేశారు. మా ఇంట్లో అందరికి ఇష్టం లేకున్నా వాళ్లకి నో చెప్పేశారు. ఒక నెల గ్యాప్‌లో ఈ సంబంధం ఖాయం చేశారు. మా పెద్దవాళ్ల అంగీకారంతో మా మ్యారేజ్ జరిగింది. రోజూ నన్ను ఫాలో అయ్యే అతనే నా భర్త! ఒకప్పుడు తనను చూస్తే భయపడేదాన్ని! ఇప్పుడు తనే నా సర్వస్వం తనే నాకు తోడు, నీడ తనే నాకు అన్నీ. ఒక్కసారిగా ఎంత ఛేంజ్. నా భర్త సంతోషానికి అవధులు లేవు లైఫ్‌లో అన్నీ సాధించినంత సంతోషం ఒక సంవత్సరానికే ఒక బాబు! నా కొడుకుని, నన్నూ ఒకేలా చూసుకునే వారు నన్ను కూడా ఒక కిడ్‌లా చూసుకునేవారు. తొమ్మిది సంవత్సరాలు గడిచాయి ఎంతో సంతోషంగా. కానీ, ఆ సంతోషం క్షణంలో ఆవిరై పోయింది. నా భర్త తిరిగిరాని లోకానికి వెళ్లి పోయాడు. నన్ను, నా కొడుకుని ఒంటరి వాళ్లని చేసి వెళ్లిపోయాడు. - తరుణి, కాకినాడ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
రివర్స్ గేమ్ ఆడా! షాక్ అయ్యింది..
నేను చిన్నప్పటినుంచి హాస్టల్లో ఉండేవాడిని. అయితే అక్కడ ఉండలేక ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు హాస్టల్నుంచి వచ్చేశా. కొత్తగా ఒక జిల్లా పరిషత్ హైస్కూల్లో చేరా. రోజూ ఇంటికి వెళ్లి వచ్చేవాడిని. అక్కడ అంతా కొత్తపరిచయాలు. అప్పుడే నాకో అమ్మాయి బాగా నచ్చింది. పేరు శ్రవంతి! ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అసలు ఆ అమ్మాయికి సైట్ కొట్టని వారు లేరు. నేను కొద్దిగా బాగా చదువుతాను. అందువల్ల నాతో అందరికీ అవసరం ఉంటది. అలా అమ్మాయి ఫ్రెండ్ ఒక రోజు నన్ను మ్యాథ్స్ హోమ్ వర్క్ బుక్ అడిగింది. నేను శ్రవంతి మీద ప్రేమతో ఆ అమ్మాయికి ఇచ్చాను. ఇలా రోజురోజుకు మా పరిచయం పెరుగుతూ పోయింది. ఒక రోజు ధైర్యం చేసి నేను తనకిచ్చే పుస్తకంలో ఇద్దరి పేర్లు రాసి లవ్ సింబల్ వేసి ఇచ్చాను. అది తను చూసి మరుసటి రోజు సార్ దగ్గరకు వెళుతున్నానని భయపెట్టింది. అప్పుడు నేను రివర్స్ గేమ్ ఆడాను. తనే ఆ పేరు రాసిందని. అప్పుడు తను ఒక్కసారిగా షాక్ అయ్యింది. నేను ధైర్యం చేసి తను ఇంటికి వెళ్లే దారిలో ఐ లవ్ యూ చెప్పా. తను మాత్రం ‘నేను నీకు బుక్ రాసి చెప్తా’ అంది. నేను ఒప్పుకోలేదు. పట్టుదలగా అప్పుడే తనతో ఐ లవ్ యూ టూ చెప్పించుకున్నా. ఇక నాకైతే అప్పుడు గాల్లో తేలిపోయినట్లు అనిపించింది. ఇద్దరం పదవ తరగతికి వచ్చాం. ఇద్దరి మధ్యా ఎన్నో గుర్తులు.. ఎన్నెన్నో మాటలు. క్లాస్‌లో తను చూసే చూపులు. ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ మర్చిపోలేను. తర్వాత ఇద్దరం ఒకే కాలేజ్‌లో జాయిన్ అవుదామనకున్నాం. కానీ, నా తప్పు వల్ల తను చెప్పిన కాలేజ్‌లో చేరలేకపోయా. టెన్త్‌లో నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థం అయింది. అమ్మాయి ప్రేమిస్తే ప్రాణం ఇస్తుందని. ఒక రోజు నేను మాట్లాడకపోతే తను క్లాస్‌లోనే ఏడ్చేసింది. ఆ రోజు నుండి ఆ అమ్మాయి అంటే నాకు బాగా నచ్చింది. మేము అనుకున్న కాలేజ్‌లో నేను చేరకపోయేసరికి తను మధ్యలోనే వచ్చేసింది. ఇక అమ్మాయికి మ్యారేజ్ చేశారు. నేనిప్పటికీ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా. -రఫి,కువైట్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అన్నయ్యా అంది.. కళ్లల్లో నీళ్లు తిరిగాయ్!
మాది విశాఖ జిల్లా నర్సీపట్నం పక్కన ఒక విలేజ్. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు డైలీ కాలేజ్‌కి బస్‌లో వెళ్లేవాడిని. రోజూ లాగానే ఆ రోజు కూడా కాలేజ్ అయిపోయాక బస్‌లో ఇంటికి వెళ్తున్నా. నా పక్కన సీట్లో ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అందులో ఒక అమ్మాయి వాళ్ల ఊరు వచ్చిందని దిగిపోయింది. దిగుతున్నపుడు తన ఫొటోస్ బ్యాగ్ నుండి కింద పడిపోయాయి. నేను అవి చూసి తన ఫ్రెండ్‌కు ఇవ్వటానికి ఆమెను పిలిచాను. నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. తను చాలా అందంగా ఉంది. కొంత సేపు తనని అలానే చూస్తూ వుండిపోయాను. తనే గట్టిగా పిలిచి ‘ఏమైంది’ అని అడిగి నవ్వుకుంది. నేను తన ఫ్రెండ్ ఫొటోస్ చూపించి ‘నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఫొటోస్’ అని అన్నాను. తను అవి తీసుకుని థాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. ఆ రోజంతా తనే గుర్తుకు వచ్చింది. ఆ తర్వాత రోజు సండే కాలేజెస్ సెలవు! సోమవారం తనకోసం చాలా వెతికాను కానీ, కనిపించలేదు. ఒక వారం రోజుల తర్వాత మళ్లీ బస్‌లో కనిపించింది. తనతో మాట్లాడాలని అనిపించేది. కానీ, ఎందుకో భయం వేసి మాట్లాడలేకపోయాను. ఆ తర్వాత తను నాకు కనిపించలేదు. ఒకరోజు నా ఫ్రెండ్ తన లవర్ కోసం బస్ స్టాప్‌లో ఎదురుచూస్తుంటే నేను వాడికి తోడుగా ఉన్నాను. వాడు తన లవర్‌తో మాట్లాడుతుంటే నేను కొంచెం దూరంగా వెళ్లి నుంచున్నాను. నా ఫ్రెండ్ లవర్‌తో పాటు నేను బస్‌లో చూసిన అమ్మాయి కూడా వచ్చింది. ఇద్దరిదీ ఒకే ఉరంట. వరసకి అక్కాచెల్లెళ్లు అవుతారంట. కానీ నా ఫ్రెండ్ నాకు విలేజ్‌లో బావ అవుతాడు. నేను వాడిని కావాలనే తన ముందు అన్నయ్యా అని పిలిచే వాడిని. అప్పటి నుండి నేను కూడా నా ఫ్రెండ్‌తో పాటు వాళ్ల కోసం వెయిట్ చేసేవాడిని. నా ఫ్రెండ్ వాడి లవర్ ఒకే సీట్లో కూర్చునేవారు. తప్పక తను నా పక్కన కూర్చునేది. కానీ ఏమీ మాట్లాడేది కాదు. వాళ్ల ఊరికి బస్‌లు ఉండవు. ఊరికి ఐదు కిమీ దూరంలో బస్ దిగేసి ఆటోకి వెళ్లాలి. ఉదయం టైమ్‌లో నేను నా ఫ్రెండ్ త్వరగా వాళ్లు బస్ ఎక్కే ఊరు వెళ్లి వాళ్ల కోసం వెయిట్ చేసేవాళ్లం. అలా తనతో పాటు బస్‌లో వెళ్లి రావటం నాకు అలవాటైంది. తను ఒక్క రోజు కనిపించకపోయినా వాళ్ల సిస్టర్ని ఏదో ఒక విధంగా తన గురించి అడిగే వాడిని. వాళ్ల సిస్టర్(నా ఫ్రెండ్ లవర్)కి నాపైన డౌట్ వచ్చి వాడిని అడిగితే నేను తనని లవ్ చేస్తున్నట్టు చెప్పేశాడు. కానీ తను వాళ్ల సిస్టర్‌కి చెప్పలేదు. ఆ రోజు జనవరి ఒకటవ తేది! నా చెల్లి అపుడు పదవ తరగతి చదువుతోంది. వాళ్ల ఫ్రెండ్ పుట్టినరోజంటే నేను మా చెల్లిని తీసుకుని వాళ్ల ఊరు వెళ్లాను. లక్కీగా చెల్లి వాళ్ల ఫ్రెండ్ ఊరు నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఊరు ఒకటే. తను కనిపిస్తుందేమోనని చాలా సంతోషంతో వెళ్లాను. చెల్లిని వాళ్ల ఫ్రెండ్ ఇంట్లో దింపేసి తను కనిపించేంత వరకు ఆ ఊరంతా ఒక రౌండ్ వెయ్యాలని అనుకున్నాను. చెల్లి వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లాము. అక్కడ నేను షాక్ అయ్యాను. చెల్లి ఫ్రెండ్ వాళ్ల సిస్టర్ నా లవర్ ఒక్క అమ్మాయే. నేను చాలా ఆనందపడ్డా. చెల్లికి థాంక్స్ చెప్పుకున్నా. అక్కడ చాలా సేపు ఉన్నాము. తను నాకు డ్రింక్ తెచ్చి ఇస్తూ ‘తీసుకో అన్నయ్యా’ అంది. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. 5 నిమిషాల తర్వాత అక్కడ నుండి చెల్లిని తీసుకుని వచ్చేశాను. ఆ తర్వాత తనకి కనిపించలేదు. ఒకవేళ కనిపించినా తప్పించుకుని తిరిగేవాడిని. తను నా ఫ్రెండ్‌ని అడిగిందంట నేను ఎందుకు కనిపించటం లేదని. ‘నువ్వు అన్నయ్య అన్నావు కదా! అందుకే వాడు చాలా బాధ పడుతున్నాడు’ అన్నాడంట తనతో. ఆ తర్వాత మేము ఒకరికి ఒకరం ఎదురుపడలేదు. ఒక నెల రోజుల తర్వాత నేను కాలేజ్ అయ్యాక ఫ్రెండ్స్‌తో కలిసి ఫస్ట్ షో సినిమాకి వెళ్లాను. సినిమా అయిపోయాక బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. తనకి ఆ రోజు ప్రాక్టికల్స్ అంట చాలా లేట్ అయిపోయారు. తను వాళ్ల ఫ్రెండ్ వచ్చారు. బస్‌లు చాలా సేపు రాలేదు. వాళ్లు చాలా కంగారు పడుతున్నారు. బస్‌లు వస్తున్నాయి కానీ, అస్సలు కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్లిపోయారు. కానీ నేను తనకి బాగా లేట్ అయ్యింది కదా తను వెళ్లిన తరువాత వెళ్దాం అని ఉండిపోయాను. బస్ వచ్చింది! నేను ముందుగా ఎక్కి సీట్లో కూర్చున్నాను. తన ఫ్రెండ్‌ని పిలిచి నేను కూర్చున్న సీట్లో కూర్చోమని చెప్పి నేను ఇంకొక దగ్గర నుంచున్నాను. వాళ్ల పక్కన ఇంకొకరు కూర్చోవటానికి ప్లేస్ ఉంది. కానీ, నేను కూర్చోలేదు నుంచున్నా. బస్ స్టార్ట్ అయిన తరువాత కొందరు అబ్బాయిలు వచ్చి వాళ్ల సీట్లో కూర్చోవటానికి చూస్తున్నారు. అప్పుడు తను వాళ్ల ఫ్రెండ్‌తో చెప్పి, నన్ను సీట్లో కూర్చోవటం కోసం పిలిపించింది. నాకు పరిస్థితి అర్థమై కూర్చున్నాను. కానీ ఎవరితోనూ మాట్లాడలేదు. మొబైల్లో సాంగ్స్ వింటున్నా. అపుడు వాళ్ల ఫ్రెండ్ ‘అన్నయ్యా! సాంగ్స్ మేము కూడా వింటాము.’ అని చెప్పింది. అపుడు నేను నా మొబైల్ వాళ్లకి ఇచ్చేసి సైలెంట్‌గా కూర్చున్నా. టైమ్ 9:30 అయ్యింది. వాళ్ల ఊరికి ఆటోలు వుంటాయో ఉండవో అని నేను కూడా తనతో పాటు తను దిగే స్టాప్‌లో దిగిపొయాను. ఎందుకైనా మంచిదని నా ఫ్రెండ్‌కి కాల్ చేసి బైక్ తెప్పించాను. తను ఆటో కోసం వెయిట్ చేస్తోంది. నేను వేరే చోట నుంచొని ఉన్నాను. కాసేపటికి నా ఫ్రెండ్ వచ్చాడు. చాలా టైమ్ తర్వాత ఆటో వస్తే తను ఎక్కింది. నేను నా ఫ్రెండ్ ఆటోని ఫాలో అవుతూ వెళ్లాము. ఊరిలో తను దిగేవరకు ఉన్నాము. తరువాత ఒకరోజు నాకో నెంబర్నుంచి కాల్ వచ్చింది. తీరా చూస్తే అది తనే. చాలా రోజుల నుండి నా కోసం చూస్తుంది కానీ నేను కనిపించలేదు అని చెప్పింది. నేను చాలా సంతోష పడ్డాను. ఆఖరికి వాళ్ల చెల్లికి జరిగిందంతా చెప్పి నా నెంబర్ మా చెల్లి దగ్గర తీసుకుని కాల్ చేసిందంట. ఆ రోజు చాలా మాట్లాడుకున్నాము. అప్పటినుండి అప్పుడప్పుడు కాల్స్. డైలీ బస్‌లో మీట్ అవ్వటం చేసేవాళ్లం. తన ఇంటర్ ఎక్షామ్స్ అయిపోయాయి. సమ్మర్లో తననుండి ఒక్క కాల్ కూడా రాలేదు. నాకు పిచ్చెక్కేది. సమ్మర్ నాకు చాలా కష్టంగా గడిచింది. తర్వాత మళ్లీ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. తనని కలిసి అడిగాను ‘ఇన్ని రోజులు ఎందుకు ఫోన్ చేయలేదు’ అని. అప్పుడు తను చెప్పింది ‘మా ఫోన్ పాడైంది. నెంబర్స్ పోయాయ్! అందుకే కాల్ చేయడానికి అవ్వలేదు’ అని. అప్పుడు తను తన కొత్త నెంబర్ నాకిచ్చింది. అప్పటి నుండి మేము డైలీ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. ఒకరోజు ధైర్యం చేసి తనను ప్రేమిస్తున్న విషయం చెప్పేశాను. తను లవ్పైన ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. అయినా కానీ నేను తనతో మాట్లాడేవాడిని చాలా రోజుల తర్వాత తను నా ప్రేమను ఒప్పుకుంది. అప్పటినుండి మా ప్రేమ, నా లైఫ్ చాలా సంతోషంగా ఉండేది. అలా మా ప్రేమ నాలుగు సంవత్సరాలు కొనసాగింది. మా ప్రేమ విషయం తను వాళ్ల అమ్మకు కూడా చెప్పింది. వాళ్ల అమ్మ కూడా మా ప్రేమను ఒప్పుకుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను పీజీ చేయడం కోసం వైజాగ్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒకరోజు తను కాల్ చేసి ‘నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏం చేయమంటావు’ అని అడిగింది. ‘ఓ రెండు సంవత్సరాలు వేయిట్ చెయ్! ఈ లోపు నా చదువు పూర్తవుతుంది. జాబ్ రాగానే పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాను. కానీ తను ‘ఇంట్లో ఒత్తిడి చేస్తున్నారు. ఈ సంవత్సరమే చేసుకోవాలి’ అని చెప్పింది. కానీ ఇంట్లో బాధ్యతల వల్ల చేసుకోలేనని చెప్పాను. ఎందుకంటే నేను నా చెల్లి పెళ్లి చేయాలి. ఆ తర్వాత నేను చేసుకోవాలి. అలా కాదని నేనే ముందు పెళ్లి చేసుకుంటే మా ఫ్యామిలీ ఇబ్బందులు పడాల్సి వస్తుందని తనతో చెప్పాను. కానీ తను ఆ టైంలో నన్ను అర్థం చేసుకోలేదు. నాకు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. అప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను. వారం రోజుల తర్వాత కాల్ చేసి ‘నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. రెండు నెలల్లో మ్యారేజ్’ అని చెప్పింది. నేను ఏమీ చేయలేక అలా ఉండి పోయాను. తన పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నాకు మంచి జాబ్ వచ్చింది. జీతం వచ్చే జాబ్ ఉంది కానీ, జీవితం ఇచ్చే ప్రేమ లేదు. నేను తనను చాలా మిస్ అవుతున్నాను. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అదే నేను కోరుకునేది మిస్ యు బుజ్జి ఐ మిస్ యు సో మచ్! ఐ లవ్ యు... నిన్ను ఎంతగానో ప్రేమించే - సతీష్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి