ప్రతీకాత్మక చిత్రం
ఇంటర్‌లో జాయినైన కొత్తలో ఒకరోజు నేను, నా ఫ్రెండ్ బస్ స్టాప్‌లో ఉన్నాం. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పింది ‘ఎవరో ఒకతను ఇటే చూస్తున్నాడు. మనల్ని ఫాలో కూడా అవుతున్నట్లు అనిపిస్తోంది’ అని. ‘అవును! నేను గమనించనే లేదు. ఈసారి చూపించు’ అన్నాను. తర్వాత తను మరచిపోయింది. నేను అడగలేదు! ఒకరోజు నా ఫ్రెండ్ రాలేదు. నేను ఒక్కదాన్నే బస్ స్టాప్‌లో ఉన్నా. బస్సు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా.. ఇంతలోనే ఎవరో వెనుకనుండి ‘ఏమండీ!’ అనే పిలుపు వినిపించింది. వెనుకకు తిరిగి చూశా. ‘మీ పేరు ఏంటండీ! ఏ ఊరు’ అని అడిగాడు. నేను ఏమీ మాట్లాడలేదు. బస్ వచ్చేసింది. ఒకరోజు నా ఫ్రెండ్ కాలేజీకి వచ్చింది. అప్పుడు చూపించింది.‘ అతను మన ఎదురుగా ఉన్నాడు చూడు! అతనే నిన్ను రోజు ఫాలో అయ్యేవాడు’ అని చెప్పింది. నన్ను ఊరు పేరు అడిగిన అతను ఇతను ఒక్కటే అని నేను గుర్తుపట్టలేదు.. ఒకరోజు మళ్లీ నా ఫ్రెండ్ రాలేదు.
ఆ రోజు నా ఫ్రెండ్ ఇంటి పేరు నా పేరు కలిపి నన్ను పిలిచాడు. ఎవరా! అని చూసేసరికి నా ఫ్రెండ్ చూపించిన అతను. నా పేరు ఎలా తెలిసింది అని ఒకటే భయం. నా గుండెల్లో వేగం పెరిగింది. అక్కడినుంచి కొంచెం ముందుకు వచ్చి నిలబడ్డాను. నా ఫ్రెండ్‌ని కదా చూసేవారు.. ఇదేంటి! తను రాకపోయినా నన్ను చూస్తున్నాడు. ఎందుకిలా అని డౌట్ వచ్చి నా కజిన్‌కి చెప్పాను. అప్పుడు నా కజిన్ అతనికి వార్నిగ్ ఇచ్చింది. అయినా తను రోజు నన్ను ఫాలో అయ్యేవాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడే కనిపించేవాడు. ఆ రోజు మొదలు రోజూ నేను గమనించడం మొదలు పెట్టాను. ఎవరు ఇతను నా ఫ్రెండ్ కోసం కాదా! నాకోసమా అని ఒకటే సందేహం. నేను బస్ స్టాప్‌కి రాగానే నా ఎదురుగా ఉండే షాప్‌లోకి వెళ్లి ఇటే చూసేవాడు.
నా బస్ వెనుకాల ఫాలో అయ్యేవాడు. రాను రాను తను కనిపించకపోతే ఎదురుచూసే పరిస్థితి. ఏదో వెలితి.. ఎక్కడ ఉన్నారా అని చూసేదాన్ని. కనిపించగానే అస్సలు చూసేదాన్ని కాను. ఫస్ట్‌లో భయం వేసేది. తరువాత మంచి ఫీల్ కలిగేది. ఎందుకంటే తను నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. వెనకే ఫాలో అవుతూ నేను ఇంటికి చేరుకునే వరకు వచ్చేవారు. నేను ఎవరితో ఐతే వార్నింగ్ ఇప్పించానో వాళ్లనే పరిచయం చేసుకుని నా డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాడు. నా కజిన్‌కి బాగా ఫ్రెండ్ అయిపోయాడు. నా కజిన్ అతడి గురించి చెప్తుంటే నాకు తెలీకుండానే నేను ప్రేమ పెంచుకున్నాను. ఒకరోజు మా ఇంట్లో నాకు సంబంధం ఒకటి తీసుకువచ్చారు. రెండు రోజులలో పెళ్లి చూపులు అన్నారు.
వెంటనే నిశ్చితార్ధం అన్నీ మూడు రోజులలో జరిగిపోయాయి. ఈ విషయం నా కజిన్ ద్వారా తెలుసుకుని నాకు ఫోన్ చేశాడు. హలో అన్నా.. అతడి నోట మాట రాలేదు. అదే మొదటిసారి అతనితో మాట్లాడటం. ‘నీకు మ్యారేజ్ సెటిల్ అయిందని విన్నాను’ అని అడిగారు. నేను ఏమీ చెప్పలేదు. ‘పోనీ నేనంటే ఇష్టమా’ అని అడిగాడు. అయినా నా సమాధానం ఏమీ లేదు. ‘సరే ఐతే! నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి’ అని ఫోన్ పెట్టేశాడు. నా మనసులో ఏదో బాధ! ఏమీ చేయలేని పరిస్థితి. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాతి రోజు కాలేజ్‌కు వెళ్లాను. ఆ రోజు కూడా కాలేజీకి వచ్చాడు. ఎప్పుడు లేనిది.. కాలేజీ క్లాస్ దగ్గరికి వచ్చి నా పేరు చెప్పి బయటకి పంపించమన్నాడు.
నాకోసం ఎవరూ రారు.. ఎవరా ??? అని వెళ్లి చూసేసరికి అతను. అతని ఫ్రెండ్ అప్పుడు చూశాను దగ్గరినుండి. ఏదో తెలియని బాధ నాలో. ‘ఏమీ నిర్ణయంచుకున్నావు’ అని తను చెప్పకనే చెప్పారు కళ్లతో. ఫస్ట్ టైం తనతో మాట్లాడాను ఎదురుగా.. ‘మా ఇంట్లో అడగండి’ అని చెప్పాను. ఏమీ మాట్లాడకుండా వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారు. అదే రోజు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వెళ్లే సమయంలో వాళ్ల వదిన నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ‘మాది చాలా పెద్ద కుటుంబం! నువ్వు ఈ క్షణం వచ్చేయ్! పెళ్లి చేసేస్తాం. తరువాత మీ ఇంట్లో తెలిసినా మా కుటుంబం గురించి తెలిసి వాళ్లు ఏమీ అనరు. కట్టు బట్టలతో వచ్చేయ్’ అన్నారు. అప్పుడు కూడా మా ఇంట్లో చెప్పి ఒప్పిస్తాను అన్నాను కానీ వచ్చేస్తాను అనలేదు.
కానీ ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారా అనే సందేహం! ఎలా చెప్పేది. అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వెళ్లేలోపు ఎన్నో ఆలోచనలు. ఏడుపు వచ్చేస్తుంది. ఇంటికి చేరుకున్నా. ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది ఏడ్చేశాను. అందరూ ఏంటి అని కంగారు పడ్డారు. విషయం చెప్పాను. ఇంట్లో అందరూ షాక్! నాన్నగారు ‘వాళ్లది చాలా మంచి కుటుంబం! కానీ, నిచ్చితార్ధం అయ్యాక ఎలా’ అన్నారు. కానీ, నాకు ఏడుపు ఆగటం లేదు. అంతే అందరూ ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక్కసారిగా నిశ్చితార్ధం క్యాన్సిల్ చేశారు. మా ఇంట్లో అందరికి ఇష్టం లేకున్నా వాళ్లకి నో చెప్పేశారు. ఒక నెల గ్యాప్‌లో ఈ సంబంధం ఖాయం చేశారు.
మా పెద్దవాళ్ల అంగీకారంతో మా మ్యారేజ్ జరిగింది. రోజూ నన్ను ఫాలో అయ్యే అతనే నా భర్త! ఒకప్పుడు తనను చూస్తే భయపడేదాన్ని! ఇప్పుడు తనే నా సర్వస్వం తనే నాకు తోడు, నీడ తనే నాకు అన్నీ. ఒక్కసారిగా ఎంత ఛేంజ్. నా భర్త సంతోషానికి అవధులు లేవు లైఫ్‌లో అన్నీ సాధించినంత సంతోషం ఒక సంవత్సరానికే ఒక బాబు! నా కొడుకుని, నన్నూ ఒకేలా చూసుకునే వారు నన్ను కూడా ఒక కిడ్‌లా చూసుకునేవారు. తొమ్మిది సంవత్సరాలు గడిచాయి ఎంతో సంతోషంగా. కానీ, ఆ సంతోషం క్షణంలో ఆవిరై పోయింది. నా భర్త తిరిగిరాని లోకానికి వెళ్లి పోయాడు. నన్ను, నా కొడుకుని ఒంటరి వాళ్లని చేసి వెళ్లిపోయాడు.
- తరుణి, కాకినాడ
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment